రాజకీయ, సైద్ధాంతిక, ఆర్ధిక స్థాయిలలో సోషలిష్టు శక్తులు యుద్ధానికి ముందుకంటే చాలా బలంగా ఉద్భవించాయి. పెట్టుబడిదారీ ప్రపంచం లోపల పాత యూరపు సామ్రాజ్యవాద దేశాలూ, జపాన్ కూడా అమెరికన్ సామ్రాజ్యవాద ఆధిపత్య నాయకత్వాన్ని అంగీకరించాల్సి వచ్చింది.
1945– 1970ల మధ్య అమెరికా నాయకత్వంలో, అసాధారణమైన శాస్త్రీయ– సాంకేతిక పురోగతి సహాయంతో; అంతరిక్ష శాస్త్రం, ఎలెక్ట్రానిక్స్, యంత్రాల వాడకం(ఆటోమేషన్), పెట్రో-కెమికల్ పరిశ్రమల మొత్తం శ్రేణితో సాధించిన ప్రగతితో; ప్రపంచ పెట్టుబడిదారీ విధానం విస్తరణ దశ గుండా వెళ్ళింది.
అదేసమయంలో ప్రపంచ సోషలిస్టు కూటమిలో తీవ్రమైన స్వభావం గల పగుళ్ళు పెరిగాయి. ఈ ముఖ్యమైన రాజకీయ పరిణామంతో పాటు ఇక్కడ ఉన్న ఇతర వాటిని కూడా మనం విశ్లేషించము. అందుకు బదులుగా సమకాలీన పెట్టుబడిదారీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలోని ఆర్ధిక లక్షణాలపై కొన్ని వ్యాఖ్యలను తదుపరి విభాగంలో విశ్లేషిస్తాము.
1970లలో ప్రపంచ పెట్టుబడిదారీ విధానం..
పరిశ్రమలలోనూ- బ్యాంకింగులోనూ లెనిన్ గమనించిన గుత్తాధిపత్యం వైపు ధోరణి,(“ఫైనాన్స్ క్యాపిటల్’’) ద్రవ్య మూలధనం అని లెనిన్ పిలిచిన బ్యాంకింగు; పారిశ్రామిక పెట్టుబడుల కలయికకు దారి తీస్తుంది. ఇది నిరంతరాయంగా కొనసాగింది. ఉదాహరణకు 1971లో యూఎస్‌లోని 0.5 శాతం తయారీ సంస్థలకు (మాన్యుఫాక్చరింగ్ కార్పోరేషన్లకు) మొత్తం అమ్మకాలలో 36.5 శాతం, మొత్తం ఆస్తులలో 50.9 శాతం, నికర లాభంలో 61.6 శాతం వాటా ఉంది.
ఉపాధి గణాంకాల ప్రకారం – 1967లో 0.7 శాతం సంస్థలు 32.8 శాతం ఉపాధిని కల్పిస్తున్న విషయం – అదే కథను చెబుతున్నాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాల గణాంకాలలో ఎటువంటి వ్యత్యాసం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండు దశాబ్దాలలో పెట్టుబడిదారీ విస్తరణ కూడా, గనుల తవ్వకం, తయారీ రంగం, వ్యవసాయ వ్యాపారం, వాణిజ్యం వంటి వివిధ శాఖలలో ఒకేమారు పనిచేసే మూలధన యూనిట్ల వంటి దిగ్గజ ‘సమ్మేళనాలు’ ఏర్పడడానికి దారితీసిన గొప్ప విలీన తరంగాలను చూసింది. మూలధన కేంద్రీకరణ ఇప్పుడు అపూర్వమైన స్థాయికి చేరుకుంది.
చాలా పెద్ద పెట్టుబడిదారీ కలయిక ఆర్ధిక జీవితాన్ని నియంత్రించడంతో, పెట్టుబడిదారీ సంక్షోభాలు గతానికి సంబంధించినవి అని రివిజనిస్టులు వాదించారు. గుత్తాధిపత్యం అంటే పోటీని నివారించడం కాదని చెప్పి ఈ వాదనలోని డొల్లతనాన్ని లెనిన్ బహిర్గతం చేశాడు. వాస్తవానికి విడివిడిగా ఉన్న శాఖలలోని గుత్తాధిపత్యాన్ని వెన్నంటి వారు పెట్టుబడి పెట్టిన శాఖలతో సంబంధం లేకుండా పెట్టుబడిదారుల మధ్య పోటీ తీవ్రతరమౌతుంది.
ప్రపంచ మార్కెట్లో, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపైన ఆధిపత్యానికి వివిధ దేశాల పెట్టుబడిదారుల మధ్య తీవ్రమైన పోటీ దీనిని వెన్నంటి వస్తుంది; ప్రతి జాతీయ రాజ్యం లోపలా పెద్ద పెట్టుబడిదారీ సంస్థలు(corporations) చిన్న కంపెనీలను కొనివేస్తాయి, కొనడం లేదా విలీనం ద్వారా ఇతర సంస్థల(corporations) ఆధీనంలోని కంపెనీలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి.
అంతర్జాతీయంగా, ఆధునిక పెట్టుబడిదారీ దేశాలలో ఉన్న పెట్టుబడిదారులు, మార్కెట్ల కోసం, ముడిసరకుల వనరుల కోసం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాల కోసం వారి పరస్పర పోరాటాలలో తమ రాజ్య యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు.
ఇది మనల్ని చాలా అద్భుతమైన సమకాలీన పెట్టుబడిదారీ విధానం లక్షణాన్ని, జాతీయ ఆర్ధిక జీవితంలో అపారమైన రాజ్య జోక్యాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. సహజంగా, చారిత్రకంగా పెట్టుబడిదారీ వర్గం అది ఆధిపత్య స్థానానికి ఎదిగినప్పటి నుంచి చౌక ద్రవ్య సహాయం, పన్నుల తగ్గింపు, వగైరాల ద్వారా అధిక లాభాలకు నేరుగా హామీ ఇవ్వడానికీ, కార్మికవర్గాన్ని సైద్ధాంతికంగానూ– ప్రత్యక్ష అణచివేత పద్ధతుల ద్వారానూ అణచి ఉంచడానికీ రెంటికీను రాజ్యాధికారాన్ని అది విస్తృతంగా ఉపయోగించుకున్నది. కానీ సామ్రాజ్యవాద యుగంలో రాజ్యం పాత్ర గణనీయంగా మెరుగుపరచబడింది. మహా మాంద్యం(1929- 1939), ‘కినీషియన్’ విప్లవం అని పిలువబడుతున్న దాని తరువాత ప్రత్యేకించి ఇది జరుగుతున్నది.
నేటి ప్రపంచ పెట్టుబడిదారీ విధాన లక్షణం..
సోషలిజం పెరుగుదల, ఆధునిక పెట్టుబడిదారీ దేశాలలో బలమైన కార్మికోద్యమాల అభివృద్ధి ఈ దేశాలలోని పాలక వర్గాలకు, ఇటువంటి మాంద్యాన్ని, దానిని అనుసరించి వచ్చే సామూహిక నిరుద్యోగాన్ని తిరిగి రానివ్వకుండా నివారించడాన్ని తప్పనిసరి చేశాయి. సోషలిస్టుయేతర దేశాలలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, సోషలిస్టు దేశాలకు స్థిరమైన ముప్పును కలిగించడానికి అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు రాజ్య వ్యయాలను పెంచడమని కూడా అర్ధం.
ఆర్ధిక జీవితంపై గుత్తాధిపత్యం ద్వారానూ, గుట్టదిపత్యాల, రాజ్యాల ఏకీకరణవైపు ధోరణితోనూ కూడా ఈ ధోరణిని శక్తివంతంగా బలోపేతం చేశారు. జాతీయ ఉత్పత్తులలో రాజ్యం వాటా– ఆర్ధిక జీవితంలో పెరుగుతున్న రాజ్య నియంత్రణా రెండూ కూడా పెరిగిన రాజ్యం పాత్రను ప్రతిబింబించాయి. ఆధునిక పెట్టుబడిదారీ దేశాలలోనూ అలాగే బాగా వెనుకబడిన పెట్టుబడిదారీ దేశాలలోనూ, ఈ ధోరణి ప్రభలంగా ఉంది.
అవి ఒక దేశంలో ఉన్న పెట్టుబడిదారులచే నియంత్రింటబడుతున్నప్పటికీ, అనేక దేశాలలో ఉత్పత్తినీ, అమ్మకాలనూ కొనసాగిస్తున్న శక్తివంతమైన బహుళజాతి గుత్తాధిపత్యాలు, దిగ్గజ పెట్టుబడిదారీ కార్పోరేషన్లు ఆవిర్భవించడం సమకాలీన పెట్టుబడిదారీ విధాన మరొక ముఖ్యమైన లక్షణం. బహుళజాతి సంస్థల పెరుగుతున్న పాత్ర, బూర్జువా వర్గంలోని వివిధ విభాగాల మధ్య కొత్త వైరుధ్యాలను సృష్టిస్తున్నందున ఇది పెట్టుబడిదారీ రాజ్యానికి కష్టమైన సమస్యను కలిగిస్తున్నది.
నిరుద్యోగాన్ని ఆమోదించిన స్థాయిలో కన్నా తక్కువగా ఉంచడానికి, అంతర్జాతీయ పోటీ నుంచి దేశీయ తయారీదారులకు రక్షణ కల్పించడానికి జాతీయ ఆర్ధిక ఆవసరాల పరంగా ఒక వైపునా, వస్తువులూ, మూలధనం, లాభాలూ దేశ సరిహద్దుల లోపల స్వేచ్చగా కదలడానికి బహుళజాతి పెట్టుబడుల డిమాండు రూపంలో మరొక వైపునా ఇవి వ్యక్తమౌతాయి. దేశీయ స్టీలు ఉత్పత్తి దారులు జపాన్, ఇతర పోటీదారుల నుంచి రక్షణను కోరడాన్ని; అదే విధంగా ఇతర అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్తలలోకి చొరబడడానికి అనువుగా సరుకుల, పెట్టుబడుల స్వేచ్ఛా కదలికను కోరడాన్ని ఎవరైనా ఉదాహరణగా చూపవచ్చు. తీవ్రమైన నిరుద్యోగాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ విధానాలు చౌక శ్రమ కోసం, మెక్సికో, దక్షిణ కొరియా లేదా ఇతర అటువంటి ప్రాంతాలకు వెళుతున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా ఉంటాయి.
ఈ పరిణామాల నికర ప్రభావం, తమ పెట్టుబడిదారులను రక్షించడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న జాతి- రాజ్యాలకూ; రాజ్యం లోపలే పెట్టుబడిదారుల వివిధ విభాగాల మధ్యా, అలాగే పెట్టుబడిదారీ వర్గానికీ కార్మికవర్గానికీ మధ్యా వైరుధ్యాలను తీవ్రతరం చేస్తుంది.
1951- 1955, 1966- 1970ల మధ్య సమ్మెల వలన కోల్పోయిన సగటు పనిదినాల వాస్తవాల నుంచి ఆధునిక పెట్టుబడిదారీ దేశాలలో వర్గపోరాటం తీవ్రతరంగావటం గురించి(కనీసం ఆర్ధిక స్థాయిలోనైనా) కొంత అవగాహనకు రావచ్చు. అదే కాలంలో సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల సంఖ్యా 70 శాతం పెరిగింది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కాలంలో సామ్రాజ్యవాదుల మధ్య అంతర్గత శత్రుత్వాల తీవ్రత గురించి చాలా చక్కగా నమోదు చేయబడింది.
1960లలో అమెరికా తిరుగులేని ఆధిపత్యానికి తగిలిన ఎదురుదెబ్బల వలన జరిగిన నష్టం(దాని చెల్లింపుల సమతుల్యత నిరంతరం లోటులో ఉన్నప్పుడు, అనేక అంతర్జాతీయ మార్కెట్లలో జపాన్ ప్రత్యేకించి జర్మనీలు అధిగమించినప్పుడు), 1970ల ప్రారంభంలో అది బలమైన రక్షణాత్మక చర్యలకు పాల్పడింది. 1970 నాటికి దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభివృద్ధి తరిగిపోవడంతో ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ స్తబ్దత కాలంలో (దశలో) ప్రవేశించింది. అంతేకాకుండా అప్పటి నుంచి మందకొడిగా ఉంది.
ఆధునిక మార్కెట్ల, ముడిసరుకుల, అలాగే పెట్టుబడి కేంద్రాల కోసం ఊహించిన విధంగానే పెట్టుబడిదారీ దేశాల మధ్య ఈ కాలం తీవ్రమైన పోటీని చూసింది. ఏమైనప్పటికీ, ప్రస్తుత ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం మూలాల వివరణాత్మక విశ్లేషణలోకి వెళ్ళడానికి మనకు సాధ్యం కాదు.
ఏమైనప్పటికీ వేగవంతమైన ద్రవ్యోల్బణం, తీవ్రమైన నిరుద్యోగం, పెరుగుతున్న రక్షణవాదం, ఆధునిక పెట్టుబడిదారీ దేశాల మధ్య తీవ్రతరమైన శత్రుత్వం, పెట్టుబడిదారీ ప్రపంచమంతటా రాజకీయ అస్థిరత, నేటి ప్రపంచ పెట్టుబడిదారీ విధాన లక్షణం.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 62వ భాగం, 61వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
