ఇంకా, బ్యాంకులనే కాక స్టాక్ ఎక్సేంజీలను, ఇన్వెస్ట్మెంట్ హౌసెస్‌ను– ఇతర సంస్థలను కలిగి ఉన్న ఋణ వ్యవస్థ అంటే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఆర్ధిక యంత్రాంగం, ప్రత్యేకించి ఉమ్మడి స్టాక్ కంపెనీల ఏర్పాటు ద్వారా మూలధన కేంద్రీకరణకు బాగా సహాయపడుతున్నది. అటువంటి సంస్థల ఏర్పాటు, వీటి మరింత పెరుగుదల, అభివృద్ధి నేటి దిగ్గజ పెట్టుబడిదారీ సంస్థలను(corporations) మనకిచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యతగల ముందడుగు. ఇది ఉత్పత్తి స్థాయి, సంస్థల ‘అపారమైన విస్తరణ’ను సాధ్యం చేస్తుంది.
ఇది ఉత్పత్తి సాంఘికీకరణలో మరింత ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఉమ్మడి స్టాక్ పెట్టుబడి తన రూపంలో ‘సామాజిక పెట్టుబడి’(నేరుగా సంబంధం ఉన్న వ్యక్తుల మూలధనం) సంస్థ ఒక సామాజిక సంస్థ. ఈ దశతో, మూలధన యజమానులు నేరుగా సంస్థను నిర్వహించరు, కానీ ఆ ప్రయోజనం కోసం నిర్వాహక సిబ్బందిని నియమిస్తారు. ఈ విధంగా ‘వాస్తవానికి పనిచేస్తున్న పెట్టుబడిదారుణ్ణి కేవలం మేనేజర్‌గా(నిర్వాహకునిగా) మార్చడం, మూలధన యజమానిని కేవలం యజమానిగా, కేవలం డబ్బులు పెట్టిన పెట్టుబడిదారునిగా మనం చూస్తాం.
చివరగా వ్యక్తిగత పెట్టుబడిదారునికి ఋణాలు ఇచ్చే ప్రతిపాదనలు. ఇతరుల మూలధనం, ఆస్తులపై కొన్ని పరిమితుల్లో సంపూర్ణ నియంత్రణ, తద్వారా ఇతరుల శ్రమపై సంపూర్ణ నియంత్రణ. ప్రజల అభిప్రాయంలో, మూలధనం స్వయంగా, ఇది నిజంగా ఒక మనిషి స్వంతం లేదా స్వంతం అనుకున్నది, ఋణ అతిపెద్ద నిర్మాణానికి పూర్తిగా ఆధారం అవుతుంది. ఊహాగానం చేసే టోకు వ్యాపారి నష్టపోయేది స్వంత ఆస్తి కాదు, సామాజిక ఆస్తి.
ఈ మూలధనంలో చిన్న భాగానికి మాత్రమే యజమానులైన కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో పెద్ద మొత్తంలో మూలధనాన్ని పెట్టడం ద్వారా అనేక ప్రమాదకరమైన సాహస కార్యాలను, ఉత్తేజపూర్వకమైన ఊహాగానాలను, మోసపూరిత కొత్త రీతులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇది అస్థిరతకు అదనపు వనరవుతుంది. ఆర్ధిక హెచ్చుతగ్గుల తీవ్రతను పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక వైపున ఋణ వ్యవస్థ పెట్టుబడిదారీ అభివృద్ధికి దోహదపడుతుంది, మరొక వైపు ఇది పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థను మరింత సంక్షోభానికి గురి చేస్తుంది.
ఋణ వ్యవస్థ ఉత్పత్తి శక్తుల భౌతిక అభివృద్ధిని, ప్రపంచ మార్కెట్ స్థాపనను వేగవంతం చేస్తుంది. అదే సమయం ఋణం ఈ వైరుధ్యం –సంక్షోభం- హింసాత్మక విస్ఫోటనాలను వేగవంతం చేస్తుంది, తద్వారా[పెట్టుబడిదారీ] ఉత్పత్తి విధానాల అంశాలను విచ్ఛిన్నం చేస్తుంది.
ఋణ వ్యవస్థపై విచ్ఛిన్న పరిశీలనలు సాధారణ, పరిచయ రూపంలో ఉన్నాయి. ఈ విషయాన్ని లోతుగా మరింత వివరంగా చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు. ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ పని తీరుపై నిర్దిష్ట అవగాహనకు ద్రవ్య, ఋణ ఏర్పాట్లపై అధ్యయనం జాతీయ రాజ్యంలో మాత్రమే కాదు, అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థకు(మరింత ముఖ్యంగా) ఈ నాడు అవసరమని చెప్పడం సరిపోతుంది.
సామ్రాజ్యవాదం, సమకాలీన పెట్టుబడిదారీ విధానం..
మూలధన కేంద్రీకరణ పోటీ పోరాట ప్రక్రియలో స్వాభావికమైన భాగమని మనం ఇంతకు ముందు చూశాము. ఈ పోరాటంలో ఓడిపోయినవారు పెట్టుబడిదారియేతర వర్గాలలో చేరగా, ఉనికిలో ఉన్న మూలధనం అతి తక్కువ విజేతల చేతుల్లోకి చాలా ఎక్కువగా పోతుంది. బ్యాంకింగ్ ఉపకరణాన్ని దాని అనుబంధ సాధనాలను అభివృద్ధి చేయడం ద్వారా వారు కలిగి ఉన్న మూలధనం కన్నా ఎన్నో రెట్లు ఋణం పొందడానికి తద్వారా పెద్ద ఎత్తున పనిచేయడానికి, పెట్టుబడిదారులకు తోడ్పడే ఋణ వ్యవస్థ మూలధన కేంద్రీకరణ ప్రక్రియకు కూడా సహాయపడుతుంది.
పెద్ద పెట్టుబడిదారులకు పెద్ద మొత్తంలో ఋణాలను సులభంగా అందించడం ద్వారా పోటీ పోరాటంలో చిన్నవాటిని అణచివేయడానికి తోడ్పడి, బ్యాంకింగ్, ఋణ చట్రం మరింత నేరుగా కేంద్రీకరణను తెస్తుంది. పెట్టుబడిదారీ పోటీ ప్రక్రియా ఋణవ్యవస్థా రెండూ కూడా ఆ విధంగా దిగ్గజ పెట్టుబడిదారీ సంస్థల(కార్పోరేషన్ల) సృష్టికి దారి తీస్తున్నాయి. ప్రతి పరిశ్రమలోనూ వేళ్ళమీద లెక్కించగలిగిన అటువంటి సంస్థలు(కార్పోరేషన్లు) ఉత్పత్తి, అమ్మకాల అధిక నిష్పత్తికి కారణం. ఆస్తులు, ఉత్పత్తి, అమ్మకాలపరంగా జాతీయ ఆర్ధిక వ్యవస్థే కొన్ని వందల అటువంటి సంస్థల (కార్పోరేషన్ల) ఆధిపత్యానికి గురౌతున్నాయి. ఆ తరువాత కొన్ని వందల గుత్తాధిపత్యాలు ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాలకు కారణమౌతున్నాయి. ఆవిధంగా పోటీ, ఋణం పెట్టుబడిదారీ విధాన గుత్తాధిపత్య దశకు దారితీస్తున్నాయి.
ద్రవ్య మూలధనం’ను సృష్టి..
లెనిన్ గుత్తపెట్టుబడిదారీ విధానాన్ని ‘సాంప్రదాయ’ లేదా ‘పోటీ’ పెట్టుబడిదారీ విధానం నుంచి విశ్లేషించాడు. గుత్తపెట్టుబడిదారీ దశను పెట్టుబడిదారీ విధాన సామ్రాజ్యవాద దశ లేక యుగంగా పిలిచాడు. తానే అభివృద్ధి చెందుతున్న పోకడలపై ఆధారపడి లెనిన్ ఈ క్రింది లక్షణాలను సామ్రాజ్యవాదం సారాంశంగా గుర్తించాడు.
ఉత్పత్తి, మూలధన కేంద్రీకరణ అది ఆర్ధిక జీవితంలో నిర్ణయాత్మక పాత్ర పోషించే, గుత్తాధిపత్యాలను సృష్టించేటంత ఉన్నత దశకు అభివృద్ధి చెందింది. బ్యాంకుల మూలధనం పారిశ్రామిక మూలధనంతో విలీనమవడం, దీని ఆధారంగా(financial oligarchy) ద్రవ్య సామ్రాజ్య(finance capital’) ‘ద్రవ్య మూలధనం’ను సృష్టించడం జరిగింది.
సరుకుల ఎగుమతికి భిన్నంగా మూలధన ఎగుమతి, ముఖ్యంగా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచాన్ని విభజించే, పెట్టుబడిదారుల అంతర్జాతీయ గుత్తాదిపత్యాల ట్రస్టులు ఏర్పడ్డాయి. పెద్ద పెట్టుబడిదారీ శక్తుల ద్వారా ప్రపంచ ప్రాదేశిక విభజన పూర్తయింది.
సామ్రాజ్యవాదాన్ని గురించి లెనిన్ చేసిన వర్ణన 1870- 1914ల మధ్య కాలంలోని పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థల అభివృద్ధి ప్రధాన లక్షణాలను నిర్దిష్టంగా నిర్ణయిస్తుంది. లెనిన్ తనకు ఆధారం చేసుకున్న ధోరణులు చాలావరకు కొనసాగాయి.
తీవ్రమైన ఎదురు దెబ్బ..
నేడు మనం సాపేక్షంగా అభివృద్ధి చెందిన సామ్రాజ్యవాద దశలో ఉన్నాము. అదే సమయంలో రష్యా విప్లవానికి ముందు సామ్రాజ్యవాదమనే లెనిన్ దృష్టికోణాన్ని ధ్రువీకరించిన ముఖ్యమైన రాజకీయ ఆర్ధిక మార్పులు జరిగాయి. ఈ పరిణామాల వివరణాత్మక వివరాలనూ విశ్లేషణనూ ఇక్కడ చేయడం సాధ్యం కాక పోయినా, కొన్ని సంక్షిప్త వ్యాఖ్యలు సరైనవే.
మానవ జాతి చరిత్రలోని ఒక మలుపు అయిన యూఎస్‌ఎస్‌ఆర్‌లోని మహత్తర అక్టోబరు విప్లవానికి మొదటి ప్రపంచ యుద్ధం సాక్షీభూతం అయ్యింది. ఆ విధంగా ప్రపంచంలోని ఆరవవంతు భాగాన్ని కోల్పోయిన పెట్టుబడిదారీ ప్రపంచం చరిత్రలోనే గతంలో ఎన్నడూ చూడని చాలా తీవ్రమైన మాంద్యంలోకి నెట్టబడింది.
1929- 1939ల మధ్య పెట్టుబడిదారీ దేశాలన్నీ(1935 తరువాత నాజీ జర్మనీ మినహా) అసాధారణమైన అధిక రేట్లలో నిరుద్యోగాన్ని, వాటి ఆర్ధిక కార్యకలాపాల స్థాయిలలో చాలా తీవ్రమైన పతనాన్ని అనుభవించాయి. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో మాత్రమే నిరుద్యోగిత రేట్లు గణనీయంగా తగ్గడం ప్రారంభించాయి. చైనా ప్రజా రిపబ్లిక్,తూర్పు యూరపు జనతా ప్రజాస్వామికాల(ఆవిర్భావాన్ని) పుట్టుకను కూడా చూసిన ఈ యుద్ధంలో ఫాసిజానికి గట్టి దెబ్బ కొట్టడం జరిగింది. చైనా, ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియా, తూర్పు యూరపు దేశాలలో సోషలిజం విజయవంతమైంది, పెట్టుబడిదారీ విధానానికి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. .
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 61వ భాగం, 60వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
