పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఉత్పత్తి శక్తుల విపరీతమైనవృద్ధిని తెస్తుంది. అదనపు విలువ వెంబడిపడడం, పెట్టుబడిదారుల మధ్య పోటీ; రెండూ పెట్టుబడిదారులను కూడబెట్టుకోమనీ, ముఖ్యంగా కార్మికుల ఉత్పాదకశక్తిని పెంచమని బలవంత పెడతాయి.
క్రమబద్ధమైన అభివృద్ధీ, యంత్రాల, ఆధునిక పరిశ్రమల వినియోగం ద్వారా చోటు చేసుకుంటున్న సాపేక్ష అదనపు విలువ, సమాజంలో ఒక్కమారుగా ఉత్పాదక శక్తినీ, నిరుద్యోగ కార్మిక సైన్యాన్నీ పెంచుతుంది.
పెరుగుతున్న నిరుద్యోగ కార్మిక సైన్యం, ఇది సూచించే వేతనాల పెరుగుదలపై పరిమితులూ, రెండూ వినియోగ పునాదిని కుంచింపజేయడానికి తోడ్పడతాయి. ఉత్పాదక శక్తుల అభివృద్ధికీ, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలకూ మధ్య ఉన్న వైరుధ్యం ఇప్పుడు ఉత్పత్తి శక్తికీ వినియోగశక్తికీ మధ్య వైరుధ్యంగా వెలువడుతుంది.
‘సమాజ సంపూర్ణ వినియోగశక్తే వాటి పరిమితిని కలిగి ఉన్నట్టుగా, ఉత్పాదక శక్తులను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులు చేస్తున్న ప్రయత్నానికి భిన్నంగా, నిజమైన అన్ని సంక్షోభాలకూ అంతిమ కారణం ఎప్పుడూ ప్రజల పేదరికమూ, పరిమితం చేయబడిన వినియోగమే’ అని మార్క్స్ తెలియజేశారు.
లెనిన్ ఆచరణాత్మకంగా ఈ విషయాన్ని అదే విధంగా ఉపయోగించాడు. ‘పెట్టుబడిదారీ విధానంలో అంతర్లీనంగా ఉన్న ఉత్పత్తిని పెంచే ప్రయత్నానికీ విస్తృత ప్రజానీకం పరిమితం చేయబడిన వినిమయానికీ మధ్య అక్కడ నిస్సందేహంగా, అపరిమితమైన వైరుధ్యం ఉంది.’
ఎంగెల్స్ కూడా అదే చెప్పాడు: ఆధునిక పరిశ్రమలో అపారమైన విస్తరణ శక్తి కనిపిస్తున్నది. గుణాత్మకంగానూ, పరిణామాత్మకంగానూ, రెండు విధాలా విస్తరణకు అవసరంగా; కానీ మార్కెట్ విస్తరణ సామర్ధ్యం ప్రధానంగా తక్కువ శక్తివంతంగా పనిచేసే చాలా భిన్నమైన నియమాలచే నిర్వహించబడుతుంది. మార్కెట్ విస్తరణ ఉత్పత్తి విస్తరణ అంత వేగంగా జరగదు. ఘర్షణ అనివార్యం అవుతుంది.
‘అల్ప వినియోగం’ వైపు ప్రయాణ ధోరణి..
పైదాని నుంచి పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తికీ, వినిమయానికీ మధ్య ఒక ప్రాథమిక వైరుధ్యం ఉన్నదని మార్క్సిస్టు అర్ధశాస్త్రం గుర్తించిన విషయం స్పష్టమౌతున్నది. పెట్టుబడిదారీ విధానం ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేస్తుంది. దీంతో సమాజ ఉత్పత్తి శక్తిని వేగంగా అభివృద్ధి చేస్తుంది. కానీ ఉత్పత్తితో(ఆవిధంగా పంపిణీతో) దాని సంబంధం సమాజ వినిమయ శక్తి పెరుగుదలని పరిమితం చేస్తుంది, ఇదే వైరుధ్యం(వైరుధ్యానికి కారణం).
అయితే ఈ వైరుధ్య ఉనికికి అర్ధం పెట్టుబడిదారీ విధానం అసాధ్యమని కానీ; లేదా పెట్టుబడిదారీ విధానం విచ్ఛిన్నమౌతుందనే సంకుచిత ఆర్ధికవేత్త భావనకానీ కాదు. అందుకు బదులుగా ‘అల్ప వినియోగం’ వైపు ప్రయాణ ధోరణిని ఈ వైరుధ్యం సూచిస్తుంది.
‘అల్ప వినియోగం’ అన్న పదాన్ని సాపేక్షంగా అంటే సమాజానికి అందుబాటులో ఉన్న ఉత్పత్తి శక్తులకు సంబందించి ఉపయోగించడం జరిగింది. నిరంతర సంక్షోభానికి, సామాజిక పునరుత్పత్తి ప్రక్రియలో చీలికకు అనివార్యంగా దారితీసే పెట్టుబడిదారీ విస్తరణ లేదా అభివృద్ధి జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ ధోరణి ప్రబలమయ్యింది.
అయితే, అనేక వైరుధ్యాల సంయుక్త కార్యాచరణ ఫలితమే ప్రతి పెట్టుబడిదారీ సంక్షోభం కూడా.
‘అల్ప వినియోగ’ ధోరణిని ఏకపక్షంగా నొక్కి చెప్పగూడదు. ఇంకా ఈ ధోరణిని సాధారణ అర్ధంలో అర్ధం చేసుకోవాలి. మూలధనం– ఉత్పత్తుల మధ్య నిష్పత్తులకు సంబంధించి అనుభవాల సారం నుంచి చేసిన ఊహల ద్వారా అల్ప వినియోగ ధోరణిని నిర్వచించే ప్రయత్నం వగైరాలు, తప్పుడు నిర్దిష్టతలు, సాధారణ అనుభవవాదం.
లాభాల పతన నిష్పత్తి నియమం..
పెట్టుబడిదారీ సంక్షోభాలలో అల్పవినియోగ ధోరణిని ఒక ముఖ్యమైన అంశంగా మార్క్స్ గుర్తించాడు. ఈ ధోరణి నియమితకాలంలో ఉత్పత్తుల అదనపు విలువను పొందడంలో ఇబ్బందులను కలిగిస్తుండడాన్ని, పెట్టుబడిదారులు తమ సరుకులను వాటి ఉత్పత్తి ధరకే అమ్ముకోలేని స్థితికి చేర్చిన ఆర్ధిక సంక్షోభాలకు దారితీయడాన్ని అతను గమనించాడు. కానీ ఉత్పత్తి శాఖలకూ, అల్పవినియోగ ధోరణికీ మధ్య ఉన్న అసమానతను పెట్టుబడిదారీ సంక్షోభాల మూలాల క్షీణతగా అతను చూడలేదు. పడిపోతున్న లాభాల రేటు నియమంగా తానూ గుర్తించిన పెట్టుబడిదారీ ప్రాథమిక ధోరణిపై అతను చాలా శ్రద్ధ చూపాడు.
పెట్టుబడిదారీ సంచిత(కూడబెట్టే) ప్రక్రియ నుంచి ఈ నియమాన్ని చాలా సులభంగా పొందవచ్చు. మొత్తం పెట్టుబడిదారుల వర్గాన్ని ఒకటిగా పరిగణించండి. మొత్తం సామాజిక అదనపు విలువ ఎస్‌ను మొదటగా ఈ వర్గం స్వంతం చేసుకుంటుంది. ఈ సామాజిక ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించిన మొత్తం సామాజిక మూలధనాన్ని, స్థిర పెట్టుబడి C, అస్థిర పెట్టుబడి V అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. మొత్తం అస్థిర పెట్టుబడి Vని దోపిడీ రేటుతో గణిస్తే వచ్చేదే సామాజిక అదనపు విలువ S. కానీ పెట్టుబడిదారునికి ఆసక్తిని కలిగించేది అదనపు విలువ రేటుకాదు. లాభాల రేటు మాత్రమే ఆసక్తిని కలిగిస్తుంది. ఉత్పత్తి ధరల గురించి మనం ఇంతకు ముందు జరిపిన చర్చలలో లాభాల రేటును సామాజిక సగటు నుంచి పొందడాన్ని చూశాము. అంటే R=S/(C+V)R = లాభాల రేటు, S= మొత్తం సామాజిక అదనపు విలువ, V= సామాజిక ఉత్పత్తిలో వినియోగించిన మొత్తం అస్థిర పెట్టుబడి, C= సామాజిక ఉత్పత్తిలో అభివృద్ధి చెందిన మొత్తం స్థిర మూలధనం.
పెట్టుబడిదారీ వర్గానికీ, కార్మికవర్గానికీ మధ్య జరుగుతున్న వర్గ పోరాటం,పెట్టుబడిదారుల మధ్య పోటీ రెండింటివల్లా జరిగిన ఉత్పత్తి అయిన అస్థిర పెట్టుబడితో సంబంధంలో స్థిర పెట్టుబడిని వినియోగించడం పెరగడం పెట్టుబడిదారీ ఉత్పత్తిలోని ప్రాథమిక ధోరణి అనేది మనకు తెలుసు. కావున పెట్టుబదిదారీ కూడబెట్టడం(సంచితం) ముందుకు సాగడంతో C/V క్రమంగా పెరుగుతుందని మనం ఆశిస్తాము. అదే సమయంలో సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి, కూడబెట్టే ప్రక్రియ ఫలితంగా యాంత్రీకరణ, ఉత్పాదక శక్తుల అభివృద్ధి ఇతర అంశాలు దారితీస్తాయని మనకు తెలుసు. అందుచేత C/V పెరగడానికి దారితీసిన అవే ప్రక్రియల కారణంగా S/V కూడా పెరుగుతుంది. ఇప్పుడు లాభాల రేటు Rను పరిగణిద్దాము.
దానిని ఇలా వ్యక్తీకరించవచ్చు:
S /(C + V) = (S / V) / (I + C / V)Rకు సంబంధించినంత వరకు వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయన్నది స్పష్టం. అస్థిర పెట్టుబడికి సంబంధించి స్థిరపెట్టుబడి వినియోగం పెరుగుదల Rని కుంగదీస్తుంది. కానీ దానిని వెన్నంటి వస్తున్న ఉత్పత్తి, S/Vల పెరుగుదల దానిని పైకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది.
ఏదేమైనా, ఆదాయాన్ని కూడబెట్టడం సాగినకొద్ది Rని కుంగదీయడం సమతుల్యత ధోరణి అని మార్క్స్ వాదించాడు. కానీ, లాభాల రేటు పడిపోవడాన్ని గురించి మాత్రమే మార్క్స్ చెప్పాడని నొక్కి చెప్పాలి. వాస్తవానికి ‘పడిపోయే లాభం రేటు ధోరణి నియమం’ అని దానిని మార్క్స్ పిలిచాడు.
మార్క్స్ చెప్పిన దాని ప్రకారం, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం స్థిర మూలధనంతో పోలిస్తే అస్థిర మూలధన క్రమబద్ధమైన క్షీణతను ఉత్పన్నం చేస్తుంది. తత్ఫలితంగా మొత్తం మూలధన సహజ పెరుగుదల కూర్పును ఉత్పన్నం చేస్తుంది. దీని తక్షణ ఫలితం అదనపు విలువ పరిమాణం అదే సమయంలో లేదా పెరుగుతున్న శ్రమ దోపిడీ స్థాయికి నిరంతరం పడిపోతున్న సాధారణ లాభాల రేటు ప్రాతినిధ్యంవహిస్తుంది.
ఈ నియమాన్ని సూత్రీకరించడంలో కూడా, స్థిర పెట్టుబడి ముఖాముఖి అస్థిర పెట్టుబడుల ఉపయోగం పెరుగుతున్న కొద్దీ అదనపు విలువ రేటు పెరగవచ్చుననే విషయాన్ని మార్క్స్ గుర్తించాడని గమనించడం ముఖ్యం.పెట్టుబడిదారీ విధానంలోని ప్రాథమిక వైరుధ్య వ్యక్తీకరణగా మార్క్స్ ఈ నియమాన్ని చూశాడని నొక్కి చెప్పడం అవసరం.
అందుచేత, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ప్రత్యేక లక్షణమైన, శ్రమ క్రమబద్ధమైన సామాజిక సామాజిక ఉత్పాదకత అభివృద్ధికి కేవలం వ్యక్తీకరణ మాత్రమే; సాధారణ లాభాల రేటు పతనమయ్యే క్రమబద్ధమైన ధోరణి. ఇతర కారణాలవల్ల లాభాల రేటు పతనం కాదని దీని అర్ధం కాదు. కానీ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన స్వభావంతో ముందుకు సాగింది. తద్వారా దాని అభివృద్ధిలో అదనపు విలువ సాధారణ సగటు రేటు సాధారణ లాభాల రేటు పతనంలో వ్యక్తీకరించబడాలనే తార్కిక అవసరాన్ని రుజువు చేసింది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 57వ భాగం, 56వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
