రోజా లక్సెంబర్గ్ వాదన..
అదనపు విలువపై రోజా లక్సెంబర్గ్ దృష్టి పెట్టింది. కార్మికులు తమ మొత్తం వేతనాన్ని వెచ్చిస్తారని మార్క్స్ లాగానే సహేతుకంగా ఊహించవచ్చు. ఉపయోగించిన స్థిర మూలధనాన్ని భర్తీ చేయడానికి మొత్తం సామాజిక ఉత్పత్తిలోని మరొక భాగం వెళ్తుంది. ఆర్ధిక వ్యవస్థ మొత్తం ఉత్పత్తి విలువలో C, Vల విలువకు ఇది సరిపోతుంది. కాని అక్కడ అదనపు విలువ S మిగిలి ఉంటుంది. అదనపు విలువలో కొంత భాగాన్ని పెట్టుబడిదారులు వినియోగిస్తారనే దానిలో అనుమానం ఏమీ లేదు, కానీ మిగిలిన దాని విషయం ఏమిటి?
వ్యక్తిగతంగా వినియోగించని అదనపు విలువకు డిమాండు ఎక్కడ ఉందిని రోజా లక్సెంబర్గ్ ప్రశ్నిస్తున్నది. పెట్టుబడిదారులు(ఉత్పత్తి చేసిన అదనపు విలువకు ప్రాతినిధ్యం వహించే) అదనపు ఉత్పత్తి సాధనాలను ఒకరి నుంచి మరొకరు కొంటారని చెప్పి ఎవరైనా ఆమెకు జవాబు చెబితే, అది ఎంత కాలం కొనసాగవచ్చు?
పెట్టుబడిదారులు ఉన్నది వ్యాపారంలో అదనపు విలువను పొందడానికే కాని కేవలం ఉత్పత్తి కొరకు మరింతగా ఉత్పత్తి చెయ్యడానికి కాదు. ఈ విధంగా విస్తరించిన పునరుత్పత్తి సమస్యను ముందుకు తేవడం ద్వారా, విదేశీ మార్కెట్లు లేకుండా పెట్టుబడిదారీ పునరుత్పత్తి అసాధ్యమని రోజా లగ్జెంబర్గ్ నిర్ధారించింది.
లక్సెంబర్గ్ వాదన అనేక విశ్లేషణాత్మక లోపాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రధాన లోపాన్ని ఎవరైనా చాలా సులభంగా చూడగలరు. మొత్తం అదనపు విలువను అమ్మి వేయవచ్చు, ఖర్చుపెట్టవచ్చు, ఆ విధంగా కాలక్రమేణా పెరిగే పెట్టుబడిదారీ వినియోగం ద్వారా తిరిగి పొందవచ్చు, లేదా అదనపు ఉత్పత్తి సాధనాలపైనా, అస్థిర పెట్టుబడిపైనా ఖర్చును సూచించే ఉత్పాదక మూలధనంగా మార్చడంద్వారా తిరిగి పొందవచ్చు.
పెట్టుబడిదారీ వినియోగం పెరుగుదలా అలాగే కొత్తగా పనిచేసే కార్మికుల వినియోగం వినిమయ సాధనాలకు అదనపు డిమాండును కలిగిస్తుంది. స్థిర పెట్టుబడిపై వెచ్చించిన అదనపు విలువ భాగం ఉత్పత్తి సాధనాల అదనపు డిమాండును కలిగిస్తుంది. ఆ విధంగా విస్తరించిన పునరుత్పత్తి జరగడం, ఉత్పాదకత, వ్యక్తిగత వినియోగం కాలక్రమేణా జరగడం సాంకేతికంగా సాధ్యమే. ఆ విధంగా విస్తరించిన పునరుత్పత్తి అసాధ్యతను లక్సెంబర్గ్ నొక్కి చెప్పడం స్పష్టంగా తప్పు.
రోజా లక్సెంబర్గ్ లోపాన్ని గుర్తించడం ఒక విషయం, కానీ దీని వ్యతిరేకత శృతిమించి విస్తరించిన పునరుత్పత్తి, ఉత్పాదక వినియోగం విస్తరణ ఆధారంగా సజావుగా, వైరుధ్యాలు లేకుండా జరుగుతుందని నొక్కి చెప్పడం మరొక విషయం.
కొంతమంది ఆర్ధిక శాస్త్రవేత్తలు, ముఖ్యంగా 19వ శతాబ్దపు చివరి భాగానికి చెందిన రష్యన్ ఆర్ధిక శాస్త్రవేత్త తూగన్ బరనోవస్కి; అదే కాలానికి చెందినా అమెరికన్ ఆర్ధిక శాస్త్రవేత్త జేడీ క్లార్కులు ఖచ్చితంగా ఈ లోపం చేశారు. జనాభా కొనుగోలు శక్తి అనే అర్ధంలో, అదనపు విలువను ఎక్కువ యంత్రాలను తయారు చేయడానికి ఎప్పుడూ యంత్రాలపై ఖర్చు చేయవచ్చు కనుక, వినియోగించుకునే శక్తి సరిపోకపోవడం పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభాలకు కాదని బరనోవస్కి వాదించాడు.
‘వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఒక నిర్ణీత మొత్తానికి మించిన వారి ఆదాయాన్ని ఆదా చేయడానికి పెట్టుబడిదారులందరూ నిర్ణయించుకుంటే, మొదట వారి వర్తమాన సాధనాలలో ఒక భాగాన్ని, ఆ తరువాత అలా సృష్టించిన మూలధనం నుంచి వచ్చే వారి మొత్తం ఆదాయాలను వారు లాభంగా పొందుతారు. అవి ఎప్పుడూ మరిన్ని మిల్లులు తయారు చేసే విధంగా వారు మరిన్ని మిల్లులు నిర్మిస్తారు’అని క్లార్క్ అంటాడు.
మార్క్స్ దృష్టి కోణం..
ముతక అల్పవినియోగ వాదనలను మార్క్స్ తిరస్కరించాడు. ఉదాహరణకు, సరిపడినంత వినియోగ శక్తి లేమి కారణంగా సంక్షోభాలు వచ్చాయనీ, ఆ పరిస్థితిని కార్మికులకు వేతనాలు పెంచి ఉత్పత్తిలో అధిక భాగాన్ని ఇవ్వడం ద్వారా పరిష్కరించవచ్చనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోండి.
ఈ అభిప్రాయంపై ‘సాధారణంగా వేతనాలు పెరుగుతూ, వాస్తవానికి వినియోగం కోసం ఉద్దేశించిన వార్షిక ఉత్పత్తిలో ఎక్కువభాగాన్ని కార్మికులు పొందుతూ ఉన్న కాలంలోనే సంక్షోభాలు తయారు చేయబడతాయని ఎవరైనా వాదించాలి’ అని మార్క్స్ అన్నాడు.
అటువంటి సంస్కరణ వాదనలను తిరస్కరిస్తూనే, ఉత్పత్తిని పూర్తిగా వినిమయం నుంచి విడదీయవచ్చని నొక్కిచెప్పే తప్పు జరగకుండా మార్క్స్ జాగ్రత్తపడ్డాడు.
ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, మారకంలు మార్క్స్ దృష్టిలో సంక్లిష్టమైన, వైరుధ్యాల మొత్తమని మనం గుర్తుచేసుకోవాలి. ఉత్పత్తి, వినియోగాల మధ్య అన్ని సమాజాల్లోనూ తార్కిక సంబంధమున్నదని మార్క్స్ నొక్కిచెప్పాడు.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని నిర్దిష్టంగా సూచించేటప్పుడు మార్క్స్ చాలా స్పష్టంగా ఉన్నాడు.
స్థిర మూలధనానికీ, స్థిర మూలధనానికీ మధ్య నిరంతర పంపిణీ ఉంటుంది. ఇది తరువాతి దానిలో ఎప్పుడూ చేరదు కనుక, మొదటగా ఇది వ్యక్తిగత వినియోగం నుంచి స్వతంత్రమైనది. కానీ, స్థిర మూలధనం తనకోసమే ఉత్పత్తి ఎప్పుడూ చేయదు కనుక వినియోగం దీనిని తప్పకుండా పరిమితం చేస్తుంది. ఇందులో చాలా భాగం దాని ఉత్పత్తులు వ్యక్తిగత వినియోగంలోకి వెళ్ళే రంగాల పరిధిలో దీని అవసరం ఉండడమే దానికి కారణం.
ఈ విషయం స్పష్టమే..
పెట్టుబడిదారీ విధానంలో యంత్రాల ఉత్పత్తి పెరుగుదల ద్వారానూ, ఇతర స్థిర పెట్టుబడుల ద్వారానూ వినిమయం నుంచి సాపేక్షంగా స్వతంత్రంగా కొనసాగుతుంది, కానీ అది ఒక స్థితి వరకు మాత్రమే. వినిమయం పెరుగుదలపై ఉత్పత్తి సాధనాల ఉత్పత్తిలో పెరుగుదల ద్వారా ఒక ఖచ్చితమైన పరిమితిని కలిగిస్తుంది. పెట్టుబడిదారీ విధానంలో సామాజిక ఉత్పత్తి ఇతర రూపాలలో లాగానే ఉత్పత్తి అంతిమంగా వినిమయంతో సంబంధించినది.
పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తికీ, వినిమయానికీ మధ్య ఉన్న నిర్దిష్ట వైరుధ్యం ఏమిటి? పెట్టుబడిదారీ ఉత్పత్తి అదనపు విలువకై కొట్టుకుపోవడం ద్వారా ప్రేరేపించబడుతుంది, నిర్వహించబడుతుంది. సంపూర్ణ, సాపేక్ష అదనపు విలువను పెంచడమే పెట్టుబడిదారీ ఉత్పత్తి లక్ష్యం. ఇది కూడబెట్టడాన్ని ప్రేరేపిస్తుంది. ఇంతకూ ముందే మనం చూసినట్లు, పెట్టుబడిదారీ కూడబెట్టే విధాన సాధారణ సూత్రం, కార్మిక(శ్రమ) శక్తి విలువ చుట్టూ వేతనాలను కేంద్రీకరించిన పెరుగుతున్న నిరుద్యోగ, పాక్షిక ఉద్యోగ కార్మిక సైన్యం. కానీ పెట్టుబడిదారులకు అదనపు విలువను ఉత్పత్తి చేయడమే సరిపోదు.
అదనపు విలువ అంతర్లీనంగా ఇమిడి ఉన్న సరుకులు తగిన ధరలకు అమ్ముడుపోయే వరకూ అదనపు విలువ సంభావ్యతగా మాత్రమే మిగిలిపోతుంది. అదనపు విలువను పొందాలంటే సరుకులు అమ్ముడుబోవాలి. ఆవిధంగా అదనపు విలువ పొందడం జరుగుతుందా లేదా అన్నది కొనుగోలుదారులు దొరుకుతారా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
అంతిమంగా ఇది ఆర్ధిక వ్యవస్థ వినిమయ శక్తిపై ఆధారపడి ఉంటుంది. కానీ వినియోగాన్ని నిర్ణయించే పరిస్థితులు- ఆ విధంగా అదనపు విలువను పొందడాన్ని నిర్ణయించే పరిస్థితులు – అదనపు విలువను ఉత్పత్తి చేసే పరిస్థితులూ ఒకటి కాదు. నిజానికి ఈ రెండూ పరస్పర విరుద్ధమైన సంబంధం కలిగి ఉన్నాయి.
ప్రత్యక్ష దోపిడీ పరిస్థితులూ, దానిని పొందే పరిస్థితులూ ఒకేలా ఉండవు. అవి స్థలం, కాలంలోనేకాక తార్కికంగా కూడా భిన్నంగా ఉంటాయి. మొదటివి సమాజ ఉత్పత్తి శక్తిచే మాత్రమే పరిమితం చేయబడి ఉన్నాయి, ఆ తరువాతవి వివిధ ఉత్పత్తి మార్గాలు, సమాజంలోని వినిమయ శక్తుల దామాషా సంబంధాలపైనా ఆధారపడి ఉన్నాయి. కానీ చివరకు చెప్పినది సంపూర్ణ ఉత్పాదక శక్తి ద్వారా లేదా సంపూర్ణ వినియోగదారుని శక్తి ద్వారా నిర్ణయించబడదు, కానీ సమాజంలోని ఎక్కువ భాగం వినియోగాన్ని ఎంతో కొంత మేరకు ఇరుకైన పరిస్థితులలో కనిష్టంగా మార్చే పంపిణీ విరుద్ధ పరిస్థితుల ఆధారపడిన వినిమయ శక్తి ద్వారా నిర్ణయించబడుతుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 56వ భాగం, 55వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
