మొదట సాధారణ పునరుత్పత్తి విషయాన్ని పరిగణనలోకి తీసుకుందాము. మొదటి విభాగం ఉత్పత్తులు, ఉత్పత్తి సాధనాలయినందున వ్యక్తిగత వినియోగంలోకి నేరుగా ప్రవేశించలేవు. మొదటి విభాగంలోని పెట్టుబడిదారులూ, కార్మికులూ వారి వినిమయ వస్తువులను పొందడానికి; మొదటి రెండవ విభాగాల మధ్య మార్పిడి తప్పనిసరిగా జరగాలి.
అదేవిధంగా రెండవ విభాగంలో ఉత్పత్తి పాత స్థాయిలో కొనసాగాలంటే, 1వ విభాగంలో వినియోగించుకున్న వాటిని భర్తీ చేయడానికి అవసరమైన స్థిర మూలధనాన్ని అక్కడి పెట్టుబడిదారులు పొందవలసి ఉంది. ఈ విషయాలు సజావుగా జరగడానికి కావలసిన Y1, Y2ల మధ్య అనుపాత సంబంధాన్ని ఈ క్రింది రెండు మార్గాలలో ఎదో ఒకదాని ద్వారా పొందవచ్చు:
ఉత్పత్తి చేసిన ఉత్పత్తి సాధనాల మొత్తం విలువ 1వ విభాగంలో వినియోగించిన దానికి రెండవ విభాగంలో వినియోగించిన దానిని కలిపితే వచ్చే దానికి సమంగా ఉండాలి. అంటే, Y1 = C1 + V1 +S 1 = C1 + C2 లేదా C2 = V1 + S1 వినిమయ వస్తువుల మొత్తం విలువ, మొత్తం రెండు విభాగాలలోని పెట్టుబడిదారులూ, కార్మికులూ అందరూ కలిసి వినియోగించిన దానికి సమానం. అంటే Y2 = C2 + V2 + S 2 = V1 + V2 + S1 +S2 లేదా (i)లో లాగా
C2 = V1 + S1.
సాధారణ పునరుత్పత్తిని నిర్ధారించడానికి 1, 2 విభాగాల మధ్య ఖచ్చితమైన(విలువ పరంగా) పరిణామాత్మక సంబంధం అవసరాన్ని ఈ సంబంధం నిరూపిస్తుంది. విషయం ఏమిటంటే రెండవ విభాగంలో భర్తీ ప్రయోజనాలకోసం అవసరమైన స్థిర మూలధనానికి సమానంగా విలువలో ఒకటవ విభాగంలోని కార్మికుల, పెట్టుబడిదారుల వినియోగానికి అవసరమైన మొత్తం వినిమయ సాధనాల అవసరం సమానంగా ఉండాలి.
సరళంగా చెప్పాలంటే, ఒకటవ విభాగం నుంచి రెండవ విభాగం కొన్న సరుకులు, ఒకటవ విభాగం రెండవ విభాగం నుంచి కొన్న సరుకులతో విలువలో సమానంగా ఉండాలి. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో లక్షలాది మంది వ్యక్తిగత వ్యాపారులూ, సంస్థలూ ఉత్పత్తి, పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నందున, మనం సాధారణ పునరుత్పత్తినే పరిగణనలోకి తీసుకున్నా కూడా, ఈ నిష్పత్తి స్వయంచాలకంగా స్థాపించబడుతుందని లేదా నిర్వహించబడుతుందని ఆశించడానికి హేతువు ఏమీ లేదు.
విస్తరించిన పునరుత్పత్తి విషయంలో పునరుత్పత్తి సజావుగా సాగడానికి ఇదేవిధంగానే కానీ మరింత సంక్లిష్టమైన పరిస్థితులను సంతృప్తి పరచాలి. అందుచేత, ఈ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయని ఆశించడానికి ఇంకా తక్కువ(హేతువు) అవకాశం ఉంటుంది. ఉత్పత్తి వివిధ ముఖ్యమైన శాఖల ఫలితాల మధ్య అవసరమైన దామాషా సంబంధాలు, మన రెండు విభాగాల పథకంలోని వినిమయ వస్తువుల, మూలధన వస్తువుల మధ్య విఫలమైనప్పుడు అసమానత సంక్షోభాలు సంభవిస్తాయి.
అల్ప వినియోగం..
పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియను విశ్లేషించే సమయం అంతట్లోనూ సరుకులు వాటి విలువకు(ఖచ్చితంగా చెప్పాలంటే వాటి ఉత్పత్తి ధరలకే) అమ్ముడుపోతాయనే ఊహను కొనసాగించడం జరిగింది. అసమానత గురించి పైన జరిగిన మన చర్చలో, అధికోత్పత్తి చేస్తే, సరుకులను వాటి విలువకన్నా(ఉత్పత్తి ఖర్చు) తక్కువ ధరలకు అమ్మవలసి వస్తుందని మనం గమనించాము. అందుచేత అసమానత నుంచి ఉత్పన్నమౌతున్న ఆర్ధికసంక్షోభాలపై చర్చలో ఈ ఊహను(ఆలోచనను) వదిలివేయాలి.
మూలధన(సర్క్యూట్) వలయ రెండు (ప్రసరణల)పంపిణీ దశలపై అంటే M-C, C’-M’లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెట్టుబడిదారీ విధానం క్రింద అసమానత నిర్దిష్ట, ప్రాథమికమైన విషయం పెట్టుబడిదారీ విధాన ఉత్పత్తి శక్తికీ, దాని వినిమయ శక్తికీ మధ్య ఉన్న వైరుధ్యం ఆధారంగా ఉంటుంది. ఇది సాధారణంగా ఉత్పత్తి సాధనాలకూ, వినిమయ సాధనాలకూ మధ్య వైరుధ్యంగా వ్యక్తమౌతుంది.
ఉత్పత్తి, వినిమయ శక్తుల అభివృద్ధిలోని వైరుధ్యాన్ని మార్క్స్- ఎంగెల్స్‌లు ఇరువురూ స్పష్టంగా గుర్తించారు, నొక్కిచెప్పారు. కానీ, కొందరు అర్ధశాస్త్రవేత్తలు, అలాగే రివిజనిస్టులు, సంస్కరణ వాదులు వైరుధ్యం స్వభావాన్ని తప్పుగా అర్ధం చేసుకొని, కేవలం దానిని నొక్కి చెప్పడం వలన, ఒక ప్రతి చర్యగా, అనేక మంది మార్క్సిస్టులు ఈ అంశాన్ని చులకనగా చూడడానికి దారితీసింది. ఉత్పాదక శక్తికీ, వినిమయ శక్తికీ మధ్య వైరుధ్యానికి అర్ధాన్నీ, పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలోని సంక్షోభాలకు ఒక మూలంగా దాని పాత్రనూ ఇప్పుడు మనం వివరించదానికి ప్రయత్నిద్దాం:
మార్క్సిస్టు అర్ధశాస్త్రవేత్తలు వినిమయం రెండురకాలని గుర్తించారు: అవి కార్మికుల, పెట్టుబడిదారుల వ్యక్తిగత వినిమయం (వ్యక్తులు కొని వ్యక్తిగతంగా వినియోగిస్తున్న ఆహారం, బట్టలు, వగైరా), (వివిధ రకాల ఉత్పత్తి క్రమంలో జరిగే వినిమయం) ఉత్పాదక వినిమయం.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ధ్యేయం అదనపు విలువను సృష్టించడం. పెట్టుబడిదారుల మధ్య పోటీ అదనపు విలువను పొందడానికి వీలుగా కూడబెట్టుకునేలా వారిని బలవంతపెడుతుంది. కూడబెట్టుకోవడం అంటే అర్ధం మరింత ఉత్పాదక వినియోగం. పెట్టుబడిదారీ వ్యవస్థ వినిమయ శక్తిలో ఓకే భాగం ఈ ఉత్పాదక వినియోగం.
పెట్టుబడిదారీ పోటీలోని అనివార్యతలు, కూడబెట్టుకోవడం దానిని వెన్నంటివచ్చే ఉత్పత్తిశక్తుల ఉత్పత్తిని పెంచే ఉత్పాదకశక్తుల అభివృద్ధి, ఉత్పాదక వినియోగం, సాపేక్షంగా వ్యక్తిగత వినియోగం పెరుగుదలతో సంబంధం లేకుండా పెరగడానికి తోడ్పడుతుందన్నది స్పష్టం.
ఉత్పాదక, మొత్తం వియోగాలోని ఈ సాపేక్ష స్వతంత్ర అభివృద్ధి, అల్పవినియోగనే ముతకవాదనలలో అంతర్లీనంగా ఉన్న వంచనను వెల్లడించడానికి ఉపయోగడుతుంది. పెట్టుబడిదారీ విధానం ప్రజలను పేదరికంలోకి నెడుతుంది. కావున తన(సమాధి) గోతిని తానే తవ్వుకుంటుంది; అది తన స్వంత దేశీయ మార్కెట్‌ను అభివృద్ధి చేసుకోలేదని ఈ ముతక వాదన నొక్కిచెబుతుంది. దీని అర్ధమేమిటంటే ‘బాహ్య’ (విదేశీ) మార్కెట్లు లేకుండా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందదు. వాస్తవానికి ముతక అల్పవినియోగ వాదనలనేకం ఉన్నాయి.
అల్ప వినియోగ ముతక వాదం..
మొదటగా, పెట్టుబడిదారీ విధానం పుట్టుక, అభివృద్ధి- చిన్న ఉత్పత్తిదారులైన హస్త కళలవారినీ చేతి వృత్తులవారినీ రైతులనూ తొలగించడాన్ని సూచిస్తుంది. కాబట్టి అది తన స్వంత మార్కెట్ ఏర్పడే అవకాశాన్నే తొలగిస్తుంది, దీంతో అది అభివృద్ధి చెందలేదనే వాదన ఒకటి ఉంది.
19వ శతాబ్దంలో రష్యాలో నరోద్మిక్కులు తీసుకున్న వైఖరి ఇది. లెనిన్ వారితో తీవ్రంగా పోరాడాడు, చాలా మంది చిన్న ఉత్పత్తిదారులు(ప్రత్యేకించి రైతుల) ఆర్ధికంగా నాశనం చేయబడినప్పటికీ, మనుగడ సాగించిన కొద్ది మందీ బాగా సంపాదించి పెద్ద పెట్టుబడిదారులుగా మారారని నిరూపించాడు. ఇంక, ఆర్ధికంగా నాశనమైన హస్త కళలవారు, రైతులు కూలీలుగా మారారు. గతంలో వారు తమ స్వంత వినియోగానికి ఉత్పత్తి చేసిన జీవనాధార వస్తువులిప్పుడు పెద్ద వ్యవసాయ పెట్టుబడిదారులు, వస్త్ర– గృహ నిర్మాణ రంగంలోని పెట్టుబడిదారులు ప్రత్యేకంగా అమ్మకం కోసమే ఉత్పత్తి చేసిన సరుకులుగా మారాయి. ఆవిధంగా కొల్లగొట్టి, కార్మికులుగా మార్చిన క్రమం, అందువలనపెద్ద సంఖ్యలో దరిద్రంలోకి నెట్టబడిన ప్రజలు పెట్టుబడిదారీ విధానానికి స్వదేశీ మార్కెట్ సృష్టిస్తారు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 55వ భాగం, 54వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
