పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాల క్రింద ఆర్ధిక సంక్షోభాలు..
ఆర్ధిక సంక్షోభాలు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి విశేషమైనవి ఏమీ కాదు. అయితే నిర్ణయాత్మకంగా విశేషమైనది. నిజానికి స్పష్టంగా విరుద్ధమైనదేది, పెట్టుబడిదారీ విధానంలోని ఆర్ధిక సంక్షోభాల లక్షణమా? పెట్టుబడిదారీ పూర్వసామాజిక నిర్మాణాలలో ఆర్ధికసంక్షోభమన్నది, ఉత్పత్తి శక్తుల సాపేక్షంగా తక్కువ స్థాయి అభివృద్ధికి వ్యక్తీకరణలైన కరువులు, వరదలు, భూకంపాలు వంటి సహజ కారణాల వలన లేదా అసాధారణ సామాజిక ఉత్పాతం వలన(ప్లేగు వంటి అంటువ్యాధుల వలన మరణాలు) వచ్చిన నిత్యావసర వస్తువుల, సేవల తీవ్రమైన కొరత వలన అనివార్యంగా ఉత్పన్నమైన పరిస్థితి. దానికి భిన్నంగా పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభాలు అధికోత్పత్తి వలన ఉద్భవించేవి.
ఒకవైపు వివిధ సరుకుల నిల్వలు దుకాణాలలో పేరుకు పోతాయి, గణనీయమైన నష్టాలను సూచించేటంత తక్కువ ధరలకు కూడా వీటిని పెట్టుబడిదారులు అమ్మలేకపోతున్నారు. మరొక వైపున కోట్లాదిమంది కార్మికులు నిరుద్యోగులు అవుతున్నారు. అందుచేత ప్రాథమిక అవసరాలను కొనలేకపోతున్నారు. అదే సమయంలో, ఉత్పత్తి శక్తుల అధిక స్థాయి అభివృద్ధి ఉత్పత్తులైన ఆధునిక యంత్రాలకు కూడా పనిలేకుండా ఉంది. పనిలేని మనుషులు ఒక వైపునా పని లేకుండా ఉన్న ఉత్పత్తి సాధనాలు మరోవైపునా; దుకాణాలలో అలంకరణగా, గోదాముల్లో నిలవలుగా పెద్ద మొతాదులో సరుకులుగా మిగిలిపోతూ ఉండగా కోట్లాది మంది రొట్టె, గంజి కొనలేని దుస్థితి ఉన్న ఇటువంటి ఆర్ధిక సంక్షోభం, పెట్టుబడిదారీ పూర్వ సమాజంలోని స్త్రీ, పురుషులు అర్ధం చేసుకోలేనిది.
పెట్టుబడిదారీ విధానం క్రింద ఆర్ధిక సంక్షోభాల వ్యక్తీకరణ తెలిసిందే. కానీ పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభానికి కారణాలను విశ్లేషించడానికి ఎవరికైనా ఒక సైద్ధాంతిక భావన అవసరం. పెట్టుబడిదారీ సంక్షోభం అంటే ఆర్ధిక జీవితం ఛిన్నాభిన్నమవడం, పెట్టుబడిదారీ పునరుత్పత్తి ప్రక్రియకు అంతరాయం అన్నది మార్క్సిస్టు భావన. మరొక మాటలో, ఆర్ధిక సంక్షోభం అంటే విడివిడిగా ఉన్న మూలధనాల సంపూర్ణత తప్ప మరొకటికాని సామాజిక మూలధన పునరుత్పత్తి ప్రక్రియకు తీవ్రమైన అంతరాయం కలగడం. అందుచేత వేయవలసిన ప్రశ్న, అటువంటి అంతరాయం ఎలా ఏర్పడుతున్నది? అని.
పెట్టుబడిదారీ సంక్షోభాల మూలాలు..
పారిశ్రామిక మూలధన సర్క్యూట్ ఈ విధంగా చూపబడడం మనం చూశాము:
..M–C.. P.. C’.. M’.. LP MP—
M ముందు M’ తరువాత ఉన్న చుక్కల గీతలు(డాటెడ్ లైన్లు) ఈ ప్రక్రియ స్థిరమైన పునరావృత్తిని సూచిస్తాయి. విడిగా ఉన్న ప్రతి మూలధనం కూడా ఒకేసారి మూడు వేరువేరు రూపాలలో: ఒక భాగం డబ్బు- మూలధనంగా, ఒక భాగం ఉత్పత్తి- మూలధనంగా, మరొక భాగం సరుకుల- మూలధనంగా, ఉండడం మనం చూశాము. విడివిడిగా ఉన్న మూలధనం తనంతట తాను పునరుద్ధరించబడాలంటే, ఈ భాగాలు ప్రతి ఒక్కటీ వరుసగా ఇతర రెండు రూపాలను తప్పనిసరిగా తీసుకోవడాన్ని అంటే దాని సర్క్యూట్‌ను వివరిస్తుంది. కానీ ఇప్పటివరకూ మనం విడివిడిగా ఉన్న మూలధన పునరుత్పత్తి ప్రక్రియను మాత్రమే పరిశీలించాము.
సంక్షోభాన్ని అర్ధం చేసుకోవడానికి ఇప్పుడు మనం తప్పనిసరిగా సామాజిక మూలధనం, అంటే సమాజమంతటిలోనూ మొత్తంగా ఉన్న మూలధన పునరుత్పత్తి ప్రక్రియను తెలుసుకోవాలి.
సామాజిక ఉత్పత్తిని మొత్తంగా, ఒకదానిని ఉత్పత్తి సాధనాలను ఉత్పత్తి చేసే దానిని, రెండవదానిని వినిమయ ఉత్పత్తులను ఉత్పత్తి చేసేదిగానూ రెండు గొప్ప శాఖలుగా లేదా రెండు ఉత్పత్తి విభాగాలుగా విభజించడం ద్వారా మనం సౌకర్యవంతంగా ప్రారంభించవచ్చు.
సామాజిక పునరుత్పత్తి ఇదే స్తాయిలో జరదగడానికి లేదా పెరిగిన స్థాయిలో జరగడానికి, ప్రతి విభాగంలో ఉత్పత్తి విలువలకు మధ్య కచ్చితమైన పరిణామాత్మక సంతృప్తి చెందాలనే విషయాన్ని ఈ అధ్యాయంలో తరువాత వివరిస్తాము. కానీ పెట్టుబడిదారీ ఉత్పత్తి ముందుగా నిర్ణయించిన సామాజిక ప్రణాళిక ద్వారా జరగదు. అందుకు బదులుగా ప్రతి పెట్టుబడిదారుడూ స్వతంత్రంగానూ, సాధారణంగా ఇతర పెట్టుబడిదారుల నిర్ణయాలు తెలియక ఉత్పత్తి, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటాడు. అందుచేత ఇక్కడ ఉత్పత్తి వివిధ శాఖల ఉత్పాదనల మధ్య, ఇక్కడ ప్రత్యేకించి ఉత్పత్తి సాధనాలకూ వినిమయ సాధనాలకూ మధ్య ‘సరైన’ నిష్పత్తి నిర్వహించబడుతుందనే దానికి ఎటువంటి హామీ లేదు. అందుకు భిన్నంగా , వ్యతిరేకంగా జరుగుతుందని ఆశించడానికి తగినంత కారణం ఉంది.
సంక్షోభానికి ఒక మూలం..
వినిమయ సాధనాల(వినిమయ వస్తువులు), ఉత్పత్తి సాధనాల(పెట్టుబడి వస్తువులు) ఉత్పత్తి సరైన నిష్పత్తులలో చేయబడక పోవడం దీని నుంచి ఉద్భవిస్తుంది, పునరుత్పత్తిని ఆమోదించే ధరలకు ఈ సరుకుల అమ్మకం అసాధ్యమౌతుంది. అటువంటి అసమానత వలన తలెత్తే సంక్షోభాలను ‘అసమానత సంక్షోభాలు’ అంటారు.
అయితే పెట్టుబడిదారీ ఉత్పత్తి ఆరాచకం అసమానత అవకాశాన్ని ఖచ్చితంగా సూచిస్తుండగా, పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభాల మూలం గురించి ఇది ఇప్పటికీ సాధారణ ప్రతిపాదనగానే మిగిలిపోయింది.
వాస్తవానికి, మార్క్సిస్టు విశ్లేషణ, రెండు లోతైన, మరింత నిర్దిష్టమైన మూలాలు. లాభం రేటు తగ్గే ధోరణి, అల్ప వినియోగ ధోరణులను సూచిస్తుంది. వీటిలో ప్రతి ఒక్క దానినీ ఈ దిగువన చర్చిస్తాము.
అసమానత సంక్షోభాలు..
పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ మొత్తం ఉత్పాదన, ప్రతి సరుకు ఉత్పత్తిలాగా దాని విలువకు సంబంధించినంత వరకు మూడు భాగాలను కలిగి ఉంటుంది. మొదట మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి చేయడంలో వినియోగించే స్థిరమైన మూలధనం ఉంది. ఆ తరువాత ఉత్పత్తిని ఉత్పత్తి చేయడంలో వినియోగించే అస్థిరమైన మూలధనం ఉంది. పనిచేస్తున్న మొత్తం కార్మికవర్గం ఉత్పత్తి చేసిన అదనపు విలువ ఉంది. పెట్టుబడిదారులకు చేరుతున్న అదనపు విలువ వారు దానిని పూర్తిగా వినియోగించినప్పుడు సాధారణ ఉత్పత్తి జరుగుతుంది.
పెట్టుబడిదారులు అదనపు విలువలో కొంత భాగాన్ని మూలధనంగా వినియోగించినప్పుడు అంటే వారు ఉత్పాదక మూలధన అంశాలను; కార్మిక శ్రమ శక్తిని, ఉత్పత్తి సాధనాలను ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో కొనుగోలు చేసినప్పుడు, విస్తరించిన పునరుత్పత్తి (కూడబెట్టడం) జరుగుతుంది.
ఆర్ధికవ్యవస్థను సామాజిక ఉత్పత్తి రెండు గొప్ప విభాగాలుగా విభజిద్దాము.
ఒకటవ విభాగం ఉత్పత్తి సాధనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని ఉత్పత్తులు వ్యక్తిగత వినియోగంలో నేరుగా ఉపయోగించబడవు. కానీ వివిధ ఉత్పత్తి ప్రక్రియలలో మూలకాలుగా పనిచేస్తాయి. రెండవ విభాగం వినిమయ సాధనాలను(వినియోగ వస్తువులను) ఉత్పత్తి చేస్తుంది. దీని ఉత్పత్తులు నేరుగా వినియోగంలోకి వెళతాయి. ప్రతి విభాగంలోనూ ఉత్పత్తి చేసిన విలువలను ఈ క్రింది విధంగా విబజించవచ్చు:
విభాగం 1: మొత్తం విలువ Y1= C1 + V1 + S1
విభాగం 2: మొత్తం విలువ Y2= C2 + V2 + S2
ఇక్కడ C1, C2లు వరుసగా 1వ, 2వ విభాగాలలో ఉపయోగించిన స్థిర పెట్టుబడులు; V1, V2లు 1, 2 విభాగాలలో వినియోగించిన అస్థిర పెట్టుబడులు; S1, S2లు 1, 2 విభాగాలలో ఉత్పత్తి చేసిన అదనపు విలువలు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 54వ భాగం, 53వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
