ధరలు, విలువలు..
బూర్జువా ధరల సిద్ధాంతంపై మార్క్స్ విమర్శ..
చారిత్రక భౌతికవాదంతోనూ, సమాజాన్ని అధ్యయనం చేసే మార్క్సిస్టు విధానంతోనూ వ్యవహరించే పరిచయంతో విషయాన్ని ప్రారంభించాము. విలువ, అదనపు విలువ, దోపిడీ అనే భావనలను కూలంకషంగా తెలుసుకున్నాము. సంపూర్ణ, సాపేక్ష విలువల ఉత్పత్తి పద్ధతుల గురించి కూడా చర్చించాము.
‘పెట్టుబడి మొదటి సంపుటిలో’ మార్క్స్ తెలియజేసినట్టుగా, ఈ విశ్లేషణాత్మక వర్గాలను ఉపయోగించడం ద్వారా పెట్టుబడిదారీ సంచిత ప్రాథమిక నియమాల వివరణల గురించి తెలుసుకున్నాము. ఇప్పటివరకూ పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ పరిధికి మాత్రమే పరిమితం చేయబడిన మన విశ్లేషణ విషయాన్ని, దానిని రెండు దిశలలో విస్తరించవలసిన అవసరాన్ని గత అధ్యాయంలో గుర్తించాము.
పెట్టుబడిదారీ పంపిణీ(సర్క్యులేషన్) విశ్లేషణను– పెట్టుబడిదారీ ఉత్పత్తి, పంపిణీ(సర్క్యులేషన్) ప్రక్రియల ఐక్యతా భావనగా సామాజిక మూలధన పునరుత్పత్తి నియమాల విశ్లేషణను తప్పక తెలుసుకోవాలి. ప్రత్యేకించి, పెట్టుబడిదారీ సంక్షోభాల గురించి మార్క్సిస్టు సూత్రీకరణ– సామాజిక మూలధన పునరుత్పత్తి ప్రక్రియకు కలిగే అంతరాయాన్ని తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది.
మార్క్స్ మూలధన కేంద్రీకరణ నియమాన్ని ప్రారంభ స్థానంగా తీసుకొని దానిలోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రత్యేకించి, పోటీతో కూడిన పెట్టుబడిదారీ విధానం నుంచి, గుత్తాధిపత్య పెట్టుబడిదారీ అభివృద్ధిని– లెనిన్ దానిని పిలిచినట్లుగా ‘సామ్రాజ్యవాదం లేదా పెట్టుబడిదారీ విధాన అత్యున్నత దశ’– అంశం మిగిలి ఉంది. అంతేకాకుండా సామ్రాజ్యవాదం గురించి మార్క్సిస్టు- లెనినిస్టు అవగాహనను వెల్లడించాలి. ప్రస్తుత అధ్యాయంలో కొన్ని ప్రాథమిక సమస్యలను పరిష్కరించడం ద్వారా, మన విశ్లేషణపై రెండు విస్తరణల కోసం భూమికను మనం సిద్ధం చేస్తాము.
విలువ– ధరలు..
రెండవ అధ్యాయంలో, మనం విలువ భావనను అభివృద్ధి చేశాము. దాని గుణాత్మక కోణంలో ‘విలువ’ అన్ని సరుకులకూ, అవి నైరూప్య శ్రమ ఉత్పత్తులైనందున లేదా సాధారణ పరిణామాత్మక మానవ శ్రమ ఉత్పత్తులై ఉన్నందున, సాధారణ సామాజిక ఆస్తి. ఒక సరుకు విలువను ఆ సరుకును ఉత్పత్తి చేయడానికి సామాజిక అవసరమైన శ్రమతో కొలుస్తారు.
సరుకులు వాటి విలువకు మార్పిడి అవుతాయని ఇప్పటివరకూ మనం భావించాము. ఏమైనప్పటికీ, మనం ఈ విధంగా కూడా చర్చించాము: వాదన మరింత అభివృద్ధి చెందడంతో, సరుకులు వాటి విలువకు అమ్ముడుపోతాయని మార్క్స్ విలువ నియమం చెప్పలేదు. కానీ వాటి ఉత్పత్తి ధరలకు మారకమయ్యే ధోరణిని చూపుతాయని చెప్పడం జరిగింది. ఆ తరువాతి దానిని మూలధనంపై ఏకరీతి లాభంవైపు పెట్టుబడిదారీ పోటీలో ఉన్న ధోరణిని పరిగణనలోకి తీసుకొని సవరించిన విలువగా అర్ధంచేసుకోవచ్చు.
ఇప్పుడు మనకు మనమే పరిష్కరించుకోవలసిన ప్రశ్నలు: ఉత్పత్తి ధరలు ఏవి? విలువలతో అవి ఎలా సంబంధం కలిగి ఉంటాయి? ఉత్పత్తి ధరల భావనను అభివృద్ధి చేయవలసిన అవసరం ఏమిటి?
ఈ ప్రశ్నల సమితిలో అంతర్లీనంగా ఉన్న ఉత్పత్తి ధరలను విలువల నుంచి పొందడంలో ఉన్న సమస్యను ‘పరివర్తన సమస్య’ అంటారు. ఇది చాలా విద్యాపరమైన రచ్చకు మూలంగా ఉంది. విలువ శ్రమ సిద్ధాంతం పూర్తిగా వైఫల్యం చెందిందని సూచించడానికి అది పరిష్కరించలేనిదనే వాదనను విద్యారంగా అర్ధశాస్త్రవేత్తలూ, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రొఫెషనల్లు తీసుకున్నారు.
ఈ సమస్యను కొంత వివరంగా దిగువన చర్చిస్తున్నాము.
పైన లేవనెత్తిన ప్రశ్నల సమితితో వ్యవహరించే ముందు, ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. విలువను కానీ, ఉత్పత్తి ధరలను కానీ సరుకులను అమ్ముతున్న అసలు రేటుగా మార్క్స్ పరిగణించలేదు. మన రోజువారీ అనుభవంలో తరువాత దానినే మనం ‘ధర’గా గుర్తిస్తున్నాము. మార్క్స్ దానిని మార్కెట్ ధర అని పిలుస్తాడు. సరుకుల ధరల ప్రశ్నను వాటి సంగ్రహణ మూడు విభిన్న స్థాయిలలో మార్క్స్ నిర్వహిస్తాడు.
సంగ్రహణ అత్యున్నత స్థాయిలో ప్రాథమిక లేదా ధరల ప్రాథమిక నిర్ణాయకత ఉంది, ఇదే విలువ. సంగ్రహణ దిగువ స్థాయిలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం మరికొన్ని నిర్దిష్ట అవసరాలు రంగం మీదికి వచ్చినప్పుడు, ఉత్పత్తి ధరలను నిర్ణయించడంలో మనం మరింత సంక్లిష్టతను ఎదుర్కొంటాము. చివరగా, పెట్టుబడిదారీ వాస్తవికత ఉపరితలంపై ప్రమాదవశాత్తూ వచ్చే సరఫరా, డిమాండ్లలోని హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకొని మనం అధికారిక ధరను కలిగి ఉంటాము. పరివర్తన సమస్యకు మనమిచ్చిన వివరణ తరువాత ఇది స్పష్టమవుతుంది.
పరివర్తన సమస్య సరుకులు తమ విలువ వద్ద మార్పిడి జరుగుతాయనే దానిని ప్రారంభస్థానంగా తీసుకొని ఈ క్రింది సమస్యను పరిశీలిద్దాము.
ఉత్పత్తి పద్ధతులలో వివిధ పరిశ్రమల మధ్య చాలా తేడాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రత్యేకించి, స్థిర– అస్థిర పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఒక పరిశ్రమ మూలధన వ్యయం తరువాతి వాటి నుంచి భిన్నంగా ఉంటుంది. ఒక పరిశ్రమ Aలో స్థిర పెట్టుబడి 80శాతం, అస్థిర పెట్టుబడి 20శాతం వినియోగించబడిందని అనుకుందాము. అదే సమయం పరిశ్రమ Bలో స్థిర పెట్టుబడి 20శాతం, అస్థిర పెట్టుబడి 80శాతం వినియోగించబడిందని అనుకుందాము.
ప్రస్తుతమున్న దోపిడీ రేటు అన్ని పరిశ్రమలలోనూ ఒకే విధంగా ఉంటుందని భావిస్తే అది 100శాతం అనుకుందాము. అప్పుడు వంద యూనిట్ల మూలధనాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పరిశ్రమ A పెట్టుబడితో ఉత్పత్తి చేసే సరుకు విలువ 80+20+20(C+V+S)=120, అదే సందర్భంలో పరిశ్రమ B ఉత్పత్తి చేసే సరుకు విలువ 20+80+80 = 180.
A, Bల ఉత్పత్తి సరుకులను వాటి విలువ వద్ద మారకం చేసుకుంటే పరిశ్రమ A యజమానైన పెట్టుబడిదారుడు 20 యూనిట్ల అదనపు విలువను మాత్రమే తన 100 యూనిట్ల మూలధన వ్యయంపై పొందుతాడు. అదే సమయంలో పరిశ్రమ B యజమానైన పెట్టుబడిదారుడు 80 యూనిట్ల అదనపు విలువను తన 100 యూనిట్ల ఒకే విధమైన మూలధన వ్యయంపై పొందుతాడు. ‘కనపడుతున్న దాని ఆధారంగా వచ్చిన అన్ని అనుభావాలకూ ఇది విరుద్ధంగా’ ఉంటుందన్నది స్పష్టమౌతున్నది.
మార్క్స్ ఈ విధంగా వివరించాడు: తాను పెట్టిన మూలధనమంతటినీ శాతాలలో లెక్కిస్తే, చాలా ఎక్కువ శాతాన్ని స్థిర మూలధనంలోనూ, చాలా తక్కువ శాతాన్ని అస్థిర మూలధనంలోనూ వెచ్చించే ఒక దూది వడికే వాడు ఈ కారణంగా చాలా తక్కువ లాభాన్ని లేదా అదనపు విలువను, చాలా తక్కువ స్థిర పెట్టుబడినీ చాలా ఎక్కువ అస్థిర పెట్టుబడినీ వెచ్చించే ఒక రొట్టెలు తయారు చేసే వానికన్నా తక్కువ పొందుతాడనేది ప్రతి ఒకరికీ తెలుసు.
ఇక్కడున్న వైరుధ్యం ఏమిటంటే?
పెట్టుబడిదారుల మధ్య నిరంతర పోటీతో ఒక పరిశ్రమ ఇచ్చిన మొత్తం వ్యయంతో మరొక పరిశ్రమ కన్నా ఎక్కువ రాబడి రేటుని ఇస్తే, అధిక రాబడి రేటు లేదా అధిక లాభాల రేటున్న పరిశ్రమ వైపు మూలధనం మొగ్గు చూపుతుంది.
మరొక మాటలో, మొత్తం(స్థిర– అస్థిర మూలధనం కలిసి) మూలధనంపై లాభాల రేటు వేర్వేరు పరిశ్రమలు అన్నింటిలోనూ సమానమయ్యే ధోరణి ఒకటి ఉంది. కానీ దోపిడీ ఒకేవిధమైన రేటుతో వాటి విలువ వద్ద సరుకుల మార్పిడి వివిధ పరిశ్రమలలో విస్తృతంగా విభిన్న లాభాల రేటుకు దారితీస్తుంది.
మార్క్స్ మాటలలో: అక్కడ అనుమానమేమీ లేదు. అనవసరమైనా, యాదృచ్ఛిక– పరస్పర పరిహార వ్యత్యాసాలను పక్కన పెడితే, పరిశ్రమ వివిధ శాఖలలో, సగటు లాభాల రేటులో తేడాలు వాస్తవానికి ఉనికిలో లేవు. అంతేకాకుండా, మొత్తం పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థను రద్దుచేయకుండా ఉనికిలో ఉండలేవు. వాస్తవ ప్రక్రియతో విలువ సిద్ధాంతం ఇక్కడ సరిపోనిదిగా కనుపిస్తున్నది. ఉత్పత్తి దృగ్విషయాలకు సరిపోనిది, ఈ కారణంగా దృగ్విషయాలను అర్ధం చేసుకునే ప్రయత్నాన్ని వదులుకోవాలి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 43వ భాగం, 42వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
