స్థిర Vs అస్థిర పెట్టుబడి..
పెట్టుబడిదారీ ఉత్పత్తి అభివృద్ధి చెందుతున్నప్పుడు, సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తి నుంచి సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి పరివర్తన చెందుతుంది. పని దినాన్ని పొడిగించే మార్గాన్ని మూసివేసిన శ్రమ, మూలధనం మధ్య జరుగుతున్న వర్గపోరాటం, ప్రయత్నించి సరుకులను చౌకగా చేయడానికి వారిని బలవంత పెట్టే పెట్టుబడిదారుల మధ్యనే జరుగుతున్న పోటీ పోరాటం రెండింటితో పరివర్తన జరుగుతుంది.
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి అవసరమైన కార్మికుల ఉత్పాదక శక్తి పెరుగుదలకు చాలా ఎక్కువగా యంత్రాల వినియోగాన్ని– శాస్త్ర, సాంకేతిక వనరులను ఉత్పత్తి కొరకు క్రమబద్దంగా వినియోగించవలసిన పద్దతుల ద్వారా సాధించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అస్థిర పెట్టుబడి రూపంలో కాక స్థిరపెట్టుబడి రూపంలో మూలధనాన్ని ఎక్కువగా నిర్దేశించడానికి దారితీస్తుంది. ఈ విధంగా ఒక విడి మూలధనం 100లో 50 స్థిర పెట్టుబడిగానూ 50 అస్థిర పెట్టుబడిగానూ ప్రారంభించినది యాంత్రీకరణ తరువాత 80 స్థిర పెట్టుబదిగానూ 20 అస్థిర పెట్టుబడిగానూ కలిగి ఉంటుంది.
యంత్రాల, యాంత్రీకరణ(ఆటోమేషన్) యుగాలతో నిర్దిష్ట మానవ శ్రమకు అపారమైన ప్రమాణంలో ఉత్పత్తి సాధనాలు పనిలో పెట్టబడినాయని చారిత్రిక అనుభవం చూపుతున్నది. ఒక యూనిట్ మానవ శ్రమచే తరలించబడిన ఉత్పత్తి సాధనాల ప్రమాణంలో భౌతిక పెరుగుదల విలువ పరంగా దాని పెరుగుదల కంటే చాలా ఎక్కువ. ఈ ప్రక్రియలో కార్మికుల ఉత్పాదకతలో అపారమైన పెరుగుదల జరుగుతుంది. దాని ద్వారా యంత్రాలు తామే ఉత్పత్తి అవుతాయి. అయినప్పటికీ, ఉత్పత్తి సాధనాలలో కోసం పెట్టిన మూలధన నిష్పత్తి పెరుగుదల పెట్టుబడిదారీ సంచిత ధోరణి.
ఉత్పత్తిలో నిర్దేశించిన స్థిరమైన మూలధన విలువకూ, ఆ విధంగా నిర్దేశించిన మూలధన విలువకూ ఉన్న నిష్పత్తిని మూలధన(Organic)సజీవ కూర్పు అని మార్క్స్ పిలిచాడు. ఒక నిర్దిష్ట సమాజంలో ఏ సమయంలోనైనా ఉత్పత్తి ప్రతి శాఖకూ, ఉత్పత్తి సాధనాలూ, మానవ శ్రమా ఏ సాంకేతిక నిష్పత్తిలో కలపాలో ఇప్పటికే ఉన్న పద్దతుల సమితి(set) నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం ఉత్పాదక స్థాయి, మూలధనం సాంకేతిక కూర్పు ఆధారంగా, విలువ లేదా మూలధనంలోని సజీవ కూర్పును అప్పుడు నిర్ణయిస్తుంది. పెట్టుబడిదారీ సంచితం లక్షణం పెరుగుతున్న యాంత్రీకరణ, కొంచం అటూ ఇటూగా నిరంతర సజీవ మూలధన కూర్పు పెరగడానికి కారణమవడాన్ని ఇప్పుడు చూడవచ్చు. ఆవిధంగా, పెట్టుబడిదారీ సంచితం ముందుకు సాగడంతో, పోటీ– వర్గ పోరాటం సజీవ శ్రమపై నిర్జీవ శ్రమ ఆధిపత్యం వహించడానికి దారితీస్తుంది. సంచిత ప్రక్రియలో వైరుధ్యాలను సృష్టించడంలో పెట్టుబడిదారీ సంచితంలోని ఈ అంశం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
ఏకాగ్రత– కేంద్రీకరణ..
సంచిత ప్రక్రియను పెట్టుబడిదారుల మధ్య పోటీ దృక్కోణం నుంచి ప్రత్యేకంగా పరిశీలించ వచ్చును. మొదటగా పోటీ పోరాటం ప్రతి పెట్టుబడిదారుడినీ కూడబెట్టదానికి, అంటే అతను దోపిడీ చేసిన అదనపు విలువను ఎంత ఎక్కువగా వీలయితే అంత ఎక్కువగా మూలధనంగా మార్చడానికి బలవంతం చేస్తుంది. వాస్తవానికి సంచితం, విడివిడి మూలధనాల పరిమాణం విస్తరణకు ఈ ప్రక్రియ దారితీస్తుంది.
పెట్టుబడిదారీ సంచితం ద్వారా ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో అనేక శాఖల ఉత్పత్తిలో విస్తరించిన మూలధన పరిమాణం అవసరమవుతుంది. మూల ధన సంచితం కారణంగా పెరిగిమ విడివిడి మూలధనాల పరిమాణాన్ని మూలధన కేంద్రీకరణం అని మార్క్స్ పిలిచాడు.
ఇంతకూ ముందు గమనించినట్లు, అభివృద్ధి చెందిన ఉత్పాదక శక్తులు ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున అవసరమైనందున, ఒత్తిడి చేస్తున్నందున, మూలధన సంచిత ప్రత్యక్ష పరిణామమైన మూలధన కేంద్రీకరణ, మరింత మూలధన సంచితానికి ముందస్తు షరతు. ఏమైనప్పటికీ, విస్తృతపరచిన స్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు ఏకైక సాధనమైన మూలధన కేంద్రీకరణే లేకపోతే, రైల్వేల నిర్మాణంతో 19వ శతాబ్దంలోఉదహరించిన ఉత్పాదక శక్తుల విపరీతమైన పెరుగుదల జరిగి ఉండేది కాదు. మార్క్స్ చెప్పినట్టు ‘ప్రపంచం ఇప్పటికీ రైల్వేలు లేకుండా కొద్దిమంది విడివిడిగా ఉన్న పెట్టుబడిదారులు రైల్వేల నిర్మాణానికి సరిపడా మూలధన సంచితాన్ని సేకరించే వరకు రైల్వేల నిర్మాణం వేచి ఉండాల్సి వచ్చేది.’
అభివృద్ధి చెందిన ఉత్పాదక శక్తుల కార్యకలాపాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ పెట్టుబడిదారీ విధానంలోనే అంతర్లీనంగా ఉన్నదన్నది సత్యం. అక్కడ, మొట్టమొదటగా ఒక పెట్టుబడిదారుడు అనేక మంది పెట్టుబడిదారులను చంపే తీవ్రమైన పోటీ పోరాటం పెట్టుబడిదారుల మధ్య ఉన్నది.
మార్క్స్ చెప్పిన దానిని ఉదహరిస్తే, ఈ పోటీ పోరాటంలో విజయం సాధించిన పెట్టుబడిదారుడు అదే ప్రక్రియలో తన స్వంత మూలధనాన్ని విస్తరిస్తాడు. తరచుగా ఓడిపోయిన పెట్టుబడిదారుల మూలధనాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇక్కడ జరుగుతున్నదమేమిటంటే, ప్రస్తుతం ఉనికిలోని సామాజిక మూలధనం కొద్దిమంది విడివిడిగా ఉన్న పెట్టుబడిదారుల మధ్య పునఃపంపకం. కొద్దిమంది విడివిడిగా ఉన్న పెట్టుబడిదారుల మూలధన విస్తరణ, మూలధన సంచితం వలన కాక మరి కొంతమంది విడివిడిగా ఉన్న పెట్టుబడిదారులను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా జరుగుతున్నది.
‘అది ఇప్పటికే ఏర్పడిన మూలధనాల కేంద్రీకరణ, విడివిడిగా ఉన్న వారి స్వాతంత్రాన్ని ధ్వంసం చేయడం, ఒక పెట్టుబడిదారుని ఆస్తిని మరొక పెట్టుబడిదారుడు స్వాధీనం చేసుకోవడం, చాలా చిన్న వాటిని కొన్ని పెద్ద మూలధనాలుగా మార్చడం, మరొక చోట చాలా మంది కోల్పోయినందున మూలధనం ఒక చోట ఒకే చేతిలో చాలా పెద్దమొత్తంగా ఎదుగుతుంది.’ మార్క్స్ దీనిని మూలధన కేంద్రీకరణ అని పిలిచాడు.
కేంద్రీకరణను చురుకుగా ప్రోత్సహించే రెండు ముఖ్యమైన శక్తులు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్పత్తి ప్రతి శాఖలోనూ విడివిడిగా ఉన్న పెట్టుబడిదారుల మధ్య పోటీ. కానీ కేంద్రీకరణ చాలా మంది పెట్టుబడిదారులను కొద్ది మంది పెట్టుబడిదారులు హింసాత్మకంగా ధ్వంసం చేయడం ద్వారా మాత్రమే జరగవలసిన పనిలేదు. అది ఋణ వ్యవస్థ ద్వారా కూడా జరగవచ్చు.
మూలధన సంచిత ప్రాథమిక దశలో విస్తృతంగా చెల్లా చెదురుగా ఉన్న చిన్న పొడుపు మొత్తాలను ఒకచోట చేర్చడంలో, పారిశ్రామిక పెట్టుబడిదారీ మూలధన సంచితం కోసం వీటిని అందుబాటులో ఉంచడంలో, ఋణ వ్యవస్థ ‘వినయపూర్వకమైనదే’ కాని ఉపయోగకరమైన పాత్రను పోషిస్తుంది. అనంతరం ఋణ వ్యవస్థ దాని ద్వారా అనేక చిన్న మూలధనాలను ఒక నియంత్రణ కేంద్రంలోకి తీసుకు వచ్చే, తద్వారా ఉత్పత్తిని చాలా పెద్ద స్థాయిలో ప్రారంభించదాన్ని సాధ్యంచేసే, జాయింటు-స్టాక్ కంపెనీల ఏర్పాటుకు తోడ్పడుతుంది. ఇక్కడ కూడా మూలధన కేంద్రీకరణ జరిగింది, కానీ పోటీ విధ్వంసం లేదా అనుసంధానం ద్వారా కాదు.
పెట్టుబడిదారీ అభివృద్ధిలో తరువాతి దశలో ఋణ వ్యవస్థలో కొనసాగే కేంద్రీకరణ ప్రక్రియ భారీమొత్తంలో ద్రవ్య నియంత్రణను చేయడానికి కొన్ని పెద్ద బ్యాంకులను కూడా అనుమతిస్తుంది. పారిశ్రామిక మూలధన కేంద్రీకరణకు ఇది ఒక ముఖ్యమైన పరికరం అయ్యింది. పెద్ద బ్యాంకులు పెద్ద పెట్టుబడిదారులకు చిన్న బ్యాంకుల కంటే సులభంగా ఆర్ధిక సహాయం చేస్తాయి. ఆవిధంగా ఋణ వ్యవస్థ, మూలధన సంచిత వినయపూర్వకమైన సహాయకుడి స్థితి నుంచి, పోటీ యుద్ధంలో ‘కొత్త, భయంకరమైన ఆయుధంగా మారుతుంది. అంతేకాకుండా చివరకు మూలధన కేంద్రీకరణకు అపారమైన సామాజిక యంత్రాంగంగా మార్చారు.’
గుతాధిపత్యానికి పోటీ..
ఈ కేంద్రీకరణ ప్రక్రియ పరిణామాలను మార్క్స్ అద్భుతంగా గ్రహించాడు. అన్నిటికన్నా ముందుగా కేంద్రీకరణ పోటీ నుంచి గుత్తాధిపత్యం అభివృద్ధికి దారితీస్తుంది.
“ఏదైనా శాఖలో పెట్టుబడి పెట్టిన పరిశ్రమ మూలధనాలన్నీ ఒకే మూలధనంగా కలిపివేస్తే కేంద్రీకరణ అంతిమ పరిమితిని చేరుకుంటుంది.” అని మార్క్స్ చెప్పాడు.
పై ఉదాహరణపై అధోజ్ఞాపికలలో ఎంగెల్స్ వివరణలో చెప్పినట్లు ‘1890ల నాటికి ఇంగ్లాండు, అమెరికా ట్రస్టులు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాయి. పెట్టుబడిదారీ విధాన ప్రస్తుత దశకు ఒక ప్రాథమిక, అత్యుత్తమ విశ్లేషణగా నేటికీ మిగిలిపోయిన తన ‘సామ్రాజ్యవాద సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి లెనిన్ ఇక్కడి నుంచి సూత్రాలను తీసుకున్నాడు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 40వ భాగం, 39వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
