కానీ ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. పెట్టుబడిదారుడిని చారిత్రక ఏజంటుగా , ఒక చారిత్రక నిర్దిష్ట ఉత్పత్తి క్రమంలో నిర్దిష్ట సామాజిక సంబంధాలను మోసే వ్యక్తిగా చూడడంలో దాని పూర్తి వైఫల్యాన్ని అది చొప్పిస్తున్నది. అన్నిటికన్నా మొదటిది పెట్టుబడిదారుడు చేసిన మూలధన సంచితం అతని సంయమన శక్తుల అభ్యాస ఉత్పత్తి కాదు. అందుకు బదులుగా అతని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే సామాజిక శక్తుల ప్రభావం. మార్క్స్ చెప్పినదానిని మనం జ్ఞాపకం చేసుకుందాం: ‘వినిమయ విలువను, పెట్టుబడిదారుని అసలు లక్ష్యంగా ఎప్పుడూ చూడరాదు.’
పెట్టుబదిదారునిగా అతని లక్ష్యం ఎప్పుడూ విలువ స్వీయ విస్తరణ అంటే మరింత అదనపు విలువ, అందువలన దానినే అతను మూలధనంగా సంచితం చేస్తాడు. ఇంకా, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందడంతో కార్యాచరణ స్థాయి నిరంతరం పెరుగుతుంది. ఉత్పత్తిని విస్తరించడానికి అదనపు విలువను ఖర్చు పెట్టేలాగా పెట్టుబడిదారుడిని ఇది బలవంత పెడుతుంది.
అంతేకాకుండా, ప్రయత్నించి సరుకులను చౌకగా చేయమని పోటీ అతనిని బలవంతం చేస్తుంది. ఉత్పత్తి కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడంలో, కొత్త యంత్రాలను కొనడం మొదలైన వాటిలో వనరులను పెట్టుబడిగా పెట్టడాన్ని ఇది సూచిస్తుంది. ఆ విధంగా అది మూలధన సంచితాన్ని సూచిస్తుంది.
మార్క్స్ మాటలలో, ‘పోటీ, అనూహ్యంగా ప్రతి విడివిడి పెట్టుబడిదారుడూ పెట్టుబడిదారీ ఉత్పత్తి నియమాలను బాహ్య నిర్బంధ నియమాలుగా అనుభూతిని చెందేలా చేస్తుంది. కానీ దానిని సంరక్షించడానికి, తన మూలధనాన్ని నిరంతరం విస్తరించే విధంగా ఇది అతన్ని బలవంతం చేస్తుంది. కానీ విస్తరించడాన్ని క్రమపద్దతిలో మూలధనాన్ని సంచితం చేయడం మినహా మరో విధంగా అతను చేయలేడు.’
ఆవిధంగా పెట్టుబడిదారులు చేసే మూలధన సంచితం స్వీయ అనుభవంలోని ‘సంయమనం’ ఫలితం కాదు. లేదా పోటీ వస్తుగత శక్తుల సృష్టి, అదనపు విలువ కోసం అన్వేషణల ఫలితం.
పెట్టుబడిదారీ మూలధన సంచితం ముందుకు సాగడంతో, పెట్టుబడిదారుడు తన ఆనందాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఎక్కువగా మూలధన సంచితాన్ని చేయడాన్ని, ఎక్కువగా వినిమయం చేయడాన్ని అతను ఒకే మారు చేయలేడు. చారిత్రక అనుభవం ఖచ్చితంగా దీనిని నిర్ధారిస్తున్నది.
ఒక రాక ఫెల్లర్ లేదా టాటాలను ప్రపంచ కార్మికుల నుంచి పొందిన నివాళిని ఆస్వాదించడాన్ని స్పష్టంగా మానుకోలేదని ఆరోపించలేము. వాస్తవానికి, బూర్జువా వర్గం, పెరుగుతున్న(ఆ విధంగా ప్రగతిశీలమైన) వర్గంగా స్థిరపడిన పాలక వర్గం కావడంతో, అది తన పూర్వపు భూస్వామ్య పూర్వీకుల విపరీత అలవాట్లను, జీవన విధానాలను అనుకరిస్తుంది. ఇంకా ‘అభివృద్ధి ఒక నిర్దిష్ట దశ చేరుకున్నాక, సంపద ప్రదర్శన కూడా అయిన, తత్ఫలితంగా కీర్తికి మూలం అయిన సాంప్రదాయక స్థాయి దుర్వ్యయం దురదృష్టవంతుడైన పెట్టుబడిదారునికి వ్యాపార అవసరం అవుతుంది. ప్రాతినిధ్య మూలధన ఖర్చులలోకి సుఖ జీవనం(Luxury) ప్రవేశిస్తుంది.’
అప్పుడు మూలధన సంచితం పెట్టుబడిదారీ సంయమనం పర్యవసానమూ కాదు. లేదా దానిచే నిర్ణయించబడనూ లేదు. పెట్టుబడిదారీ వినియోగం, మూలధన సంచితాల మధ్య అదనపు విలువ విభజనే కాక– పోటీ వంటి వస్తుగత కారకాలచే ఎక్కువగా నిర్ణయించబడిన విభజనే కాక – అక్కడ మూలధన సంచిత పరిమాణాన్ని నిర్ణయించే ఇతర కారకాలు కూడా ఉన్నాయి. వీటి వైపే ఇప్పుడు మనం మన దృష్టి సారిస్తాము.
మూలధన సంచిత నిర్ణయాధికారాలు..
మరింత అదనపు విలువ కోసం పెట్టుబడిదారీ వర్గం ఉత్పత్తి విస్తరణలో వెచ్చిస్తున్న మొత్తం అదనపు విలును చూస్తే, అటువంటి విస్తరణ పరిధి శ్రమ శక్తి దోపిడీ స్థాయి పైన, కార్మికుల ఉత్పాదక శక్తిపైన, స్థిర మూలధనం అస్థిర మూలధనంల మధ్య మూలధన సాంకేతిక విభజనలపైన ఆధారపడి ఉంటుంది.
సమస్యను విశ్లేషించడంలో, (ఆడం)స్మిత్– రికార్డో వంటి శాస్త్రీయ అర్ధశాస్త్రవేత్తలు అదనపు విలువ మూలధనంగా మార్చబడుతుందనే ముఖ్యమైన విషయం చెప్పారు. అంటే ఉత్పాదకంగా వినియోగించినప్పుడు అది సంచితం చేయబడింది. కానీ అటువంటి ఉత్పాదక వినిమయమే రెండు అంశాలను కలిగి ఉంటుందన్నది ఈ అర్ధ శాస్త్రవేత్తలు పట్టించుకోని విషయం.
ఒక వైపు వినిమయ సాధనాలు, వారు వాటిని పెట్టుబడిదారుల కోసం ఖర్చు చేసినప్పటికీ, వారి(శ్రమ) కార్మిక శక్తిని పునరుత్పత్తి చేయడానికి, పెట్టుబడిదారులకోసం అదనపు విలువను ఉత్పత్తి చేసే ఉత్పాదక కార్మికులకు చేరాలి. మరొక వైపున ఉత్పాదక కార్మికులచే అదనపు విలువ ఉత్పత్తికి ప్రస్తుత పద్దతుల ద్వారా నిర్దేశించిన నిష్పత్తిలో ఉత్పత్తి సాధనాల అవసరం ఉంది. ఆ విధంగా, మొత్తం అదనపు విలువ, అస్థిర పెట్టుబడి భౌతిక మూలవస్తువులైన జీవనాధార సరుకులను పాక్షికంగానూ, స్థిర పెట్టుబడి భౌతిక మూలవస్తువులైన ఉత్పత్తి సాధనాలను పాక్షికంగానూ కలిగి ఉండాలి.
మూలధన సంచిత పరిమాణం నేరుగా దోపిడీ రేటుపై ఆధారపడి ఉంది. రెండోది అదనపు విలువ రేటును దోపిడీకి అందుబాటులో ఉన్న శ్రమ శక్తి పరిమాణంతో గుణించగా వచ్చినది తప్ప మరేమీ కాని అదనపు విలువ సంపూర్ణ పరిమాణాన్ని నిర్ణయించడంలో సహాయ పడుతుంది. శ్రమ శక్తికి దాని విలువకు తగ్గట్లు వేతనం చెల్లించవలసి ఉందని ఊహించిన శ్రమ శక్తిని మనం సాధారణంగా కలిగి ఉండగా, ఈ విలువకు దిగువకు వేతనాలను నెట్టివేయడం మూలధన సంచిత వృద్ధిలో చారిత్రకంగా ముఖ్యమైన పాత్రను పోషించింది. మార్క్స్ దీనికి అనేక ఉదాహరణలను ఇచ్చాడు.
అదనంగా, ఉత్పత్తి సాంకేతికతలో పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ, ఉత్పత్తిలోని స్థిర– అస్థిర పెట్టుబడుల మధ్య నిష్పత్తి కొన్ని వైవిధ్యాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఎక్కువ కాలం పనిచేసేలా చేసిన కార్మికులు ఖచ్చితంగా ఎక్కువ ముడి పదార్ధాలను వాడుతారు. కానీ స్థిర పెట్టుబడి ఇతర పరికరాలు అంటే శ్రమ సాధనాల దామాషా పెరుగుదల అవసరం లేదు. స్థిర, అస్థిర పెట్టుబడుల మధ్య దామాషా నిష్పత్తి సాంకేతికత ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడదు. కానీ కొంత సాగే/వంగే గుణం ఉంటుందని చూపడానికి ఎవరైనా ఇతర ఉదాహరణలను ఉదహరించవచ్చు. సాగే/వంగే గుణం ఇచ్చిన మూలధనం నుంచి మరింతగా అదనపు విలువను పొందడానికి వనరు, ఆ విధంగా మూలధన సంచితం పెరగడానికి కూడా వనరు.
మనం ఇప్పటికే చూసినట్లు, అదనపు విలువను పెంచడానికి, అందువల్ల మూలధన సంచితానికి అత్యంత ముఖ్యమైన వనరు కార్మికుల ఉత్పాదకతలో పెరుగుదల. పెరుగుతున్న కార్మిక ఉత్పాదకతతో పెట్టుబడిదారీ వర్గం ఒకేసారి ఎక్కువ వినియోగిస్తుంది. ఎక్కువగా మూలధన సంచితం చేస్తుంది.
నిజవేతనాలు పెరుగుతున్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. అదనపు విలువ పెరుగుదల రేటు వేతనాల పెరుగుదల కన్నా ఎక్కువ వేగంగా పెరగడంతో, ఇచ్చిన అస్థిర పెట్టుబడి విలువ ఎక్కువ పరిమాణంలో శ్రమ శక్తి పనిచేసేటట్లు చేస్తుంది. అంతేకాకుండా ఇచ్చిన స్థిర పెట్టుబడిలో పెద్దమొత్తంలో ఉత్పత్తి సాధనాలు ఇమిడి ఉంటాయి.
పెద్ద మొత్తంలో మూలధన సంచితాన్ని ఈ రెండూ సూచిస్తున్నాయి. అంతేకాకుండా ఇచ్చిన మూలధన / పెట్టుబడి పరిమాణం అందువలన వేగంగా విస్తరిస్తుంది. సహజంగానే కొంతమేరకు ఉత్పాదకతలో పెరుగుదల స్థిర పెట్టుబడిలోని కొన్ని వస్తువులను(elements), ఉదాహరణకు యంత్రాలు పనికి రాకుండా చేయవచ్చు. కాని తూచినప్పుడు, వాస్తవంగా పనిచేస్తున్న పెట్టుబడి పరిమాణంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పెరిగే శక్తిని మూలధనానికి శాస్త్రం, సాంకేతికతలు ఇస్తాయి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 37వ భాగం, 36వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
