శ్రమ శక్తి విలువ– వేతనాలు
అదనపు విలువ రేటు గురించిన చర్చలో వేతనం లేదా శ్రమ శక్తి ఖరీదు, శ్రమ శక్తి విలువకు మధ్య వ్యత్యాసం తక్షణ– ప్రత్యేక కారణాల వలన; ఉదాహరణకు శ్రమ శక్తికి డిమాండు– సరఫరాల మధ్య తాత్కాలిక హెచ్చుతగ్గులు ఉండడం మనం గమనించాము. (ఏదైతే, ఒక వస్తువు ధర తరచుగా దాని విలువకు భిన్నంగా ఉంటుందనేదానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ మాత్రమే అయినా) వేతనాలకూ, శ్రమ శక్తి విలువకూ మధ్య వ్యత్యాసం కన్నా ముఖ్యమైనది కార్మిక శక్తి విలువ శ్రమ ధరగా వేతనమనే భావనలో వచ్చిన గుణాత్మక పరిణామం.
రోజువారీ ఉపయోగంలో వేతనాలను శ్రమ ధరగా పరిగణించబడుతుంది. కానీ వేతనాలు శ్రమ ధర అయితే అప్పుడు బహుశా శ్రమ అనేది దేని ధర అయితే వేతనం ఆ సరుకు అవుతుంది.
సరుకుగా మారిన ఈ శ్రమ ఏమిటి? శ్రమ సరుకు అయితే ఖచ్చితంగా దానికి విలువ ఉండాలి. కానీ విలువే స్పష్టంగా శ్రమగా, సరుకులను పునరుత్పత్తి చేయడానికి సామాజికంగా అవసరమైన సమయంగా కొలవబదుతుంది. అందుచేత శ్రమ విలువ శ్రమ శక్తిని పునరుత్పత్తి చేయడానికి అవసరమైన శ్రమ! కానీ ఇది అసంబద్ధమైన, పునరుక్తి ప్రకటన.
ఎవరైనా శ్రమను ఎలా ఉత్పత్తి చేస్తారు? ఒక మారు ఈ ప్రశ్నను లేవనెత్తిన తరువాత ‘శ్రమ విలువ’ అనే భావన సమస్య స్పష్టమవుతుంది. కార్మికుడు పెట్టుబడిదారునికి అమ్మేది శ్రమ కాదు, సరుకుగా శ్రమ శ్రమ శక్తిని. ఈ విషయాన్ని మార్క్స్ ఈ విధంగా వివరించాడు: వాస్తవానికి డబ్బులున్న వానికి మార్కెట్లో(విఫణిలో) ముఖాముఖి ఎదురయ్యేది శ్రమ కాదు, శ్రామికుడు/ కార్మికుడు. కార్మికుడు అమ్మేది తన శ్రమశక్తిని. నిజంగా శ్రమ ప్రారంభం కావడంతోనే అది అతనికి చెందనిదవుతుంది. అందుచేత అతను దానిని ఇంకేమాత్రమూ అమ్ముకోలేడు. శ్రమ అనేది ఒక పదార్ధం, విలువ తక్షణ కొలత, దానంతట దానికి విలువలేదు.
ఆ విధంగా శ్రమ విలువ అనే భావన పూర్తిగా అసంబద్ధమైనది. ఊహాజనితమైనది.
ఏమైనప్పటికీ(ఒక వైపు ప్రత్యక్షంగా కనపడే దానికీ లేదా దృష్టికి కనపడే దానికీ, మరొకవైపు వాటి సారం లేదా వాస్తవానికి మధ్య వైరుధ్యం) ఇది ఎలాంటిదంటే, ఇష్టపడిన స్త్రీ బట్టలను వేసుకొని సంతోషపడేలాంటి భావన: ‘ఉత్పత్తి సంబంధాల నుంచే, ఈ ఊహాజనిత వ్యక్తీకరణ తలెత్తుతుంది. అవి అవసరమైన సంబంధాల అసాధారణ రూపాల శ్రేణులు.’
సాంప్రదాయ అర్ధశాస్త్రం పరిమితులు..
కార్మికుడు పెట్టుబడిదారునికి తన శ్రమ శక్తిని సరుకుగా అమ్ముతాడనే భావన సూత్రీకరణ మార్క్స్ తన అదనపు విలువ సిద్ధాంత ఆవిష్కరణలో వేసిన గొప్ప ముందడుగు. కార్మిక శక్తి అదనపు విలువను ఒక మారు గుర్తించి, పని దినం నుంచి తీసివేసినప్పుడు అదనపు విలువ తార్కికంగా దానిని వెన్నంటి వస్తుంది.
ప్రత్యేకించి శ్రమను, శ్రమ శక్తిని విడివిడిగా గుర్తించడంలో విఫలమైన కారణంగా శాస్త్రీయ అర్ధశాస్త్రవేత్తలు(స్మిత్, రికార్డో తదితరులు) అదనపు విలువ స్థిరమైన, క్రమబద్ధమైన సిద్ధాంతాన్ని సూత్రీకరించలేక పోయారు. వాస్తవానికి రికార్డో విషయాల నిజమైన సంబంధాలకు దగ్గరగా చేరుకున్నప్పటికీ ఇలా జరిగింది. ఇక్కడ అనుసరించిన పద్దతి నొక్కి చెప్పడానికి తగిన విలువ కలది.
ప్రజాదరణ పొందిన రోజువారీ ఉపయోగంలో ఉన్న ‘శ్రమ ధర’ వర్గీకరణను విమర్శనాత్మకంగా పరిశీలించకుండా ‘శ్రమ ధర ఎంత?’ అనే ప్రశ్నతో శాస్త్రీయ అర్ధశాస్త్రవేత్తలు ప్రారంభించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పే క్రమంలో ‘శ్రమ సహజ ధరను’ (దాని ధర డిమాండు, సరఫరా అస్థిరమైన హెచ్చుతగ్గుల నుంచి సంగ్రహించాబడుతుంది) కార్మికుడి పునరుత్పత్తి ఖర్చు నిర్ణయిస్తుందని వారు గ్రహించారు. ఆ విధంగా మార్క్స్ చెప్పినట్లు ‘కార్మికుడి ఉత్పత్తి వ్యయం ఎంత? అనే ప్రశ్న’ శ్రమ ఉత్పత్తి ఖర్చును కనుగొనడానికి చేసిన శోధన వృత్తంలోకి చేరి తన స్థితిని ఎప్పుడూ వదిలి పెట్టనందున తెలియకుండానే ‘రాజకీయ అర్ధశాస్త్రంలో’ అసలుదానికి ప్రత్యామ్నాయంగా చేరింది.
అనుసరించిన పద్దతి సులభంగా ఈ విధంగా ఉంది: శాస్త్రీయ అర్ధశాస్త్రం దాని విశ్లేషణ చట్రం కారణంగా ఏదైతే మార్క్స్‌ను అదనపు విలువ సూత్రీకరణకు తీసుకు వెళ్లిందో మార్క్స్ అడగగలిగిన ఆ ప్రశ్నను వారు అడగలేకపోయారు. సమస్యాత్మకమైన శాస్త్రీయ అర్ధశాస్త్ర సైద్ధాంతిక చట్రం (సులభంగా చెప్పాలంటే సైద్ధాంతిక చట్రం) లోపల ‘శ్రమ శక్తి’ అనే భావన అభివృద్ధి కాలేదు.
వేతనాలు శ్రమ శక్తి ధర తప్ప మరొకటి కాదని అప్పుడు మనం చూస్తాము. కానీ శ్రమ విలువ, ధర వేతనరూపంలో పరివర్తన చెందడం ముఖ్యమైన సైద్ధాంతిక పరిణామాలకు దారితీస్తుంది. ఉదాహరణకు దినసరి(వారానికి లేదా గంటకు) వేతనాన్ని తీసుకోండి.
ఒక కర్మాగారంలో కార్మికునికి ఒక రోజు పనికి 8 రూపాయలు వేతనం చెల్లిస్తున్నారని అనుకుందాము. వేతన రూపం కార్మికుడు రోజంతాచేసిన పనికి, అతను పని చేసిన ప్రతి గంటకూ చెల్లింపబడుతున్నదని తప్పుగా సూచిస్తుంది. అతను 8 గంటలు పనిచేస్తే అతని వేతనం గంటకు 1 రూపాయిగా పరిగణించబడుతుంది. చివరకు పనిదినంలో కొంత భాగాన్ని (4గంటలు అనుకుందాము) తన దినసరి వేతనానికి సరిపడా పెట్టుబడిదారునికి అతను అప్పటికే తిరిగి చెల్లించాడు. మిగిలిన సమయంలో వేతనం లేకుండా శ్రమిస్తున్నాడనే వాస్తవం పూర్తిగా మాసిపోయినది.
పనిదినంను అవసరమైన శ్రమ, అదనపు శ్రమలను వేతనంతో కూడిన, వేతన రహిత శ్రమలుగా విభజించే ప్రతి జాడనూ వేతన రూపం రూపుమాపుతుంది. శ్రమ అంతా కూడా వేతనంతో కూడిన శ్రమగా కనపడుతుంది.
అందుచేత, శ్రమ శక్తి విలువ– ధరను వేతన రూపంలో లేదా శ్రమ విలువ, ధరగానే పరివర్తన నిర్ణయాత్మక ప్రాముఖ్యత కలది. ఏదైతే వాస్తవ సంబంధాన్ని కనపడకుండా చేస్తుందో, ప్రత్యక్ష వ్యతిరేక సంబంధాన్ని చూపుతుందో ఆ అసాధారణ రూపం కార్మికునికీ, పెట్టుబడిదారునికీ ఇరువురికీ అన్ని న్యాయపరమైన భావాలకూ, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాల అన్ని రహస్యాలకూ, స్వేచ్ఛకు సంబంధించినన్ని భ్రమలకూ, అసభ్య అర్ధశాస్త్ర వేత్తలు చూపే అన్ని సాకులకు ఆధారం అవుతుంది.
వివిధ రూపాల వేతనాల, జాతీయ వేతనాల మధ్య గల వ్యత్యాసాలపై క్లుప్తమైన చర్చకు ఇప్పుడు మనం వెళ్దాం.
వేతన రూపాలు..
మనకు ఆసక్తి కలిగించే రెండు ప్రధాన వేతన రూపాలు– కాలపరిమితి వేతనాలు, ముక్క వేతనాలు(piece-wages) ఉన్నాయి.
కాలపరిమితి వేతనాలు ఆ పదం సూచించినట్లు పని చేసిన కాలం ప్రాతిపదికన వేతనాలు ఉదాహరణకు గంటకు ఇంత లేక రోజుకు ఇంత అని చెల్లించబడతాయి. ముక్క వేతనాలు (piece-wages) ఆ పదం సూచించినట్లు ఉత్పత్తి చేసిన ప్రతి వస్తువుకూ ఒక నిర్ణీత మొత్తంలో చెల్లించబడతాయి. ప్రతి రూపం దాని ఆర్ధిక, సైద్ధాంతిక ప్రభావాన్ని కలిగి ఉంది.
మనం ఇప్పటికే చూసినట్లు కాలపరిమితి వేతనాలు ప్రతి శ్రమా వేతనం చెల్లించిన శ్రమే అనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. రెండవది, ప్రతి గంటకూ చెల్లించే వేతనం అదే ఉన్నప్పటికీ, శ్రమ తీవ్రతను పెంచడం ద్వారా పెట్టుబడిదారుడు శ్రమ శక్తి ధరను దాని విలువకు సంబంధించి కూడా(ఒక నిర్ణీత సమయంలో మనం ఎక్కువ శ్రమ శక్తిని ఖర్చు చేస్తున్నందున) తగ్గించగలడు, అధిక అదనపు విలువ రేటును పిండుకోగలడు. గంటల వారీగా వేతన విధానం పాక్షిక-ఉద్యోగ అవకాశాలను దానితో పాటు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యమైన పరిణామాలను కలిగి ఉంది. పెట్టుబడిదారుడు కార్మికునికి రోజువారీ శ్రమశక్తికి విలువకు వేతనం చెల్లించకుండానే కార్మికుని నుంచి ఒక రోజులో కొంత భాగం మాత్రమే పనిలో పెట్టుకుని అదనపు విలువను పిండుకోగలడు.
మార్క్స్‌ను ఉటంకిస్తే: తన స్వంత జీవనాధారానికి అవసరమైన శ్రమ సమయాన్ని కార్మికునికి అనుమతించకుండానే కార్మికుడి నుంచి ఒక నిర్ణీత అదనపు విలువను ఇప్పుడు పెట్టుబడిదారుడు పిండుకోగలడు. అతను క్రమబద్ద ఉద్యోగ విధానాన్ని సర్వనాశనం చేయగలడు, అతని స్వంత సౌలభ్యం, ఇచ్ఛానుసారం, ఆ క్షణంలోని ప్రయోజనానికి అనుగుణంగా పని సాపేక్ష లేదా సంపూర్ణ విరమణ/ ముగింపు ద్వారా అత్యంత అపారమైన మితిమీరిన పనిని ప్రత్యామ్నాయంగా చేయగలడు.
ఏమైనప్పటికీ పెంచిన పని తీవ్రత, పాక్షిక ఉద్యోగ కల్పన, పనిదినాన్ని పొడిగించడం వగైరా చర్యల ద్వారా అదనపు విలువ రేటును పెంచే ప్రయత్నం పెట్టుబడిదారుల మధ్య తీవ్రమైన పోటీని సృష్టిస్తుంది. తమ పోటీదారులు తమ కార్మికులకు చాలా తక్కువ వేతనాలను చెల్లించడం ద్వారా తమకన్నా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని కొందరు రొట్టెల ఉత్పత్తిదారుల ఫిర్యాదును ఉదాహరిస్తూ పెట్టుబడిదారుల మధ్య పోటీ పరిణామాన్ని మార్క్స్ వివరిస్తాడు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 31వ భాగం, 30వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
