మరొక వైపున టెలివిజన్ సెట్లను చౌకగా తయారు చేసే పద్ధతి భారతీయ పరిస్థితులలో శ్రమ శక్తి విలువపై ఎటువంటి ప్రభావాన్నీ కలిగిఉండదు. ఏమైనప్పటికీ టెలివిజన్ ఉత్పత్తిదారునికి పరిశ్రమలోని తన ప్రత్యర్దుల కన్నా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. దృష్టికి కనిపించే ఈ రెండు విషయాల మధ్య గల సంబంధాన్ని మార్క్స్ చాలా చక్కగా వివరించాడు: ‘ఉత్పత్తి చేసిన పడదని ఉపయోగించిన పెట్టుబడిదారుడు అదే వ్యాపారంలో ఉన్న ఇతర పెట్టుబడిదారులకన్నా ఎక్కువగా పనిదినంలోని ఎక్కువ భాగానికి చెందిన అదనపు శ్రమను స్వంతం చేసుకుంటాడు. సాపేక్ష అదనపు విలువను ఉత్పత్తి చేయడంలో నిమగ్నమైన పెట్టుబదిదారులందరూ కలిసి సమిష్టిగా చేసిన దానిని అతను ఒక్కడే వ్యక్తిగతంగా చేస్తాడు.’
ఏమైనప్పటికీ: దీంతో ఉత్పాదకతలో పెరుగుదల, మానవుని జీవనోపాధికి అవసరమైన భాగంతో సంబంధం కలిగి ఉండి వాటిని చౌకగా అనుభవంలోకి తెచ్చే, అందువల్ల కార్మిక శక్తి విలువ అంశాలైన, అనుసంధానించబడిన ఉత్పత్తి శాఖలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడే, అదనపు విలువ సాధారణ నిష్పత్తి చివరికి ప్రభావితమౌతుంది.
కార్మికుల ఉత్పాదకత పెరగడం వల్ల సరుకులు చౌకగా అందుబాటులోకి రావడానికి, వాటి విలువ తగ్గడానికి దారితీయడాన్ని మనం చూశాము. ఏమైనప్పటికీ, విలువ– అదనపు విలువ ఉత్పత్తి పెట్టుబడిదారీ ఉత్పత్తికి ప్రాథమిక చోదక శక్తిగా ఉంది. సాపేక్ష అదనపు విలువ అనే భావన ద్వారా ఇక్కడ ఉన్న వైరుధ్యం పరిష్కరించబడింది.
సాపేక్ష అదనపు విలువ కార్మికుని పెరిగిన ఉత్పాదకతమీద, సాపేక్ష అదనపు విలువ వర్గపోరాటం– పెట్టుబడిదారీ పోటీ నిర్దేశించిన అనివార్యతపైన ఆధారపడి ఉంటుంది. సరుకుల విలువను తగ్గించడానికి దారితీస్తుంది. చివరకు విలువపైన కాక అదనపు విలువపై పెట్టుబడిదారుడు ఆసక్తి చూపుతాడు.
పైన అదనపు విలువ అనే భావనను అభివృద్ధి చేసిన తరువాత మార్క్స్ చేత గుర్తించబడిన దాని ఉత్పత్తి వివిధ సాధనాలను ఇప్పుడు మనం పరిశీలిస్తాము. ఇవి సహకారం, శ్రమ విభజన– తయారీ, చివరకు యంత్రాలు, ఆధునిక పరిశ్రమ. వీటిలో ప్రతి దానినీ ఒక దాని తరువాత ఒకటిగా మనం పరిగణనలోకి తీసుకుంటాము.
సహకారం..
పెట్టుబడిదారీ విధాన ప్రారంభ దశలో ఉత్పత్తి వివిధ శాఖల విజయాన్ని కార్మికుని పెట్టుబడికి అధికారికంగా లొంగదీయడమని మార్క్స్ వర్గీకరించాడు.
ఇంతకు ముందటి అధ్యాయంలో ఉదహరించిన వ్యవస్థను బయట పెట్టడం ద్వారా ఒక ఉదాహరణ అందించబడింది. పెట్టుబడిదారీ విధానం మరింత అభివృద్ధి చెందడంతో, పెట్టుబడిదారుడు ఒకే చోట అనేక మంది కార్మికులను సమీకరించడం, శ్రమ ప్రక్రియను ప్రత్యక్ష పర్యవేక్షణ లేదా నియంత్రించడాన్ని మొదలుపెడతాడు. ఆ విధంగా, గతంలోలా పెట్టుబడికి కార్మికునిని లోబర్చడం కాకుండా, సాధారణ సహకారంతో అనేక మంది కార్మికులు ఒకే చోట పని చేయడానికి పెట్టుబడిదారుని కనుసన్నలలో సమీకరించడంతో నిజంగా ‘నిజమైన’ పెట్టుబడిదారీ ఉత్పత్తి ఆవిధంగా సంభవమయ్యింది.
సహకారం సరళమైన రూపం స్వయంగా కొన్ని తక్షణ ప్రభావాలను కలిగి ఉంటుంది. మొత్తం కార్మిక సమూహానికి (పరికరాలకు) వసతి కల్పించడానికి వీలుగా కర్మాగార భవనం వంటి ఉత్పత్తి సాధనాల నిర్మాణంతో అక్కడ పెద్ద స్థాయి ఆర్ధిక వ్యవస్థలు వచ్చాయి. ఇరవై మంది నేతగాళ్ళు ఇరవై మగ్గాలపై పనిచేసే వసతితో ఉన్న ఒక వర్క్ షాపుకు, రెండు మగ్గాలతో ఇద్దరు నేతగాళ్ళు పనిచేసే పది వర్క్ షాపుల కన్నా తక్కువ ఖరీదు పడుతుందనే ఉదాహరణను మార్క్స్ ఇచ్చాడు. ఉత్పత్తి సాధనాలపై ఈ పొదుపు సరుకులను చౌకగా ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా అవసరమైన శ్రమకు, అదనపు విలువకు మధ్య నిష్పత్తిని పెంచుతుంది.
సహకారం – అనేక మంది కార్మికులు పక్కపక్కన కలిసి పనిచేస్తూ, ఒకేలా లేదా పరస్పర సంబంధమున్న కార్యకలాపాలు నిర్వహించడం కార్మికుల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలను తొలగించడానికి సహాయపడుతుంది. సమిష్టి శ్రమ ఫలితం ఆ విధంగా సగటు సామాజిక శ్రమ లక్షాన్ని కలిగి ఉంటుంది.
ఒంటరిగా ప్రతి ఒక్క కార్మికుడూ చూపే ప్రభావాల మొత్తానికి భిన్నమైన ప్రభావాన్ని కలిసి పనిచేసే అనేకమంది కార్మికులు చూపుతారు. స్థూల ఆర్ధిక వ్యవస్థను గురించి చెప్పినది దీనిని వెల్లడిస్తుంది. వ్యత్యాసం పూర్తిగా పరిణామాత్మకమే కాదని, సహకారం నూతన సామాజిక శక్తిని సృష్టిస్తున్నందున ‘సహకారం ద్వారా మనకిక్కడ ఉన్నది వ్యక్తిగత ఉత్పాదక శక్తి పెరుగుదల మాత్రమే కాదు, ప్రజల సమిష్టి శక్తి అనబడే నూతన శక్తి సృష్టి కూడా’ అని గమనించాలి.
సహకారం శ్రమ ప్రక్రియ లక్షణంగా– ఉదాహరణకు కర్మాగార నిర్మాణం వంటి పెద్ద ఆర్ధికవ్యవస్థలను అందిస్తూనే, రోడ్ల నిర్మాణం, నీటి పారుదల, వరద నివారణ వంటి పెద్ద స్థలంలో పనిని కొనసాగించడానికి అనుమతిస్తుంది.
సహకారం– ఉత్పాదకత ప్రభావాల వివరణ..
శ్రమ యాంత్రిక శక్తిని సహకారం- ఉత్పాదకత పెంచుతుంది. లేదా ఎక్కువ స్థలంలో దాని కార్యాచరణ రంగాన్ని విస్తరిస్తుంది. లేదా ఉత్పత్తి స్థాయికి సంబంధించి ఉత్పత్తి రంగాన్ని కుదిస్తుంది. లేదా క్లిష్ట సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులచే పని చేయిస్తుంది. అదీకాకుండా వ్యక్తుల మధ్య అనుకరణను ఉత్తేజపరుస్తుంది. అంతేకాకుండా వారి సహజ భోగ విలాసాలను పెంచుతుంది. లేదా ఏకకాలంలో వేరువేరు కార్యకలాపాలను నిర్వహిస్తుంది. లేదా వ్యక్తిగత శ్రమకు సగటు సామాజిక శ్రమ లక్షణాన్ని కల్పిస్తుంది.
ఉత్పత్తి సంబంధాలు..
ఇంతవరకు మనం చర్చించినది అంతా కార్మికుల ఉత్పాదకతపై సహకారం ప్రభావం మాత్రమే. అంతే ప్రాముఖ్యత కలది ‘ఉత్పత్తి సంబంధాల’ అంశం అంటే సహకారం వర్గ లక్షణం. మరొకవైపున సహకారం చారిత్రకంగా ప్రగతిశీల పాత్ర పోషిస్తుంది. సామాజిక శ్రమ ఉత్పాదకతను అది అభివృద్ధి చేస్తుంది. మార్క్స్ చెప్పినట్లు ‘కార్మికుడు ఇతరులతో క్రమపద్దతిలో సహకరించినప్పుడు ఆటను తన వ్యక్తిత్వపు సంకెళ్ళను తెంచుకుంటాడు. తన జాతి సామర్ధ్యాలను అభివృద్ధి చేస్తాడు’. మరొక వైపున సహకారం పెట్టుబడిదారీ ప్రత్యేక లక్షణంగా ఉంది. దీనివైపే ఇప్పుడు మనం దృష్టి సారిస్తున్నాము.
అనేక మంది కార్మికుల సహకారంతో కూడిన కార్మిక ప్రక్రియలో పెట్టుబడిదారునికి తప్పనిసరిగా స్థిర(భవనాలు, పనిముట్లు, ముడిపదార్ధాలు), అంతేకాకుండా అస్థిర(ఎక్కువ మంది కార్మికులను పనిలో పెట్టుకోవడం) మూలధనాలు రెండింటి గణనీయమైన వ్యయం ఉంటుంది. ఆవిధంగా సహకారం వ్యక్తిగత పెట్టుబడిదారుడి చేతిలో మూలధన కేంద్రీకరణను సూచిస్తుంది.
శ్రామికుని మూలధానం అధికారికంగా అణచివేయడం నుంచి దాని అసలైన అణచివేతకు పరివర్తన చెందడాన్ని కూడా సహకారం సూచిస్తుంది.
అనేకమంది వేతన కార్మికుల ద్వారా సహకారంతో పెట్టుబడి ప్రభావం, కార్మిక ప్రక్రియను కొనసాగించడానికి అవసరమైన దాని నుంచి ఉత్పత్తి నిజమైన అవసరానికి అభివృద్ధి చెందుతుంది. యుద్ధ రంగంలోని సైనిక జనరల్ అధికారంలాగా, ఉత్పత్తి రంగంపై పెట్టుబదిదారుడి అధికారం ఇప్పుడు చాలా అవసరం.
సహకార శ్రమ ప్రక్రియ అనివార్యంగా సమన్వయము, పర్యవేక్షణ పనులను కలిగి ఉంటుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలలో ఈ కర్తవ్యాలు మూలధనం విధులు, హక్కులుగా పరిణమిస్తాయి. ఈ ప్రక్రియలో అవి ఒక నిర్దిష్ట వర్గ పాత్రను సంతరించుకుంటాయి. పెట్టుబడిదారుడు(అతను నియమించిన యాజమాన్యం) నిర్వహించిన సమన్వయం, దిశానిర్దేశం, పర్యవేక్షణ, కార్మిక ప్రక్రియ సహకార లక్షణం ద్వారా నిర్దేశించబడినవి కావు. అవి, కార్మికుల నుంచి అత్యధిక అదనపు శ్రమను గుంజుకోడానికి కావలసిన అవసరం నుంచి నిర్దేశించబడినవి కూడా.
పెట్టుబడిదారుడు వినియోగించే నియంత్రణ సామాజిక శ్రమ ప్రక్రియ సహజ లక్షణం ద్వారా, ఆ ప్రక్రియ ప్రత్యేకత వలన వచ్చిన ప్రత్యేక పని మాత్రమే కాదు. కానీ, అదేసమయంలో సామాజిక శ్రమ ప్రక్రియను దోచుకునే పని కూడా తత్ఫలితంగా దోపిడీ చేసే వానికీ అతని దోపిడీకి గురౌతున్న శ్రామికులకూ, ముడి సరుకులకూ మధ్య అనివార్యమైన విరోధంలో పాతుకుపోయింది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 21వ భాగం, 20వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
