సంపూర్ణ– సాపేక్ష అదనపు విలువ
అదనపు విలువ కోసం దాని తీర్చలేని దాహంతో పెట్టుబడిదారీ వర్గం మొదట పని దినాన్ని వీలైనంత ఎక్కువ పెంచడానికి ప్రయత్నిస్తుంది. మార్క్స్ దీనిని ‘సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తి’ అని పిలవడాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.
చారిత్రకంగా సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తి, సాంకేతిక పద్ధతులు సాపేక్షంగా మారని పెట్టుబడిదారీ పద్ధతి శ్రమ ప్రక్రియను కూకటివేళ్ళతో సహా స్వాధీనం చేసుకోనప్పటి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ప్రారంభదశను వర్ణిస్తుంది.
అదనపు శ్రమను లేదా అదనపు విలువను, పనిదినాన్ని పొడిగించడం ద్వారా మాత్రమే మెరుగు పరచడం సాధ్యమయ్యే విధంగా ఈ దశలో శ్రమ విలువా, ఆ విధంగా అవసరమయ్యే శ్రమ ఇవ్వబడి, సాపేక్షంగా స్థిరంగా ఉంటాయి.
శ్రమకూ, మూలధనానికీ మధ్య పెరిగిన వర్గపోరాటం, ఈ పద్దతిలో అదనపు విలువను మెరుగుపడడానికి తీవ్రమైన అడ్డంకులు కల్పిస్తుంది. పని దినాన్ని పొడిగించడానికి వ్యతిరేకంగా– ముందో, వెనుకో విజయవంతమయ్యే తన పోరాటాన్ని కార్మికవర్గం కొనసాగిస్తుంది.
ఇచ్చిన పనిదినపు నిడివితో అవసరమయ్యే శ్రమ సమయాన్ని తగ్గించడం, అంటే శ్రమ శక్తి విలువను తగ్గించడం, అదనపు విలువను పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమౌతుంది. పెట్టుబడిదారీ ఆచరణలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ, శ్రమ శక్తి విలువకన్నా దిగువకు వేతనాలు నెట్టబడే సంభావ్యతను మనం ఇక్కడ పక్కన పెడుతున్నాము.
మనం పని దినాన్ని AB రేఖ ద్వారా చూపితే, AC రేఖ అవసరమయ్యే శ్రమకు ప్రాతినిధ్యం వహిస్తే, అప్పుడు CB రేఖ అదనపు శ్రమకు ప్రాతినిధ్యం వహిస్తుంది. AB= 10 గంటలు, AC=6 గంటలు, ఆవిధంగా CB=4 గంటలతో మనం ప్రారంభిద్దాము.
A____ E___ C___B____D
ప్రారంభ అదనపు విలువ నిష్పత్తి 4/6 = 66 2/3 శాతం. ఇప్పుడు అందుబాటులో ఉన్న సంపూర్ణ అదనపు విలువ పనిదినం నిడివిని ఉదాహరణకు 11గంటలకు(AD రేఖ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నది) పెంచడం ద్వారా జరుగుతుంది. కానీ పనిదిన నిడివి AB= 10 వద్ద స్థిరపరిస్తే, ప్రతి కార్మికుని ద్బారా సమకూరే అదనపు విలువను పెంచాలంటే, ఉన్న ఏకైక మార్గం అవసరమైన కార్మికులను తగ్గించడం మాత్రమే. 
పాయింటు E ఒక ఉదాహరణను అందిస్తుంది. కార్మికుని ఉత్పాదకతలో పెరుగుదల ద్వారా శ్రమ శక్తిని ప్రతి దినం పునరుత్పత్తి చేయడానికి అవసరమైన సరుకులను, సేవలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన(ప్రత్యక్ష, పరోక్ష) సమయాన్ని AC = 6 గంటల నుంచి AE = 5 గంటలకు తగ్గిస్తే అదనపు విలువ నిష్పత్తి 4 / 6 నుంచి 5 / 5 కి, అంటే 66 2/3 శాతం నుంచి 100 శాతానికి పెరుగుతుంది. మార్క్స్ దీనిని సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి ప్రక్రియ అని పిలిచాడు.
పనిదినాన్ని పెంచడం ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు విలువను సంపూర్ణ అదనపు విలువ అని పిలుస్తాము.
మరొక వైపున అవసరమైన శ్రమ సమయాన్ని తగ్గించడం, పని దినం రెండు భాగాల సంబంధిత పొడవులలోని సంబంధిత మార్పుల ద్వారా ఉత్పన్నమైన అదనపు విలువను సాపేక్ష అదనపు విలువ అని పిలుస్తాము.
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి..
శ్రమ శక్తికి(కార్మికుని శ్రమకు) దాని విలువవద్ద చెల్లించినంత కాలం సాపేక్ష అదనపు విలువను కార్మికుని ఉత్పాదకతను పెంచడం ద్వారా మాత్రమే జరుగుతుందని పైదాని నుంచి అర్థమవుతుంది.
సాధారణంగా కార్మికుని ఉత్పాదకత ఒక్కటే సరిపోదు. కార్మికులు ప్రత్యక్షంగా వినియోగిస్తున్న సరుకులనూ, సేవలనూ లేదా అటువంటి సరుకులనూ, సేవలనూ ఉత్పత్తి చేయడానికి అవసరమైన సాధనాలను ఉత్పత్తి చేసే శాఖలలో కూడా ఆ పెరుగుదల జరగాలి.
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి సంబంధిత కార్మికుని శక్తి పునరుత్పత్తికి వెచ్చించే నిర్ణీత పొడవు గల పనిదిన భాగంలో క్షీణతే ఇందుకు కారణం. అందుచేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ శ్రమ శక్తి పునరుత్పాదనలో ప్రమేయం ఉన్న ఉత్పత్తి ఒక శాఖలో ఉత్పాదకతలో పెరుగుదల సంభవిస్తే, పని దినంలో అవసరమైన శ్రమ, అదనపు శ్రమల మధ్య పనిదిన విభజన, అదే విధంగా అదనపు విలువ నిష్పత్తి మారదు.
సాపేక్ష అదనపు విలువను విశ్లేషించడానికి ఎవరైనా దానిని ఉత్పత్తిచేసిన పద్దతిని లోతుగా పరిశీలించాలి.
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి, ఉత్పాదక శక్తి పెరుగుదలతో శ్రమ శక్తి విలువ ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో తగ్గడం అవసరమైన, తగిన పరిస్థితి అని మనం చూశాము. కానీ వ్యక్తిగత పెట్టుబడిదారుడు ‘సంపూర్ణ అదనపు విలువ’, ‘సాపేక్ష అదనపు విలువ’, ‘శ్రమ శక్తిని చౌకగా చేయడం’, వగైరాలను గురించి కచ్చితంగా ఆలోచించడు. విలువ, అదనపు విలువలో అంతర్లీనంగా ఉన్న శక్తుల మధ్య పోటీ రంగంలోని వ్యక్తీకరణలను మాత్రమే అతను గ్రహిస్తాడు.
పెట్టుబడిదారునికి ఆసక్తిని కలిగించే పోటీ పోరాటం మాత్రమే ఉత్పత్తి చేసే సరుకులను ఉత్పత్తి చేసే పద్దతులను ప్రయత్నించడానికి, మెరుగుపరచడానికి అతన్ని బలవంత పెడుతుంది. తన పోటీదారులతో సంబంధించినంతవరకు అతని ధ్యేయం అతని ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడమే.
కార్మికునికి అతని శ్రమ విలువ మొత్తాన్నిపెట్టుబడిదారుడు(ప్రస్తుతానికి)తప్పకుండా చెల్లించాలని అనుకుంటే, అప్పుడు ఉత్పాదకతను పెంచడం ద్వారా మాత్రమే అతను ఖర్చులను తగ్గించగలడు. పూర్తిగా కొత్త సాంకేతిక పద్ధతి మొదలైన వాటితో మార్చిన శ్రమ విభజన ద్వారానే ఇది చేయవచ్చు. నికర ప్రభావం, ఉన్న పని దినం నిడివితోనే మునుపటికంటే ఎక్కువగా సరుకుల యూనిట్లను ఉత్పత్తి చేయడం.
పోటీ– ఇవే సరుకులను ఉత్పత్తి చేస్తున్న పెట్టుబడిదారులను చౌకైన, మెరుగైన ఉత్పత్తి విధానాలను ఆచరించేటట్లు బలవంతంచేస్తుంది. ఎంతో కొంత మేరకు ఈ ప్రక్రియ పనిచేసినప్పుడు, ఒక సరుకును ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామాజిక శ్రమ సమయమైన సరుకు విలువ తగ్గిపోతుంది. ఈ సరుకులు కార్మికుల వినియోగ జాబితాలోకి లేదా ఆ వినిమయ సరుకులను ఉత్పత్తి చేసే అవసరమైన ఉత్పత్తి సాధనాల జాబితాలోకి చేరిన మేరకు శ్రమ శక్తి విలువ కూడా తగ్గుతుంది.
ఆ విధంగా, పనిదినం నిడివి (పొడవు)అలాగే ఉండగా అవసరమైన శ్రమ తగ్గుతుంది. అంతేకాకుండా అదనపు విలువకూ, అవసరమైన శ్రమకూ మధ్య నిష్పత్తి పెరుతుంది. అంటే సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి అయ్యింది.
నూతన సాంకేతికతలు..
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ కార్మికవర్గం వినియోగించే సరుకులను ఉత్పత్తి చేసే ఏ శాఖలోనైనా ఉత్పాదకత పెరుగుదల జరగడం ద్వారా సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి జరుగుతుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ అటువంటి సరుకులను ఉత్పత్తి చేయని పెట్టుబడిదారునికి కూడా ఖర్చులు తగ్గించడానికి ప్రోత్సాహకం ఉంటుందన్న విషయాన్ని గుర్తించడం అవసరం.
మార్క్స్ చెప్పినట్లు తన స్వంత కర్మాగారంలో ఉత్పాదకత పెరగడం వల్ల పెరిగిన అదనపు విలువను తన సరుకుల శ్రమ శక్తి సాధారణ విలువను నిర్ణయించడంలో భాగస్వామ్యం వహించే జీవనోపాధి సాధనాల వర్గానికి చెందినవి అయినా కాపోయినా పెట్టుబడిదారుడు తన జేబులో వేసుకుంటాడు. అందువలన ఈ తరువాతి పరిస్థితుల నుంచి స్వతంత్రంగానే ప్రతి వ్యక్తిగత పెట్టుబడిదారునికీ కార్మికుల ఉత్పాదకతను పెంచడం ద్వారా తన సరుకులు చౌకగా లభ్యమయ్యేటట్లు చేసే ప్రేరణ ఉంది.
కొన్ని ఉదాహరణలు ఈ విషయాన్ని స్పష్టం చేయవచ్చు.
వస్త్ర పరిశ్రమలో ఉన్న పోటీ కారణంగా ఒక నూతన సాంకేతిక పద్ధతిని విస్తృతంగా వాడినప్పుడు, కార్మికుడు ధరించే సాధారణ నూలు బట్ట ఉత్పత్తికి తీసుకునే సమయాన్ని నాల్గవ వంతు తగ్గిస్తుంది. అది శ్రమ శక్తి విలువ తగ్గడానికి, ఆ విధంగా సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి దారితీస్తుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 20వ భాగం, 19వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
