పెట్టుబడిదారీ అభివృద్ధి కొనసాగుతున్నకొద్దీ కార్మికోద్యమ బలం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది త్వరలోనే, బాహాటంగా పనిదినాన్ని పొడిగించడం ద్వారా సంపూర్ణ అదనపు విలువ విస్తరణను చాలా కష్టతరం చేస్తుంది. అప్పుడు పెట్టుబడిదారుడు ఇతర పద్ధతులకు: శ్రమను తీవ్రతరం చేయడానికి(మునుపటి దశలో కూడా ఉన్నాయి), సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి, వివిధ వేతన రూపాలను ఉపయోగించడానికి(సమయానికి ప్రతిగా ముక్క(పీస్) రేటు మొదలైనవి) మళ్లుతాడు.
పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో ఉత్పత్తి పద్దతులలో చారిత్రకంగా వచ్చిన మార్పులు ‘వివరించలేనివి’, ‘స్వయంప్రతిపత్తి’ గలవి లేదా స్వర్గంలో నిర్ణయించబడినవి కావన్న విషయం ఇక్కడ ముఖ్యంగా గుర్తించవలసిన విషయం! అందుకు బదులుగా అవి కార్మిక వర్గానికీ పెట్టుబడిదారులకూ మధ్య జరుగుతున్న వర్గపోరాటం నుంచి, పెట్టుబడిదారుల మధ్యా పోటీ నుంచి ప్రత్యేక చారిత్రక పరిస్థితులలో గుర్తించబడిన పరిస్థితుల నుంచి పుట్టుకు వచ్చినవే.
సారాంశము..
శ్రమ ప్రక్రియను పరిశీలిస్తూ మనం ఈ వ్యాసాన్ని ప్రారంభించాము. వాస్తవానికి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం క్రింద శ్రమ ప్రక్రియపై మనం ఆసక్తి కలిగి ఉండగా; అన్ని సామాజిక యుగాలలోనూ సాధారణ శ్రమ ప్రక్రియ అంశాలు ఉన్నాయని మనం గుర్తించాము.
ఏ శ్రమ ప్రక్రియ అయినా మానవుల మధ్య గల పరస్పర సంబందాల(చర్యల) వలననే లేదా మానవునికీ ప్రకృతికీ మధ్య గల పరస్పర సంబంధాల వలన అన్నదే ఈ అవశ్యమైన సామాన్యత. ఈ ప్రక్రియలో, మానవ శ్రమ ఉద్దేశపూర్వక, చైతన్య యుత కార్యకలాపంగా కనుపిస్తుంది. ఈ శ్రమ ప్రక్రియలో సజీవ శ్రమ ప్రకృతి నేరుగా ప్రసాదించిన వస్తువులను, ఉపయోగ విలువను ఉత్పత్తి చేయడానికి మానవ శ్రమ నిక్షిప్తమై ఉన్న ముడి పదార్ధాలు, పనిముట్లు మొదలైన వాటిని వినియోగిస్తుంది. శ్రమ ప్రక్రియలో సజీవ శ్రమ క్రియాశీల అంశం.
ఆ తరువాత మనం ప్రత్యేకంగా పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియను పరిశీలించాము. అది విలువను, ఇంకా అదనపు విలువను ఉత్పత్తి చేసే ప్రక్రియ అని గమనించాము. ఆ ప్రక్రియ నుంచి కార్మికుడు రెట్టింపు దూరమయ్యాడు: (a) కార్యాచరణ ప్రయోజనాన్ని, దానిని అమలు చేసే పద్దతిని నిర్ణయించడం ద్వారా పెట్టుబడిదారుడు శ్రమ ప్రక్రియను నియంత్రిస్తాడు; (b) కార్మికుని శ్రమ ఉత్పత్తిని పెట్టుబడిదారుడు స్వంతం చేసుకుంటాడు. ఆ విధంగా ప్రక్రియ, ఉత్పత్తి రెండింటి నుంచి కార్మికుడు దూరమౌతాడు.
నిర్జీవ శ్రమ– సజీవ శ్రమ..
పరాయీకరణ అనేది మానవ సార చరిత్ర పూర్వ భావనల నుంచి పుట్టుకొచ్చిన అస్పష్టమైన మానవ శాస్త్ర భావన కానీ ‘పారిశ్రామికీకరణ’, ‘సాంకేతికత’ ఫలితం కాదు. కానీ చారిత్రకంగా నిర్దిష్ట భావన. ఇది వస్తుగతంగా (i) సామాజిక ఉత్పత్తి, జీవనం పైన ఎటువంటి చైతన్యయుత సామాజిక నియంత్రణ లేని సరకుల ఉత్పత్తి (‘మార్కెట్ అరాచకం’ అన్నపదం ఏమాత్రం సరిపోదు); ఇంకా (ii) శ్రమ ప్రక్రియ నుంచీ దాని ఉత్పత్తి నుంచీ కార్మికవర్గం దూరం చేయబడిన, పెట్టుబడిదారీ వర్గం ఆధిపత్యం వహించిన పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉన్న సమాజ పరిణామం.
ఇంకా, ఉత్పత్తిలో అదనపు విలువ సృష్టించాబడడం మనం చూశాము. శ్రమ శక్తి విలువకూ పెట్టుబడిదారుడు వినియోగించుకుంటున్న శ్రమ శక్తి సమయానికీ(అంటే పని దినానికి) మధ్య ఉన్న వ్యత్యాస ఫలితం ఇది. ఆవిధంగా, ఎనిమిది గంటల పనిదినంలో, మొదటి నాలుగు గంటల తన పనిలో కార్మికుడు ప్రతి రోజూ అతని మద్దతుకూ, పునరుత్పత్తికీ అవసరమైన సరుకుల కట్టకు సరిపడా విలువ గల సరుకులను ఉత్పత్తి చేశాడని అనుకుందాము. మిగిలిన సమయంలో అతను పెట్టుబడిదారుని కొరకు వేతనం లేని శ్రమ చేస్తాడు.
ఉత్పత్తి సాధనాలు నిష్క్రియాత్మక పాత్ర పోషిస్తాయి. తగిన, నిర్దిష్ట తరహా(ప్రత్తిని నూలుగా మార్చడానికి వడకడం వంటి) శ్రమను చేయడం ద్వారా, కార్మికుడు వినియోగించిన ఉత్పత్తి సాధనాల విలువను సంరక్షిస్తాడు. దానిని ఉత్పత్తిలోకి బదిలీ చేస్తాడు. ఉత్పత్తి సాధనాల విలువ వాటిని ఉత్పత్తి సాధనాలుగా వినియోగిస్తున్న ప్రక్రియలో కాక, వాటిని ఉత్పత్తి చేసిన ప్రక్రియలో నిర్ణయించబడుతుంది. అందువలన వాటి విలువలో(ఉదాహరణకు పనిముట్టు దాని వినియోగంలో కోల్పోయిన విలువ అంటే, దాని అరుగుదల నిర్దిష్ట శ్రమ ద్వారా ఉత్పత్తికి బదిలీ చేయబడుతుంది. ఆవిధంగా లాభమూ లేదు నష్టమూ లేదు) మార్పు లేదు, మార్క్స్ చేత స్థిర మూలధనం అని పిలువబడ్డాయి.
సారూప్య తర్కం ద్వారా శ్రమ శక్తిని కొనడంలో వెచ్చించిన మూలధనాన్ని అస్థిర మూలధనం అంటారు. స్థిర మూలధనాన్ని ‘నిర్జీవ శ్రమ’ అనీ అస్థిర మూలధనాన్ని ‘సజీవ శ్రమ’ అనీ మనం చెప్పవచ్చు.
పనిదినంలో రెండు భాగాలు అవసరమైన శ్రమ (శ్రమ శక్తి దినసరి విలువకు సమానం), అదనపు విలువలను కూడి ఉండడం చూశాము. కార్మికుడిని పెట్టుబడిదారుడు చేసే దోపిడీకి కొలతను అదనపు శ్రమ, అవసరమైన శ్రమల మధ్య నిష్పత్తి ఇస్తుంది. మార్క్స్ దీనిని అదనపు విలువ రేటు(నిష్పత్తి) లేదా దోపిడీ రేటు (నిష్పత్తి)అని పిలిచాడు.
పెట్టుబడిదారీ అభివృద్ధి ప్రారంభ దశలో అదనపు విలువ విస్తరణ అధిక ఉత్పాదకత ద్వారా కాక పనిదినాన్ని పొడిగించడం ద్వారా జరిగింది. మార్క్స్ దీనిని సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తి అని పిలిచాడు. కార్మికవర్గం పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా జరిపిన వర్గపోరాటం తదుపరి పరిణామాలు అదనపు విలువ విస్తరణ ఈ పద్దతిని కష్టతరం చేశాయి. క్రమంగా ఇది సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి దారితీసింది. మనం దీనిని తరువాత పరిశీలిస్తాము.
వివరణలు– సూచనలు..
1. కారల్ మార్క్స్, గృండ్ రైజేస్ అనువాదం నికోలస్ పెలికాన్ 1973, పేజీ 35 వక్కాణింపు అసలుది. (K Marx, Grundrisse, translated by M. Nicolaus, Pelican, 1973, p. 35, emphasis in original.)
2. కారల్ మార్క్స్, పెట్టుబడి, సంపుటి 1, ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, 1967, పేజీ 197.
3. Ibid., p. 178.
4. Ibid., p. 179.
5. Ibid., pp. 180–81, వక్కాణింపు చేస్చబడింది.
6. Ibid., pp. 183–84, వక్కాణింపు చేస్చబడింది.
7. Ibid., p. 183.
8. Ibid., p. 185.
9. పెట్టుబడిదారీ సామాజిక శాస్త్రవేత్తలు వరుసగా (ఉదాహరణ బ్లునార్), మానవతా వాద స్కూలు(ఉదాహరణ ఎరిచ్ ఫ్రొం)లు టెక్స్ట్‌లో పేర్కొన్న రెండు లోపాలకు పాల్పడ్డారు. మంచి చర్చ కోసం ఈ మండెల్ రచించిన మార్క్స్ ఆర్ధశాస్త్రం(The Formation of Karl Marx’s Economic Thought), మంత్లీ రివ్యూ, 1972, ఎన్ గెరాస్ ఇన్ బ్లాక్బం(ed.)సోషల్ సైన్స్‌లో సిద్ధాంతం, వింటేజ్ బుక్స్, 1973లు చూడండి.
10. మార్క్స్ , పెట్టుబడి, సంపుటి 1, పేజీ 186.
11. Ibid, p. 188.
12. Ibid, p. 193.
13. Ibid
14. Ibid, pp. 194–95.
15. ఏదైనా తయారీ సంస్థలో పెట్టుబడిదారుడు పెట్టిన మూలధనంలో కొంత భాగం తప్పకుండా మన్నికైన యంత్రాలతో కూడి ఉంటుంది. అర్ధ శాస్త్రంలో దీనిని ‘స్థిర మూలధనం’ అంటారు. ఒక రోజు ఉత్పత్తిలో స్థిర మూలధన అంశంగా మొత్తం స్థిర మూలధనం విలువలోని చిన్న భాగం మాత్రమే చేరుతుంది. వ్యయం చేసిన మొత్తం స్థిర మూలధనానికి సంబంధించినంత వరకు స్థిర మూలధనం ముడిసరకులు రెండూ కలిసి ఒక భాగంగా రూపొందుతాయి.
పేరు పెట్టడానికి ‘స్థిర’, ‘అస్థిర’ అనే పదాలను వరుసగా నిర్జీవ(లేదా గత), ‘సజీవ’ శ్రమలని పిలుస్తారు. విషయాన్ని సులభతరం చేయడానికి స్థిర మూలధానం మొత్తం ఉత్పత్తి ఒకే కాలంలో అంటే ఒక రోజులో వినియోగించారని అనుకుందాము.
ఆర్ధిక పరిభాషలో, ఇప్పుడు మనం ‘తిరుగుతున్న మూలధన నమూనా’ను వాడుతున్నాము. కానీ ఇది మన ఫలితాలను ఏ ప్రాథమిక మార్గంలోనూ ప్రభావితం చేయదు.
16. మార్క్స్ , పెట్టుబడి, సంపుటి 1, అధ్యాయం 10, పేజీలు 231– 302.
17. చరిత్ర సాంకేతికత, సంస్థల ఉత్పత్తి అనే సిద్ధాంతంగా మార్క్సిస్టేతరులచే మార్క్సిజం తరచుగా తప్పుగా సూచించబడింది. ఉత్పత్తి రూపానికీ ఉత్పత్తి సంబంధాలకూ మధ్య గల సంబంధాల కేంద్ర దృష్టి అంతా చరిత్ర ప్రాథమిక నిర్ణేత అయిన వర్గపోరాటంపైనే. ఉత్పాదక శక్తులను సాంకేతికతకు, ఉత్పత్తి సంబంధాలను ‘సంస్థల’ను కుదించలేము.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 19వ భాగం, 18వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
