శ్రమ శక్తి విలువకూ, అదనపు విలువకూ మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాము.
ఒక నిర్దిష్ట సామాజిక, చారిత్రక నేపథ్యంలో, దాని ఉత్పాదక శక్తుల అభివృద్ధి స్థాయితో శ్రమ శక్తి విలువ మనకు ఇవ్వబడినట్లే పరిగణించవచ్చు. దీనికి సమానమైన విలువను ఉత్పత్తి చేయడానికి తీసుకున్న పని దినంలోని భాగాన్ని అవసరమైన శ్రమ అంటారు. మిగిలిన పని దినాన్ని అదనపు శ్రమ అంటారు. ఆ విధంగా అవసరమైన శ్రమ సమయం శ్రమ శక్తి విలువకు సమానం అవుతుంది(దాని రోజువారీ పునరుత్పత్తిలో ఖర్చు చేయబడినది). అంతేకాకుండా, అదనపు శ్రమ సమయం అదనపు విలువకు సమానం అవుతుంది. అదనపు శ్రమకు అవసరమైన శ్రమకు మధ్య ఉన్న నిష్పత్తిని అదనపు విలువ నిష్పత్తి (RSV)అని మార్క్స్ పిలిచాడు.
(RSV)= అదనపు శ్రమ / అవసరమైన శ్రమ= అదనపు విలువ/ శ్రమ శక్తి విలువ అనేది స్పష్టమే.
దోపిడీని కార్మికుడి నుంచి సేకరించిన అదనపు శ్రమను సూచిస్తున్నదని, ఈ అదనం కార్మికుడు స్వతంత్రంగా తనను తాను పునరుత్పత్తి కాగలిగిన సమయంతో సంబంధం కలిగి ఉన్నదని, ఖచ్చితంగా విశ్లేషణాత్మక భావనగా అర్ధంచేసుకున్నప్పుడు, అదనపు విలువ నిష్పత్తి పెట్టుబడిదారుడు కార్మికుడిని దోపిడీ చేస్తున్న దాని కొలతను ఇస్తుంది. ఆవిధంగా అదనపు విలువ నిష్పత్తిని కూడా దోపిడీ నిష్పత్తి అని మార్ల్స్ పిలిచాడు. మన ఉదాహరణ ఉక్కు సుత్తుల ఉత్పత్తిలో, RSV= 4 / 4 =100%. పెట్టుబడిదారుడికి అదనపు విలువను ఉత్పత్తి చేయడానికి పనిదినంలో సగభాగాన్ని కార్మికుడు వెచ్చిస్తున్నాడు.
అదనానికీ, అస్థిర మూలధనానికీ మధ్య ఉన్న నిష్పత్తి వ్యక్తిగత పెట్టుబదిదారునికి తక్షణమే ఆసక్తి కలిగించే విషయం కాదు. నిజానికి, శ్రమ ప్రక్రియను విలువ, అదనపు విలువల పరంగా పెట్టుబడిదారుడు చైతన్యయుతంగా చూడడు. అతను పొందే అదనానికీ, తాను పెట్టవలసిన మొత్తం మూలధనానికీ మధ్య గల సంబంధంపైనే, అంటే(కొంత నోటి దురదతో మాట్లాడితే) అదనపు విలువ నిష్పత్తిపైన కాదు, లాభం నిష్పత్తిపైన మాత్రమే అతని ఆసక్తి.
ఏమైనప్పటికీ, మనం ఇప్పుడు మొత్తం పెట్టుబడిదారీ వర్గానికీ కార్మిక వర్గానికీ మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తున్నాము. ఈ స్థాయిలో విలువ సంబందాలపైనే మన ఆలోచన. మార్క్స్ ఏవిధంగా లాభ సంక్లిష్ట వర్గాన్నీ, అదనపు విలువకూ దాని నిష్పత్తికీ మధ్య గల సంబంధాలు ఏమిటి అనేది ఒక వైపునా, లాభానికీ దాని నిష్పత్తికీ మధ్య గల సంబంధాలు ఏమిటి అనేది మరొక వైపున అభివృద్ధి చేసిందీ తరువాత మనం చూస్తాము.
సంపూర్ణ అదనపు విలువ..
బ్రిటన్లో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ప్రారంభ దశలో మూలధనం క్రమంగానూ, అసమాన పద్ధతిలోనూ మాత్రమే ఉత్పత్తి వివిధ శాఖలను ‘జయించింది’. ఈ దశలో ఉత్పత్తి ఒక నిర్దిష్ట శాఖలో ప్రవేశపెట్టబడిన ఆర్ధిక సంస్థల పెట్టుబడిదారీ రూపాలు, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలకు అర్ధం మార్క్స్ చెప్పినట్టు అధికారికంగా మూలధనానికి కార్మికుడిని బందీని చేయడమే. ఉదాహరణకు అగ్గి పెట్టెల తయారీ వంటి కొన్ని గృహ పరిశ్రమలలో ఇప్పుడు మన దేశంలో చూడవచ్చు.
ఇలా బందీని చేయడం అధికారికం, ఇందులో శ్రమ ప్రక్రియను పెట్టుబడిదారుడు నేరుగా నియంత్రించడు. అందుకు బదులుగా ముడి పదార్ధాలను కార్మికునికి ఇచ్చి, వారి వేతనాలు వారికి చెల్లించిన తరువాత ఉత్పత్తిని తీసుకుంటూ పెట్టుబడిదారుడు కార్మికునికి పని అప్పగిస్తాడు. కార్మికులు తమ కుటుంబ సభ్యుల సహకారంతో తమ ఇళ్ళల్లో పని చేయవచ్చు. క్రమంగా పెట్టుబడిదారుడు కార్మికులందరినీ ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చి ఉమ్మడి పనిస్థానంలో ఉత్పత్తిని పర్యవేక్షణలో నిర్వహించడం ప్రారంభిస్తాడు. పనిలో సులభమైన రూపాలలో సహకారం అభివృద్ధి చెందుతుంది, పని స్థలంలోనే శ్రమ విభజనకు దారితీస్తుంది. తడనతరం ఇది తయారీ అభివృద్ధికి, ఆధునిక పరిశ్రమ అభివృద్ధికి దారితీస్తుంది.
ఏమైనప్పటికీ అభివృద్ధి చెందిన తయారీ రూపాలు, ఆధునిక పరిశ్రమ అభివృద్ధి చెందే వరకూ పెట్టుబడిదారీ ఉత్పత్తి లక్షణం వారసత్వంగా వచ్చిన పెట్టుబడిదారీ పూర్వ, కర్మాగారాలలో సహకారం, శ్రమ విభజన ద్వారా కొంత మేరకు అభివృద్ధి చెందిన ఉత్పత్తి ప్రాచీన పద్దతులను కలిగి ఉంటుంది.
పెట్టుబడిదారీ ఉత్పత్తే అదనపు విలువ ఉత్పత్తి..
పైన క్లుప్తంగా వివరించిన చారిత్రక దశలో అదనపు విలువను ఎలా విస్తరించాలి? ఉత్పత్తి సాంకేతికతలను చూస్తే(ఈ దశలో అవి సాపేక్షంగా స్తబ్దతతో, మార్పులేనివిగా ఉన్నాయి) శ్రమ శక్తి విలువ తెలిసిందే. అవసరమైన శ్రమ ఉన్నది కావున పని దినం నిడివిని పొడిగించడం ద్వారా మాత్రమే ప్రతి కార్మికునికి అదనపు శ్రమ, అదనపు విలువను పెంచగలం. పని దినం నిడివిలో శ్రమ శక్తి విలువను తీసివేస్తే వచ్చేది ప్రతి కార్మికునికి అదనపు విలువకు సమానం. మొత్తం మూలధనంలో స్థిర మూలధనం, అస్థిర మూలధనం ఎంతెంత ఉండాలి అన్నదాన్ని ఉనికిలో ఉన్న సాంకేతిక పరిస్థితులు నిర్ధారిస్తాయి. అందుచేత అదనపు విలువలో పెరుగుదలను పనిదినాన్ని పొడిగించడం ద్వారా కార్మికులను ఎక్కువ సమయం పూర్తిగా దోపిడీ చేయడం ద్వారా మాత్రమే పొందగలం.
పని దినాన్ని పొడిగించడం ద్వారా ఉత్పత్తి అయ్యే అటువంటి అదనపు విలువను మార్క్స్ సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తి అని పిలిచాడు. తదనంతరం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం విప్లవకర పాత్ర ఆధిపత్యం వహించడం వచ్చింది. ఉత్పత్తి పద్దతులలో వేగంగా మెరుగుదల వచ్చింది. పని దినాన్ని అవసరమైన శ్రమ, అదనపు శ్రమల మధ్య విభజించడం, అదనపు శ్రమకు అనుకూలంగా మారింది. ఇది సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి, మనం దీనిని తరువాత విస్తృతంగా పరిసీలిస్తాము.
ప్రయోజనాల సంఘర్షణ..
మరింత అదనపు విలువకు పెట్టుబడిదారీ వర్గం దాహం ఆ విధంగా ప్రారంభంలో పని దినాన్ని ఏకపక్ష, భయానకంగా పొడిగించడంలో వ్యక్తమౌతుంది. వర్గ శక్తుల ప్రారంభ సంతులనం కార్మికవర్గం కేవలం ఏర్పడే ప్రక్రియలో ఉన్నందున– బ్రిటన్ విషయంలో దాని శ్రేణులు(ర్యాంకులు) వేరు చేయబడిన చేతివృత్తులవారితోనూ, బానిసలతోనూ, భూములు కోల్పోయిన చిన్న రైతులతోనూ కూడి ఉన్నందున– కూడా ఇది సాధ్యమయ్యేలా చేస్తుంది.
కార్మిక వర్గ రక్షణ సంస్థలైన కార్మిక సంఘాలు ఇంకా శైశవదశలోనే ఉన్నాయి. పెట్టుబడి(కేపిటల్)మొదటి సంపుటిలోని పనిదినంపై అధ్యాయం పెట్టుబడిదారీ దాడిని విస్తృతంగా నమోదు చేసింది.
చాలా ప్రమాదకరమైన పెట్టుబడిదారీ విధాన ఈ అంతర్గత తర్కం దానికి బదులుగా కార్మిక వర్గ ఆవిర్భావానికి తావు ఇచ్చింది. ఈ పరిణామం, పని దినం పొడిగింపుకు వ్యతిరేకంగా కార్మికవర్గ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అంతేకాకుండా బలోపేతం చేసింది.
అదనపు విలువ విస్తరణ చేయడానికి ఈ పద్దతిని వినియోగించడం బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గానికి చాలా కష్టతరం చేసింది. వర్గపోరాటం ఈ చారిత్రక పరిణామం. ఇతర నిర్దిష్ట చారిత్రక పరిణామాలు కూడా తగిన పాత్ర పోషించాయి. మళ్లీ పెట్టుబడి (కేపిటల్)మొదటి సంపుటిలోని పనిదినంపై అధ్యాయం అద్భుతమైన వివరణను, విశ్లేషణను ఇస్తుంది. పని దినాన్ని పొడిగించే, సంపూర్ణ అదనపు విలువను లాక్కొనే క్రూరమైన పద్దతులు, ప్రపంచం లోని అనేక ప్రాంతాలలో, మన దేశంలోని అగ్గి పెట్టెల తయారీ, కొబ్బరి పీచు, జీడిపప్పు వంటి పరిశ్రమలలో సహా ఇప్పటికీ కొనసాగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 18వ భాగం, 17వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
