
మనం చూసినట్లు కార్మికుడు ఒక రోజు పనిలో ఎనిమిది గంటల శ్రమ తాజా విలువను కలుపుతాడు. కానీ పెట్టుబడిదారుడు కార్మికుడి నుంచి కొన్న సరుకు విలువ ఏమిటి? మరొక మాటలో ఈ శ్రమ ప్రక్రియలోని అంశం ప్రారంభ విలువ(ఆ రోజు ప్రారంభంలో విలువ) ఎంత? పెట్టుబడిదారుడు కార్మికుడి నుంచి శ్రమ శక్తిని, ఊహించిన దాని విలువవద్ద కొన్నాడని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
శ్రమ శక్తి విలువ దానిని ఉత్పత్తి చేయడానికి సామాజికంగా అవసరమైన శ్రమ సమయం, ‘చారిత్రక- నైతిక అంశం’ అని పిలవబడేది కూడా ఇందులో చేరి ఉంది. నిర్దిష్ట చారిత్రక పరిస్థితులలో ఒక కార్మికుని పునరుత్పత్తి చేయడానికి(సామాజికంగా అనుగుణమైన ప్రస్తుత, భవిష్యత్ కార్మిక శక్తి పునరుత్పత్తికి అంటే, మొత్తం కార్మికవర్గ పునరుత్పత్తికి సంబంధించి కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకొని) అవసరమైన సగటు శ్రమ సమయం ఇది. సగటున ఇది నాలుగు గంటలకు సమానమని అనుకుందాము. దీని అర్ధం ఏమిటంటే, నాలుగు గంటలు పనిచేయడం ద్వారా కార్మికుడు తన శ్రమ శక్తి విలువకు సమానమైన– పెట్టుబడిదారుడు తనకు చెల్లించిన దానికి సమానమైన తాజా విలువను(ఇది ఉత్పత్తిలో పొందుపరచబడింది) సృష్టిస్తున్నాడు. కానీ అతను అక్కడే ఆగిపోవడం లేదు.
పెట్టుబదిదారుడితో తన ఒప్పందం ప్రకారం అతను ఎనిమిది గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఉత్పత్తిలో చేరి ఉన్న, అందువలన పెట్టుబడిదారుడికి చెందే మరి నాలుగు గంటల తాజా విలువను సృష్టిస్తున్నాడు. ఒక వైపున పెట్టుబడిదారుడు ఒక పనిదినంలో పెట్టిన పెట్టుబడి మొత్తం పదహారు గంటలు(లోహ పలక), యంత్ర అరుగుదలకు నాలుగు గంటలు, నాలుగు గంటలు (శ్రమశక్తివిలువ) కలిపి 24 గంటలకు సమానం.
మరొక వైపున రోజు చివరకు తయారైన సరుకు(నాలుగు సుత్తుల) విలువ 16 గంటలు + 8 గంటలు = 24 గంటలకు సమానం. ఇక్కడే అదనపు విలువ రహస్య మూలం ఉంది. రేఖా చిత్ర రూపంలో AB పని దినం నిడివికి(8 గంటలకు) ప్రాతినిధ్యం వహిస్తే AC శ్రమ శక్తి విలువ(నాలుగు గంటలు), CB పెట్టుబడిదారుడు ఉచితంగా కార్మికుడి నుంచి పొందుతున్న అదనపు విలువకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రబలంగా ఉన్న చారిత్రక పరిస్థితులలో, ఉత్పాదక శక్తుల అభివృద్ధి స్థాయిలో కార్మికుడు తనని తాను నిలబెట్టుకోవడానికి(సగటున) ఖర్చు చేయవలసిన శ్రమ అని మార్క్స్ మొదటి (AC) దానిని పిలిచాడు. పని దినంలోని మిగిలిన భాగంలో కార్మికుడు పెట్టుబదిదారుడి కొరకు అదనపు శ్రమను చేస్తాడు. ఈ అదనపు శ్రమే ఉత్పత్తిలో మళ్లీ కనపడుతుంది. పెట్టుబడిదారుడు పొందుతున్న అదనపు విలువను కలిగి ఉంటుంది.
AC- B
మనం టోపీ నుంచి ఒక కుందేలును బయటకు తీశామా? విషయం నిజంగా చాలా సులభమైనది. ఈ విషయం ఆయువుపట్టు ఇది: ‘శ్రమ శక్తిలో ఇమిడి ఉన్న గత శ్రమ, పనిలో పెట్టగలిగిన సజీవ శ్రమ; దానిని నిర్వహించడానికి అయ్యే రోజువారీ ఖర్చు, పనిలో దాని రోజువారీ ఖర్చు రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు. మొదటిది శ్రమ శక్తి మార్పిడి విలువని, ఆ తరువాతిది వినియోగ విలువను నిర్ణయిస్తాయి.’
సమాన మార్పిడి నియమాలను ఉల్లంఘించకుండా అదనపు విలువ సృష్టిని వివరించడం జరిగిందని నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. పెట్టుబడిదారుడు ఉక్కు పలకలనూ, యంత్రాలనూ వాటి విలువ వద్ద కొన్నాడు. శ్రమ శక్తిని కూడా దాని విలువ వద్ద కొన్నాడు. ‘అసమాన’ మార్పిడి ద్వారా కాదు. కానీ, సరుకు ప్రత్యేక ఆస్తి, శ్రమ శక్తి ద్వారా అదనపు విలువ పుట్టుకొచ్చింది. మార్క్స్ మాటలలో మొత్తం విషయాన్ని సమీక్షిస్తే: ఈ రూపాంతరం/ పూర్ణ పరివర్తన, ధనాన్ని మూలధనంగా మార్చడం; పంపిణీ లోపల మార్కెట్లో శ్రమ శక్తిని కొనడం వలన వచ్చే షరతుల కారణంగానూ, పంపిణీ వెలుపల దానిలోపల జరిగిన దాని వల్లనూ, పంపిణీ(సర్క్యులేషన్)లోపలా దాని వెలుపలా రెండింటిలోనూ జరుగుతుంది. పూర్తిగా ఉత్పత్తిరంగానికే పరిమితమైన ప్రక్రియయిన అదనపు విలువ ఉత్పత్తికి మొదటి అడుగు మాత్రమే ఇది.
అదనపు విలువ నిష్పత్తి..
విలువ, అదనపు విలువల ఉత్పత్తి ప్రక్రియను మనం సన్నిహితంగా విశ్లేషించాము. ప్రక్రియలో ఉపయోగించిన ఉత్పత్తి సాధనాల విలువను సజీవ శ్రమ సంరక్షిస్తుందని, ఉత్పత్తిలోకి విలువను బదిలీ చేస్తుందని పైన మనం చెప్పాము. తలెత్తే ప్రశ్నలు ఇవి: (i) సజీవ శ్రమ దీనిని ఎలా చేస్తుంది? (ii) ఉత్పత్తి సాధనాల– ముడి సరకులు లేదా శ్రమకు లోబడినవి, బాయిలర్లో మండించిన బొగ్గు వంటి ‘సహాయక’ పదార్ధాలు, శ్రమ సాధనాలు(పనిముట్లు)– ఈ ప్రక్రియలో నిర్వహించే పాత్ర ఏమిటి?
సజీవ శ్రమ రెండు విధాలుగా పనిచేస్తుంది. తన ప్రత్యక్ష శ్రమ ద్వారా తాజా విలువను సృష్టించడంలో ఇది ‘విలువను సృష్టించే శ్రమ’గానే, అంటే సహజంగా మానవ శ్రమగా లేదా సంపూర్ణ శ్రమగా లెక్కించబడుతుంది. ఇక్కడ ప్రత్యేక శ్రమను(ఉదాహరణకు పత్తిని నూలుగా వడికే శ్రమ) గురించి పట్టింపు లేదు. కానీ సజీవ శ్రమ అది ఒక నిర్దిష్ట తరహా శ్రమ అయితే తప్ప– ఉత్పత్తి సాధనాల విలువను సంరక్షించడం, బదిలీ చేయడం – వంటి ఇతర విధులను నిర్వర్తించలేదు. ఉదాహరణకు వెల్డింగ్ పనిలో చేసే నిర్దిష్ట శ్రమ పత్తిని నూలుగా మార్చలేదు. వడకడం ద్వారా మాత్రమే పత్తిని నూలుగా మార్చగలం. ఈ విధంగా మాత్రమే ఉత్పత్తి సాధనాలలో వాడేసిన శ్రమ విలువలో ఇమిడి ఉన్నది. ఆవిధంగా సంరక్షించబడింది. అందుచేత, ఉత్పత్తి సాధనాలలో వాడేసిన శ్రమ విలువను సంరక్షించే, బదిలీ చేసే దాని పనిలో సజీవ శ్రమ నిర్దిష్ట శ్రమగా లెక్కించబడుతుంది.
ఉత్పత్తి సాధనాలలో, ఇంధనంగా వాడిన బొగ్గు వంటి సహాయక పదార్ధాలు వాటి విలువను మాత్రమే ఉత్పత్తిలో వదలి భౌతికంగా కనుమరుగు కాగా, ముడి సరకులు ఉత్పత్తిలో(పత్తి నూలుగానూ, ఉక్కు పలక సుత్తి గానూ) మారిన రూపంలో తిరిగి కనపడతాయి. ఏమైనప్పటికీ శ్రమ సాధనాలు(పనిముట్లు, యంత్రాలు మొదలైనవి) వాటి భౌతిక రూపాన్ని కోల్పోవు. వాటి విలువలో కొంత భాగం మాత్రమే ఉత్పత్తిలోకి బదిలీ అవుతుంది. అనేక ఉత్పత్తి ప్రక్రియలలో ఉత్పత్తులు ప్రతిరోజూ ఉత్పత్తి అవుతుండగా అవి వారాల, నెలల, లేదా సంవత్సరాల తరబడి మన్నుతాయి. కావున అవి వాటి విలువను ఉత్పత్తులకు క్రమంగా మాత్రమే వాడుకుంటాయి.
కానీ ఉత్పత్తి సాధనాలన్నిటికీ ఉమ్మడిగా ఒక విషయం ఉంది: అవి ఉత్పత్తి అయిన ప్రక్రియలోనే వాటి విలువలు నిర్ధారించబడతాయి. శ్రమ ప్రక్రియలకు సంబంధించినంత వరకు అవి ఉత్పత్తి సాధనాలుగా ఎక్కడ పని చేస్తాయో, అక్కడే ప్రారంభంలోనే వాటి విలువలు ఇవ్వబడ్డాయి. ఎటువంటి మార్పుకూ గురికావు. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి ఉత్పత్తి సాధనాలను పెట్టుబడిలో స్థిర భాగం లేదా స్థిర పెట్టుబడి (మూల, అదనం) అని మార్క్స్ పిలుస్తాడు.
పెట్టుబడి పెట్టిన మూలధన మరొక భాగం శ్రమ శక్తి..
మనం ఇప్పటికే చూసినట్లు శ్రమ శక్తి తన స్వతంత విలువను పునరుత్పత్తి చేయడమే కాకుండా అదనంగా అదనపు విలువను కూడా ఉత్పత్తి చేస్తుంది. మూలధనం విలువలో మార్పును ప్రభావితం చేసేది ఈ అంశమే. మూలధనం విలువలో మార్పులకు భాద్యతను మోయవలసింది ఇదే. ప్రక్రియ ప్రారంభంలోని శ్రమ శక్తి చివరలో అది, అదనపు విలువ కలిపిన మొత్తం అవుతుంది. ఇది మారుతూ ఉంటుంది, అందుకే మార్క్స్ మూలధనంలోని ఈ భాగాన్ని అస్థిర మూలధనం అని పిలుస్తాడు.
ఉత్పత్తిలో ఇమిడే స్థిర మూలధనం విలువను C గానూ అస్థిర మూలధనాన్ని V గానూ సూచిస్తే మనం అప్పుడు పనిదినం చివరలో ఉత్పత్తి విలువను C + V + Sకు సమానంగా వ్రాయగలం. ఎక్కడ S = అదనపు విలువ లేదా తన శ్రమ శక్తి విలువకు సరిపడా సమయం పనిచేసిన తరువాత కార్మికుడు పెట్టుబదిదారుడి కొరకు అదనంగా చేసే శ్రమ సమయం. 15 మన ఉక్కు సుత్తి ఉదాహరణలో నాలుగు ఉక్కు సుత్తుల విలువ కలిసి ఇరవై ఎనిమిది గంటలకు సమానం, దీని నుంచి మనం ఇప్పుడు చూస్తాము:
C = (16 +4) = 20 గంటలు
V = 4 గంటలు
S = (8 – 4) = 4 గంటలు
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 17వ భాగం, 16వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.