
పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియ
శ్రమ ప్రక్రియ మొట్టమొదటి, ముఖ్యమైన పెట్టుబదిదారీ అంశం కార్మికుడు తన శ్రమ శక్తిని అమ్ముకున్న పెట్టుబడిదారుని నియంత్రణలో పనిచేయడం. పెట్టుబడిదారుడు ఈ నియంత్రణను ప్రత్యక్షంగా కానీ లేదా పర్యవేక్షకుల అంతస్తుతో పర్యవేక్షించినా పెట్టుబడిదారుడి నియంత్రణలో సమర్ధవంతంగా శ్రమ నిర్వహించబడుతుందనే వాస్తవం మారదు. చేసిన శ్రమ ఇప్పటికీ ఉద్దేశించిన ప్రయోజనం కొరకు చేసినదే కానీ ప్రయోజనం, కార్యాచరణ పెట్టుబదిదారుడి చేత నియంత్రించబడుతుంది. కానీ, శ్రమించే కార్మికుని చేత కాదు.
రెండవది, అంటే ప్రాముఖ్యత కలది కార్మికుడు చేసిన శ్రమ ఫలితంగా జరిగిన ఉత్పత్తి ‘పెట్టుబడిదారుని ఆస్తే కానీ తక్షణ ఉత్పత్తిదారుడైన కార్మికునిది కాదు’. పెట్టుబడిదారీ ఆస్తి సంబంధాల కింద పెట్టుబడిదారుడు సరుకును – శ్రమ శక్తిని – ఒక నిర్దిష్ట కాలానికి(ఉదాహరణకు ఒక రోజు) కొన్నందున, అతని ఇచ్ఛానుసారం దానిని ఉపయోగించుకునే స్వాతంత్రం అతనికి కలదు, ఫలితంగా వచ్చే ఉత్పత్తి అతనికి చెందుతుంది.
పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియలో, కార్మికుడు రెండు విధాల పరాధీనుడయ్యాడని చెప్పవచ్చు: అతడు శ్రమ ప్రక్రియ నుంచి దూరంచేయబడ్డాడు. తన స్వంత కార్యకలాపాల ప్రయోజనం, నియంత్రణ పెట్టుబడిదారుడిచే నిర్ణయించబడుతుంది. తన స్వంత శ్రమ ఉత్పత్తి అది పెట్టుబడిదారుడి ఆస్తి అయినందున అతను దానికి దూరమయ్యాడు.
పెట్టుబడిదారీ విధానం కింద పరాయీకరణ అద్భుత- ఘటన శ్రమ ప్రక్రియకే పరిమితం కాలేదు కానీ అది ఆర్ధిక, సైద్ధాంతిక, రాజకీయ రంగాలలోని, వాస్తవానికి ఇంతకు ముందు చర్చించిన సరుకులపై వ్యామోహ దృగ్విషయ అంశంలోని అన్ని స్థాయిలలోని ఉత్పత్తి రీతులలో వేళ్ళూనుకొని వున్నది. విస్తృతార్ధంలో, సాధారణ సరుకుల ఉత్పత్తి లక్షణమైన, సామాజిక ఉత్పత్తిపై చైతన్యయుత సామాజిక నియంత్రణ లేకపోవడం ఫలితనమే పరాయీకరణ. ఇది ఆ విధంగా చారిత్రక నిర్దిష్ట దృగ్విషయాన్ని సూచిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పర్యవసానంగానో లేదా మనిషిని తన నిజమైన మానవ శాస్త్ర సారం నుంచి వేరు చేయడంగానో ఏ విధంగానూ చూడలేము.
‘ఉపయోగ విలువను మాత్రమే కాక విలువను; విలువనే కాదు అదనపు విలువను’ కూడా ఉత్పత్తి చేయడం పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియ లక్ష్యంగా ఉంటుంది. అందుచేత మనం విలువ సృష్టించే శ్రమ ప్రక్రియను పరిశీలిద్దాము.
శ్రమ ప్రక్రియ పరిశీలన..
పెట్టుబడిదారుడు తన కార్మికులు ఉక్కు సుత్తులను తయారు చేయాలని అనుకున్నారని అనుకుందాం. అప్పుడు అతను లోహపు పలకలనూ, లోహం నుంచి ఉక్కు సుత్తులను తయారు చేయడానికి కావలసిన పరికరాలనూ కొంటాడు. మన సమస్య ఉన్న పరిస్థితులలో పెట్టుబడిదారుడు ముడి పదార్థాలను(ఉక్కు పలకలు), పరికరాలను వాటి విలువ వద్ద ఇతర పెట్టుబడిదారుల నుంచి కొంటాడని మనం అనుకుందాము. కార్మికుడు ఒక రోజులో ప్రామాణిక కొలతలు(పొడవు, వెడల్పు, మానడం) గల ప్రతి ఉక్కు పలకకు ఒక సుత్తి చొప్పున నాలుగు ఉక్కు సుత్తులను ఉత్పత్తి చేశాడని పరిగణిద్దాము, పనిదినం 8 గంటలు అనుకుందాము.
ఉక్కు పలకలను సుత్తులుగా మార్చే శ్రమ ప్రక్రియ ప్రారంభంలో మనం ఉక్కు పలకలను ముడిపదార్ధాలుగా కలిగి ఉన్నాము. ప్రతి పలకా(ప్రామాణిక పరిమాణం) కూడా మరొక చోట ఇదివరకుచేసిన శ్రమ ఫలితం, ఆవిధంగా కొంత మొత్తంలో శ్రమ సమయం దానిలో చేరి ఉంటుంది. ఇది పలక విలువ, అది సామాజికంగా అవసరమైన, నాలుగు గంటల శ్రమ సమయానికి సమానం అనుకుందాము. ముడి పదార్ధాల నుంచి సుత్తులను ఉత్పత్తి చేసే క్రమంలో కార్మికుడు యంత్రాలను ఉపయోగిస్తాడు. తద్వారా అవి కొంత మేరకు అరుగుతాయి. ఒక పనిదినంలో నాలుగు సుత్తులను ఉత్పత్తి చేసే క్రమంలో యంత్రాల మొత్తం విలువలో కొంత భాగం ఉపయోగించబడుతుంది. విషయాలకు కొద్దిగా స్పష్టత ఇవ్వడానికి రోజుకు నాలుగు సుత్తుల చొప్పున ఉత్పత్తి చేస్తూ 300 రోజులు పనిచేస్తుందని అనుకుందాము. యంత్రం వాడుకలో లేనిదిగా/పనికిరానిదిగా(ఉత్తమమైన యంత్రంతో మార్కెట్లో భర్తీ చేయబడలేదని) దాని జీవిత కాలం 300 రోజులలో అవలేదని కూడా అనుకుందాము. ఆ విధంగా ఒక్క పని దినంలో సగటున యంత్రం విలువలో 1/300 భాగం ఉపయోగించబడుతుందని మనం చెప్పవచ్చు. యంత్రాన్ని తయారు చేయడానికి 1,200 గంటల సామాజికంగా అవసరమైన శ్రమ సమయం పడుతుందని మనం అనుకుందాము. అప్పుడు అది ఒక పనిదినంలో ‘నాలుగు గంటల విలువను’ కోల్పోతుంది.
విలువ సృష్టి..
విలువ సృష్టిలో ఒకటిగా శ్రమ ప్రక్రియపై మార్క్సిస్టు దృష్టికోణం ఈ క్రింది విధంగా ఉంది. కొంతమొత్తంలో సమ్మిళితమైన శ్రమతో ముడిపదార్ధాలు శ్రమ ప్రక్రియలోకి వస్తాయి. ఈ ముడి పదార్ధాన్ని మరొక సరుకుగా మార్చడంలో, కార్మికుడు మరికొంత శ్రమ సమయాన్ని నేరుగా ఖర్చు చేస్తాడు/ వ్యయం చేస్తాడు– ఇక్కడ ఉక్కు పలక సుత్తిగా మార్చబడింది. ఇలా చేయడంలో ఉత్పత్తికి కొంత తన విలువను వదిలివేసే యంత్రాన్ని కార్మికుడు వాడుతాడు.
ముడి సరుకుల మాదిరిగానే యంత్రం కూడా దానిని ఉత్పత్తి చెయ్యడానికి సామాజికంగా అవసరమయ్యే శ్రమ నిర్ణయించే ఒక నిర్దిష్ట విలువతో శ్రమ ప్రక్రియలోకి వస్తుంది. ఆ విధంగా ముడిసరుకులు, యంత్రం రెండింటి విలువను నిర్ణయించడం పరిగణనలో ఉన్న(ఉక్కు పలకలను సుత్తులుగా మార్చే) శ్రమ ప్రక్రియలో జరగదు. కానీ అవి ఉత్పత్తియిన శ్రమ ప్రక్రియలో జరుగుతుంది.
ప్రస్తుత శ్రమ ప్రక్రియలో యంత్రం, ముడి సరుకులు తాజా విలువను సృష్టించడానికి దోహదపడవు. దానికి బదులుగా ఈ శ్రమ ప్రక్రియలోని మౌలికాంశమైన కార్మికుని సజీవ శ్రమ మూడు పనులు చేస్తుంది: (i) ఇది ఉత్పత్తిలోని ముడి సరుకుల విలువను సంరక్షిస్తుంది. (ii) ఇది యంత్ర విలువలో కొంత భాగాన్ని ఉత్పత్తికి బదలాయిస్తుంది. (iii) ప్రత్యక్ష శ్రమ ద్వారా తాజా విలువను ఉత్పత్తికి చేరుస్తుంది.
ఉదాహరణలో ఒక రోజు ఉత్పత్తి నాలుగు సుత్తుల తయారీలో సంరక్షించబడిన ముడి సరకుల విలువ 16 గంటల శ్రమకు సమానం(ప్రతి పలకకూ 4 గంటల చొప్పున), యంత్రం తరుగుదల లేదా కార్మికుని ద్వారా ఉత్పత్తికి బదిలీ చేయబడిన భాగం విలువ 4 గంటలు(12,00/ 300 = 4).
రోజు చివరలో మనకు మిగిలిన 4 సుత్తుల విలువ ఏమిటి? యంత్రం నుంచి బదిలీ చేయబడిన విలువ, ముడిసరకుల విలువ, తాజాగా చేర్చబడిన(ఆరోజు వెచ్చించిన ప్రత్యక్ష శ్రమ) విలువల మొత్తమన్నది జవాబు. మన ఉదాహరణలో అది నాలుగు సుత్తులకూ కలిపి 4 + 16 + 8= 28 గంటలు. అంటే ప్రతి సుత్తిలోనూ 7 గంటల శ్రమ ఇమిడి ఉన్నదని చెప్పాలి. అందులో ఒక గంట యంత్రం నుంచి బదిలీ చేయబడిన విలువ, అప్పటికే సుత్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన ఉక్కు పలకలో ఉన్న 4 గంటల శ్రమ, మిగిలింది ఉక్కు పలకను సుత్తిగా మలచడంలో ప్రత్యక్షంగా వెచ్చించిన శ్రమ.
పైన చెప్పినదానిలో విలువను సృష్టించే ప్రక్రియలో ఉత్పత్తి సాధనాల పాత్రను మనం చూసిన విధానాన్ని ప్రత్తిని నూలుగా వడికే ప్రక్రియకు సంబంధించి మార్క్స్ ప్రకటన ద్వారా చాలా బాగా సమీక్షించవచ్చు: ‘అందుచేత ముడి సరకులోనూ, శ్రమ సాధనాలలోనూ(పనిముట్ల లోనూ) ఉన్న విలువను, అసలైన నూలు వడికే ప్రక్రియ ప్రారంభానికి ముందు నూలు వడికే ప్రక్రియ ప్రారంభదశలో వెచ్చించిన శ్రమగా చూడవచ్చు.
అదనపు విలువ..
ఒక సరుకు(ఉక్కు సుత్తి) విలువను దాని ఉత్పత్తిలో వెచ్చించిన ప్రత్యక్ష, పరోక్ష శ్రమ సమయంగా చూడాలని మన విశ్లేషణ తెలుపుతున్నది. కానీ పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియ పని విలువను ఉత్పత్తి చేయడమే కాదు, అదనపు విలువను ఉత్పత్తి చేయడం కూడా. అందుచేత అదనపు విలువ ఎలా సృష్టించబడింది? అనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది. దీనికి జవాబు చెప్పడానికి మనం శ్రమ ప్రక్రియ ‘నిష్క్రియాత్మక’ అంశాలు– ఉత్పత్తి సాధనాల నుంచి– క్రియాశీల అంశం, సజీవ శ్రమకు మళ్ళాలి.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 16వ భాగం, 15వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.