లేబర్ కోడ్స్ ముసాయిదా నియమాలను 2025 డిసెంబర్లో విడుదల చేస్తూ, ఇది గొప్ప పరిణామాత్మక సంస్కరణగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది.
2025-26 ఆర్థిక సర్వే ఒక ఆశాజనకమైన అంచనాకు వచ్చింది. లేబర్ కోడ్స్ చట్టాల ద్వారా ఉపాధి రంగంలో క్రమబద్ధీకరణ 60.4% నుంచి 75.5%కి పెరుగుతుందని, 77 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, నిరుద్యోగం తగ్గుతుందని, మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం పెరుగుతుందని, 2029-30 నాటికి జీడీపీ 1.25% పెంపుదల ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.
పరిశ్రమలకు నిబంధనల అమలును సరళీకరించడం వల్ల క్రమబద్ధీకరణ మెరుగవుతుందని, ఉపాధి విస్తరిస్తుందని సర్వేలో చెప్పబడింది.
అయితే, భారతదేశపు కార్మికులలో 90% కంటే ఎక్కువ మంది అసంఘటిత రంగంలో ఉన్నారు.
వీరు లేబర్ కోడ్ ప్రయోజనాలకు దాదాపుగా వెలుపలే ఉన్నారు.
అసంఘటిత రంగం పరిధి పెరుగుతోంది. పరిశ్రమలకు వెసులుబాటు కల్పించినప్పుడు, అవి శాశ్వత ఉపాధి నుంచి దూరంగా జరిగే అవకాశం ఉంది.
2011- 2023 మధ్య ప్రత్యక్ష ఫ్యాక్టరీ ఉపాధి 61% – 47%కి పడిపోయింది. ఫ్యాక్టరీ కార్మికులలో కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం కార్మికుల సంఖ్యలో 42%కి పెరిగారు.
పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే- 2025 ప్రకారం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ఉపాధి కార్మికులు 2024లోనే 30,000 తగ్గారు.
వారి స్థానంలో తాత్కాలిక, కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు.
ఒకప్పుడు స్థిరమైన శాశ్వత ఉపాధికి చిహ్నంగా ఉన్న ప్రభుత్వ రంగం భారతదేశంలో కుంచించుకుపోతోంది.
కొత్త లేబర్ కోడ్లు నియంత్రణ నిర్వచనాలను, రక్షణలను సడలించడం ద్వారా తాత్కాలిక ఉపాధి మరింత వేగవంతం అవుతుంది.
దీంతో పరిశ్రమ అధిపతులు శాశ్వత ఉపాధి కల్పన నుంచి తప్పించుకుంటారు. కార్మిక సంబంధాల నుంచి వైదొలగడం సులభం అవుతుంది.
క్రమబద్ధీకరణ ఒక భ్రమ
ఈ కోడ్ ల ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, Thresholds రక్షణను పెంచడం ద్వారా అసంఘటిత రంగం విస్తరిస్తుంది.
వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్(OSH Code)”ఫ్యాక్టరీ” నిర్వచనాన్ని విద్యుత్ వాడే పరిశ్రమలలో 10 మంది కార్మికుల నుంచి 20కి, విద్యుత్ వాడకపోతే 20 నుంచి 40కి పెంచారు. కాంట్రాక్ట్ కార్మిక పరిమితిని 20 నుంచి 50కి పెంచింది.
లే-ఆఫ్స్ కోసం ముందస్తు అనుమతి పొందే పరిమితిని 100 నుంచి 300కు పెంచింది.
యజమానులకు ఇంతటి వెసులుబాటు కల్పిస్తూనే ఈ కోడ్లు శాశ్వత ఉపాధిని పెంచుతాయని ప్రభుత్వం చెబుతున్నది. ఇది ప్రధానంగా “నిర్ణీత కాల ఉపాధి”ని విస్తరించడంపై ఆధారపడి ఉంటుంది.
అంటే శాశ్వత ఉద్యోగాలకు బదులుగా యజమానులు స్వల్పకాలిక ఒప్పందాలపై కార్మికులను నియమించుకోవడానికి అనుమతించడమే.
చారిత్రక పరంగా శాశ్వత ఉపాధి అంటే ఉద్యోగ భద్రత, క్రమబద్ధ వేతనాలు, సామాజిక భద్రత, ఉమ్మడి బేర సారాల హక్కు లాంటివి.
లేబర్ కోడ్ల ద్వారా నిర్ణీత కాల ఉపాధిపై నియమించబడే వారికి నియామక పత్రాలు; ఒక సంవత్సరం తర్వాత గ్రాట్యుటీ వంటి కొన్ని ప్రయోజనాలను లభిస్తాయి. కానీ కీలకమైన శాశ్వత ఉపాధి, ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుంది.
అస్పష్టతలు
గిగ్ కార్మికుల పథకాల కోసం ప్లాట్‌ఫారమ్ కంపెనీలు వారి వార్షిక టర్నోవర్‌లో 1%-2% కేటాయించాలని కోడ్లు చెబుతున్నాయి.
అయినప్పటికీ కంపెనీలు ఎలా నిధులు కేటాయించాలి, ఏ ప్రయోజనాలు కల్పించబడతాయి, కవరేజ్, క్లెయిమ్ వివరాలన్నీ “తదుపరి స్కీమ్‌లో తెలియజేయబడతాయి”అని వదిలివేయబడ్డాయి.
తొలగించబడిన కార్మికుల కోసం ఉద్దేశించిన పునఃనైపుణ్య నిధి కూడా పైవిధంగా తదుపరి స్కీమ్‌కు వదిలి వేయబడింది.
యజమానులు ఒక్కో కార్మికుడికి 15 రోజుల వేతనం ప్రకారం జమ చేయాలి.
అయితే ఈ నిధులను ఎలా వినియోగించుకోవాలి, శిక్షణ ఎవరు ఇస్తారు? ఏ నైపుణ్యాలు నేర్పిస్తారనేది నిర్దిష్టంగా పేర్కొనలేదు. భారతదేశంలోని అనేక సెస్- సంక్షేమ నిధుల వలె, ఇందులో కూడా వసూళ్లు జరగవచ్చు కానీ ఆచరణలో కార్మికులకు ప్రయోజనం శూన్యం.
వేతనాల చట్టం
వేతనాల కోడ్ జాతీయ స్థాయి ఫ్లోర్ వేజ్, కనీస వేతనాన్ని నిర్దేశించింది. కానీ దానిని నిర్ణయించడానికి, వాటి మధ్య తేడాలను గుర్తించడానికి స్పష్టమైన పద్ధతి ఏది కోడ్‌లో లేదు.
దీనికి బదులుగా కొత్త నిబంధనలు పరిపాలనా పరమైన విచక్షణకు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాయి.
సరళీకృత విధానాలను బలపరిచేవారు కనీస వేతనాలు నిర్ణయించడం ద్వారా ఉద్యోగాలు తగ్గిపోతాయని చెబుతుంటారు.
దీనిలోని లాజిక్ ఏమంటే యజమానులను మార్కెట్ ధరల కంటే ఎక్కువ చెల్లించమని ఒత్తిడి చేస్తే, వారు తక్కువ మంది కార్మికులను నియమించుకుంటారని వారి తర్కం.
కానీ దశాబ్దాల అనుభవపూర్వక పరిశోధనలు(Dube 2019) ఈ వాదన తప్పు అని నిరూపిస్తున్నాయి.
తక్కువ వేతనం పొందే కార్మికులకు జీతాలు పెరిగినప్పుడు, వారు ఆహారం, రవాణా, గృహ వసతి, వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తారు. ఫలితంగా మొత్తం డిమాండ్ పెరుగుతుంది.
యజమానులకు తక్కువ వేతనాలు నిర్ణయించే అధికారం ఉన్నప్పుడు, కనీస వేతనాల విషయంలో కార్మికులను యజమానులు దోపిడీ చేయడం తగ్గుతుంది.
లేబర్ ఇన్స్పెక్టర్లను “ఇన్స్పెక్టర్-కమ్-ఫెసిలిటేటర్స్”గా మార్చడం అభ్యుదయకరమైనదిగా చెబుతున్నారు. కానీ ఇన్స్పెక్టర్లు యజమానులకు నిబంధనల ఉల్లంఘనలలో సహాయపడే ఫెసిలిటేటర్లుగా మారినప్పుడు, యజమానుల బాధ్యతను అమలు చేయడం జరగదు.
ఫలితంగా వేతనాల దోపిడి, ఓవర్‌టైమ్ చెల్లించక పోవడం వంటి యాజమానుల తీవ్రమైన ఉల్లంఘనలు కొద్దిపాటి జరిమానాల ద్వారా సరి పెట్ట బడతాయని స్పష్టమవుతున్నది.
చట్ట నిబంధనల అమలు చేయడానికి అయ్యే ఖర్చు కంటే జరిమానాలు తక్కువగా ఉంటే, చట్టాన్ని ఉల్లంఘించడం అనేది ఒక హేతుబద్ధమైన వ్యాపార నియమంగా మారుతుంది. ఇది ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు చాలా నష్టదాయకం.
యూనియన్లు, లేబర్ కోర్టులు, కార్మికుల హక్కులపై అవగాహన లేని అసంఘటిత రంగంలో, లేబర్ ఇన్స్పెక్టర్లు మాత్రమే పరిష్కారం కోసం కార్మికులకు ఏకైక మార్గంగా ఉండేవారు. వారిని ఫెసిలిటేటర్లుగా మార్చడం వల్ల ఈ కనీస జవాబుదారీతనం కూడా కనుమరుగవుతుంది.
చాలా అపోహలు..
అసంఘటిత రంగానికి దారితీసే కారణాలను కనుగొనడంలో లేబర్ కోడ్లు మొదటగా విఫలమయ్యాయి. యజమానులు చట్టాలను అమలు చేయడం వీలుకానంత క్లిష్టంగా నియమాలు లేవు. కానీ అసంఘటిత రంగమే వ్యవస్థాగతంగా లాభదాయకమైనది.
సాంకేతికత అభివృద్ధి ద్వారా ఉద్యోగాలు బాగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా కొత్తగా సృష్టించబడుతున్న ప్లాట్‌ఫారమ్ ఉద్యోగాలు యజమాని-కార్మికుడు సంబంధాన్ని పూర్తిగా తొలగిస్తున్నాయి.
ఆర్థిక సర్వే ఆశాజనక అంచనాలు కార్మిక మార్కెట్ వాస్తవాలకు విరుద్ధమైన ఊహలపై ఆధారపడి ఉన్నాయి. అసంఘటిత రంగం చౌకగా, లాభదాయకంగా ఉన్నంత కాలం, శాశ్వత ఉపాధి అవకాశాలు మెరుగుపడటం సాధ్యం కాదు.
యజమానులు కార్మికులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడాన్ని లేబర్ కోడ్లను అనుమతించిన తర్వాత యజమానులు శాశ్వత కార్మికుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకుంటారు తప్ప, శాశ్వత ప్రాతిపదిక ఉపాధి మెరుగుపడడం సాధ్యం కాదు.
శాశ్వత ఉపాధి శాతం వంటి అంకెలు కనిపించవచ్చు. కానీ అవి కార్మికుల పట్ల యజమానులలో వచ్చే మార్పులను మాత్రమే సూచిస్తాయి తప్ప, కార్మికుల వాస్తవ జీవన ప్రమాణాల్లో మెరుగుదల ఉందా అనే విషయాన్ని లేబర్ కోడ్లు పట్టించుకోవు.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
