
భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఐదేళ్లల్లో తొలిసారిగా షాంఘై సహకార మండలి సమావేశాల కోసం బీజింగ్ వెళ్లారు. క్వాడ్ పేరుతో రక్షణ వ్యవహారాల్లో పరస్పర ప్రయోజనాలు కాడుకోవడానికి ఏర్పాటైన నాలుగు దేశాల కూటమిలోని రెండు దేశాలు – జపాన్, ఆస్ట్రేలియాలు చైనా పట్ల తమ వైఖరిని పునఃబేరీజు వేసుకుంటున్నాయి.
గత వారం జపాన్ ప్రధాని షెగెరు ఇషిబా ‘‘వాళ్లు చెప్పిందల్లా వినాలి, వాళ్లపై పూర్తిగా ఆధారపడాలి అని అమెరికా అనుకుంటే ఆహారం, భద్రత, ఇంధనం వంటి అన్ని విషయాల్లో అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వీయ సమృద్ధిని సాధించేందుకు జపాన్ ప్రయతిస్తుంది’’ అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
తైవాన్ జల సంధిలో చైనాకు వ్యతిరేకంగా నావికా దళ విన్యాసాల్లో పాల్గొనాల్సిందిగా వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ ఆస్ట్రేలియా ప్రధాని అల్బెనీస్ ‘‘అటువంటి పరిస్థితి వస్తే మా జాతీయ ప్రయోజనాల రీత్యా చైనాతో ఎంత వరకూ అంగీకరించాలో ఎక్కడ విబేధించాలో నిర్ణయించుకంటాము’’ అని కుండ బద్దలు కొడుతూ సంయుక్త నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు తిరస్కరించారు.
కానీ ట్రంప్ తీసుకుంటున్న అనేక హానికర చర్యలపై భారత ప్రధాని మోడీ మాత్రం మౌనముద్రనే పాటించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య సంధి కుదిర్చింది తానేనని చెప్పుకున్నా, ఏకపక్షంగా మోయలేని సుంకాల భారాన్ని నెత్తిన పెడుతున్నా , సుంకాల విషయంలో జరుగుతున్న చర్చలను నిరవధికంగా పొడిగిస్తున్నా మోడీ మౌనముద్ర వీడలేదు. 1990 దశకం తర్వాత తొలిసారిగా భారత్- అమెరికా సంబంధాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో భారత్ సంబంధాలను కేంద్రం పునఃసమీక్షించుకోవాలని నిర్ణయించింది. తదనుగుణంగానే భారత విదేశాంగ మంత్రి ఐదేళ్లల్లో తొలిసారి చైనాలో అడుగుపెట్టారు. బీజింగ్‌లో జరుగుతున్న షాంఘై సహకార మండలి సమావేశాలకు హాజరయ్యారు. ట్రంప్ తీసుకుంటున్న అడ్డగోలు చర్యలతో తల బొప్పి కట్టిన నాలుగు దేశాల కూటమిలో మూడు దేశాలు వేరే దిక్కు చూస్తూ ఉంటే ఇక ఈ కూటమి మనుగడ ఎక్కడిది?
ఈ మధ్యనే జరిగిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఈ కూటమి భవిష్యత్తు గురించి కానీ కార్యాచరణ ప్రణాళిక గురించి కానీ ఆశాజనకమైన సూచనలేమీ ఇవ్వలేదు. బహుముఖ వేదికల్లో భాగస్వామ్యం అన్న వ్యూహాన్ని అనుసరించి భారతదేశం అటు బ్రిక్స్‌లోనూ, ఇటు షాంఘై మండలిలోనూ, మరోవైపు క్వాడ్‌లోనూ, ఎఆర్ఎఫ్, బిమ్సెటెక్ వంటి వేదికలు అన్నింటిలోనూ సభ్యురాలిగా ఉన్నది.
పరిస్థితులు తారుమారైతే వచ్చే సంవత్సరం భారతదేశంలో జరగాల్సిన క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి వచ్చే ట్రంప్‌కు భారతదేశం విన్నూత్న తరహాలో గతంలో క్రికెట్ స్టేడియంలో ఘనస్వాగతం పలికిన దానికి భిన్నంగా స్వాగతం పలికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
బీజింగ్ అవగాహన
2008- 09 అట్లాంటిక్ తీర దేశాల ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ ద్రవ్యపెట్టుబడి సంక్షోభంగా పొరపాటు నామకరణం చేశారు. ఈ సంక్షోభానంతరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, రాజకీయ భూగోళ నిపుణులు ఓ ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు. అప్పటివరకూ ప్రపంచాన్ని శాసించిన వాషింగ్టన్ ఒప్పందం స్థానంలో ప్రపంచ ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల్లో ముందు ముందు బీజింగ్ అవగాహన శాసించనున్నదా అన్నదే ఆ ప్రశ్న. 1990 దశకం నాటికి ప్రశ్ఛన్న యుద్ధం ముగియటం, అమెరికా నాయకత్వంలో పశ్చిమ దేశాలు దాదాపు అర్థశాబ్ది సైద్ధాంతిక యుద్ధంలో విజేతలుగా నిలవడంతో ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో నూతన ఎజెండా ముందుకొచ్చింది. అలా ముందుకొచ్చిన నూతన ఎజెండాకే వాషింగ్టన్ అవగాహన అని పేరు పెట్టారు. చైనా లక్షణాలతో పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా అన్న నినాదం కూడా ఈ అభిప్రాయం ఏర్పడటానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, పాశ్చాత్య దేశాలలోని ఇతర మేధో కేంద్రాలు ప్రతిపాదించిన విధానాలే వాషింగ్టన్ అవగాహన రూపంలో అమల్లోకి వచ్చాయి. దేశీయంగా స్వేచ్ఛా మార్కెట్, అంతర్జాతీయంగా స్వేచ్ఛా వాణిజ్యం, పరిమిత ప్రభుత్వం, అపరిమిత ప్రైవేటురంగం వంటివన్నీ ఈ అవగాహనలో పుట్టుకొచ్చిన అంశాలే. అంతర్జాతీయంగా ఆర్థిక మేధో రంగంలో వాషింగ్టన్ అవగాహన తెచ్చిపెట్టుకున్న పెద్దన్న స్థానం 2008 నాటి అట్లాంటిక్ తీర దేశాల్లో విజృంభించిన సంక్షోభం, తదనంతర కాలంలో అమెరికా, పశ్చిమ దేశాల్లో నెలకొన్న సామాజిక రాజకీయ పరిణామాల ఉధృతిలో కొట్టుకుపోయాయి.
ఈ సంక్షోభానికి ప్రధాన స్రవంతి ఆర్థిక విధానాలు కారణమన్న వాదన ప్రబలంగా ముందుకొచ్చింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు కాలం చెల్లిందంటూ కీన్సియన్ ఆర్థిక సూత్రాల గురించిన చర్చ మేధో కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్లో మొదలైంది.
ఇక్కడ జరిగిన అసలు విషయం ఏమిటంటే అట్లాంటిక్ తీర దేశాలను కమ్మేసిన ఆర్థిక సంక్షోభం సెగ చైనాను తాకలేకపోయింది. పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదవటబెట్టడానికి చైనా చేయందించింది. తర్వాతి కాలంలో చైనా ఆర్థికాభివృద్ధి గణనీయంగా పెరిగింది. ప్రపంచ రెండో ఆర్థిక అగ్ర రాజ్యంగా ఎదిగింది. ప్రధాన దేశాలన్నిటితోనూ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా మారింది.
ఈ నేపథ్యంలో బీజింగ్ అవగాహన అన్న భావన ప్రపంచ వ్యాప్తంగా తెరమీదకు వచ్చింది. పదేపదే డాలర్లు ముద్రించటం ద్వారా డిమాండ్‌ను పునరుద్ధరించటం, దివాళా తీసిన ప్రైవేటు కంపెనీలను ఆదుకోవడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత వంటి చర్చలు, చర్యలు వాషింగ్టన్ అవగాహన స్థానాన్ని రాజ్యప్రాయోజిత పెట్టుబడిదారీ విధానం నమూనాను అనుసరించిన బీజింగ్ అవగాహన ఆక్రమిస్తోందనటానికి సూచనగా పరిగణిస్తున్నారు.
గత దశాబ్దకాలంగా ప్రపంచ దేశాలు అనుసరించిన భౌగోళిక రాజకీయాలు ప్రధానంగా చైనా ఆర్థికాభివృధ్ధిని అడ్డుకోవడానికి అనుసరించిన విధానాలే. ఈ విధానాలు అమెరికాలో తయారయ్యాయి. వాటికి వ్యూహకర్త ఎడ్వర్డ్ లుట్వాక్. ఇదే వ్యూహాన్ని అమలు చేయటానికి ట్రంప్ తొలి పదవీకాలంలో ప్రయత్నించారు. ప్రస్తుతం రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రపంచం ముందుకు సాగిపోయింది.
అమెరికాదే అగ్ర తాంబూలం అన్న ధోరణితో చైనా పురోగతిని, పెరుగుతున్న పలుకుబడిని నిలువరించే ప్రయత్నంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు అమెరికా మిత్రులను అమెరికా నుంచి దూరం చేస్తున్నాయి. నూతన తరహా బీజింగ్ అవగాహన ఓ భౌగోళిక రాజకీయ విధానంగా అవతరించటానికి దారితీస్తున్నాయి. ట్రంప్ తొలిదఫా అధ్యక్ష పాలన, తర్వాతి కాలంలో బైదెన్ పాలన కాలంలో ప్రపంచ దేశాలు చైనాతో దోస్తీ వీడి తమను తాము కాపాడుకోవాలంటూ అమెరికా ఇచ్చిన నినాదం ట్రంప్ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత మిత్రదేశాలు అమెరికాను వీడితేనే తమను తాము కాపాడుకునే అవకాశాలున్నాయన్న స్థాయికి చేరింది.
చైనాకు దగ్గరయ్యేందుకు అనేక దేశాల ప్రయత్నం..
జపాన్ నుంచి భారతదేశం వరకూ, గల్ఫ్ దేశాల నుంచి ఆఫ్రికా దేశాల వరకూ, యూరప్ నుంచి లాటిన్ అమెరికా దేశాల వరకూ అనేక దేశాలు చైనాతో దోస్తీకి సిద్ధపడుతున్నాయి. అమెరికాతో స్నేహం వలన జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
క్వాడ్ అన్నది చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న రక్షణ ఒప్పందం కాదు. పశ్చిమ పసిఫిక్ తీరంలో అమెరికాకు చైనాతో యుద్ధం వస్తే ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లు అమెరికాతో చేతులు కలపడానికి సిద్ధం కావటం లేదు. కాబట్టి అమెరికా ఏమనుకున్నా క్వాడ్ చైనాకు వ్యతిరేకంగా ఈ నాలుగు దేశాలూ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం అయితేకాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏరకంగా చూసుకున్నా చైనాతో కాలుదువ్వేందుకు అమెరికాకు ఇది తగిన సమయం కాదు కాబట్టి చేయి కలపటానికి అదును కోసం చూస్తోంది.
మరోవైపు ఈ క్వాడ్ కూటమి శాస్త్ర సాంకేతిక విషయాలు, ఆర్థిక విషయాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పాటు చేసిందన్నది వ్యవస్థాపక లక్ష్యం. ట్రంప్ వాణిజ్య విధానాలు, తనను కట్టడి చేయాలన్న అమెరికా వ్యూహాన్ని ఇప్పటి చైనా నిలువరించగలగటం, నిరంతరం నిలకడైన ఆర్థికాభివృద్ధిని సాధించటం వంటి పరిణామాల నేపథ్యంలో అనేక దేశాలు చైనాతో స్నేహహస్తం అందించటానికి చూస్తున్నాయి. అమెరికా పడగ నీడలో జరిగిన నష్టం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నిజానికి ఇరుగుపొరుగు దేశాలకు చైనా సవాలుగా లేదు. కానీ అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక విషయాల్లో ప్రభావశాలి శక్తిగా చైనా ఎదగటమే చైనాతో సముచిత సంబంధాలు కొనసాగించుకోవాలన్న ఆలోచనకు ప్రపంచ దేశాలను నెడుతోంది. ట్రంప్ పుణ్యమా అంటూ ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక విధానాలకు చైనా గురుత్వాకర్షణ కేంద్రంగా మారుతోంది.
సంజయ్ బారు
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత సంజయ్ బారు మాజీ సంపాదకులు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారు).
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.