ప్రస్తుత పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చిన ప్రధాని మోదీ, ప్రపంచ స్థాయి సంక్షోభాలు వ్యవసాయానికి, ఎరువుల లభ్యతకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, భారత్ విజ్ఞప్తిపై చైనా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారత్‌కు ఇంధన సరఫరా తగ్గిపోయి ఎరువుల ఉత్పత్తికి ముప్పు ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో, యూరియా కార్గోల ఎగుమతులపై ఆంక్షలను సడలించాలని చైనాను భారత్ అభ్యర్థించినట్టు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొన్నది.
యూరియా ఉత్పత్తికి కీలకమైన ద్రవీకృత సహజ వాయువు సరఫరాలకు హార్ముజ్ జలసంధి మూసివేతతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో, కొన్ని యూరియా కార్గోల విక్రయానికి అనుమతించాలని భారత అధికారులు చైనా అధికారులను కోరినట్టు సమాచారం.
ప్రధాని మోదీ హామీ
మార్చి 13న అస్సాంలోని గౌహతిలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “అంతర్జాతీయ సంక్షోభాలు వ్యవసాయంపై ప్రభావం చూపకుండా మేము చూసుకున్నాం” అని అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో తీసుకున్న చర్యలను గుర్తుచేస్తూ, “అప్పట్లో సంక్షోభం నుంచి రైతులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసింది” అని మోదీ పేర్కొన్నారు.
“అంతర్జాతీయ మార్కెట్లో రూ 3,000 ధర పలికే యూరియా బస్తాను మన రైతులకు కేవలం రూ 300లకే అందించాం” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారత్ తక్షణ ఎరువుల కొరతను ఎదుర్కోనప్పటికీ, ఈ అంతరాయం సుదీర్ఘకాలం కొనసాగితే, జూన్‌లో నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌కు ముందే మరిన్ని నిల్వలను సమీకరించుకోవాల్సిన ఒత్తిడి ప్రభుత్వంపై పడవచ్చు.
సురక్షితమైన ఎరువుల నిల్వలు
అయితే, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ, “రాబోయే ఖరీఫ్ సీజన్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన దృఢమైన- సురక్షితమైన ఎరువుల నిల్వలతో దేశం పూర్తి సన్నద్ధతతో ఉంది” అని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ మార్చి 6న ఒక ప్రకటనలో హామీ ఇచ్చింది.
2025 మార్చి 6 నాటికి 12.98 మిలియన్ టన్నులుగా ఉన్న ఎరువుల నిల్వలు, ఏడాది తిరిగేసరికి 17.73 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని, ఇది వార్షిక ప్రాతిపదికన 36.5% పెరుగుదల అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, భారతదేశంలోని కొందరు ఎరువుల తయారీదారులు తమ కర్మాగారాలను మూసివేయడానికి లేదా వార్షిక నిర్వహణను ముందుకు జరపడానికి బలవంతం చేయబడ్డారని బ్లూమ్‌బెర్గ్ గతంలో నివేదించింది.
భారత ఎరువుల పరిశ్రమకు ప్రస్తుతం వారి అవసరంలో కేవలం 70% గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోందని ఆ కథనం పేర్కొంది.
దక్షిణాసియా దేశాల ఆందోళన..
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా గుండా సాగే ప్రపంచ వాణిజ్యం దెబ్బతిన్న తరుణంలో, ఇంధన- ఆహార సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కీలకమైన సరుకులను సురక్షితంగా ఉంచుకోవడానికి దక్షిణాసియా దేశాలు ఆశ్రయిస్తున్న అనేక అసాధారణ చర్యల్లో భాగంగానే ఈ పరిణామం కనిపిస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ ఉదహరించిన అజ్ఞాత అధికారుల సమాచారం ప్రకారం, దీనిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి, ఎలాంటి నిర్ణయం తీసుకోబడలేదు.
చైనా యూరియా ఎగుమతులు కోటా విధానం కింద అమలవుతాయి. వసంతకాలపు నాట్ల సీజన్ కోసం దేశీయ సరఫరాను భద్రపరుచుకున్న తర్వాతే, ఇతర దేశాలకు కోటాలను కేటాయిస్తుంది.
కథనం ప్రకారం, గత ఏడాది అనుమతించిన షిప్మెంట్లలో భారత్‌కు కేటాయించిన కోటా కూడా ఉంది.
రాబోయే దిగుమతుల ప్రణాళిక
భారత్ 2026 ఫిబ్రవరి నాటికి 9.8 మిలియన్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకోగా, రాబోయే మూడు నెలల్లో అదనంగా మరో 1.7 మిలియన్ టన్నుల దిగుమతికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మార్చి 10న ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ నెలాఖరులోగా లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రభుత్వం కొత్త యూరియా దిగుమతి టెండర్‌ను జారీ చేయవచ్చని బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్, వరి, గోధుమలతో పాటు చక్కెర, పత్తి వంటి ప్రధాన పంటలను అత్యధికంగా పండించి, ఎగుమతి చేసే దేశంగా ఉంది.
ఎరువుల పరిశ్రమపై పడే ఎలాంటి ప్రభావమైనా – అది స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా – చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే, సుమారు 147 కోట్ల జనాభాకు ఆహారం అందించే భారతదేశ సామర్థ్యంపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
