పునరుత్పాదకశక్తి, ఇథనాల్ మిశ్రమం, సుస్థిర వైమానిక ఇంధనంపై బ్రెజిల్‌తో చేతులు కలుపుతున్నట్టు మోదీ తెలిపారు. ప్రపంచ బయో ఇంధన కూటమిలో బ్రెజిల్ పాత్రను కొనియాడారు.
న్యూఢిల్లీ: కీలక, అరుదైన ఖనిజాల సహకార ఒప్పందం మీద ఫిబ్రవరి 21న భారత్, బ్రెజిల్‌లు సంతకం చేశాయి.
రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో సరఫరా గొలుసు పటిష్టతకు కేంద్ర స్థానమిచ్చాయి.
అదే సందర్భంలో ఇరుదేశాలను ప్రభావితం చేసే అమెరికా సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ‘‘వేచి చూసే ’’ వైఖరిని అనుసరించాలని భారత్, బ్రెజిల్ నిర్ణయించాయి.
న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరుదేశాల మధ్య జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చలలో కుదిరిన 10 ఒప్పందాలలో ఖనిజాల ఒప్పందం కూడా ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిలియాను సందర్శించిన ఏడు నెలల తరువాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా భారత పర్యటనకు వచ్చారు.
2006 నాటి ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరి 20 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యపాత్ర పోషించనున్న ఒప్పందం..
ఇరువురి నేతల సమావేశం అనంతరం జరిగిన సంయుక్త పత్రికా సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ‘‘కీలక ఖనిజాలు, అరుదైన ఖనిజాలపై రెండు దేశాల మధ్య అవగాహన’’ను పటిష్టమైన విలువ గొలసులను ఏర్పాటు చేసుకోవడంలో పెద్ద ముందడగుగా పేర్కొన్నారు.
‘‘నేడు మేము సంతకం చేసిన మార్గదర్శకమైన ఒప్పందంలో పునరుత్పాదకశక్తి, కీలక ఖనిజాల విషయంలో సహకారం కేంద్ర స్థానంలో ఉంటుంది’’అని లూలా వర్ణించారు.
కేంద్రీకృత సరఫరా గొలుసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన నెలకొన్న పరిస్థితులలో ఈ ఒప్పందం జరగడం గమనార్హం.
ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, స్మార్ట్ ఫోన్లు, జెట్ ఇంజన్లు, క్షిపణులలో కీలక ఖనిజాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
పరిశ్రమ అంచనాలు, జియోలాజికల్ సర్వేల ప్రకారం చైనా ప్రపంచ అరుదైన లోహాల మైనింగ్‌లో దాదాపు 60-70% వాటా, ప్రాసెసింగ్ సామర్థ్యంలో 90% వాటాను కలిగి ఉంది.
ఇటీవల కాలంలో, దేశ భద్రత దృష్ట్యా బ్రెజిల్ గాలియం, జెర్మానియం, కొన్ని గ్రాఫైట్ ఉత్పత్తులపై చైనా ఎగుమతి ఆంక్షలు విధించింది.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, పునరుత్పాదక శక్తి వ్యవస్థలు, సెమి కండక్టర్లు, రక్షణ సామగ్రిలో వినియోగించే ఖనిజాలను ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని భారతదేశం భావిస్తోంది.
డేటాను సమర్పించిన లూలా..
కీలక ఖనిజాలు, అరుదైన ఖనిజాల నిక్షేపాలలో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది.
భారతదేశ పర్యటన సందర్భంగా లూలా వీటికి సంబంధించిన డేటాను సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
ఇంకా శోధించవలసిన నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా ఆయన వివరించినట్లు పేర్కొన్నారు.
ఈ విషయంలో ఖనిజాల శోధనను విస్తరించడం, ప్రాసెసింగ్ చేయడం, సహకరించుకోవడానికి విస్తారమైన అవకాశాలను లూలా ప్రస్తావించారు.
పరిమాణాత్మకమైన లక్ష్యాలు, దిగుమతి లక్ష్యాలను, పెట్టుబడికి సంబంధించిన అంకెలను కానీ ప్రకటించలేదు.
విస్తృత ప్రాతిపదిక కలిగిన ఇంధన భాగస్వామ్యం పరిధిలోనే ఖనిజాల సహకారం కూడా రూపొందించబడింది.
పునరుత్పాదక శక్తి, ఇథనాల మిశ్రమం, సుస్థిర వైమానిక ఇంధనం విషయంలో భాగస్వామ్యాన్ని మోదీ ప్రస్తావించారు. ప్రపంచ బయోఇంధన కూటమిలో బ్రెజిల్ క్రియాశీల పాత్రను కొనియాడారు.
అత్యవసర చట్టం ద్వారా ప్రతి వర్తక భాగస్వామ్య దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న కొట్టివేసిన మరుసటి రోజే ఈ సమావేశం జరిగింది.
భారత్- అమెరికా సంబంధాలు..
2025 ఆగస్టులో, అమెరికా భారతదేశ ఎగమతులపై 50% సుంకాలను విధించింది.
వీటిలో 25% పరస్పర పోటీ సుంకాలు కాగా, మరో 25% రష్యా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే చమురుతో ముడిపడిన ‘పెనాల్టీ’ సుంకం ఉన్నాయి.
దీనిని ఇప్పటికీ కార్యాచరణపై చర్చించవలసి ఉన్న ద్వైపాక్షిక వర్తక ఒప్పందంలో భాగంగా 18%కు తగ్గించారు.
బ్రెజిల్‌తో పెద్ద ఎత్తున వర్తక మిగులును కలిగి ఉన్నప్పటికీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో విచారణతో ముడి పెట్టి అమెరికా 50% సుంకాలు విధించింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఎదురు దెబ్బతిన్న ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా 10% ప్రపంచ వ్యాప్త టారిఫ్‌ను ప్రకటించారు. మరిన్ని సుంకాలను విధించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్టు పేర్కొన్నారు.
నూతన పరిణామంగా అంగీకారం..
పత్రికా సమావేశంలో ఇరుదేశాల నేతల సమావేశ వివరాలను వెల్లడిస్తూ ఈ అంశంపై చర్చించిన విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తూర్పు దేశాల కార్యదర్శి పీ కుమరన్ నిర్ధారించారు. అయితే పరిస్థితి అసందిగ్ధంగానే ఉన్నట్టు తెలిపారు.
‘‘అమెరికా వర్తక విధానం, అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై చర్చ జరిగింది. దీనినొక నూతన పరిణామంగా ఇరువురు నేతలు అంగీకరించారు. దీని ప్రభావాల గురించి చర్చించవలసిన అవసరాన్ని ఇరుపక్షాలు చర్చించవలసిన అవసరం ఉంది. అమెరికా పాలనాయంత్రాంగం తీసుకునే నిర్ణయాల కోసం వేచి చూడాలని నిర్ణయించారు’’ అని కుమరన్ తెలిపారు.
వర్తకంపై ప్రభావాలు స్పష్టంగా ఉన్నాయి, ఇరు పక్షాలు‘‘వేచి చూసే’’ వైఖరిని ఎంచుకున్న తరువాత, రెండు దేశాల ఉమ్మడి ప్రతిస్పందనను ఆశించడం తొందరపాటు అవుతుందని అన్నారు.
‘‘వెంటనే స్పందించడం తొందరపాటు అవుతుందని అందరికీ తెలుసు. పత్రికా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ 10% టారిఫ్ విధించారు. ఏ టారిఫ్‌లు ఉన్నాయి? ఏ టారిఫ్‌లు పోతాయి? అనే విషయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇవన్నీ కూడా చాలా వేగంగా జరిగిన పరిణామాలు. ఈ సమాచారం నిన్న రాత్రి చాలా ఆలస్యంగా వచ్చింది. మన వర్తకంపై దీని ప్రభావం ఖచ్చితంగా ఎలా ఉంటుందో వేచి చూడాలని అంగీకరించడం జరిగింది”అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా చెప్పారు.
బలోపేతం ఆవశ్యకత..
గతంలోనే అమెరికా వైఖరిని వాణిజ్య ఒంటెద్దువాదంగా లూలా తీవ్రంగా విమర్శించారు. శనివారం లూలా మాట్లాడుతూ ‘‘ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మన దేశాలు బలోపేతం కావలసిన అవసరం ఉంది. మన వ్యూహాత్మక చర్చలను తీవ్రతరం చేయాలి’’అని పేర్కొన్నారు.
భారత్, మెర్కోసర్ మధ్య పటిష్టమైన సంబంధాల ద్వారా ‘‘వాణిజ్య ఒంటెద్దు వాదానికి’’ గట్టిగా సమాధానమివ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే అమెరికాను లేదా వాణిజ్య ఆందోళనలను మోదీ నేరుగా ప్రస్తావించలేదు.
బ్రెజిల్ లాటిన్ అమెరికాలో భారత్‌కు అతిపెద్ద వర్తక భాగస్వామి. 2024తో పోల్చుకుంటే ఈ రెండు దేశాల ద్వైపాక్షిక వర్తకం 2025లో 25% పెరిగి 15.21 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
రానున్న ఐదు సంవత్సరాలలో వర్తకాన్ని 20 బిలియన్ డాలర్లకు మించి తీసుకెళ్లడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ చెప్పారు.
11 మంది మంత్రులు, 300 మంది వ్యాపారవేత్తలతో కూడిన అతిపెద్ద అధికారిక ప్రాతినిధ్యాన్ని తన ఉద్దేశానికి రుజువుగా చెబుతూ, 2030 నాటికి ద్వైపాక్షిక లక్ష్యాన్ని 30 బిలియన్ డాలర్లకు పెంచాలని లూలా కోరుకుంటున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం 450 రకాల టారిఫ్‌లను కవర్ చేస్తున్న 2009 నాటి భారత్ మెర్కోసర్ ప్రాధాన్యతా వర్తక ఒప్పందం విస్తరణను కూడా ఇరువురు నేతలు మద్దతు తెలిపారు. వ్యవసాయం, ఎంపిక చేయబడిన పారిశ్రామిక రంగాలలో ఇరువైపులా ఉన్న సున్నితాంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
భారత్ కృషికి లూలా మద్దతు..
భారత్, బ్రెజిల్ కలసి పని చేస్తున్న ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు మరింత దృఢంగా, స్థైర్యంగా మారుతుంది’’అని మోదీ చెప్పారు.
చర్చలు, దౌత్యంతో ప్రపంచ సవాళ్లను పరిష్కరించుకోవాలని; ప్రపంచ సంస్థలను సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా సంస్కరించాలని కూడా ఆయన కోరారు.
ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూటీఓ, జీ20లో భారత్, బ్రెజిల్‌లను ముఖ్యమైన గళాలుగా లూలా వర్ణించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత, నాన్ పర్మినెంట్ కేటగిరీల విస్తరణతో సహసంస్కరణలకు మద్దతును పునరుద్ఘాటించారు.
శాశ్వత సభ్యత్వానికి బ్రెజిల్, భారత్‌లు స్వాభావిక అభ్యర్థులని లూలా తెలిపారు. జీ4 ఛట్రంలో సమన్వయాన్ని కొనసాగించాలని కోరారు.
ఉక్రెయిన్ యుద్ధ ముగింపు కోసం- పాలస్తీనా బాధలను తొలగించడం, దక్షిణ అమెరికాను శాంతి మండలంగా కొనసాగించడానికి భారత్ చేస్తున్న కృషికి లూలా మద్దతు తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా డిజిటల్ ప్రజా వసతులు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటింగ్, సెమి కండక్టర్లు, బ్లాక్ చెయిన్ మొదలగు వాటిలో సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది.
వివిధ రంగాల ప్రస్తావన..
రక్షణ రంగంలో, బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ సంస్థ ఎంబ్రాయర్ భారతదేశంలో విస్తరించడాన్ని లూలా గుర్తు చేశారు. అంతేకాకుండా, స్కార్పీన్ సబ్ మెరైన్ల నిర్వహణ కోసం మజగావ్ డాక్, భారత్, బ్రెజిల్ దేశాల భాగస్వామ్యంతో త్రైపాక్షిక ఏర్పాటు గురించి లూలా ప్రస్తావించారు.
ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్‌పై కూడా చర్చించడం జరిగింది. ఔషధాలు, ముఖ్యంగా జనరిక్ ఔషధాలకు సమాన ప్రాప్యత, ఆరోగ్య సార్వభౌమత్వంపై ప్రపంచ ఆరోగ్య సంస్థలో రెండు దేశాలు దశాబ్దాలుగా చేస్తున్న కృషిని లూలా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘‘ఆరోగ్యం, ఫార్మాసూటికల్ రంగాలలో సహకారానికి కూడా విస్తారమైన అవకాశం ఉంది. భారత్ నుంచి బ్రెజిల్‌కు చౌకైన, నాణ్యమైన ఔషధాల సరఫరాను పెంచే దిశగా మేము కృషి చేస్తాం. అదే సమయంలో, సమగ్ర ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం కోసం ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యం బ్రెజిల్లో విస్తరించబడుతుంది” అని చెప్పారు.
గత సంవత్సరం పహల్గాం, ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడులను ఉమ్మడి ప్రకటనలో బ్రెజిల్ ‘‘తీవ్ర పదజాలం’’తో ఖండించింది. సీమాంతర ఉగ్రవాదంతో సహా ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలను ఇరు దేశాలు ఖండించాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
