
న్యూ ఢిల్లీ: పహల్గాం దాడుల నేపథ్యంలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతోన్న రోజు జూన్ 28న ప్రధాని మోడీ పార్లమెంట్‌కు హాజరు కాలేదు. ఈ విషయాన్ని చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరపాలని, ఆ సమావేశానికి మోడీ ప్రత్యక్షంగా హాజరు కావాలని ప్రతిపక్షాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధపడినా, ప్రధాని మాత్రం సభకు హాజరు కాకుండా బృహదీశ్వరాలయం పర్యటన పెట్టుకోవటం గమనించాల్సిన విషయం.
అర్థరాత్రి వరకూ జరిగిన ఈ చర్చల్లో ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదుల దాడి వెనక నిఘా వ్యవస్థ లోపాలు గురించి, రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు మొదలైన నాల్గో రోజుకే ఈ ఘర్షణలు ముగిశాయని, రెండు దేశాలు తమ ప్రతిపాదనలకు ఒప్పుకున్నాయని ట్రంప్ ప్రకటించటం వంటి అంశాలపై పలువురు ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలను సంధించారు. పహల్గాం దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు మంత్రులు సమాధానం చెప్పలేదు. ట్రంప్ ప్రకటనలను కూడా తిరస్కరించటానికి పరిమితం అయ్యారు తప్ప ఖండించటానికి సిద్ధంకాలేదు.
దేశ రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ మాట్లాడుతూ, కాల్పుల విరమణకు సంబంధించి తమపై బయటి శక్తుల ఎటువంటి ఒత్తిడి లేదనీ ట్రంప్ పేరు ప్రస్తావించకుండా వివరించారు. మరోవైపున ట్రంప్, మోడీల మధ్య ఎటువంటి సంభాషణలు జరగలేదని విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. ఇదిలా ఉండగా ఓ వైపున ట్రంప్ జోక్యం లేదని ప్రభుత్వం వక్కాణిస్తుంటే, అదేరోజు స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ మాత్రం తన ధోరణిని కొనసాగిస్తూ తన వల్లనే యుద్ధం ఆగిందని చెప్పుకున్నారు.
దాడి జరిగిన వంద రోజుల తర్వాత కూడా ఉగ్రవాదుల జాడ తెలుసుకోలేని ప్రభుత్వం..
లోక్‌సభలో ప్రతిపక్షం తరఫున కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గగొయ్ చర్చను ప్రారంభిస్తూ, “పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి పాల్పడి వందరోజులు అవుతోంది. అయినప్పటికీ దోషుల గురించిన ఆచూకీ కేంద్రం తెలుసుకోలేకపోయింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాధ్యత వహించాల”ని డిమాండ్ చేశారు.
‘‘ఉగ్రవాదులు దాడి చేసి వంద రోజులు అవుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆ ఐదుగురి ఆచూకీ తెలుసుకోలేకపోయిందా అని దేశం ప్రశ్నిస్తోంది. వాళ్లకు ఎవరో ఒకరు ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు. దేశం వదిలి పారిపోవడానికి సహకరించి ఉండవచ్చు. కానీ, వంద రోజులు తర్వాత కూడా వారి జాడ తెలుసుకోలేకపోవడం ఏంటి? కేంద్రం చేతుల్లో డ్రోన్లు ఉన్నాయి. పేగసస్ నిఘా సాఫ్ట్వేర్ ఉంది, పారామిలటరీ బలగాలున్నాయి. దాడికి కొద్ది రోజుల ముందే, కేంద్ర హోంమంత్రి అక్కడ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అయినా అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల జాడ మాత్రం తెలీదా’’ అంటూ ధ్వజమెత్తారు గొగోయ్.
ఉగ్రవాదుల నడుం విరగ్గొట్టామని కేంద్ర హోంమంత్రి చెప్తున్నారు. అయినా 2016లో యూరిలోనూ, 2019లో పుల్వామాలోనూ, 2025లో పహల్గాంలోనూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారని గొగొయ్ గుర్తు చేశారు. ‘‘అంతిమంగా బాధ్యత ఎవరిది? జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌దా? కాదు. ఈ వైఫల్యం కేంద్ర హోంమంత్రిదే. కేంద్ర హోంమంత్రి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పేరు చెప్పి తప్పించుకోలేరు’’అని స్పష్టం చేశారు.
ఈ దాడి జరిగినప్పుడు మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారని, కనీసం తిరిగి వచ్చిన తర్వాత కూడా పహల్గాంలో పర్యటించటానికి బదులు ఎన్నికలు జరగనున్న బీహార్‌లో పర్యటించేందుకు ప్రాధాన్యత ఇచ్చారని గొగొయ్ గుర్తుచేశారు.
పహల్గాం నిందితులు పట్టుబడే వరకూ దేశం ఉత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా లేదని ఎన్సీపీ(శరద్పరవార్) నేత సుప్రియ సూలే పేర్కొన్నారు.
‘‘దాడులకు బరి తెగించిన ఉగ్రవాదులను పట్టుకునేంత వరకూ ఆపరేషన్ సిందూర్ ముగియదు. అంతా బాగుందని మనకు మనమే వీపు తట్టుకుంటే సరిపోదు. ఉగ్రవాదులను పట్టుకునేంత వరకూ విజయోత్సవం చేసుకోలేము’’ అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రమా శంకర్ రాజ్‌భర్ మాట్లాడుతూ, సరిహద్దులను కాపాడలేని ప్రభుత్వ ప్రగల్భాలను ఎండగట్టారు. సమస్య పరిష్కారం కోసం యుద్ధమే మార్గమన్నప్పుడు, పరిష్కారం కాకుండానే యుద్ధం ఎందుకు ముగించాల్సి వచ్చిందని నిలదీశారు. ‘‘మన దేశం విశ్వగురువు అయిందన్న ప్రధాని మాటలకు ఎంతో మురిసిపోయాము. కానీ విశ్వగురువు అమెరికాలో తిష్టవేశాడని ఇప్పుడే తెలిసింది’’ ఎద్దేవా చేశారు.
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించటం ఏంటి?
భారత్- పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు సంధి కుదిర్చానని చెప్పుకుంటున్న ట్రంప్‌ను నిలదీయకపోవటంతో కేంద్రాన్ని పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించారు.
‘‘నరేంద్రమోడీ తాను చెప్పింది తప్పని ఒక్కరోజు కూడా ఎక్స్(ట్విట్టర్లో) పోస్ట్ చేయలేదు. అమెరికా అధ్యక్షుడిని నిలదీయటానికి ప్రభుత్వం ఎందుకు జంకుతోంది? ట్రంప్ ముందు నిలబడగానే(ప్రధాని) ఎత్తు ఐదడుగులు పడిపోతుంది. 56 అంగుళాల ఛాతీ కాస్తా 36 అంగుళాలకు కుదించుకుపోతుంది’’ అని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఘాటుగా విమర్శిస్తూ ఎగతాళి చేశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుసరించిన దౌత్య వ్యూహాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు. ఓవైపు పాకిస్తాన్‌ను ఒంటరిపాటు చేయాల్సిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్‌కు చెందిన ఫీల్డ్ మార్షల్ మునీర్‌కు ఆతిథ్యం ఇవ్వడాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు.
‘‘మీ విధానం సఫలమైందా? మీరు రాజ్యాంగంలోని లౌకితత్వం అన్న భావనకు వ్యతిరేకమే. కానీ అదే రాజ్యాంగ పీఠికలో సార్వభౌమత్వం అన్న భావన కూడా ఉంది. అంటే మన నిర్ణయాలు మనం తీసుకోవడం. ఇదేనా మీ జాతీయత? అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటిస్తే సైన్యం మనోధైర్యంగా ఎలా ఉంటుంది? మా ప్రధానికి బదులు తెల్లోడెవడో కాల్పుల విరమణ సంధి కుదుర్చాడా అన్న ప్రశ్న తలెత్తదా’’ అంటూ ఒవైసీ నిలదీశారు.
‘‘నీళ్లు- రక్తం కలిసి ప్రవహించవనీ, ఉగ్రవాదం- చర్చలు కలిసి ప్రయాణించవనీ చెప్పారు. యుద్ధం చేశారు. గగనతలాన్ని మూసేశారు. వాణిజ్యం నిలిపివేశారు. ఆనకట్ట గేట్లు వేశారు. అయినా క్రికెట్ మాత్రం ఆపలేకపోయారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన ఆ 25 కుటుంబాలను కలిసి ఆపరేషన్ సిందూర్‌తో మేము పగతీర్చుకున్నాము. మీరు ఇంట్లో కూర్చుకుని క్రికెట్ చూడండని చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు.
శివసేన(ఉద్దవ్ బాల్ థాక్రే)ఎంపీ అర్వింద్ సావంత్ మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విముక్తి చేస్తామని ప్రభుత్వం పదే పదే ప్రచారం చేసింది. ఆపరేషన్ సిందూర్ ఈ వాగ్దానం నెరవేర్చటానికి సరైన సమయం. కానీ యుద్ధం నిలిపివేశారని అన్నారు.
పాకిస్తాన్‌కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ భారతదేశంలో సమాన హోదా కలిగిన అధికారికి ఫోన్ చేశారని చెప్తున్నప్పుడు, కనీసం ఒక్క షరతు కూడా విధించకుండా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందని సావంత్ నిలదీశారు. ‘‘పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం అడుక్కుంటుంటే కనీసం మనకు నచ్చిన షరతులు కూడా మనం ఎందుకు విధించలేకపోయాము? అమెరికా అధ్యక్షుడేమో తానే కాల్పుల విరమణ చేయించానని ఈనాటికీ చెప్పుకుంటున్నారు. కాల్పుల విరమణకు ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవటం అన్నది మీ చేతుల్లో ఉన్నప్పుడు బేషరతుగా ఎందుకు ఒప్పుకున్నారు?’’అన్నారు.
భారతదేశానికి చమురు సరఫరా చేసే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడి చేసినప్పుడు భారతదేశం ఇజ్రాయెల్ పక్షాన నిలిచింది. కానీ, భారతదేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క దేశమూ మన దేశానికి అండగా నిలవలేదు.
రోమ్ చక్రవర్తులు క్రీడాస్థలం నిర్మించి ప్రజలను ఆటలపై ఉసిగొల్పటం ద్వారా దేశ పాలనా వైఫల్యాల గురించి దృష్టి మళ్లించటానికి ప్రయత్నించినట్లు కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి వైఖరినే అనుసరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రణితి షిండే విమర్శించారు.
‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియలో ప్రభుత్వం ఆడిన తమాషా ఆట తప్ప మరోటి కాదు. ఈ ఆపరేషన్‌తో మనం ఏం సాధించామో ఎవ్వరూ చెప్పటం లేదు. ఎంతమంది ఉగ్రవాదులను పట్టుకున్నాము? మనం ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయాము? దీనికి కారణం ఎవరు? ఈ తప్పు ఎవరిది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానాలు చెప్పాలి. కానీ ప్రభుత్వం సమాధానాలివ్వకుండా పారిపోతోంది’’ అన్నారు షిండే.
పహల్గాం దర్యాప్తుపై నోరు మెదపని ప్రభుత్వం..
రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రులు ప్రభుత్వం తరఫున తొలుత మాట్లాడారు. ఇద్దరిలో ఎవ్వరూ సంధి కుదర్చటంలో ట్రంప్ ప్రమేయం ఉందని అంగీకరించలేదు.
దాదాపు గంట సేపు మాట్లాడిన రక్షణ మంత్రి, పహల్గాం ఉగ్రవాదుల దాడి గురించి కానీ, ట్రంప్ జోక్యం గురించి కానీ ప్రస్తావించలేదు. ఆపరేషన్ సిందూర్ నిలిపివేయటం పట్ల ఎవరి ప్రమేయమూ లేదని మాత్రమే చెప్పారు.
భారతదేశం ఎంచుకున్న రాజకీయ సైనిక లక్ష్యాలు సాధించాము కాబట్టి కాల్పుల విరమణకు అంగీకరించామని రాజ్‌నాథ్ అన్నారు. ఎవరి ఒత్తిడికో లొంగి కాల్పుల విరమణ చేయలేదని అన్నారు.
ఏప్రిల్ 22 నుంచి జూన్ 17వ తేదీ మధ్య మోడీ, ట్రంప్‌లు ఫోన్లో మాట్లాడుకోలేదని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో పలు దేశాలు ఫోన్లో సంప్రదింపులు జరిపినా మధ్యవర్తిత్వాన్ని భారతదేశం అంగీకరించలేదని స్పష్టం చేశారు.
వాణిజ్యం బూచిని చూపించి రెండు దేశాలనూ అణ్వస్త్ర ప్రయోగం ప్రమాదం నుంచి వెనక్కు తెచ్చారని ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నారు. ఏ సందర్భంలోనూ తాము జరిపిన చర్చల్లో వాణిజ్యం గురించిన ప్రస్తావన రాలేదని జైశంకర్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు విదేశీ నేత మాటలు నమ్ముతున్నారు. కానీ తమ దేశ విదేశాంగ మంత్రి మాటలు నమ్మేందుకు సిద్ధం కావటం లేదని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు.
ఓ వైపు కాల్పుల విరమణలో ట్రంప్‌కు ఏ పాత్రా లేదని జైశంకర్ పార్లమెంట్లో వివరిస్తుంటే మరోవైపు స్కాట్లాండ్ పర్యటనలో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.