బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీఐపీ చీఫ్ ముఖేష్ సాహ్నిని మహా కూటమి ప్రకటించింది. పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఈ విషయాన్ని ప్రకటించారు. బీహార్‌లో మార్పు కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని తొలగించాలని నాయకులు ఐక్యంగా పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్ర పాట్నాలోని హోటల్ మౌర్యలో అక్టోబర్ 23 గురువారంనాడు ప్రతిపక్ష పార్టీల మహాకూటమి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ సమావేశంలో తెలియజేశారు.
ఇదే విలేకరుల సమావేశంలో, వీఐపీ(వికాశీల్ ఇన్సాన్ పార్టీ) చీఫ్ ముఖేష్ సాహ్నిని మహా కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. మహా కూటమిలో విభేదాలున్నాయనే వార్తల మధ్య, ఈ విలేకరుల సమావేశంలో అనేక మంది సీనియర్ నాయకులు ఐక్యంగా బీహార్‌లో మార్పు కోసం పిలుపునిచ్చారు.
తేజస్వి యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ :
మహా కూటమి నాయకులందరూ నాపై పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అందరం కలిసి, అవినీతిమయమైన “డబుల్ ఇంజిన్” ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాము. మేమంతా కలిసి ఒక పత్రికా సమావేశం కూడా నిర్వహించాము. కానీ, ఎన్డీఏలో నితీష్ కుమార్‌కు అన్యాయం జరుగుతోంది. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించడం లేదు. అసలు విషయమేమిటంటే, నితీష్ కుమార్‌ను బీజేపీ ముఖ్యమంత్రిని చేయదు. శాసనసభా పార్టీల సంఖ్య ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని అమిత్ షా స్వయంగా చెప్పారు. ప్రశ్నమేమిటంటే: ప్రతిసారీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేవారు, ఈసారి అలాంటి ప్రకటనను ఎందుకు చేయడం లేదు?
ఉప ముఖ్యమంత్రి పదవికి ముఖేష్ సాహ్ని..
మహా కూటమికి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీఐపీ చీఫ్ ముఖేష్ సాహ్నిని నియమించినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ తెలిపారు.
“తన ప్రయాణం పోరాటం, సహనంతో నిండి ఉంది. తను ఎప్పుడూ పేదల పక్షాన నిలిచారు. తన సమాజానికి సేవ చేశారు” అని గెహ్లాట్ అన్నారు. మహా కూటమి రెండవ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని తరువాత ప్రకటిస్తామని కూడా ఆయన అన్నారు.
‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’
విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, “బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల అన్యాయం జరుగుతోంది. ఎన్డీఏ ఇంకాను విలేకరుల సమావేశం నిర్వహించలేదు, లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ధారించలేదు. నితీష్ కుమార్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చేయరని మేము చాలా కాలంగా చెబుతున్నాము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.”
కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, “రాష్ట్రం, దేశం గురించి ఆందోళన చెందడం సహజం. ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న విధానం దేశానికి, ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభానికి ముప్పు. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మీరు దీనిని ఖండిస్తే, మీరు జర్నలిస్ట్ అయినా, సెలబ్రిటీ అయినా, లేదా మరెవరైనా, మీరు జైలుకు వెళ్లవచ్చు. మొత్తం ప్రజలు బీహార్ వైపు చూస్తున్నారు; ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.”
తేజస్వీ యాదవ్‌తో పాటు అశోక్ గెహ్లాట్, బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అల్లవరపు, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య, వీఐపీ చీఫ్ ముఖేష్ సాహ్ని కూడా ఉన్నారు.
“బీహార్‌లో ఈ ఎన్నికలు ఉద్యోగాలు అడిగినందుకు కొట్టబడుతున్న యువత కోసం. అప్పుల ఊబిలోకి నెట్టబడిన మహిళల కోసం. భూమిని లాక్కుంటున్న రైతుల కోసం. ఈ పరిస్థితిలో, ఈ అవినీతి ప్రభుత్వాన్ని మార్చడానికి బీహార్ పూర్తిగా సిద్ధంగా ఉందని, యావత్ దేశానికి మేమందరం హామీ ఇవ్వాలనుకుంటున్నాము” అని భట్టాచార్య అన్నారు .
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
