అంతర్జాతీయ రాజకీయాలలో ‘న్యాయం’, ‘సార్వభౌమాధికారం’, ‘శాంతి’వంటి పదాలకు అసలు అర్ధమే లేకుండా ఎలా చేస్తున్నారో- ఆ పదాలను ఎంత క్రూరమైన వ్యంగ్యంగా మార్చేశారో గమనించడానికి ఇరాన్‌పై తాజాగా జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి ఒక రక్తసిక్తమైన ఉదాహరణ.
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, రక్షణ మంత్రి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) అధిపతిని ఒక కచ్చితమైన క్షిపణి దాడితో హత్య చేయడం ద్వారా వాషింగ్టన్, టెల్ అవీవ్‌లు సాధించినది కేవలం ఒక సైనిక విజయం మాత్రమే కాదు.
అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అనేవి కేవలం మూడో ప్రపంచ దేశాలకు, బలహీన రాజ్యాలకు మాత్రమే వర్తిస్తాయని; “ప్రపంచ పోలీసు”గా చలామణి అయ్యే సామ్రాజ్యవాదులకు కాదని మరోసారి బాహాటంగా నిరూపించిన దుహంకారం ఇది.
దౌత్యం పేరుతో యుద్ధ కుట్ర
ఖమేనీ కాంపౌండ్‌లో భద్రతా మండలి సమావేశం జరుగుతున్న సమయం, ప్రదేశం అమెరికా గూఢచార సంస్థ ‘సీఐఏ’కి ముందే తెలుసని పత్రికలు చెబుతున్నాయి.
అంటే, దౌత్యం పేరుతో ఒమన్ దేశం ద్వారా నడిపిన శాంతి చర్చలనేవి కేవలం ఇరాన్ పాలకులను ఏమార్చి, వారి భద్రతా వలయాన్ని సడలించేలా చేయడానికి వేసిన ఒక ఉచ్చు మాత్రమేనని స్పష్టమవుతోంది.
దౌత్యం అనేది యుద్ధ నివారణకు కాదు, అది యుద్ధ కుట్రలో భాగమేనని దీని అర్థం.
సరిగ్గా ఎనిమిది నెలల క్రితం(2025 జూన్‌లో) జరిగిన 12 రోజుల ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలను, సైనిక నాయకత్వాన్ని వారి ఇళ్లలో, ఆఫీసుల్లో ఇజ్రాయెల్ ఎలాగైతే మట్టుబెట్టిందో, ఇప్పుడు కూడా అదే తరహాలో ఇరాన్ భద్రతా వ్యవస్థలోకి చొచ్చుకుపోయింది.
బహిరంగమైన కూటమి – విముక్తి ముసుగులో విధ్వంసం
గతంలో, ముఖ్యంగా గాజాలో మారణకాండ జరుగుతున్న సమయంలో అమెరికా పాత్ర కాస్త పరోక్షంగా ఉన్నట్టు ఒక భ్రమ ఉండేది.
జో బైడెన్ ఒకవైపు కాల్పుల విరమణ గురించి నీతులు చెబుతూనే, మరోవైపు 70,000 మందికి పైగా పాలస్తీనియన్ల(అందులో 70 శాతం మంది మహిళలు, పసిపిల్లలే) ఉసురు తీయడానికి ఇజ్రాయెల్‌కు నిరంతరాయంగా ఆయుధాలు సరఫరా చేశారు.
కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రంగప్రవేశంతో ఆ ముసుగు కూడా పూర్తిగా తొలగిపోయింది.
ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసం
అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై “జంటగా” యుద్ధం చేస్తున్నాయని ట్రంప్ ఎటువంటి దాపరికాలు లేకుండా ప్రకటించారు. జనవరిలో జరిగిన దేశీయ ప్రజాందోళనలను నెత్తుటి ఏరులు పారించి అణచివేసిన ఇరాన్ పాలకవర్గం నైతికంగా పతనమై, ఆర్థికంగా చితికిపోయి బలహీనంగా ఉందన్నది సామ్రాజ్యవాదుల అంచనా.
ఖమేనీలాంటి “చరిత్రలోనే అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి” మరణంతో ఇరాన్ ప్రజలకు “తమ దేశాన్ని తిరిగి దక్కించుకునే” అవకాశం వచ్చిందని ట్రంప్, నెతన్యాహులు సెలవిస్తున్నారు.
వారు ఇరాన్ ప్రజలకు ‘ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను’ బహుమతిగా ఇస్తారట! ఇది అత్యంత జుగుప్సాకరమైన ద్వంద్వ నీతి.
నిజానికి ఇజ్రాయెల్ కోరుకుంటున్నది ఇరాన్లో ప్రజాస్వామ్యం రావడం కాదు. తమకు అడ్డునిలిచే ఏకైక సంస్థాగత శక్తి అయిన ఇరాన్‌ను, సిరియా, లిబియా, లెబనాన్ల వలె ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం చేసి, పశ్చిమాసియాలో ఎదురులేని ఆధిపత్యాన్ని నెలకొల్పడమే వారి అసలు లక్ష్యం. 
పలు కీలకమైన ప్రశ్నలు..
ఈ క్రమంలో మనుషుల ప్రాణాలకు విలువెక్కడుంది? ఇరాన్ ప్రజలు తమ నిరంకుశ పాలకులను ఎంతగా ద్వేషిస్తున్నా, తమ మీద ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపిస్తున్న విదేశీ సైన్యాలకు వత్తాసు పలుకుతారా?
దక్షిణ ఇరాన్‌లోని ఒక బాలికల పాఠశాల మీద అమెరికా-ఇజ్రాయెల్ బాంబులు వేసి 148 మంది పసిప్రాణాలు తీసిన తర్వాత, కేవలం తొలిరోజు బాంబు దాడుల్లోనే 201 మంది పౌరులు మరణించి, 747 మంది తీవ్రంగా గాయపడిన తర్వాత(రెడ్ క్రెసెంట్ లెక్కల ప్రకారం), ఏ ఇరానియన్ పౌరుడు ఈ దాడులను తన ‘విముక్తి’ కోసం జరుగుతున్న పోరాటంగా భావిస్తాడు?
9 కోట్ల 20 లక్షల(92 మిలియన్లు) ఇరాన్ జనాభాలో 78 శాతం మంది నగరాల్లోనే నివసిస్తున్నారు. ఐసిస్‌ను అంతం చేస్తామనే పేరుతో ఇరాక్, సిరియాలలోని నగరాలను అమెరికా ఎలా శిథిలాల దిబ్బలుగా మార్చిందో, గాజాను ఎలా శ్మశానంగా మార్చిందో, ఇరాన్ నగరాలకు ఇప్పుడు అదే గతి పడుతోంది. బాంబులతో ప్రజాస్వామ్యాన్ని ఆకాశం నుంచి జారవిడవలేం.
ఆర్థిక యుద్ధం: పెట్టుబడిదారీ వ్యవస్థ నరాలపై ఇరాన్ దెబ్బ
అమెరికా నిఘా సంస్థలు సైతం ఇరాన్ వల్ల అమెరికాకు, ప్రపంచానికి ప్రత్యక్ష ముప్పు ఉందని ట్రంప్ చేస్తున్న వాదనను అంతర్గతంగా అపహాస్యం చేస్తున్నాయి.
అయినా సరే, ఇది “నాలుగు నుంచి ఐదు వారాల్లో ముగిసే ఆపరేషన్” అని, తనకు ఇది ఎంతమాత్రం “బోర్ కొట్టదనీ” ట్రంప్ తన వ్యాపారస్తుడి అహంకారంతో మాట్లాడుతున్నారు.
ఇరాన్ లొంగిపోయి, వెనిజులా తరహాలో అమెరికాకు సాగిలపడే కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన కలలు కంటున్నారు.
కానీ ఈ యుద్ధం రాజకీయ ఆర్థిక శాస్త్రం వేరు. నిస్సందేహంగా, అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఆపేంత శక్తి ఇరాన్‌కు లేదు.
వాళ్లు ప్రయోగించే చాలా క్షిపణులను సామ్రాజ్యవాద శక్తులు గాల్లోనే కూల్చేయగలవు. కానీ ఇరాన్ బలం దాని అసమాన యుద్ధ వ్యూహంలో ఉంది.
1973 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం, లేదా 2022 నాటి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరహాలో ఇది కూడా ప్రపంచ ఆర్డర్‌ను తలకిందులు చేసే అంతర్జాతీయ సంక్షోభంగా మారుతోంది.
‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి దిగ్బంధం
ఇరాన్ ఇప్పుడిక యుద్ధాన్ని గల్ఫ్ ప్రాంతానికి విస్తరించింది. ప్రపంచ చమురు, ద్రవ సహజ వాయువు ఎగుమతుల్లో ఐదో వంతు ప్రవహించే 21 మైళ్ల వెడల్పున్న అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిని ఇరాన్ వాస్తవికంగా దిగ్బంధించింది.
అటు ఇరాన్ మిత్రపక్షాలైన యెమెన్ హౌతీలు ఎర్ర సముద్రంలోకి వెళ్లే బాబ్ అల్-మండబ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించారు. దిగ్గజ చమురు ట్యాంకర్లు వెనక్కి మళ్లుతున్నాయి.
ఇన్సూరెన్స్ కంపెనీలు భయంతో రక్షణ కల్పించడానికి నిరాకరిస్తున్నాయి. విమానయాన సంస్థలు గల్ఫ్ దేశాలకు వేలాది విమానాలను రద్దు చేశాయి.
ఇంతటితో ఆగక, ఇరాన్ తనకు కేవలం 200 మైళ్ల దూరంలో ఉన్న సౌదీ అరేబియా, ఖతార్‌లపై గురిపెట్టింది. రోజుకు 5 లక్షల 50 వేల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న సౌదీకి చెందిన ‘రాస్ తనురా’ చమురు రిఫైనరీ మీద, ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ‘రాస్ లాఫాన్’ ఎల్ఎన్జీ కేంద్రం మీద డ్రోన్లతో దాడి చేసి వాటిని మూసివేసేలా చేసింది.
దీని ఫలితం? ఒక్కరోజులోనే యూరప్ గ్యాస్ ధరలు రెట్టింపయ్యాయి. మంగళవారం ఉదయానికే బ్రెంట్ క్రూడ్(ముడి చమురు) ధర 8 శాతం పెరిగి బ్యారెల్ 84 డాలర్లకు చేరుకుంది.
అమెరికా వల్ల బలి కానున్న మూడో ప్రపంచ దేశాలు..
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంధన అవసరాలనే సున్నితమైన నరాన్ని ఇరాన్ గట్టిగా నొక్కిపట్టింది. ఖమేనీ హత్య జరిగిన వెంటనే, ఇరాన్ సైనికాధికారి అలీ లారిజానీ చెప్పినట్లు, “అమెరికాలాగా కాకుండా, ఇరాన్ ఒక సుదీర్ఘ యుద్ధానికి సిద్ధపడింది.”
నాయకత్వాన్ని వికేంద్రీకరించి, ఎంతటి నష్టాన్నయినా తట్టుకుంటూ ఎదురుదాడి చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇక్కడ మనం సూటిగా వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల, తద్వారా రాబోయే భయంకరమైన ద్రవ్యోల్బణం భారాన్ని మోయాల్సింది ఎవరు?
వైట్ హౌస్‌లో కూర్చున్న ట్రంప్, టెల్ అవీవ్‌లోని నెతన్యాహూ కాదు. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ దేశాల్లో బతుకులీడుస్తున్న కోట్లాది మంది సామాన్య శ్రమజీవులు, దినసరి కూలీలు. సామ్రాజ్యవాద అహంకారానికి అంతిమంగా బలయ్యేది ఎప్పుడూ పేదలే.
మతపరమైన పునాదులు – వ్యవస్థ నిలకడ
ఇరాన్లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడిన షియా ఛాందస ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజల మద్దతు భారీగా పడిపోయిందన్నది వాస్తవం.
కానీ ఆ వ్యవస్థ అంత సులభంగా పేకమేడలా కూలిపోదు. ఈ రాజ్యాధికారం కేవలం వ్యక్తుల మీద కాదు, క్రీశ 680 నాటి కర్బలా యుద్ధంలో అమరులైన హుస్సేన్, అబ్బాస్‌ల ‘షహదత్'(అమరత్వం) చుట్టూ అల్లబడిన షియా మత విశ్వాసాల పునాది మీద, సైద్ధాంతిక క్యాడర్ మీద నిర్మితమైంది.
మరణించిన నాయకుల స్థానంలో వెంటనే బాధ్యతలు తీసుకునే ప్రత్యామ్నాయాలు వారికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికా చేసినవి భూతల యుద్ధాలు. అప్పుడు ఆ దేశాలలోని అమెరికా వ్యతిరేక తిరుగుబాటుదారులకు పాకిస్తాన్, సిరియా, లేదా స్వయంగా ఇరాన్‌లాంటి పొరుగు దేశాల మద్దతు ఉండేది.
కానీ ఇప్పుడు ఇరాన్‌కు అండగా నిలబడే దేశాలేవీ లేవు, ఇదొక వైమానిక యుద్ధం.
అయితే, ఇరాన్ పరోక్ష పారామిలటరీ దళాలు(లెబనాన్, ఇరాక్, యెమెన్‌లలోని సాయుధ షియా వర్గాలు) ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతిన్న మాట నిజమే అయినా, వారి చరిత్రను మర్చిపోలేము.
సామ్రాజ్యవాద దుర్మార్గం- శాంతి నిర్వచనం లొంగుబాటు..
1983లో బీరూట్‌లోని అమెరికా మెరైన్ బ్యారక్స్‌పై ఆత్మాహుతి దాడి చేసి ఏకంగా 241 మంది అమెరికా సైనికులను మట్టుబెట్టిన నెత్తుటి చరిత్ర వారిది. ఒకప్పుడు జార్జ్ బుష్ “సద్దాం హుస్సేన్‌ను గద్దె దించండి” అని ఇరాక్ ప్రజలకు పిలుపునిస్తే అక్కడ జరిగిన రక్తపాతం అంతాఇంతా కాదు.
ఇప్పుడు ఇరాన్లో అమెరికా ఒక సాయుధ తిరుగుబాటు దళాన్ని తయారు చేయాలన్నా దానికి ఎంతో సమయం, వనరులు పడుతుంది.
ముగింపు ఏమిటంటే, ఇరాన్ వ్యవస్థ లొంగిపోదు, కానీ శిథిలమవుతుంది. పశ్చిమాసియా ఇక సుదీర్ఘ కాలం పాటు అమెరికా-ఇజ్రాయెల్‌ల సంయుక్త నిరంకుశ పాలన కింద రక్తమోడుతూనే ఉంటుంది.
ట్రంప్ చెబుతున్నట్లు ఇది ‘శాంతి’ యుగం కాదు; “లొంగుబాటు”నే శాంతిగా నిర్వచించే సామ్రాజ్యవాద దుర్మార్గం.
తన దురంహంకారపు యుద్ధ ప్రణాళికలో ట్రంప్ బహుశా ఈ ప్రపంచ స్థాయి ఆర్థిక సంక్షోభాన్ని ఊహించి ఉండకపోవచ్చు, కానీ ఆ సంక్షోభం ఇప్పుడు అనివార్యంగా మన తలుపు తడుతోంది. ఇది కేవలం రెండు దేశాల ఘర్షణ కాదు, ఇది ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన వైరుధ్యాల విస్ఫోటనం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
