2026 ఫిబ్రవరి 14న జర్మనీ దేశంలోని మ్యూనిచ్ నగరంలో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రోమియో మాట్లాడుతూ కమ్యూనిజానికి వ్యతిరేకంగా విషం కక్కారు.
యూరప్ గతంలో అనుభవించిన వలస దేశాల పద్ధతిని తిరిగి పునర్నిర్మించాలని హిత బోధ చేశారు.
ఆ విధంగా ప్రపంచంపై పట్టు, ఏకచత్రాధిపత్యాన్ని నెలకొల్పాలని యూరప్‌ను ఉసిగొలిపారు. అందుకు అమెరికా, ప్రత్యేకంగా డోనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని; అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసి సోవిట్ యూనియన్‌తో పాటు తూర్పు యూరప్‌లోని పలు దేశాలు సోషలిస్టు వ్యవస్థలుగా రూపాంతరం చెందాయి.
1961లో (జర్మనీ) బెర్లిన్ గోడ నిర్మించబడింది.
అదొక అభ్యుదయకరమైనదని, ప్రపంచ దేశాలు ప్రజోపయోగ పథకాలు అమలు చేయాలనే భ్రమ, మాయకు యూరప్‌తో సహా పలు దేశాలులోనైనాయి.
జర్మనీ కమ్యూనిజం స్వేచ్ఛ ప్రపంచం మధ్య విభజనకు గురైంది. 1963లో క్యూబా అణు మిస్సైల్స్ విధ్వంసానికి పాల్పడింది.
నాడు(1963)లో ఇదే మ్యూనిచ్ నగరంలో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది.
సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలలోని సోషలిస్టు వ్యవస్థల పతనంతో అది ఒక పెద్ద విషాదమని, మోసపూరితమని రుజువయిందని రూబియో విరుచుకుపడ్డారు.
ఇప్పుడు ఆ పీడవిరగడైన తర్వాత మళ్లీ మ్యూనిచ్ నగరంలో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరుగుతున్నదని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అత్యంత ప్రమాదకర హెచ్చరిక..
అమెరికా విదేశాంగ మంత్రి చేసిన ఈ విషపూరిత రెచ్చగొట్టే ఉపన్యాసం జరిగిన నేపథ్యం కూడా మన గమనంలో ఉండాలి.
2026 నూతన సంవత్సర వేడుకలలో ప్రపంచ ప్రజలు నిమగ్నమై ఉన్న వేళ జనవరి 3న ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వెనిజులా అధ్యక్షుడిని తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, బంధించి అమెరికాకు తరలించారు.
తాజాగా ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశ నాయకుడు అయతుల్లా ఖమేనీని, అనేకమంది పౌరులను అమెరికా హతమార్చింది.
పాలస్తీనా దురాక్రమణతో మానవ మారణకాండను సృష్టించిన ఇజ్రాయిల్‌కు పూర్తి సహాయ సహకారాలు అమెరికా అందించింది.
పనామా కాలువ తమదని, గ్రీన్ ల్యాండ్ తమదని, కెనడా తమ దేశంలో అంతర్భాగమని పెచ్చరెల్లి మాట్లాడిన విషయం మనం చూశాం.
అమెరికా ఈ దురాగతాల చిట్ట చాంతాడంత ఉంది. ఇప్పుడు బహిరంగంగా యూరప్ దేశాలు, అమెరికా కలిసి మొత్తం ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని; అత్యంత కిరాతకమైన ఆకాంక్షను వెలిబుచ్చారు.
అమెరికా యూరప్‌లు కలిసి ప్రపంచంపై గుత్తాధిపత్యాన్ని సాధించకపోతే మరొక ప్రమాదం జరుగుతుందని పరోక్షంగా చైనాని ఉద్దేశించి మార్కో రుబియో ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
అంతేకాక ఐక్యరాజ్యసమితి శక్తి ఉండి చేతగానితనంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. గాజా, ఉక్రెయిన్, ఇరాన్‌లను ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు.
పై మూడు ఘటనలలో అమెరికా ప్రత్యేకంగా డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకొని పరిష్కరించినట్టు గొప్పగా చెప్పుకున్నారు.
నేడు ప్రపంచ మానవాళి, అందులో భాగంగా భారతదేశ పౌరులు మార్కో రూబియో ప్రసంగాన్ని తేలికగా పరిగణించకూడదు. అత్యంత ప్రమాదకర హెచ్చరికగా గుర్తించాలి.
ఇరాన్‌పై ఆమెరికా దాడి, ఆ దేశ నాయకుడు ఖమేనీ హత్యను నిరసిస్తూ భారీ సంఖ్యలో శ్రీనగర్‌లో జనం సమీకృతులైయ్యారు. దాన్ని సహించలేని కొందరు “బత్తాయిలు” అడ్డగోలు వ్యాఖ్యానాలతో సోషల్ మీడియాలో పెచ్చరిల్లి పోతున్నారు. ఈ బత్తాయిలకు అమెరికా ప్రమాదం అర్థం కాలేదా? లేక తాము కూడా అమెరికా, యూరప్ మాదిరిగానే ప్రయాణించాలనుకుంటున్నారా? అందుకేనా దేశంలో ప్రభుత్వాన్ని చిన్న విమర్శ/ సూచన చేసినా తట్టుకోలేక తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది?
రెండో ప్రపంచ యుద్ధంలో నియంత హిట్లర్‌ను ఓడించడమే కాక తూర్పు యూరప్‌లో కొన్ని దేశాలు సోషలిస్టు వ్యవస్థలుగా మార్పు చెందడానికి సోవియట్ యూనియన్ తోడ్పడింది.
అంతకుముందు ప్రపంచంలో వలస దేశాలుగానున్న అనేక దేశాలు రెండో ప్రపంచ యుద్ధానంతరమే స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి.
అందులో భాగమే భారతదేశానికి కూడా 1947లో స్వాతంత్రం సిద్ధించింది.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అమెరికా విచ్ఛిన్నకర, ప్రమాదకర పోకడలు, మార్కో రూబియో ప్రసంగం అన్నింటినీ కలిపి చూడాలి.
అప్పుడే నేడు ప్రపంచ మానవాళి ఎంతటి తీవ్ర ప్రమాదకర అంచులకు చేరుకుంటున్నది అర్థం చేసుకోగలం.
ప్రపంచంలోని పలు దేశాలలో అమెరికా జోక్యం, దాడులు; సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని పలు దేశాలను వలసలు చేసుకొని ఏ రకంగా దోపిడీ చేసింది- తర్వాత రెండవ, మూడవ భాగాలలో తెలుసుకుందాం.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్న హోటల్ బేరిషర్ హాఫ్‌లో 2026 ఫిబ్రవరి 14న ప్రసంగించారు.
మార్కో రుబియో ప్రసంగ పూర్తి పాఠం
అందరికీ ధన్యవాదాలు. ప్రపంచాన్ని రక్షించిన, మార్చిన ఒక చారిత్రాత్మక కూటమి సభ్యులుగా మనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము.
1963లో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైనప్పుడు, అది ఒక దేశంలో- నిజానికి ఒక ఖండంలో- తనలో తాను విడిపోయి ఉంది.
కమ్యూనిజం, స్వేచ్ఛ మధ్య సరిహద్దు రేఖ జర్మనీ గుండె గుండా సాగింది. బెర్లిన్ గోడ మొదటి ముళ్ల కంచెలు అప్పటికి కేవలం రెండు సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డాయి.
అంతేకాకుండా ఆ మొదటి కాన్ఫరెన్స్‌కు కేవలం కొన్ని నెలల ముందు, మన పూర్వీకులు ఇక్కడ మ్యూనిచ్‌లో మొదటిసారి సమావేశం కావడానికి ముందు, క్యూబా క్షిపణి సంక్షోభం ప్రపంచాన్ని అణు విధ్వంసం అంచుకు తీసుకువచ్చింది.
రెండవ ప్రపంచ యుద్ధం జ్ఞాపకాలు అమెరికన్లు, యూరోపియన్ల మనస్సులలో ఇంకా పచ్చిగానే ఉన్న సమయంలో- మనం ఒక కొత్త ప్రపంచ విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇది మానవ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత వినాశకరమైన, ఆఖరి విధ్వంసాన్ని కలిగించే సామర్థ్యం ఉన్నది.
ఆ మొదటి సమావేశం జరిగిన సమయంలో, సోవియట్ కమ్యూనిజం విస్తరిస్తోంది. వేల ఏళ్ల పాశ్చాత్య నాగరికత భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
ఆ సమయంలో, విజయం ఖాయమని ఎవరూ అనుకోలేదు. కానీ మనం ఒక ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగాము.
మనం దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నామనే దానివల్లే కాదు, మనం దేనికోసం పోరాడుతున్నామనే దానివల్ల కూడా మనం ఐక్యమయ్యాము.
మనం ఐరోపా, అమెరికా కలసి విజయం సాధించాము. ఒక ఖండం పునర్నిర్మించబడింది. మన ప్రజలు అభివృద్ధి చెందారు.
కాలక్రమేణా, తూర్పు- పశ్చిమ కూటములు మళ్ళీ ఏకమయ్యాయి. ఒక నాగరికత మళ్లీ సంపూర్ణంగా మారింది.
ఈ దేశాన్ని రెండుగా చీల్చిన ఆ అపఖ్యాతి పాలైన గోడ కూలిపోయింది. దాంతో పాటు ఒక దుష్ట సామ్రాజ్యం అంతమైంది, తూర్పు- పశ్చిమ దేశాలు మళ్లీ ఒకటి అయ్యాయి.
కానీ ఈ విజయం కలిగించిన ఉత్సాహం మమ్మల్ని ఒక ప్రమాదకరమైన భ్రమలోకి నెట్టింది: మనం “చరిత్ర ముగింపు” దశలోకి ప్రవేశించామని; ప్రతి దేశం ఇప్పుడు ఉదారవాద ప్రజాస్వామ్యంగా మారుతుందని, కేవలం వాణిజ్యం, వ్యాపార సంబంధాలు ఇప్పుడు దేశభక్తి స్థానాన్ని ఆక్రమిస్తాయని, జాతీయ ప్రయోజనాల స్థానంలో నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమం వస్తుందని, సరిహద్దులు లేని ప్రపంచంలో మనమందరం ప్రపంచ పౌరులమవుతామని మనం భ్రమపడ్డాము.
ఇది మానవ స్వభావాన్ని- 5,000 ఏళ్లకు పైగా ఉన్న మానవ చరిత్ర పాఠాలను విస్మరించిన ఒక తెలివితక్కువ ఆలోచన. దీనివల్ల మనం భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాము.
ఈ భ్రమలో, కొన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను రక్షించుకుంటూ, మన కంపెనీలను దెబ్బతీయడానికి తమ కంపెనీలకు సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ, మనం అదుపులేని స్వేచ్ఛా వాణిజ్యాన్ని గుడ్డిగా నమ్మాము. దీనివల్ల మన కర్మాగారాలు మూతపడ్డాయి, మన సమాజంలోని పెద్ద భాగాలు పారిశ్రామికీకరణను కోల్పోయాయి, లక్షలాది మధ్యతరగతి ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయాయి. మన కీలక సరఫరా గొలుసుల నియంత్రణను ప్రత్యర్థుల చేతుల్లో పెట్టాము.
అనేక దేశాలు తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని పక్కన పెట్టి భారీ సంక్షేమ పథకాలపై పెట్టుబడి పెడుతుంటే, మనం మన సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగించాము. ఇతర దేశాలు మానవ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా సైనిక శక్తిని పెంచుకుంటూ, తమ ప్రయోజనాల కోసం ఆ శక్తిని ఉపయోగించడానికి వెనుకాడడం లేదు.
ఒక పర్యావరణ పిచ్చిని (climate cult) తృప్తి పరచడానికి, మన ప్రత్యర్థులు చమురు, బొగ్గు- సహజ వాయువును వాడుకుంటూ అభివృద్ధి చెందుతుంటే; మనం మాత్రం మన ప్రజలను పేదరికంలోకి నెట్టే ఇంధన విధానాలను అమలు చేసుకున్నాము.
సరిహద్దులు లేని ప్రపంచం కోసం చేసే ప్రయత్నంలో, మనం సామూహిక వలసలకు తలుపులు తెరిచాము. ఇది మన సమాజాల ఐక్యతను, మన సంస్కృతిని, మన ప్రజల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది.
మనం ఈ తప్పులను కలిసి చేశాము, ఇప్పుడు కలిసి ఆ వాస్తవాలను గుర్తించి, పునర్నిర్మాణం వైపు ముందుకు సాగాల్సిన బాధ్యత మన ప్రజల పట్ల మనకు ఉంది.
అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరోసారి పునరుద్ధరణ, పునరుజ్జీవన బాధ్యతను చేపడుతుంది.
అవసరమైతే మేము దీనిని ఒంటరిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్న మా మిత్రదేశాలైన మీతో కలిసి దీనిని చేయాలని మేము ఆశిస్తున్నాము.
అమెరికా, ఐరోపా ఎప్పుడూ కలిసే ఉండాలి. అమెరికా 250 ఏళ్ల క్రితం స్థాపించబడింది. కానీ దాని మూలాలు చాలా కాలం క్రితమే ఈ ఖండంలో మొదలయ్యాయి. అమెరికాను నిర్మించిన వారు తమ పూర్వీకుల జ్ఞాపకాలను, సంప్రదాయాలను, క్రైస్తవ విశ్వాసాన్ని ఒక పవిత్ర వారసత్వంగా తమతో తెచ్చుకున్నారు.
మనం ఒకే పాశ్చాత్య నాగరికతలో భాగం. శతాబ్దాల ఉమ్మడి చరిత్ర, క్రైస్తవ విశ్వాసం, సంస్కృతి, భాష, మన పూర్వీకుల త్యాగాలతో మనం ఒకరికొకరు విడదీయలేని బంధంతో ముడిపడి ఉన్నాము.
అందుకే మేము అమెరికన్లము కొన్నిసార్లు నేరుగా, అత్యవసరంగా సలహాలు ఇస్తుంటాము. అందుకే అధ్యక్షుడు ట్రంప్ ఐరోపాలోని మా మిత్రుల నుంచి సీరియస్‌నెస్, పరస్పర సహకారాన్ని కోరుకుంటారు.
ఎందుకంటే మాకు మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళన ఉంది. మేము మీతో విభేదించినా, అది ఐరోపా పట్ల మాకున్న లోతైన శ్రద్ధ వల్లే జరుగుతుంది. మనం కేవలం ఆర్థికంగా, సైనికంగానే కాదు, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కూడా ముడిపడి ఉన్నాము.
ఐరోపా బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఐరోపా మనుగడ సాగించాలని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే గత శతాబ్దపు రెండు గొప్ప యుద్ధాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి – అంతిమంగా మన విధి మీతో ముడిపడి ఉంది. (చప్పట్లు)
ఈ సమావేశం ప్రధానంగా చర్చించే జాతీయ భద్రత అనేది కేవలం సాంకేతిక ప్రశ్నల సముదాయం మాత్రమే కాదు. మనం రక్షణ కోసం ఎంత ఖర్చు చేస్తున్నామనేది ముఖ్యమే, కానీ అది ప్రాథమిక ప్రశ్న కాదు.
అసలు మనం దేనిని రక్షిస్తున్నామనేదే ప్రాథమిక ప్రశ్న. ఎందుకంటే సైన్యాలు కేవలం సిద్ధాంతాల కోసం పోరాడవు. సైన్యాలు ప్రజల కోసం పోరాడతాయి.
సైన్యాలు దేశం కోసం పోరాడతాయి. సైన్యాలు ఒక జీవన విధానం కోసం పోరాడతాయి. మనం రక్షిస్తున్నది అదే- తన చరిత్ర పట్ల గర్వంగా, భవిష్యత్తు పట్ల నమ్మకంతో ఉన్న ఒక గొప్ప నాగరికతను.
ప్రపంచాన్ని మార్చిన స్వేచ్ఛా బీజాలు నాటిన ఆలోచనలు పుట్టింది ఇక్కడే ఐరోపాలోనే. చట్టబద్ధమైన పాలనను, విశ్వవిద్యాలయాలతోపాటు శాస్త్రీయ విప్లవాన్ని ప్రపంచానికి ఇచ్చింది ఈ ఐరోపా ఖండమే. మోజార్ట్, బీథోవెన్, డాంటే, షేక్స్పియర్, మైఖేలాంజెలో, డా విన్సీ, బీటిల్స్, రోలింగ్ స్టోన్స్వంటి మేధావులను అందించింది ఈ ఖండమే.
సిస్టీన్ చాపెల్, కొలోన్లోని గొప్ప కేథడ్రల్ శిఖరాలు కేవలం మన గత కాలపు గొప్పతనాన్ని లేదా దేవునిపై ఉన్న విశ్వాసాన్ని మాత్రమే చాటవు. అవి మన భవిష్యత్తులో మన కోసం వేచి ఉన్న అద్భుతాలను కూడా సూచిస్తాయి.
డీ-ఇండస్ట్రియలైజేషన్(పరిశ్రమలు కోల్పోవడం) అనేది అనివార్యం కాదు. అది మన దేశాల సంపదను, ఉత్పత్తి సామర్థ్యాన్ని, స్వతంత్రతను హరించిన ఒక చేజేతులా చేసుకున్న విధానం. కీలకమైన సరఫరా గొలుసులపై సార్వభౌమాధికారాన్ని కోల్పోవడం అనేది ఒక తెలివితక్కువ పని. ఇది మన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడేలా చేసింది. సంక్షోభ సమయాల్లో మనల్ని ప్రమాదంలో పడేసింది.
సామూహిక వలసలు అనేవి ఏదో చిన్న విషయం కాదు. ఇది పాశ్చాత్య దేశాలన్నింటినీ అస్థిరపరుస్తున్న ఒక సంక్షోభం.
మనం కలిసి మన ఆర్థిక వ్యవస్థలను మళ్ళీ పారిశ్రామికీకరించవచ్చు. ఈ కొత్త కూటమి కేవలం సైనిక సహకారంపైనే కాకుండా, పరస్పర ప్రయోజనాలు, నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. అంతరిక్ష ప్రయాణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి రంగాలలో మనం కలిసి పని చేయాలి.
అలాగే, మనం మన జాతీయ సరిహద్దులపై నియంత్రణ సాధించాలి. మన దేశాల్లోకి ఎవరు రావాలి, ఎంతమంది రావాలని నిర్ణయించుకోవడం ద్వేషం కాదు.
అది జాతీయ సార్వభౌమాధికారానికి సంబంధించిన ప్రాథమిక చర్య.
చివరగా, మనం ఇకపై మన ప్రజల- దేశాల ప్రయోజనాల కంటే “ప్రపంచ క్రమాన్ని” ఎక్కువగా చూడలేము.
మనం నిర్మించిన అంతర్జాతీయ సంస్థలను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం లేదు, కానీ వాటిని సంస్కరించాలి.
ఉదాహరణకు, ఐక్యరాజ్యసమితికి ఇప్పటికీ మంచి చేసే సామర్థ్యం ఉంది.
కానీ అత్యంత ముఖ్యమైన విషయాల్లో అది ఎటువంటి పాత్ర పోషించలేకపోతోందనే వాస్తవాన్ని మనం విస్మరించలేము.
అది గాజా యుద్ధాన్ని పరిష్కరించలేకపోయింది. అమెరికా నాయకత్వమే బందీలను విడిపించింది. అది ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించలేదు.
చర్చల కోసం ఇరుపక్షాలను ఒప్పించడానికి అమెరికా నాయకత్వమే అవసరమైంది. టెహ్రాన్‌లోని తీవ్రవాద పాలకుల అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో అది విఫలమైంది.
వెనిజులాలోని మాదకద్రవ్య ఉగ్రవాద నియంతను పట్టుకోవడంలోనూ అది విఫలమైంది. ఒక పరిపూర్ణమైన ప్రపంచంలో ఇవన్నీ చర్చల ద్వారా పరిష్కారం కావచ్చు.
కానీ మనం అటువంటి ప్రపంచంలో లేము. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే వారు వాటి వెనుక దాక్కోవడానికి మనం అనుమతించలేము.
అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ఎంచుకున్న మార్గం ఇదే. ఐరోపాలోని మీరు కూడా మాతో కలిసి ఈ మార్గంలో నడవాలని మేము కోరుకుంటున్నాము.
గత ఐదు శతాబ్దాలుగా, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు, పశ్చిమ దేశాలు విస్తరిస్తూనే ఉన్నాయి.
కానీ 1945లో, కొలంబస్ కాలం తర్వాత మొదటిసారిగా, అవి కుంచించుకుపోవడం ప్రారంభించాయి. ఐరోపా శిథిలావస్థలో ఉంది. సగం ఐరోపా “ఐరన్ కర్టెన్” వెనుక ఉంది.
ఇటువంటి నేపథ్యంలో, అప్పుడు- ఇప్పుడు కూడా, చాలామంది పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ముగిసిందని నమ్ముతున్నారు.
కానీ కలిసి, మన పూర్వీకుల ఆశయంతో ముందుకు కదిలి వాళ్ల నమ్మకాలను వమ్ము చేద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
