చెట్టు కొమ్మలోని ఒక పచ్చని ఆకు మీదుగా కిందకు వాలుతూ సూర్య కిరణం తలపై దాల్చి కిరీటధర రాజులా మెరుస్తాను!
చెరువు మధ్యన బురదలో వెలిసిన తామరాకుపై అటూఇటూ కదులుతూ నిశ్చలతత్వాన్ని బోధిస్తాను!
బొట్లు బొట్లుగా చూరుపై నుంచి జారుతూ ఇంటి లోపలి వారికి నా తల్లి ‘వాన’ ప్రయాణ స్థితిగతిని తెలియపరుస్తాను!
నా తాకిడితో ఇబ్బంది పడుతున్న గూడులేని అభాగ్యులకు సాయం అందించాలనే ఆలోచనను కొద్దిపాటి ఆపన్న హస్తాలకైనా కలుగజేస్తాను!
నిండుగా గొడుగు పట్టుకున్నా పక్క నుంచి కొద్దికొద్దిగా తడుపుతూ పేదల చిరుగు బతుకుల బాధలను కొంతైనా సహానుభూతి చెందిస్తాను!
అప్పటిదాకా బాహ్య లోకాన్ని ఆనందభాష్పాలుగా మభ్యపెడుతున్న బాధాతప్త హృదయపు భారశోకాన్ని బయట పడకుండా నా తడి చేతులతో మమేకం చేయిస్తాను!
ప్రపంచంలోని బాధాగ్రస్త హృదయ శోకపు క్షారతను కలుపుకొని, వడివడిగా కదిలి, చిన్ని కాలువలుగా, పెద్ద వాగులుగా, భారీ నదులుగా, బ్రహ్మాండ సముద్రముగా రూపాంతరం చెందుతూ.. ఆ ఉప్పదనాన్ని విశ్వమంతటా పరివ్యాప్తం చేస్తాను!!
పునర్భ్రమణ కాలగతులను శిరసావహిస్తూ మళ్ళీమళ్ళీ ఈ భువిపైనే జారుతూ చలన చైతన్యాన్ని రగిలిస్తాను!!!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
