ఢిల్లీలోని మాన్ సింగ్ రోడ్లో ఇండియా గేట్ ముందు కొందరు నిరసనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు ఏం కోరుకుంటున్నారు? రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్న కాలుష్యం నుంచి తమను కాపాడమని ప్రాధేయపడటమే ఈ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్న కోరిక. సారాంశంగా చెప్పాలంటే “మమ్మల్ని ఆరోగ్యంగా బ్రతకనీయండి” అని మాత్రమే కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
శాంతియుతంగా జరుగుతున్న నిరసనపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడటంతో నిరసనకారుల గొంతులు పిక్కటిల్లాయి. కాలుష్యంతో కమ్మేసిన ఢిల్లీ గగన వీధుల్లో నినాదాలు మార్మోగాయి. పోలీసులు నిరసనకారుపై చొచ్చుకు వచ్చే కొద్దీ నిరసనకారులు బారికేడ్లను చీల్చుకుంటూ ముందుకు వెళ్లారు. కొంతమంది నిరసనకారులపై పోలీసులు మిరియాల స్ప్రే కూడా ప్రయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి బదులుగా నిరసనకారులే పోలీసుల కళ్ళల్లో కారం చల్లారని విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని పోలీసు యంత్రాంగం ఆరోపించింది.
ఢిల్లీలో ఆహ్లాదకరంగా ఉండాల్సిన శీతాకాలం కాలుష్య భరితం కావటం- నానాటికీ కాలుష్యం పెరుగుతూ ఉండటంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అర్ధవంతమైన చర్యలు తీసుకోవాలన్నది నిరసనకారుల విజ్ఞప్తి. వాయు కాలుష్యం 400 పాయింట్లు దాటి పోవడం పరిస్థితి ప్రమాదకర స్వభావానికి నిదర్శనం.
నిరసకారులు నిరసన ప్రదేశాన్ని ఖాళీ చేయటానికి నిరాకరించటంతో అంబులెన్స్వంటి కీలకమైన సేవలకు అంతరాయం కలుగుతోందన్నది ప్రభుత్వ వాదన. ముగ్గురు నలుగురు పోలీసు ఉన్నతాధికారులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో పోలీసులు 17మంది నిరసనకారులను అరెస్ట్ చేసి భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిరసకారులను పోలీసు రిమాండ్‌కు పంపాలన్న పోలీసు అధికారుల విజ్ఞప్తికి అనుగుణంగా ఈ 17 మందిని జ్యూడియల్ కస్టడీకి తరలించారు.
పోలీసులపై మిరియాల రసం ప్రయోగించటం ఇటువంటి నిరసనల్లో ఇదే మొదటిసారని పోలీసులు చెప్పారు.
కర్తవ్య పథ్ పోలీసు స్టేషన్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించటంవంటి అభియోగాలు మోపగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషనులో దాఖలయిన కేసులో దేశద్రోహం వంటి అభియోగాలు కూడా చేర్చారు.
ఢిల్లీ పోలీసులు నిరసన వ్యక్తం చేయటానికి ముందు అంగీకరించి అనుమతి ఇచ్చారని; తర్వాత హిడ్మా, చారువంటి వాళ్ళ పేర్లతో కూడిన నినాదాలు వినగానే బహిరంగంగా అణచివేతకు పాల్పడ్డారని వివిధ కథనాలు తెలియజేశాయి.
నిరసనలో పాల్గొన్న 18 ఏళ్ల అమ్మాయి తనకు జీవితంలో ఇలాంటి నిరసనల్లో పాల్గొనటం ఇదే మొదటి సారని ఈ భయాందోళనల నుంచి బయటపడటానికి తనకు చాలా సమయం పట్టేలా ఉందని ది వైర్‌తో చెప్పింది. “ముందు మమ్ములను వేరు చేయటం మొదలు పెట్టారు. మొదట్లో మగ పోలీసులు పురుషులైన నిరసనకారులను లాకెళ్ళటం, ఆడ పోలీసులు మహిళా నిరసనకారులను లాకెళ్ళటం మొదలు పెట్టారు. తర్వాతా మగ పోలీసులు స్త్రీలను కూడా లాకెళ్లారు” అని ఈ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
మరో నిరసనకారుడి కాళ్ళ నిండా రక్తపు చారలు ఉన్నాయి. రోడ్డు మీద పడేసి లాకెళ్ళటంతో ఏర్పడిన గాయాలు అవి. ‘మేమేమైనా చట్టవిరుద్ధమైన విషయాలను అడిగామా? అసాధ్యమైనది ఏమైనా చేయమని అడిగామా? కనీసం సరిగ్గా బతకటానికి అవకాశం ఇవ్వండని అడుగుతున్నాము. అయినా సరే అదేదో మేము ప్రభుత్వాన్ని కూలదోయటానికి నినాదాలిస్తున్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
“స్వచ్ఛమైన గాలి పీల్చుకోవటం కోసం ఆందోళన చేసిన మా మిత్రులు కొందరు జ్యూడిషయల్ కస్టడీలో ఉండటం చూసి మా తల్లి తండ్రులూ షాక్‌కు గురయ్యారు” అని పేర్కొన్నారు.
ఇండియా గేట్ వద్ద పోలీసుల ప్రవర్తనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. స్వచ్ఛమైన గాలి కోరటం కూడా దేశంలో నేరం అయ్యిందాని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “పోలీసుల చర్యలు గమనిస్తే ఈ ప్రభుత్వం ఎంత అసహనంతో ఉన్నదో అర్ధమవుతోంది. ప్రజాస్వామిక నిరసలను కూడా సహించే స్థితిలో లేదు. స్వచ్ఛమైన గాలి ప్రజలు జీవించే హక్కుల్లో ఒకటి. ఆ హక్కు డిమాండ్ చేసినందుకు ప్రజలను ప్రభుత్వం నేరస్తులుగా పరిగణించటం సరైనది కాదు” అన్నారు.
పిల్లలు ఊపిరి పీల్చుకోవటానికి కష్టపడుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. శివసేన నేత ఆదిత్యథాక్రే కొన్ని వీడియోలు పోస్ట్ చేసి పర్యావరణం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై అల్లర్లను అణచివేసే సాయుధ బలగాలను ప్రయోగించటం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకుంటున్న మన దేశ ప్రతిష్టకు తగని పనని వ్యాఖ్యానించారు.
స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కును అడిగిన పౌరులు అరెస్టయ్యారన్నారు.
కాలుష్య నివారణా సంస్థలు వాయు కాలుష్యానికి సంబంధించిన గణాంకాలు తారుమారు చేశాయని మాజీ ఆప్ మంత్రి భరద్వాజ్ విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనకు ఈ నిరసనలు నిదర్శనమని అయన అన్నారు. ప్రభుత్వ సంస్థలే తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసగిస్తున్నపుడు నిరసనవ్యక్తం చేయటం తప్పదని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రాథమిక హక్కని, ప్రజలు తమ ప్రాథమిక హక్కులను ఉపయోగించుకుంటున్నపుడు పోలీసుల బలప్రయోగంతో దాన్ని అడ్డుకోవడం సరైన స్పందన కాదని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. సీపీఐ(ఎంఎల్)తో సహా అన్ని వామపక్ష పార్టీలు కాలుష్యాన్ని నియంత్రించాలని, ప్రజలను కాదని డిమాండ్ చేశాయి.
పోలీసుల కర్కశత్వము, నిరసనకారులు పోలీసు కస్టడీకి పంపడంవంటి చర్యలను పౌర సమాజం ఖండించింది. ప్రభుత్వ స్పందన గమనిస్తే కనీస శాంతియుత నిరసనలకు కూడా అవకాశం లేదన్న విషయం తేటతెల్లమవుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
సాధారణ నిరసనలను ప్రజల ఆగ్రహావేశాలుగా పరిగణించటానికి బదులు పోలీసులు కేసులు నమోదు చేయటం, కాలుష్య నివారణవంటి డిమాండ్లతో జరిగే ఆందోళనలను కూడా శాంతి భద్రతల సమస్యగా పరిగణించటం సాధారణ వ్యవహారంగా మారింది.
పోలీసుల ప్రవర్తనను గమనించిన వీక్షకులు దేశ రాజధానిలో పౌర హక్కుల పట్ల ప్రభుత్వ వైఖరి గురించి ఓ అవగాహన కలుగుతుంది.
ఢిల్లీ మరో శీతాకాలంలో గుక్క తిప్పుకోలేనంత స్థాయిలో కాలుష్య సమస్యను ఎదుర్కొంటోంది. నిరసన కారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటనే విషయాన్నీ స్పష్టం చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే మార్గాలు ఏమిటో తెలీని పరిస్థితి నెలకొన్నది.
ప్రభుత్వ ప్రకటనలు కోర్టు ప్రకటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను దేశం గమనిస్తోంది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
