
కశ్మీర్‌పై రాసిన 25 పుస్తకాలను భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 98 కింద నిషేధించడానికి ముందు, ఆ రాష్ట్ర హోంశాఖలో ఎవరో ఒకరు నెలల తరబడి ఆ పుస్తకాలను చదివి ఉంటారు. ఈ పుస్తకాలను చదవడానికి ఇంత శ్రమ తీసుకున్నారంటే, నిజంగానే ఆ వ్యక్తి ఈ ప్రాంతంలోని అధికార యంత్రాంగంలో విద్యావంతుడై ఉండాలి.
దర్యాప్తు సంస్ధలు- ఇంటలీజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ పుస్తకాలను నిషేధిస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారులు నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు.
యువత హింసాత్మక కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఆకర్షితులు కావడానికి ఈ సాహిత్యం ప్రేరేపిస్తుందని ప్రకటనలో ఆరోపించారు. అంతేకాకుండా, చరిత్రగా లేదా రాజకీయ వాఖ్యానంగా అసత్యాలతో కూడిన సాహిత్యాన్ని పేర్కొంటున్నారని తెలియజేశారు. వాస్తవానికి విరుద్ధంగా యువతను తప్పుదొవ పట్టిస్తూ, ఉగ్రవాదాన్ని గొప్పగా చిత్రీకరిస్తూ రాజ్యం పట్ల హింసను ప్రేరేపించే విధంగా ఈ సాహిత్యం ఉందని నోటిఫికేషన్లో చెప్పుకొచ్చారు.
“యువతపై ఈ పుస్తకాలు మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి, ఉగ్రవాదులను కథనాయకులుగా మార్చే సంస్కృతిని ప్రేరేపిస్తుంది” అని నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం వాదిస్తుంది.
ఈ నోటిఫికేషన్‌ను చదివినప్పుడు అసలు ఏ ఆధారం మీద దర్యాప్తు చేశారనే సందేహం వస్తుంది. ప్రస్తుత నిషేధిత పుస్తకాలకు హింసకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. నిషేధానికి గురైన పుస్తకాలలో నేను రాసిన పుస్తకం కూడా ఒకటి ఉంది- ఏ డిస్మాంటెల్డ్ స్టేట్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ 370. ఈ పుస్తకంలో ఎలాంటి అభ్యంతరకరమైన పదజాలాలు, పేజీలు- పేరాలు వారు కనుగొన్నారు? వారు మతిస్థిమితం కోల్పోయి ఉంటారు. లేదా తమ అభిప్రాయాలను అత్యంత రహస్యంగా దాచి పెట్టి ఉంటారు.
రాసిన వాటిలో హింస- ఉగ్రవాదానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను కనుగొన్నారు?
తాము తుపాకి పట్టక ముందు, హింసకు పాల్పడక ముందు విచారణ సందర్బంగా “తప్పుదోవ పట్టిన” యువత ఈ పుస్తకాలను చదివామని చెప్పారా?
లేదా హోంశాఖలో ఎవరో ఒకరు లేక కొందరు వ్యక్తులతో ఎర్పడిన కమిటీ పాఠకులుగా మారి పుస్తకాల్లోని రాతల్లో దేశద్రోహం, ఉగ్రవాదం, హింసను బోధించే మార్మిక పదజాలాన్ని కనుగొన్నారా?
ముఖ్యమైన విషయం ఏంటంటే, తప్పుడు కథనాలు రాస్తూ దేశ వ్యతిరేకంగా ప్రచారాన్ని సాగిస్తున్నారని జమ్మూ కశ్మీర్ పాలన యంత్రాంగం ప్రకటించింది. యంత్రాంగంలో ఎవరైనా ఒకరు అసలు ఈ పుస్తకాల్లోంచి ఏదైన ఒక పుస్తకం చదివారా?
ఒకవేళ చదివితే, వాటిలో ఉన్న మేధా సంపత్తిని తెలుసుకుంటే, వాటిని తొక్కిపెట్టకుండా ఆ పుస్తకాలు ఎంతటి విజ్ఞానాన్ని సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాయో తెలిసి వచ్చేది. అంతేకాకుండా, ఈ పుస్తకాలు భారతదేశంలో అందుబాటులో లేవని, ఎక్కువ ధరల్లో విదేశాలలో లభ్యం అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకునేవారు.
కొంతమంది నిరక్ష్యరాసులైన సలహాదారుల సూచన మేరకు, ఏదో తాము ఏఐతో పరిశోధనలు చేసి అధారాలను సాధించామన్నట్లు సంబర పడిపోయి, కేవలం తమ ఇష్టాల మేరకు ఊహించుకుంటూ, అనాలోచిత అధికారులు కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకున్నట్టు అర్థమవుతోంది.
అసలు ఇంత అవసరం ఎందుకు వచ్చింది? నిరంకుశ ఆధిపత్యానికి సంబంధించి, ఒక పాత హాస్య కథ గుర్తొస్తుంది. ఒక రాజ్యంలో మూడు జైలు గదులు ఉండేవి, ఓ ముగ్గురు నిందితులను అందులో బంధించారు. ఆ విధంగా, ఎవరో ఒక ఉన్నతాధికారి ఈ “25 పుస్తకాలను నిషేధించా”లని నిర్ణయించాడు. దీంతో జాబితాను అందజేయడంలో ఆయన కింది స్థాయి అధికారులు తలమునకలైయ్యారా?
నా పుస్తకంతో పాటు మిగిత పుస్తకాలు వాస్తవాలతో రాజ్యానికి సంబంధించిన అసత్య సమాచారానికి సవాల్ విసిరాయి. దీంతో ప్రభుత్వం ఇబ్బందికి గురవుతోంది. అందుకే, కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి, చారిత్రక పరిశోధన- రాజకీయ విశ్లేషణ ద్వారా సేకరించిన విజ్ఞానాన్ని నేరంగా పరిగణిస్తూ రాత్రికి రాత్రి ఒక అధికారి కలం పోటుతో కొట్టిపారేశారు.
కొంతమంది అధికారుల సున్నిత మనస్తత్వానికి, లేదా ఇప్పటికే అనేక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఊహలకు ఈ పుస్తకాలు సరిపడటంలేదు. లోకాన్ని తన దృష్టికోణంతో చూస్తున్న ప్రభుత్వం, కొత్త పదాన్ని లేదా ఆలోచనను సహించే పరిస్థితిలేదు.
ప్రస్తుత నిషేధం భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా కశ్మీర్లో అనుసరిస్తున్న అణిచివేత ధోరణికి ప్రతిబింబంగా ఉంది. అదే సమయంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా- రాష్ట్ర హోదా రద్దు ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, శ్రీనగర్‌లో “చినార్బుక్ ఫెస్టివల్”ను నిర్వహించారు. కశ్మీర్లో శాంతి, ప్రగతి, అభివృద్ధిని తీసుకొచ్చామని ఈ ఫెస్టివల్లో పాలనా యంత్రాంగం తనకు తాను కితాబిచ్చుకుంది.
అంతా బాగుంటే, మరి పుస్తకాలను నిషేధించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సం సందర్భంగా ప్రభుత్వ యాంత్రాంగం నిఘా, నియంత్రణను కొత్త స్థాయికి తీసుకెళ్లడానికా?
గత ఆరు సంవత్సరాలుగా జర్నలిస్టులు, వార్తాపత్రికల నోరును పాలనా యంత్రాంగం మూయించింది. అంతేకాకుండా ఆర్కీవ్లను (పురాతన సమాచార కేంద్రాలను) మాయం చేసింది. ఇప్పుడు కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వాదిస్తుంది. పుస్తకాలను నిషేధించి జమ్మూకశ్మీర్‌లో ఎవరు అధిపతులో ప్రజలకు గుర్తు చేస్తూ, ఆ ప్రాంతంలో భయంతో కూడిన అణిచివేత వాతావరణాన్ని కొనసాగించడానికి ఇదో కొత్త పద్దతి.
ఈ పుస్తకాలు నేరమయమైనవని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. కానీ అది నిజమని నిరూపించడానికి కావల్సిన బలమైన సాక్ష్యం వారి వద్ద లేదు.
అయితే, నిషేధించిన పుస్తకాల జాబితాను ఎలా తయారు చేశారనే దానికి గల ఉద్దేశ్యాలు, కారణాలు ఉహించుకోవచ్చు. దీని దీర్ఘకాలిక దుష్ప్రభావాన్ని చూడటం అంత కష్టమేమీ కాదు.
నిషేధించిన పుస్తకాలపై రకరకాల ప్రస్తావనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ పుస్తకాల పట్ల మార్కెట్లో బాగా డిమాండ్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయ ప్రభావం కనిపిస్తుంది. తమ పఠన జాబితాలో ముఖ్యమైన సాహిత్యాన్ని, విజ్ఞాన సమాచారాన్ని చేర్చుకోవాలనుకునే పుస్తక ప్రేమికులు, యువ స్కాలర్లపై తీవ్ర ప్రభావం పడుతుంది.
నిషేధం తర్వాత కశ్మీర్లో పుస్తక దుకాణాలపై దాడులను గమనిస్తే, కేవలం నిషేధించిన పుస్తకాలే కాదు. కశ్మీర్లో మొత్తం దుకాణాలే మూగబోయాయి.
దాడులు, అణిచివేత ఈ ప్రాంతంలో ప్రతిరోజు సర్వసాధారణం. పుస్తకాల నిషేధాన్ని ఆయుధంగా మల్చుకొని, లిఖితపూర్వకంగా దేశ ద్రోహం అనే పదాలను కనుగొనేందుకు ప్రజలను మరింతగా వేధింపులకు గురిచేస్తారని, కార్యాలయాలు, ఇళ్లపై దాడులు, పరికరాలను ధ్వంసం చేస్తారని ఉహించుకోవడం అంత కష్టమేమీ కాదు.
ఈ పరిస్థితిలో, ప్రచురణకర్తలు పుస్తకాలను ప్రచురించే విషయంలో పునరాలోచించవచ్చు. దాని వల్ల ప్రత్యేకంగా కశ్మీర్‌పై బయట నుంచి కూడా భవిష్యత్తు స్కాలర్లు, రచయితలు, పరిశోధకులు ముఖ్యంగా యువకుల కీలక ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడంపై తీవ్రమైన చెడు ప్రభావం ఏర్పడగలదు.
ఇప్పటికైనా ఆపేస్తారాని, నా స్నేహితులు- పరిచయస్తులు అనేక మంది నన్ను అడిగారు. వారందరికి ఈ వ్యాసమే నా సమాధానం. అయితే, ప్రస్తుతం మరింత ఎక్కువగా రాసే అవసరం ఉంది.
అనువాదం: జీ రాజు
(కశ్మీర్ టైమ్స్ పత్రికకు వ్యాస రచయిత అనురాధ బాసిన్ ఎక్జిక్యూటివ్ ఎడిటర్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.