ప్రపంచీకరణ పురోగమన, తిరోగమన రెండు పరిణామాలను ఆధునిక ప్రపంచం అనుభవిస్తున్నది. మనకంటే ముందే నగరీకరణను ప్రోత్సహించిన దేశాలు, ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు అల్లాడిపోతున్నాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు మూలాధారమవుతున్న సేవారంగం, టూరిజం- వీటి కారణంగా ఆయా దేశాలు త్వరతగతిన అభివృద్ధి చెందిన మాట వాస్తవం.
1960- 90 వరకు టూరిజం ఎకానమీని ప్రోత్సహించిన దేశాలు ఇప్పుడు కొత్త పల్లవిని ఎత్తుకున్నాయి. తమ దేశానికి టూరిస్టులు ఎవరూ రాకూడదని వేడుకొంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే పర్యాటకులు ఎవరూ తమ దేశానికి రావొద్దని బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్ అస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్ తదితర దేశాల ప్రజలు అంటున్నారు. కొన్ని దేశాలలో ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన వ్యక్తమైంది. సుస్థిరమైన ఉపాధి, ఉద్యోగ కల్పనల గురించి లోతైన అధ్యయనం లోపించిన కారణంగానే ఈ తరహా ఇబ్బందులు వస్తున్నాయనేది కొందరి బాధ. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నగరాల అభివృద్ధి జరిగింది. వాటినే అభివృద్ధి కేంద్రాలుగా ఆయా ప్రభుత్వాలు భావించాయి.
ఆయా దేశాలు టూరిజాన్ని ప్రోత్సహించాయి, ఇప్పుడు వద్దంటున్నాయి. ఎందుకు? కాస్త లోతుల్లోకి వెళ్తే కారణాలేంటో తెలుస్తాయి.
భారీ సంఖ్యలో పర్యాటకులకు ఆయా ప్రాంతాలకు వెళ్తున్న కారణంగా అక్కడి ప్రజల జీవన విధానం మీద తీవ్ర ప్రభావం పడుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం నగరాలకు వెళ్లే వారికి అద్దె ఇళ్లు దొరకడం గగనమై పోతున్నదటా!
ఉనికే ప్రశ్నార్థకమవుతున్న వేళ
అంతేకాదు పర్యాటకుల రద్దీ కారణంగా, వెలుగు జిలుగుల ఎకానమీ వల్ల జీవనవ్యాయాలు పెరుగుతున్నాయని ఆయా దేశాల ప్రజలు లబోదిబోమంటున్నారు. తమ దేశానికే రావద్దని కొందరంటే, తమ వీధుల్లోకి రాకూడదని మరికొందరు ఆంక్షలు విధించారు. సాంస్కృతికంగా తమ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని మరికొన్ని దేశాల ప్రజలంటున్నారు.
ఒకే దగ్గర రద్దీ ఎక్కువ కావడం వలన చాలా రకాలు సమస్యలు వస్తూ ఉంటాయి. రద్దీకి తగిన విధంగా ప్రయాణ, భోజన, వసతి ఇతర సౌకర్యాల కల్పన సవాలుగా మారుతోంది. టూరిజాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల ప్రధాన సమస్య కూడా ఇదే.
మన దేశంలోనూ నగరీకరణను చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయి.
రద్దీ కారణంగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు ఢిల్లీ పరిసర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలస వెళ్లడంతోపాటు- వివిధ దేశాల పర్యాటకుల తాకిడి వల్ల జీవనవ్యయం, కాలుష్యం పెరిగిపోయాయి.
ఐటీ రంగం బలంగా విస్తరిస్తున్న నగరాలలో బెంగళూరు, చైన్నై, హైద్రాబాద్ తదితరాలున్నాయి. ఇక్కడ ఇప్పటికే జీవన వ్యయం భరించరానిదిగా ఉంది. 1996- 97 నుంచి 2006- 07 మధ్య కాలంలోనే హైదరాబాద్ జనాభా ఇంచుమించు కోటికి చేరుకున్నది. 2025 నాటికి హెచ్ఎండీఏ పరిధిలో నగర జనాభా కోటి డైబ్భై లక్షలని ఒక అంచనా. ఇంతమందికి మౌలిక సదుపాయాల కల్పనకు ఎదురవుతున్న సవాళ్లేమిటో ఇప్పుడు మనందరి అనుభవంలో ఉన్నదే.
పునాది నుంచి నిర్మాణం వరకు
1991లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో చారిత్రక నగరం హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు తొలి అడుగులు పడ్డాయి. దీనిని మొదట్లో “రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్” అని పిలిచేవారు. 1991లోనే దీనికి శంకుస్థాపన జరిగింది.
ఆ తర్వాత 1998లో హైటెక్ సిటీ అని పేరు మార్చారు. నగరాన్ని హైద్రాబాద్, సికింద్రాబాద్, సైబరాబాదని మూడు నగరాలుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్గీకరించారు. అతికొద్ది కాలంలోనే హైటిక్సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరిగాయి. అది ఒక గ్రోత్ సెంటర్‌గా మారింది.
ఐటీ రంగం విస్తరణ తర్వాత ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ కంపెనీలు సైతం హైదరాబాద్‌కు వచ్చాయి.
ఈ సందర్భంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతూ సమాజం ముందుకు తెచ్చింది. కొందరి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల భూములను తక్కువధరకు తీసుకుంటున్నారని, వారిని వాచ్మెన్లుగా మార్చారని విమర్శలు వెల్లువెత్తాయి.
విదేశీయులు చంద్రబాబు ఆర్థిక నమూనాపై పరిశోధనా పత్రాలను సమర్పించారు. చంద్రబాబుది- ఏకపక్ష, కొందరి ప్రయోజనాల కోసం చేసిన అభివృద్ధి నమూనాని అన్నారు. ఆమేరకు తెలుగు దేశంపైన, ఆయన పాలనపైన, తెలంగాణ ఉద్యమం ఉధృతమవ్వడంపైన ఈ చర్చల ప్రభావం బలంగా ఉన్నది.
మరో ఎత్తుకు నగరాభివృద్ధి
2014 తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి మరో స్థాయికి వెళ్లింది. అప్పటికే ఉన్న మూడు నగరాలతో పాటు(హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్)తో పాటు ఫైనాన్షియల్ డిస్టిక్ భారీ ఎత్తున వలసలను ఆకర్షించేలా చేసింది హైదరాబాద్.
ఇందులో ప్రధాన ప్రాంతాలు: నానక్‌రామ్‌గూడ, గౌలిదొడ్డి, ఐఎస్బీ రోడ్; సమీప ప్రాంతాలు: కోకాపేట, ఖజాగూడ, వట్టినాగులపల్లి, నార్సింగి; ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కొన్ని ప్రముఖ ల్యాండ్‌మార్క్‌లు: వేవ్‌రాక్ SEZ, అమెజాన్ క్యాంపస్, మైక్రోసాఫ్ట్- గూగుల్ ఆఫీసులు, కాంటినెంటల్ హాస్పిటల్, యూఎస్ కాన్సులేట్- ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఊహకందనంత ఎత్తుకు రియలెస్టేట్ పెరిగింది. వెరసి ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్ చేరిపోయింది.
సగటుజీవి సంపాదన ఇంటి రెంటుకు, తిండికే సరిపోతున్నది. జీవనవ్యయం భారీగా పెరగడం వల్లన ప్రజల పొదుపు స్థాయి పడి పోతున్నది. రూరల్ తెలంగాణ నుంచి నగరానికి వచ్చి ఉపాధి వెతుక్కునే వారికి అడ్డాలపైన కూడా జాగాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ప్రస్తుత హైదరాబాద్ నగర అభివృద్ధి జీవన చిత్రణ.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయిన తర్వాత నుంచి ఫోర్త్ సిటీ, నైట్ ఎకానమీ అంటున్నారు. ఒకవేళ ఫోర్త్ సిటీ కల నిజం కావడానికి సమయం తీసుకున్న ఇప్పటికే పెరిగిన నగర అభివృద్ధి, సాంస్కృతిక అంశాలు- ఇక్కడి జనజీవన మూల సంస్కృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నగరాల కేంద్రంగా అభివృద్ధి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నదో- వర్తమాన అనుభవం చెపుతున్నది.
టూరిజం, నైట్ ఎకానమీ ప్రభావాలను కూడా ప్రపంచం మనందరి కళ్ల ముందుచ్చుతున్నది. అంతులేని నగరీకరణ, అంతిమ ఫలితమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ గ్రామం యూనిట్‌గా ఉంటే, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ప్రపంచదేశాల అనుభవ పాఠం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
