
అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన నిర్వచనం ప్రకారం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు, అధికారులు పబ్లిక్ సర్వెంట్స్ కోవ కిందకు వస్తారా లేదానే విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనున్నది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ను దాఖలైంది. దీనిని కొట్టి వేయాలంటూ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు అవినీతికి పాల్పడ్డారంటూ ఎఫ్ఐఆర్ దాఖలు అయింది. ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయించుకోవడానికి తెలంగాణ హైకోర్టును క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం నుంచి నిర్వాహకులకు ఆశించిన ఫలితం రాకపోవడంతో తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ప్రసన్న బీ వరాలే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనున్నది.
స్థానిక క్రికెట్ క్లబ్ సభ్యులు కొందరు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన అవినీతి నిరోధక శాఖ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి, అవకతవకలు చోటు చేసుకున్నాయని నిర్ధారించింది. ఆమేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులపై చార్జిషీటు కూడా దాఖలు చేశారు.
తొలుత రూ 31 కోట్ల అంచనా ఖర్చుతో స్టేడియం నిర్మాణం ప్రారంభమైంది. కానీ నిర్మాణం పూర్తయ్యే సరికి 108 కోట్లుకు చేరింది. స్టేడియంలో వేసే కుర్చీలు, అవసరమైన వస్తు సామాగ్రి విషయంలో ప్రాథమిక అంచనాలకంటే పెద్ద మొత్తంలో ఖర్చులు పెరిగాయని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఒక్కో కుర్చీ అంచనా ధర 450 రూపాయలుగా ఉంటే, 910 రూపాయలుగా నమోదు చేశారని, టికెట్ల అమ్మకాలలో జరిగిన అవకతవకలకుగాను రూ 44 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని, స్టేడియంలో క్రికెట్ గ్రౌండ్ నిర్మాణ ఏర్పాటు వంటి విషయాలలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వచ్చాయి.
తమకు చట్టం వర్తించదన్న క్రికెట్ నిర్వాహకులు..
అవినీతి నిరోధక చట్టం తమకు వర్తించదని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వ సంస్థ కాదని వీరు వాదించారు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అవినీతి నిరోధక చట్టం తమకు వర్తించదన్నది పిటిదనర్ల వాదన. కానీ ఈ వాదనను హైకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందిందని, ముఖ్యంగా 23.27 గుంట విలువైన భూమిని రాయితీ రుసుము కింద పొందిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏడాదికి లక్ష రూపాయల చొప్పున ఈ భూమిని ప్రభుత్వం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లీజుకు ఇచ్చింది.
జీ టెలి ఫిలిమ్స్ కేసులోనూ, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా బీహార్ క్రికెట్ అసోసియేషన్ మీద వేసిన కేసులోనూ ఈ సంస్థలు ప్రభుత్వ తరహా విభాగాలేనని సుప్రీం కోర్టు గతంలో వ్యాఖ్యానించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.