విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ సెల్ డేటా సెంటర్ కోసం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ ఢిల్లీలో సీఎం చంద్రబాబు, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వనీవైష్టవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్‌ల సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేశారు. డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం గూగుల్ సంస్థ 15 బిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల 1,88,220 ఉద్యోగాలు లభిస్తాయనే ప్రచారంగా ఉంది.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందనే ప్రచారం కూడా జరుగుతున్నది. దీని సరసన డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎంతమందికి అవకాశాలు వస్తాయనే దాని మీద పెద్ద చర్చ జరుగుతున్నది.
ఈ క్రమంలో గూగుల్ సంస్థ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది. ఉచితంగా ఐదు వందల ఎకరాల విలువైన భూములు, ఈ భూములకు 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ప్లాంట్ మిషనరీ ఖర్చుల 10% మూలధనం రాయితీ కల్పించడం, ఆపరేషన్ యాజమాన్య నిర్వహణ చార్జీల కింద ప్రతి మూడేళ్లకు 5% వంతున పెంచడం, డేటా సెంటర్ నిర్మాణం కోసం అయ్యే 2,245 కోట్లకు గాను జీఎస్టీ మినహాయింపు, ఐదు సంవత్సరాల పాటు లీజులపై చెల్లించే జీఎస్టీ మినహాయింపు, నీటి చార్జీలపై పదేళ్ల పాటు 20% రాయితీ, ఇవన్నీ కలుపు కుంటే కూటమి ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తం 22 వేల కోట్లు. అంటే ప్లాంట్ ఖర్చులో నాలుగవ వంతు ప్రభుత్వం రాయితీ రూపంలో ఇస్తున్నది. ఈ రాయితీలే కాక గూగుల్ సంస్థకు రోజుకు 24 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనాలు ఉన్నాయి.
పరస్పర విరుద్ధ మాటలు..
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ లక్షలాది కోట్లు కలిగి ఉంది, అలాంటి సంస్థకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తనకు కావాల్సిన ఏర్పాట్లు సొంతంగా చేసుకోగలదు. అది కోరిన రాయితీలు ఇచ్చి దాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? కర్ణాటక ప్రభుత్వం రాయితీలు నిరాకరించడం వల్ల అక్కడ తన సంస్థనూ గూగుల్ ఏర్పాటు చేయలేదన్నది గమనించాలి. గూగుల్ సంస్థ ఏర్పాటుకు రాష్ట్రంలో అనుమతించినందుకు ప్రభుత్వానికే రాయితీలు ఇవ్వాలి. 22 వేల కోట్ల రాయితీలు ఇస్తున్నందుకు దాని లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి భాగం ఇవ్వదు గదా!
దేశ ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న రైతాంగం సంక్షోభంలో ఉంటే ఆర్థిక చేయూత ఇవ్వటానికి చేతులు రాని కూటమి ప్రభుత్వానికి, గూగుల్ సంస్థ అడగ్గానే 22 కోట్ల రాయితీలు ఇవ్వటం పాలకుల స్వభావానికి అద్దం పడుతున్నది.
22 కోట్ల రాయితీలు ఇచ్చినా వచ్చే ఉద్యోగాలు, లభించే ఉపాధి నామ మాత్రమే. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 1,88,220 ఉద్యోగాలు వస్తాయని చెప్పటం వాస్తవం కాదని, పరిమిత ఉద్యోగాలు మాత్రమే లభిస్తాయని కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ శాసనసభ సభ్యులు విష్ణుకుమార్ రాజు చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల వచ్చే ఉద్యోగాల గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని విష్ణుకుమార్ రాజు చెప్పకనే చెప్పారు. గూగుల్ ఒక ప్రైవేట్ సంస్థ. ఉద్యోగాలు ఇవ్వటం దాని ఇష్టం. ఎక్కడి నుంచైనా అది ఉద్యోగులను తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఉండదు. డేటా ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని గూగుల్ చెప్పలేదు. ఉద్యోగాల ప్రచారమంతా టీడీపీ చేస్తున్నదే.
సాప్ట్వేర్ సంస్థలు వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. గూగుల్ సంస్థ అందుకు మినహాయింపు కాదు. ఈ సంస్థ ఉద్యోగుల తొలిగింపు కోసం కొత్త ఎత్తుగడ అవలంభిస్తున్నది. వర్క్ ఫ్రమ్ ఆఫీసు విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యోగులను తొలగించుకునేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది. స్వచ్ఛంద నిష్క్రమణను సులభతరం చేసేందుకు, గూగుల్ కొత్త మార్గ దర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలిగింపు ప్యాకేజీని అందిస్తోంది. 2023లో 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లో ఉద్యోగుల తొలిగింపు ప్రారంభించింది.
ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత..
ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా దేశాన్ని పారిశ్రామికమయం చేయటం ద్వారా అది సాధించ వచ్చు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు ఉద్యోగ, ఉపాధిని వదిలి వేస్తున్నారు. ఫలితంగా దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోంది.
భారత జనాభాలో 35 సంవత్సరాల లోపు యువత 65% ఉన్నారు. వీరికి ఉద్యోగ- ఉపాధి అవకాశాలు కల్పించడంలో, నైపుణ్య మానవ వనరులుగా మార్చడంలో పాలకులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధిలేమి నానాటికి పెరిగిపోతున్నది. దేశ నిరుద్యోగుల్లో 83% యువకులే ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవలే ప్రకటించిన నివేదికలో తెలిపింది. ప్రతి సంవత్సరం కోటి మందికిపైగా విద్యార్ధులు కొత్తగా చదువుల పట్టా పుచ్చుకుంటున్నారు. వారికి ఉద్యోగ, ఉపాధిని పాలకుల కల్పించ లేకపోతున్నారు. డిగ్రీలు, పీజీలు తిండి పెట్టలేక పోతున్నాయని యువత ఆవేదన చెందుతున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) నుంచి వచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగం 2024లో 9.2%గా ఉంది. గ్రామీణ ప్రాంత నిరుద్యోగం గణనీయంగా పెరుగుతున్నది. మోడీ నాయకత్వాన ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆచరణలో విఫలమైంది.
ఆంధ్రప్రదేశ్ టాప్ 10 నిరుద్యోగ జాబితా రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగంతో ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్)తాజాగా వెల్లడించింది. 2024లో జాతీయ నిరుద్యోగం 18.9% ఉండగా, ఏపీలో 21.5%గా వెల్లడైంది. ప్రస్తుత ఏపీలో పని లేని వారు కోటి,26 లక్షల మంది ఉన్నారు.
చంద్రబాబు గత పాలనలో, నేటి పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వరంగాన్ని పక్కనపెట్టి ప్రైవేట్ రంగాన్ని అమలు జరుపుతూ ఉన్నాడు. దాని ఫలితమే నిరుద్యోగం పెరుగుదల. 2024లో చంద్రబాబు నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ప్రణాళికలో ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఉద్యోగాల నియామకం ప్రారంభం కాలేదు. టీచర్ పోస్టులకు అర్హత పత్రాలు ఇచ్చినా ఇంకా నియామకం జరగలేదు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యోగ కల్పనలో విఫలమైంది.
గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చాలా పరిమితంగా ఉన్నా, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయని టీడీపీ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కావాల్సింది గూగుల్ లాంటి సంస్థల ఏర్పాటు కాదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, ప్రజల అవసరాలను తీర్చే పారిశ్రామిక పరిశ్రమలను ప్రభుత్వం నెలకొల్పాలి. గ్రామీణ పేదలకు భూసంస్కరణల ద్వారా భూములు పంపిణీ చేయాలి. గ్రామీణ ఉపాధిని పెంచాలి. ఇందు కోసం గ్రామీణ పేదలు, పట్టణ పేదలు నిరుద్యోగ యువత, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలి.
(వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
