భారతదేశం ఇప్పటికే హిందూ దేశంగా మారిందని డిసెంబర్ 21న కోల్‌కతాలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)“శతజయంతి వ్యాఖ్యానమాల” కార్యక్రమం సందర్భంగా తన ఉపన్యాసంలో మోహన్ భగవత్ ప్రకటించారు. ఈ సైద్ధాంతిక ఎజెండాయే గత కొంతకాలంగా భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.
ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 100 ఉపన్యాసాల కార్యక్రమంలో మోహన్ భగవత్ ఓ పోలికను ప్రస్తావిస్తూ వచ్చారు.
“ఎప్పటి నుంచి సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడో మనకు తెలియదు. దీనికి కూడా రాజ్యాంగం అనుమతి కావాలా? హిందుస్థాన్ ఒక హిందూ దేశం. భారతదేశాన్ని మాతృభూమిగా పరిగణించే వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని ఆదరిస్తారు. భారతీయ పూర్వీకులను గుర్తించి గౌరవించే, ఆదరించే వ్యక్తి కనీసం ఒక్కరున్నా అప్పటి వరకు భారతదేశం హిందూ దేశంగానే మిగిలి ఉంటుంది. ఇదే సంఘ్ సిద్ధాంతం, భావజాలం” అని భగవత్ వక్కాణించారు.
ఈ విధంగా మాట్లాడిన తర్వాత మోహన్ భగవత్ ప్రాథమిక భారతదేశంలో పునాదిగా నిలిచిన లౌకిక చట్రం గురించి కూడా ప్రస్థావించారు. రాజ్యాంగాన్ని గుర్తించటం ఆర్ఎస్ఎస్ ప్రాథమిక లక్ష్యం కాదని స్పష్టం చేశారు. లేదా రాజ్యాంగం ద్వారా గుర్తింపు పొందడం ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాదని కూడా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల్లో ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర సంస్థ. అయినప్పటికీ, రాజ్యాంగం ద్వారా గుర్తించబడని సంస్థగానే మిగిలిపోయింది. స్వాతంత్ర అనంతరం కనీసం మూడుసార్లు కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను నిషేధించింది.
“ఎప్పుడైనా రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరించి ఆ పదాన్ని జోడిస్తుందా లేదా? జోడించక పోయినా పర్లేదు. ఆ పదం గురించి మాకు ఏమీ వెరపు లేదు. ఎందుకంటే మేము హిందువులు. అంతేకాకుండా మా దేశం హిందూదేశం. ఇదే వాస్తవం” అని మోహన్ భగవత్ వెల్లడించడంలో రాజ్యాంగం పట్ల ఆయన అధికారాన్ని లోకానికి కనబడకుండా దాచాలనే ప్రయత్నం కూడా లేదు.
నవభారత నిర్మాణానికి పునాదిగా ఉన్న రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్ నిర్మొహమాటంగా నిరాకరిస్తున్నారు. ‘లౌకిక‘ అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలోనే పొందుపరుచుకున్నాము. పీఠికలో ఉపయోగించిన లౌకిక రాజ్యమనే అవగాహనకు అర్థం ఏంటి? భారతదేశం– అన్ని మతాలు, జాతులు, విశ్వాసాలకు సంబంధించిన ప్రజానీకానికి చెందిన దేశమన్నదే ఈ అర్థం. ఇదే అవగాహన రాజ్యాంగంలోని 14 అధికరణం కూడా పునరుద్ఘాటిస్తోంది. రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రకారం చట్టాలను సమానంగా వర్తింపజేయడానికి నిరాకరించకూడదు. చట్టం ముందు అందరూ సమానులే.
మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో సైద్ధాంతిక నేపథ్యానికి మించిన ప్రాధాన్యత ఎందుకు ఉన్నది? ఎందుకంటే ఆయన మాటల్లో ఆర్ఎస్ఎస్ ఉద్దేశం కనిపిస్తోంది. తన ఉద్దేశాన్ని ఆచరణ సాధ్యం చేయటానికి కావలసిన కార్యాచరణ కూడా కనిపిస్తుంది.
రాజ్యాంగం గ్యారెంటీ చేసిన వైవిధ్యానికి తూట్లు
భారతదేశం హిందూ దేశమే అని ప్రకటించడంతోపాటు గత 75 సంవత్సరాలుగా రాజ్యాంగ ఆధారిత పరిణామాలను ధిక్కరించటం, నిరాకరించడం, విస్మరించడం కేవలం ఒక సాధారణ రాజకీయ వ్యాఖ్యానం కాదు. బహుళత్వానికి, వైవిధ్యానికి ఆలవాలమైన భారతదేశంలో ఆ బహుళత్వానికి, వైవిధ్యానికి ఉన్న స్థానాన్ని నానాటికి కుదించే ప్రయత్నమే. భారతదేశంలో హిందూయేతర మత విశ్వాసాలను పాటించే వారి జీవితాలని ఈ వైఖరి కలవరపరుస్తుంది. ఈ భయం ఊహాజనితమైనది కాదు.
ఈ మధ్యకాలంలో, ప్రత్యేకించి క్రిస్మస్ సమయంలో క్రైస్తవులపై దాడులు పెరిగాయి. 1998- 99 మధ్యకాలంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం చెలాయించిన సమయంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర భారత రాష్ట్రాల్లో చెదురుమదురుగా మొదలైన ఈ దాడులు, ప్రస్తుతం దేశవ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ ఒక్క 2025 సంవత్సరంలోనే దాడుల పెరుగుదలలో తీవ్రత కనిపిస్తుంది. ప్రత్యేకించి ఉత్తర భారతం, పశ్చిమ భారత రాష్ట్రాల్లో ఆ దాడుల ఉధృతి పెరిగింది.
భారతదేశ మొత్తం జనాభాలో క్రైస్తవులు 2.3 శాతం మాత్రమే. అయినా వివిధ రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వారిలో క్రైస్తవుల సంఖ్య గణనీయంగా ఉంది.
యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం నివేదిక ప్రకారం, గత పదకొండేళ్లలో క్రైస్తవులపై దాడులు ఎనిమిది రెట్లు పెరిగాయి. ఆ దాడులకు పెరుగుతున్న ఆర్ఎస్ఎస్ ప్రేరిత ప్రభుత్వాల ఆధిపత్యానికి మధ్య సంబంధం స్పష్టంగా వ్యక్తమవుతోంది.
రాజ్యమే ప్రేరేపిస్తున్న వివక్ష
దాడుల తీరును గమనిస్తే, అడపాదడపా జరిగే మూకదాడుల స్థాయి నుంచి దేశవ్యాప్త ధోరణిగా మారిందనే విషయం స్పష్టమవుతుంది. మైనారిటీలపై క్రమపద్ధతిలో పెరుగుతున్న ఒత్తిళ్లు– అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వంటి వారి మాటలతో మరింత చెలరేగిపోతున్నాయి. ఈ ప్రకటనలతో పాటు పోలీసులు, పట్టనపరిపాలన వ్యవహారాల శాఖ వంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అనుసరించే వివక్ష పూరిత చర్యల దూకుడు మరింత పెరిగింది. ప్రత్యేకించి మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఇళ్ల కూల్చివేతలు మనం చూస్తున్నవే. అంటే, ఈ వివక్షపూరిత పాలనకు పైస్థాయిలోనే అండదండలు ఉన్నాయన్నది స్పష్టం.
ఓట్ల సమీకరణ వ్యూహంగా మారిన ఎలగీత(పోలరైజేషన్)
2024 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలలో ప్రధానమంత్రి మోదీ కలసిమెలిసి జీవిస్తున్న వివిధ మతాల ప్రజల మధ్య విభజన రేఖలు గీయడంలో మొనగాడుగా నిలిచారు. హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ కథనం ప్రకారం 2024 మార్చిలో ఎన్నికల ప్రవర్తనన నియమావళి అమలకు వచ్చిన తర్వాత మోదీ ప్రసంగించిన 173 సభలు సమావేశాలలో– 117 చోట్ల ముస్లిం వ్యతిరేక విష ప్రచారాన్ని చేశారు. ఇవన్నీ ఎన్నికల అవసరం కోసం చేసిన ఉపన్యాసాలు కావు. వ్యూహాత్మకంగా చర్చకు పెట్టిన రాజకీయ అంశాలే.
తాజాగా ఈ మధ్యన ముగిసిన బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ మూడో తేదీన జరిగిన సభలో ఈ దాడిని మరింత ఉధృతం చేశారు. సీమాంచల్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ముస్లిం జనాభా పెంచేందుకు తద్వారా ఆ ప్రాంతంలో మతపరమైన సమతౌల్యాన్ని తిరగదోడేందుకు కాంగ్రెస్, ఆర్జెడీలు ప్రయత్నిస్తున్నాయని మోదీ ఆరోపించారు. మోదీ ఉపన్యాసం విద్వేష ప్రచారం తప్ప మరోటి కాదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మోడీ భాష- అన్ని మతాల జనాభాను పెంచడం ద్వారా దేశానికి ముప్పును కలిగించేందుకు ప్రతిపక్షాల ప్రయత్నిస్తున్నాయన్న వాదన- ఆయన ప్రచారవ్యూహంలో సాధనంగా మారింది.
భారతీయత స్వభావాన్ని, చట్టాలను తిరగరాయడం
భారతదేశాన్ని భిన్నత్వంతో కూడిన దేశంగా కాకుండా కేవలం హిందూదేశంగా పునర్నిర్వచించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం– అనేక రంగాలలోనూ, రూపాలలోనూ కనిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టాలు, బోధనా అంశాలను సవరించడం ద్వారా చరిత్రను తిరగరాసే ప్రతిపాదనలు, మరీ ముఖ్యంగా స్వాతంత్రానంతకాలంలో ఒక్క ముస్లిం క్యాబినెట్ మంత్రి కూడా లేని కేంద్ర మంత్రిమండలిని రూపొందించి అధికారాన్ని చలాయించడం ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. దేశ జనాభాలో 14 శాతం మంది ముస్లింలు. మొత్తం జనాభాలో 25% మంది వివిధ మతాలకు చెందిన మైనారిటీలు. ఈ పరిస్థితుల్లో మోహన్ భగవత్ వంటివారు– భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటించడమంటే, దేశ జనాభాలలో 20 శాతం జనాభా ఈ దేశానికి చెందినవారు కాదని నొక్కి వక్కాణించడం తప్ప మరొకటి కాదు.
దౌత్యరంగంలో ఒంటరిపాటవుతున్న భారతదేశం
ఈ రకమైన సైద్ధాంతిక నేపథ్యంతో కూడిన నిర్ణయాలు అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఒంటరిపాటు చేస్తున్నాయి. పొరుగునున్న బంగ్లాదేశ్‌లాంటి దేశాలు ఒకవైపున ఇస్లామిక్ మతోన్మాద ఉద్యమాల నుంచి, మరోవైపున హిందుత్వ శక్తులు నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఈ రకంగా ఒంటరిపాటు కావటం ఆందోళన కలిగించే విషయం.
గడిచిన కొన్నివారాలలో బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువులు మూక దాడులకు గురయ్యారు. ముందుగా తమ భూభాగంలో ఉన్న అన్య మతస్తులకు రక్షణ, భద్రత కల్పించినపుడు మాత్రమే; అన్ని మతాలకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్‌ను కోరటానికి భారతదేశానికి నైతిక హక్కు ఉంటుంది.
భారతదేశం హిందూ దేశమని ఓ వైపు ఢంకా బజాయించి, మరోవైపు బంగ్లాదేశ్‌ను లౌకిక దేశంగా ఉండాలని పిలుపునివ్వడమనేది మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టే అంశం కాదు. పైగా ఇటువంటి ధోరణి ఇరుదేశాలలోనూ మతోన్మాద శక్తులను రెచ్చగొట్టడానికి దోహదం చేస్తుంది. బెంగాలీ మాట్లాడే ముస్లింలను బంగ్లాదేశీయులుగా పదేపదే ప్రచారం చేయటం; వారిని చొరబాటుదారులని దుమ్మెత్తి పోయడం వంటి చర్యలు మతపరమైన మైనారిటీలను కాపాడాలనే ప్రతిపాదనలపై విశ్వాసం కల్పించలేవు. 2018లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా బంగ్లాదేశీయులను చెదపురుగులుగా అభివర్ణించారు. మతపరమైన మైనార్టీలు ఏ మతానికి చెందిన వారు? ఏ దేశానికి చెందినవారనే విషయంతో సంబంధం లేకుండా వారి పట్ల బీజేపీ అనుసరించే వైఖరికి ఈ ప్రకటన ఓ ఉదాహరణగా, ప్రమాణంగా మిగిలిపోతుంది.
ఆర్ఎస్ఎస్ కృషి – విస్తృతి
మోహన్ భగవత్ ప్రకటన ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే, ఆర్ఎస్ఎస్ నిర్మాణం దాని పరిధి గురించి అవగాహన ఉండాలి. బీజేపీలాంటి వందల సంఖ్యలో ఉన్న సంఘాలు, సంస్థలు, వ్యవస్థలకు ఆర్ఎస్ఎస్ ఓ పునాది.
బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్‌లాంటి సంస్థలు బహిరంగంగానే తాము ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి. స్వయంగా ప్రధాని మోదీ పూర్తి కాలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు. మోదీలా పూర్తి కాలం ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా పనిచేసిన వారు కేంద్ర మంత్రిమండలిలోనూ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగానూ, ఆయా రాష్ట్రమంత్రివర్గాలలోనూ చాలా మంది ఉన్నారు. మరికొందరు ఇతర రాజ్యాంగ వ్యవస్థలైన గవర్నర్లుగా కూడా ఉన్నారు. ఇది సమాంతర ఉద్యమం కాదు. వర్తమాన భారత ప్రభుత్వానికి వెన్నెముక.
ఒకప్పుడు భారతదేశంలో ప్రజాతంత్ర సంప్రదాయాలకు పునాదిగా ఉన్న వైవిధ్యం, బహుళత్వాలను ఓ పథకం ప్రకారం ప్రస్తుత మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. అయితే ఇలా ధ్వంసం చేయడానికి రాజ్యాంగ సవరణలు సాధనంగా చేసుకోవడం లేదు. కార్యనిర్వాహ గవర్నర్ అంటే ప్రభుత్వ యంత్రాంగం, హక్కులు, అధికారాలు, విధులు, విధానాలతోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తుంది. అధికారపు చర్యలతో పాటు, మూక దాడులు, వివక్షపూరితమైన చట్టాలు, వాటి అమలు, నిరంతరం మతపరమైన మైనారిటీలపై దాడులు, దుష్ప్రచారం, వారి అస్తిత్వాన్ని సవాలు చేసే చర్యలు వంటి రూపాల్లో బీజేపీ ప్రభుత్వం ఈ లక్ష్యాలను సాధిస్తోంది. ఈ విధ్వంసానికి మోహన్ భగవత్ మాటలు దిశా నిర్దేశం చేస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ అగ్ర నేత మాటలు అంతులేని ప్రభావాన్ని చూపిస్తాయి. పలుకుబడిని కలిగి ఉంటాయి. భారతదేశం హిందూదేశమనే ఆర్ఎస్ఎస్ అవగాహనను వ్యక్తీకరించడంలానే– మోహన్ భగవత్ ప్రకటనలను చూస్తే సరిపోదు. ఆర్ఎస్ఎస్ అవగాహనతో విభేదించేవారినందరిని పౌర జీవనము నుంచి గెంటివేసే మరింత ప్రమాదకరమైన వ్యూహానికి దారులువేసే చర్య. జాతీయ జనజీవన స్రవంతి నుంచి అటువంటి వారందరినీ తొలగించే చర్య.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
