భారతదేశానికి ముస్లింలు రాకపూర్వం క్రీపూ 1000(బీసీఈ) నుంచి క్రీశ 1200(సీఈ) మధ్య కాలంలో భారతదేశంలో స్వర్ణయుగం కొనసాగిందని, ఆ కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, హిందుత్వవాదులు వాదిస్తారు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనకు అందుబాటులోకి వచ్చిన విమానాలు, ఇంటర్నెట్, మూలకణ పరిశోధనలు, ప్లాస్టిక్ సర్జరీవంటివన్నీ అప్పుడే, ఆ స్వర్ణయుగంలోనే భారతేశంలో ఉండేవని దబాయిస్తారు.
అదే నిజమైతే అవి ఎవరు కనిపెట్టారు? ఎవరు అభివృద్ధి చేశారో చెప్పాలి కదా? పైగా పురాతన గాథలకు, పురాణపాత్రలకు వాటిని అన్వయించి చెపుతారు. అవన్నీ వాస్తవాలుగా మనం స్వీకరించాలని ఆశపడుతుంటారు. ఆధారాలు చూపకుండా మొండివాదనల్ని జనం ఎలా ఒప్పుకుంటారూ? ఏ కొద్దిపాటి వైజ్ఞానిక పరిజ్ఞానం ఉన్న వారైనా, ఇప్పుడు దేశంలో మనకు అందుబాటులోకి వచ్చిన శాస్త్ర పరిజ్ఞానం, పరికరాలు అన్నీ 18- 20 శతాబ్దాల మధ్య కాలంలో యూరోప్ దేశాలు ప్రపంచానికి అందించినవేనన్నది గ్రహిస్తారు.
భారతదేశంలో ఢిల్లీ సల్తనత్- ముస్లిం సుల్తానుల పరిపాలన క్రీశలో 320 సంవత్సరాల పాటు(1206- 1526)కొనసాగింది. మామ్లుక్ రాజవంశం(1206- 1290), ఖిల్జీ రాజవంశం(1290- 1320, తుగ్లక్ రాజవంశం(1320- 1414), సయ్యద్ రాజవంశం(1414- 1451), ఆఫ్ఘాన్ లోది రాజవంశాలు(1451- 1526) రాజ్యమేలాయి.
ఆ కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లో కొంత భాగం భారతదేశంలో అంతర్భాగాలుగా ఉండేవి. ఆ తర్వాత తొలి మొఘల్ చక్రవర్తి బాబర్ పరిపాలన సీఈ 1526లో ప్రారంభమై 1530 వరకు కొనసాగింది. అతని తర్వాత అతని వారసులు వరుసగా 1857 వరకు రాజ్యమేలారు.
ఆయా కాలాలకు సంబంధించిన విషయాలన్నింటిని నాటి చరిత్రకారులు గ్రంథస్థం చేసే ఉంచారు. కాబట్టి, ఆ కాలానికి సంబంధించి అబద్ధాలు అల్లడానికి వీలు లేదు. అందుకే హిందుత్వవాదులు 1000 క్రీపూ నుంచి 1200 క్రీశ మధ్య కాలాన్ని కావాలనే ఎంచుకున్నారు.
ఈ సున్నితమైన అంశం పాఠకుల దృష్టికి తీసుకురావడానికే, నెనిక్కడ ముస్లిం రాజుల ప్రవేశానికి సంబంధించిన వివరాలు విపులంగా తెలియజేశాను.
ముస్లిం సుల్తానులు దేశంలోకి రాక పూర్వమే ఇక్కడ స్వర్ణయుగం కొనసాగి ఉంటే, దాని ప్రభావం, దాని ఛాయలు ఢిల్లీ సల్తనత్ కాలంలో కనిపించాలి కదా? ఇంటర్నెట్, ప్లాస్టిక్ సర్జరీలాంటి వైజ్ఞానిక సౌకర్యాలన్నీ మొఘలులు ఎందుకు వాడుకోలేపోయారూ? వాటిని ముస్లిం పాలకులు సర్వనాశనం చేశారని హిందుత్వవాదులు చెప్పినా చెపుతారు. ఆశ్చర్యం లేదు. కానీ, అందుబాటులో ఉన్న సౌకర్యాన్ని ఎవరైనా ఎందుకు నాశనం చేసుకుంటారూ? ఆలోచించాల్సిన విషయం కదా?
ద్వేషానికి కావాల్సిన అబద్ధం..
మరో అవాస్తవమేమంటే- ముస్లిం రాజులు పరిపాలన సాగించినంతకాలం హిందువులు పీడనకు గురయ్యారని, బానిసల్లా జీవించారని చెపుతారు. సమకాలీనంలో ఉన్న హిందూ- ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించడానికి ఇది ఉపయోగపడే అబద్ధమే తప్ప, అందులో నిజం లేదు.
దేశ చరిత్రలో అశోకుడు “ద గ్రేట్” ఎలా అయ్యాడు? తర్వాత కాలంలో అక్బర్ “ద గ్రేట్” అని ఎలా పిలిపించుకున్నాడూ?
ముస్లింలలతో తాము అణిచివేయబడ్డామని బ్రిటీష్ వారితో తాము అణచివేయబడ్డామని అరిచి గీపెట్టే ముందు తామేం చేశారో ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది. పరిపాలకులు ఎవరైనా, చిన్నా చితక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని అంత ప్రాముఖ్యమివ్వాల్సిన పనిలేదు. అంటరాని తనాన్ని ప్రవేశపెట్టి, జనాన్ని నాలుగు వర్ణాలుగా విభజించి, కింది కులాల వారిని చిత్రహింసలు గురిచేయడం ఎవరు మరిచిపోయారనీ? చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు వందల ఏళ్లుగా గొంతెత్తి న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు కదా?
భారతదేశంలో వివిధ జాతుల సమ్మేళనం వివిధ సంస్కృతుల సమ్మేళనం కామర్ ఎరాలోని ఒకటి రెండు శతాబ్దాలలో జరిగిందని చరిత్రకారుల పరిశీలనలు, జన్యుశాస్త్రవేత్తల పరిశోధనలు అన్నీ తేటతెల్లం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా హిందుత్వ సిద్ధాంతకర్తలు భారత ఉపఖండమంతా “ముందు నుంచే ఆర్య సంస్కృతి వెల్లివిరుస్తోందని” దాన్నే ఇంకా ఇంకా సంరక్షించుకోవాల్సి ఉందని అబద్ధాలు చెపుతుంటారు. పురావస్తు పరిశోధనలు గానీ, జన్యుశాస్త్ర సంబంధమైన సాక్ష్యాలుగానీ చెపుతున్నదేమంటే, ఉత్తరభారతీయులు ఇరాన్, మధ్య ఆసియా జాతులతో సమ్మిళితమై నిగ్గుతేల్చాయి. అంటే వివిధ జాతులు భారతదేశంలోకి వలస వచ్చిన విషయం రూఢీ అయ్యింది. దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి తప్ప- హిందుత్వవాదులు చెప్తున్న బలహీనమైన అబద్ధపు వాదనను ఏ మాత్రం పట్టించుకోగూడదు.
ఇంతకీ ఈ “హిందుత్వ” అనే మాట ఎలా వాడుకలోకి వచ్చిందీ? ముందు అది అర్థం చేసుకోవాలి!
లౌకిక జాతీయవాద సంస్థ భారత జాతీయ కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధిగా పని చేసింది. స్వాతంత్ర్య సమరంలో అందరూ భుజంభుజం కలిపి పోరాడారు. అప్పటికీ వారి మధ్య హిందూ, ముస్లిం అనే భేదాలు లేవు. తాము వేరు, తమ జాతులు వేరు, తమ మతాలు, విశ్వసాలు వేరువేరనే అభిప్రాయం 1920లలో బలపడింది. సుమారుగా ఆ కాలంలోనే రెండు వాదాలు తలెత్తాయి.
మహ్మదీయ భూస్వాములూ, మధ్య తరగతి విద్యావంతులు కలిసి 1906 డిసెంబర్ 30న ఢాకా బంగ్లాదేశ్‌లో అంటే నాటి బ్రిటీష్ ఇండియాలో “ముస్లిం లీగ్”ను స్థాపించారు. దాని వెనుక మహ్మదాలి జిన్నా, ఫజుల్ హక్, ఆగా ఖాన్ వగైరాలున్నారు. ముస్లిం జాతీయవాదంగా అది ముందుకొచ్చింది. 1947లో పాకిస్తాన్ ఇక స్వతంత్రదేశంగా విడిపోవడంలో ముస్లింలీగ్ ప్రధానపాత్ర పోషించింది కూడా!
అదే సమయంలో మరోవైపు హిందూ అగ్రజాతి, మధ్య తరగతి విద్యావంతులూ కలిసి “హిందూ మహాసభ”ను 1915లో స్థాపించారు. తమది హిందూ జాతీయవాదమని ప్రకటించుకున్నారు. దాని వెనుక పండిత మదన్ మోహన్ మాలవ్యా, సావర్కర్ మొదలైనవారున్నారు.
తమది జాతీయవాదమని చెప్పుకున్నారే గానీ, బ్రిటీష్‌కు ఎదురు తిరిగి పోరాడలేదు. వారికి లొంగిపోయి, స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న నాటి భారతీయ యువతను తప్పుదారి పట్టించారు. స్వదేశీయుల్ని అడ్డుకుంటూ బ్రిటిష్‌కి మేలు చేసే విధంగా కార్యచరణ రూపొందించుకున్నారు.
ముస్లింలీగ్ ప్రభావంతో ఒక ముస్లిం రాజ్యాం “పాకిస్తాన్” ఎలా ఏర్పడిందో అలాగే ఇక్కడ భారతదేశాన్ని హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఒక హిందూ రాజ్యంగా మార్చాలని తహతహలాడారు. తర్వాత కాలంలో కేబీ హేడ్గేవార్ నాయకత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)గా 1925లో హిందూ మహాసభ రూపం మార్చుకుంది. దాని నుంచే భారతీయ జనతా పార్టీ(బీజేపీ)1980లో ఆవిర్భవించింది. దాని నేపథ్యంలో ఎబీ వాజ్‌పేయ్, ఎల్కే అద్వానీలు ఉన్నారు.
1947లోనైనా 2021లోనైనా ఈ హిందుత్వవాదులు ఎజండా ఒకటే! లౌకిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఎలాగైనా ఒక హిందూ రాజ్యంగా మార్చాలని! ఆ ప్రయత్నం వారు ముమ్మరం చేస్తున్నట్టుగా మనకు ప్రస్తుత బీజేపీ పాలనలో స్పష్టమౌతూనే ఉంది. దేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు గనక, ఆ హిందూ మెజారిటీవాదాన్ని చట్టబద్ధం చేయడానికి వారు ఏర్పరుచుకున్న దృక్పథమే “హిందుత్వ”గా పిలవబడుతూ ఉంది.
జేమ్స్ మిల్ రాసిన బ్రిటీష్ ఇండియా చరిత్ర 1857లో అచ్చయ్యింది. ఆ కాలం నాటి అనేక అంశాల్ని ఆ గ్రంథం విపులంగా చర్చించింది. ఆ రచయిత హిందూ- ముస్లిం- బ్రిటీష్ మూడు విభిన్న దృక్పథాల గురించి వివరించాడు. పైగా హిందూ- ముస్లింలు వేర్వేరు జాతుల వారని వారి మధ్య నిరంతరం ఘర్షణలు సాగుతూ వచ్చాయనీ రాశాడు . అందుకే హిందుత్వవాదులు అతని గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ అర్థశతాబ్దంలో చరిత్రకారులు జన్యుశాస్ర్త పరిశోధకులు, పురావస్తు పరిశీలకులు అందరికందరూ జేమ్స్మిల్వాదనని తప్పుపట్టారు. హిందూ- ముస్లిం బ్రిటీష్ అంటూ వైజ్ఞానికంగా మానవ జాతిని విభజించే పద్ధతి సరికాదని దుయ్యబట్టారు. మానవజాతి అంతా ఒక్కటేనని చెపుతూ, లెక్కలేనన్ని ఆధారాలు చూపారు. ఆధారాలు లేని వాదనలు, మనిషిని మనిషి నుంచి విడగొట్టే కుట్రలు, రాజకీయాలు ఇప్పుడిక సాగవు.
మతవిశ్వాసాలు ఎప్పుడూ వ్యక్తిగతమే!
విశ్వాసాల ఆధారంగా చట్టాలుంటడవు. పరిపాలన సాగదు. “ఆర్య” అనే శబ్దానికి గౌరవనీయుడనే అర్థం ఉంది కాబట్టి, మిగతావారి కంటే హిందువులు “ఎక్కువ గౌరవనీయులు” అనే అభిప్రాయం స్థాపించాలని వారి ప్రయత్నం. అందుకు 1930 నాటి జర్మన్, ఇటాలియన్ ఫాసిజాల భావజాలం అరువు తెచ్చుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడరు.
దేవాలయాల్లోని గుప్త నిధుల కోసం ముస్లింలు దేవాలయాల్ని కొల్లగొట్టింది నిజమే. అయితే హిందూ మతాన్ని నాశనం చేసి, ముస్లిం మతాన్ని స్థాపించాలనే ఆకాంక్ష లేదు. సంపదను, నిధులను దోచుకోవడానికి హిందూ ఆలయాలపై హిందూ పాలకులే దాడి చేసిన ఉదంతాలు కూడా చరిత్రలో ఉన్నాయి. అది గమనించాల్సిన అంశం. అంటే ఏమిటీ? అక్కడ సంపదకు ప్రాముఖ్యం ఉందే కానీ మతానికి కాదు.
హిందూ మత ఛాందసులు వేలవేల మంది బౌద్ధుల్ని నరికి చంపి భీభత్సం సృష్టించారు కదా? మరి అక్కడ సంపద దోచుకోవడం కాదు. మత మార్పిడే ముఖ్యమయ్యింది. దీనిలో మనకు మళ్లీ యూరోప్‌లో జనాన్ని బలవంతంగా క్రైస్తవంలోకి లాక్కోవడానికి క్రైస్తవులు చేసిన భీభత్సవం గుర్తుకొస్తుంది. మతం ఎప్పుడూ ఎక్కడా శాంతిని స్థాపించలేదు. భీభత్సాల్ని మారణహోమాల్ని మాత్రమే మిగిల్చింది.
వేరువేరు జాతుల మధ్య ఘర్షణలు జరిగాయంటే దానికి వేరువేరు కారణాలు ఉండొచ్చు. వాటిని అలా ఉండనివ్వండి. మరి ఒక మతానికే చెందిన హిందువుల్లో కొందరు అగ్రవర్ణం వారు, మరికొందరు నిమ్నవర్గం వారు ఎలా అయ్యారూ? విద్య, ఆర్థిక స్థోమత, సమాజంలో ఉన్నతమైన స్థాయీ ఆ అగ్రవర్ణం వారికే ఉండాలని మిగతా వారికి అవి సమకూరగూడదని ఎందుకు ప్రయత్నించినట్టూ? చెరువులోని నీళ్లు తాగడానికి, పుట్టుకకూ సంబంధమేమిటీ? దేశంలోని అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా జంతువులు కన్నా హీనంగా ఎందుకు చూసినట్టూ? అస్పృశ్యులుగా మార్చి వారిని సమాజంలో ఎందుకు వెలివేసినట్టూ? అస్పృశ్యులుగా మార్చి వారిని సమాజంలో ఎందుకు వెలివేసినట్టూ? వెట్టి చాకిరి ఎందుకు చేయించుకున్నట్టూ? ఇంతటి వివక్ష, హింస భరించలేకనే కదా ఈ దేశమూలవాసులు మతాలు స్వీకరించారూ? విశాల భావాలతో ప్రజాస్వామ్యబద్ధంగా మెలిగితే ఆ పరిస్థితి వచ్చేది కాదు.
ఇప్పుడు వారు సమాధామైనా చెప్పగలగాలి. లేదా బుద్ధుడికి, చార్వాకులకూ క్షమాపణలు చెప్ప సన్మార్గంలో హేతుబద్ధంగానైనా నడవడానికి ప్రయత్నించాలి. మరో మార్గం లేదు.
అతిగా చేస్తే ఏ మతమైనా సరే ఉగ్రవాదంలోకి దారి తీస్తుంది. ఈ దేశానికి వైజ్ఞానిక స్పృహనందించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కావాలనే కనుమరుగు చేయాలని చూస్తున్న హిందుత్వవాదుల కుట్రల్ని భారతీయ యువత అర్థం చేసుకుంటోంది. మూర్ఖుల్ని ఎవరూ ఎద్దేవా చేయనవసరం లేదు. వారి మూర్ఖత్వమే వారిని నవ్వులపాలు చేస్తుంది. రాబోయే వైజ్ఞానికతరం, ఇక మూర్ఖపు- అజ్ఞానపు మత భావనల్ని ఎంత మాత్రమూ సహించబోదు.
(వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
