“గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది” అంటూ పేదల బతుకులను తన గొంతుతో గోరటి వెంకన్న లోకానికి తెలియజేశారు. తన రాతలతో, పాటలతో తెలంగాణ ప్రజల జీవితాన్ని సాహిత్యంలో పొందుపరుస్తున్నారు. సామాన్య ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తూ తెలంగాణ సాహిత్యాన్ని సుసంన్నం చేస్తున్న గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం వరించింది.
విద్యార్థి దశ నుంచి భారత విద్యార్థి ఫెడరేషన్లో క్రియాశీలకంగా గోరటి వెంకన్న పాల్గొన్నారు. నాటి నుంచి తెలంగాణ మాండలికంలో సాహిత్య సృజన చేశారు. టీవీ షోలతో సాహిత్యాన్ని తెలంగాణ ప్రజలకు మరింత చేరువ చేయటంలో, సాహిత్యం ద్వారా తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులను లోకానికి తెలియజేయడానికి కేంద్ర సాహిత అకాడమీ అవార్డు గ్రహీత విశిష్ట కృషి చేశారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చేస్తున్న సాహితీ సేవను గుర్తించిన అంబేడ్కర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 2025 సెప్టెంబరు 30న విశ్వవిద్యాలయంలో జరగనున్న విశ్వవిద్యాలయ 26వ స్నాతకోత్సవంలో ఈ పురస్కారాన్ని వెంకన్నకు ఇవ్వనున్నారు.
తెలంగాణ ప్రజాకవి గోరటి వెంకన్న సాహిత్య సేవ..
గోరటి వెంకన్న అంటేనే మట్టిపరిమళం గుర్తుకొస్తుంది. సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఆయన తన రచనలలో, పాటలలో ప్రతిబింబిస్తారు. సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో లోతైన అర్థాన్నిచ్చే పాటలను రాస్తూ ప్రజల హృదయాలను ఆకట్టుకొని ప్రజాకవిగా ఆయన చలామణి అవుతున్నారు.
ఏకునాదం మోత, కొండమీది చంద్రవంక, పూసిన పున్నమి, రేలపూతలు, ఎలుగు జిలువు వంటి రచనలను గోరేటి వెంకన్న వెలువరించారు. కవిగా, గాయకుడిగా, వాగ్గేయకారుడిగా తెలుగు సాహిత్యాన్ని ఆయన సుసంపన్నం చేస్తూనే, ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేస్తున్నారు. సీని గేయ రచయితగా ఆయన అందించిన రచనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. తెలంగాణ ఉద్యమకాలంలో ఆయన పాడిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. మలిదశ స్వరాష్ట్ర తెలంగాణ ఉద్యమానికి కొత్త జవసత్వాలను అందించాయి.
రచనలకు పలు పురస్కారాలు..
వెంకన్న రచనలకు, సాహిత్యకృషికి పలుపురస్కారాలు వరించాయి. అందులో చెప్పుకోదగ్గవి, రేల పూతలు రచనకు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గేయ సంపుటి పురస్కారాన్ని అందించింది.
2010లో వచ్చిన అల చంద్రవంక రచనకు హంస అవార్డుతో పాటు గండ్ర హన్మంతరావు స్మారక సాహితీ పురస్కారాన్ని వెంకన్న తీసుకున్నారు. 2019లో వల్లంకి తాళంకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. అంతేకాకుండా కాళోజీ సాహిత్య పురస్కారంతో పాటు పలు వేదికల మీద కీలకమైన పురస్కారాలను అందుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూ కోటి నగదును పురస్కారాన్ని పొందారు. గోరేటీ వెంకన్న సాహిత్యం మీద పీహెచ్‌డీలు కూడా చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
