“వచ్చిండన్న వచ్చాడన్నా
వరాల తెలుగు ఒకటేనన్నా..”
అంతేకాదు. మరో పాదాన్ని లోతుగా పరిశీలించవలసి ఉన్నది. ఎందుకంటే రాజకీయ, భౌతిక, మానసిక స్థితిగతుల మార్పు కేంద్రంగా ఈ కింది పదబంధం మారింది. అదేంటంటే..
“తెలుగు జాతి మనది
రెండుగా వెలుగు జాతి మనది” ఈ పదబంధాలు వచించిన పండిత పుత్రులు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి.
తెలంగాణ ఉద్యమం మహోద్ధృతంగా జరుగుతున్న సందర్భంలో మారిన తన అభిప్రాయాన్ని పైవిధంగా సీనారే వ్యక్తీకరించారు. అంతకు పూర్వం రాసిన తన పాద పంక్తులకు కాలగమనాన్ని జోడించారు. భవిష్యత్తు దర్శనం చేశారు.
1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో నారాయణగూడలోనూ ఒక థియేటర్లో ప్రదర్శించబడుతున్న “తల్లా పెళ్ళామా” సినిమాకు అతి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. ప్రజల భావోద్వేగాలకు భిన్న దృశ్యమే ఆ నిరసనకు కారణం. ఇది గత కాలపు ఒకానొక అనుభవం.
2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనంతరం సరికొత్త చరిత్రకు పునాది పడింది. తదనంతరం, ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ పతాక సన్నివేశ ఆగ్రహ ప్రకటన వరకు ఒకానొక కొనసాగింపు. అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సీమాంధ్ర పెట్టుబడి- పెత్తందారీబారి నుంచి తనను తాను రక్షించుకున్నది. ఆత్మగౌరవ పతాక ఎగురవేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయింది. తనదైన మట్టి స్వభావాన్ని ఈ నెల సజీవంగా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది.
ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు. ఏ భావజాలానికి, ఏ భావోద్వేగానికి ఎవరు ప్రతీకలో అర్థం చేసుకున్న తర్వాతనే తెలంగాణ తన స్పందనను తెలియజేస్తున్నది.
అభ్యంతరాల నడుమ ఆవిష్కరణ
రవీంద్రభారతిలో ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రమణ్యం విగ్రహ ఏర్పాటుపై తెలంగాణవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, నేటితరం తెలంగాణ జనులు ఈ నిరసనలో భాగస్వాములయ్యారు. వీరి ఆవేదన వెనుకున్న పలు కోణాలను సమాజం అర్థం చేసుకోవాల్సి ఉన్నది.
1956కు ముందు తెలుగువారికి రెండు రాష్ట్రాలున్నాయి. 56 తర్వాత తెలంగాణ ప్రజానికం మనోభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు కారకులైన మహానీయులు గాంధేయవాది పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఆంధ్రప్రదేశ్ కోసమేననే తప్పుడు అభిప్రాయాన్ని నాడు కలిగించారు. ఈ విషయమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో వాస్తవాల వెల్లడికి కేంద్రస్థానమైంది. పొట్టి శ్రీరాములు భారతదేశ చరిత్రలో తిరుగులేని త్యాగశీలి. సర్వమానవ సమానత్వాన్ని చాటి చెప్పిన త్యాగి.
విస్మరణకు గురైన తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆటా, పాటలను; సంస్కృతీ, సాహిత్యాలను; ఈ ప్రాంతపు ఉనికి, అస్తిత్వాలను; ఉమ్మడి అస్తిత్వంగా నాటి పాలకులు అందించే ప్రయత్నం చేయలేదు. ఒకటి అరా మినహాయిస్తే, పాఠ్య పుస్తకాలలో తెలంగాణవారికి స్థానమే లేదు.
పైడి జయరాజు నటనా చాతుర్యం గురించి నాటి తెలుగు సినీ పరీశ్రమ అసలూ పట్టించుకోలేదు. తెలంగాణ జనజీవితమే సినీ సాహిత్య రంగాల్లోకి రాలేదు. ఇట్లానేకంటే రానివ్వలేదనేది సముచితం కావచ్చు.
పాఠ్యపుస్తకాల్లో పలుకుబడుల్లో ఆంధ్ర పెత్తందారి భాషా విన్యాసమే ఉన్నది. సరిగ్గా దీన్నే తెలంగాణ సమాజం తీవ్రంగా ఆక్షేపించింది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తత్ఫలితంగా రాజకీయాంశలు తోడై ప్రత్యేక రాష్ట్రం అనివార్యమైంది. దీనికి వందల మంది తెలంగాణ బిడ్డలు స్వీయ బలిదానాలు చేసుకున్నారు. ఇదంతా గడిచిన చరిత్రమాత్రమే కాదు- గతకాలపు గాయాల, వేదనల దృశ్యంగా తెలంగాణ ప్రజల మనుసుల్లో ఉన్నది.
10వ నుంచి 6వ తరగతులు వరకు కవి పరిచయాలు
కొనసాగింపు
తెలుగువారికి రెండు రాష్ట్రాలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సాహితీకారులకు స్థానమే లేదు. ఇవ్వండని ఇక్కడవారు అడగనూ లేదు. తెలుగు భాష సాహిత్యకారుల సృజన తెలుగు జీవితం నుంచే ఉన్నది. ఇక్కడ ఆట, పాట, మాట, తిరుగులేమి సాంస్కృతిక శక్తిగా ఉద్భవించింది. శ్రమజీవుల వెతలకు తెలుగు సాహిత్యంలో స్థానం కల్పించిన కవిపండితులు ఎందరో తెలంగాణలో ఉన్నారు. కాసులకు ఆశపడకుండా తమ గానంతో సమాజాన్ని జాగృతం చేసినవారూ ఉన్నారు. ఇలాంటివారి గురించి, ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో ప్రస్థావన ఎంత ఉన్నదో తేల్చాల్సిన అనివార్యత ఇప్పుడున్నది. తమ రాష్ట్రానికి చెందిన అంటరాని కవుల సాహిత్యాన్ని పాఠ్యపుస్తకాల్లోకి తీసుకున్నారు. భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సిందే.

ఎస్పీ బాల సుబ్రమణ్య విగ్రహం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణవాదుల మద్దతు ఏమేరకున్నదో అందరికీ తెలిసిన విషయమే. బాలు పట్ల, ఆయన గానామృతాల పట్ల ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోని వారిలో వీరూ ఒకరు.
బాలసుబ్రమణ్యం పలు భారతీయ భాషల్లో వందలాది పాటలు పాడారు. తన జీవితపు ఎదుగుదల మద్రాసు నుంచే ప్రారంభమైంది. అట్లాగే తెలుగులోనూ. ఒక తెలుగు గాయకుడిగా ఆయనను అందరూ అభిమానిస్తారు. ఇది వాస్తవం. కానీ ఆయన ఆలోచన, ఆచరణ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఆవేదనను అర్థం చేసుకోలేదు. అందుకే, ఇప్పుడీ నిరసన.
బాలు విగ్రహావిష్కరణలో పాల్గొన్నవారికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించిన చరిత్రే లేదు. అందుకే ఈ తీవ్ర నిరసనలు. ఎక్కడున్నా తెలుగువారమంతా ఒక్కటే. ఎక్కడున్న భారతీయులమంతా ఒక్కటే. ఈ ఐక్యత మరింత బలంగా ముందుకు సాగాలంటే బలవంతపు పెత్తనాలు, ఆధిపత్య పోకడలు కాదు- పరస్పర గౌరవాభిమానాలు అవసరం, అనివార్యం. ఇదే చరిత్ర మనకు చెపుతున్న సత్యం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
