ఈ ఏడాది ప్రారంభంలో కోర్టు ఆమోదం పొందినప్పటికీ కొత్త విమాన విధి సమయ పరిమితి(ఎఫ్డీటీఎల్) నియమాలు పూర్తిగా అమలు కాలేదని ఆరోపిస్తూ ఇండియన్ పైలట్స్ గిల్డ్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు డీజీసీఏ స్పందన కోరింది.
న్యూఢిల్లీ: ఇండియన్ పైలట్స్ గిల్డ్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 16న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి స్పందనను కోరింది.
వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభంలో కోర్టు ఆమోదం పొందినప్పటికీ కొత్త విమాన విధి సమయ పరిమితి(ఎఫ్డీటీఎల్) నియమాలను పూర్తిగా అమలు చేయలేదని పిటిషన్ ఆరోపించింది.
సిబ్బంది అలసట నిర్వహణను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలు రూపొందించబడ్డాయని; అయితే విమానయాన సంస్థలకు మార్పులు, మినహాయింపులు, రాయితీలివ్వడం ద్వారా- డీజీసీఏ హైకోర్టుకు ఇచ్చిన హామీలు, సూచనలను విస్మరించిందని; విమానాలు, ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలో పడేసిందని పిటిషన్లో పేర్కొనబడింది.
పౌర విమానయాన అవసరాలు(సీఏఆర్)2024 ఫ్రేమ్‌వర్క్‌ను ఉల్లంఘించి పైలట్ అలసట నిర్వహణకు సంబంధించిన నిబంధనలలో విమానయాన సంస్థలకు పొడిగింపులు, సడలింపులు ఇచ్చారని కూడా అది పేర్కొన్నది.
కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ అధికారులపై ధిక్కార చర్యలు ప్రారంభించాలని ఆ సంస్థ పిటిషన్లో కోరింది.
‘నిబంధనలు పాటించని ఎఫ్డీటీఎల్ పథకాలను ఆమోదించడం, విమానయాన సంస్థలకు మార్పులు-మినహాయింపులతోపాటు రాయితీలను మంజూరు చేయడం ద్వారా ప్రతివాదుల చర్యలు ఈ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించడమే’ అని పిటిషన్లో పేర్కొన్నట్టుగా పీటీఐ తెలిపింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, డీజీసీఏ మరొక కేసులో హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలు దశలవారీగా అమలు చేయబడతాయని చెప్పడం గమనార్హం.
ప్రతిపాదిత 22 విభాగాలలో 15 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయని, మిగిలినవి 2025 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నది.
డీజీసీఏ న్యాయవాది ధిక్కార పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, నియంత్రణ సంస్థకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయని; విమాన చట్టం, నిబంధనల ప్రకారం తాత్కాలిక, నిర్దిష్ట కేసు మినహాయింపులను మంజూరు చేసే అధికారం కోర్టుకు ఉందని అన్నారు.
ఇరువైపులా వాదనలు విన్న తర్వాత, జస్టిస్ అమిత్ శర్మ డీజీసీఏకి నోటీసు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ 2026 ఏప్రిల్ 17న ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
