మొంథా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. తుఫాను వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు తుఫాను వల్ల అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధమైయ్యాయి. చాలా ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, సూర్యారావుపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్ కర్నూల్, మహబూబాద్ , జనగాం, కరీంనగర్ మొదలైన జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తితో పాటు మిర్చి, మొక్కజొన్న మొదలైన పంటలు 5లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో పంటల విస్తీర్ణత ఇంకా ఎక్కువగా ఉంటుంది.
పంట నష్టంతో పాటు రెండు డిస్కింల పరిధిలో విద్యుత్ సంస్థకు 10 వేల కోట్ల దాకా నష్టం జరిగింది. 4,576 కిలోమీటర్ల మేర రహదార్లు దెబ్బ తిన్నాయి. 302 కల్వర్టులు ధ్వంసమయ్యాయి. రహదారుల మరమ్మతులకు 2,713 కోట్ల అవసరమని ఆర్అండ్బీ శాఖ మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ వల్ల జరిగిన మొత్తం నష్టం 5,265 కోట్లుగా ప్రాథమిక అంచనా వేశారు.
మరమ్మత్తుల లేమి..
తెలంగాణలో పంట కాలువల, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేక పోవటం; ముల్ల కంపలు, పూడికలతో కాలువలు నిండి ఉండటం వల్ల వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కాలువలకు, చెరువులకు గండ్లు పడి పంటలు ముంపుకు గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి కాలువలే లేవు.
తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు పంట నష్ట పరిహారంగా 10 వేల రూపాయల ప్రకటించింది. ఇది రైతుకు ఊరటనివ్వదు. ఎకరా సేద్యానికి 35 వేలకుపైగా రైతు పెట్టుబడి పెట్టాడు. కౌలు రైతులు అదనంగా కౌలు డబ్బులు చెల్లిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతు నిలదొక్కుకోవడానికి ఉపయోగపడదు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారం పెంచాలి. కౌలు రైతులకు పరిహారమే లభించడం లేదు. ప్రస్తుత బాధితులకు కూడా నష్ట పరిహారం ఇవ్వాలి.
“ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మొదలగు జిల్లాల్లో మొంథా తుఫాన్ వల్ల లక్షా 38 వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. 12,215 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయి. ఆక్వా రంగంలోని 32 వేల ఎకరాల్లో రైతాంగం నష్టపోయారు. 2,261 పశువులు చనిపోయాయి. 4,794 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్ల, కల్వర్టులు, వంతెనలు దెబ్బ తిన్నాయి. 311 కల్వర్టుల , వంతెనలకు నష్టం వాటిల్లింది. విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది” అని మొత్తం నష్టం రూ 5,244 కోట్లుగా తెలియజేస్తూ ప్రాథమిక అంచనా నివేదకను కూటమి ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
క్షేత్ర స్థాయి పరిశీలనలో నష్టం చాలా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. అనేక చెరువులు, వాగులకు గండ్లు పడి పంటలతో పాటు వందలాది గ్రామాలు నీట మునిగాయి. అనేక చోట్ల రాకపోకలు స్థంబించిపోయాయి. జనజీవన స్రవంతి స్థంబించిపోయింది. కొద్దిమంది చనిపోయారు.
ఊరటనివ్వని పరిహారం..
15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని కూటమి ప్రభుత్వం పంట నష్టాన్ని తక్కువ చేసి చెబుతుందనే విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వ పంట నష్టం తక్కువగా చెప్పడం ద్వారా రైతులకు నష్టపరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని తగ్గించుకోవడం కోసమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పంటలు కోల్పోయిన రైతాంగానికి ఇచ్చే పరిహారం కూడా వారికి ఊరట ఇవ్వటం లేదు. రైతు ఇప్పటికే ఎకరాకి 35 వేలు దాకా సేద్యానికి పెట్టుబడి పెట్టాడు. కౌలు రైతులు అదనంగా మరో 15 వేలు కౌలు రూపంలో చెల్లించాడు. ప్రభుత్వం ప్రకటించే నష్ట పరిహారం ఎకరాకు ఎంత అన్నది ఇంకా ప్రకటించలేదు. కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం ఇస్తామని చెబుతున్నా ఆచరణలో అమలు జరగడం లేదు.
వైసీపీ పాలన కాలంలో పంటల బీమా పథకానికి బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించి పంట నష్టానికి కొంత మేరకు పరిహారం అందేలా చేసింది. కారణం తెలియదు కానీ చంద్రబాబు ప్రభుత్వం రైతాంగం తరఫున ఈ సంవత్సరం ప్రీమియం చెల్లించలేదు.
బీమా ప్రీమియం చెల్లించనని కూటమి ప్రభుత్వం చెప్పినా, రైతులైనా చెల్లించుకునేవారు. ప్రీమియం చెల్లించని ఫలితంగా బీమా సంస్థల నుంచి నష్ట పరిహారం లభించక రైతులు నష్టపోతున్నారు. బీమా పరిహారం లభించి ఉంటే, అది రైతుకు ఉపయోగం ఉండేది. గత పంటల నష్టానికి గాను ఇన్పుడ్ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన 595 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు.
బాధ్యతను గాలికి వదిలేసిన పాలక ప్రభుత్వాలు..
పంటలు ముంపుకు గురైనప్పుడు, రైతాంగం నుంచి ఎటువంటి వంకలు పెట్టకుండా మద్దతిచ్చి ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి. మొంథా తుఫాన్ గురైన రైతుల నుంచి పంట కొనుగోళ్లు చేయాలంటే, పంట నష్ట పరిహారం కోసం పేర్లు నమోదు చేసుకోరాదని, చేసుకుంటే, నష్ట పోగా మిగిలిన పంటను మిల్లర్లు ఇచ్చే రేటుకు అమ్ముకోమని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశం లేదని అధికారులు కొన్ని ప్రాంతాల్లో రైతులకు తెగేసి చెబుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
ముంపు బారినపడిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనమని మిల్లర్లు ప్రకటించారు. మిల్లర్లు ఇచ్చిన రేటుకే అమ్ముకోవలసిన పరిస్థితుల్లో రైతులు బాగా నష్టపోతారు. పంట వివరాలు కూడా ఒక్క రోజులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అక్టోబర్ 31 తర్వాత పంట నష్టం నమోదు జరగదని అధికారులు నోటీసులు పంపారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైఖరిని రైతాంగం వ్యతిరేకిస్తూ, ఒక్క రోజులో పంట నమోదు ఎలా సాధ్యమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరదలు రావటానికి, పంటలు ముంపుకి గురి కావటానికి కారణమైన నదుల, వాగుల, కాల్వల, చెరువుల కర కట్టలను పటిష్ట చేయడం, పూడికలు తీయడం, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. ఈ పనుల చేయడంలో రాష్ట్ర పాలకుల వైఫల్యం వల్ల తుఫాన్ల సందర్భంగా పంటలకు అపార నష్టం జరుపుతున్నది.
రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగం, మోంథా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయి మరింత సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ బాధ్యతను పాలక ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి.
కౌలు రైతులతో సహా పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరాకి కనీసం 30 వేలు, మిగతా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 20 వేలు ఇవ్వాలి. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. చిన్న, సన్న కారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు రద్దు చేయాలి. పంట కాలువలు, డ్రైనేజీ కాలువలను ఆధునీకరించాలి. సహాయం పొందడం పాలకుల భిక్ష కాదని, అది తమ హక్కు అని రెండు రాష్ట్రాల రైతాంగం ఉద్యమించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
