బ్రెయిన్ డెడ్ అయిన వారు.. కాని వారు.. ఎవరైనా సరే..
ఎక్కడివారయినా సరే!
దయచేసి హృదయ దానం చేసే వారు మీకు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి!
మేం ఎవరిమని చూస్తున్నారా?
మా కులం మతం ఏంటని చూస్తున్నారా..!
ఇచ్చేవాళ్ళు కదండీ మీరు? మీకు ఎందుకు ఇవన్నీ?
అయినా వినండి
మేము 99% ప్రజలం
మాకు కులం లేదు
మేము శ్రామికులం
మాకు మతమూ లేదు
మేము శాంతికాముకులం
ఈ దివ్య భవ్య నిర్భర జాతిలో
కేవలం ఒక్క శాతంగా ఉండి
వందలు, వేలు, లక్షలు, కోట్లాది
జన జీవితాలను మరింత కిందికి తోస్తున్నారు వాళ్ళు..
మళ్ళీ మళ్ళీ తొక్కుతూ తోస్తూ
పదేపదే పైమెట్లు ఎక్కుతూనే ఉన్న
అ ఆలకు ప్రతీకలుగా నిలిచిన
అతి కొద్దిమంది వాళ్ళు
చట్టాలకు మొదట్లో చుట్టాలుగా ఉండి
తామే చట్టాలుగా మారిన బడాబాబులు
ఎక్కిన నిచ్చెనమెట్లము మేము
మాది ఏముందండీ?
ప్రధాన స్రవంతి మీడియాలో
ఒక చిన్న మూలన
కనబడీ కనబడినట్టుగా,
వినబడీ వినబడనట్టుగా
ఉండీ లేనట్లుగా ఉండే ఒక చిన్న వార్తాంశాలం
ప్రధాన వార్తలు వారివే;
ప్రత్యేక ఫోకస్ వారి మీదే;
స్పెషల్ బిగ్ డిబేట్లు వారితోనే..
ఎందుకంటే, చెప్పేది చెప్పించేది;
చేసేది చేయించేది వారే కదా
చర్చించేది; చర్చించబడింది; చర్చించామని చెప్పేదీ వారే కదా
మేము ప్రేక్షక దేవుళ్లం మాత్రమే!
మా పేరుతో తయారు చేసిన నైవేద్యం
ప్రసాద భోక్తల కొరకే
ఇప్పటికైనా దయచేసి చెప్పండి..
మా అందరికీ కావాలి
ఒక స్పందించే హృదయం
అవయవ దానంగా
ఒక్కటైనా ఇప్పించండి అందరం కలిసి పంచుకుంటాం
మా కోసం మాత్రమే కావాలనేంత స్వార్థపరులం కాదు
మా తరువాతి తరాల కోసం
ఆ తర్వాతి తరాల కోసం కూడా
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
