
కవి తన వర్తమాన పరిస్థితులను కవిత్వీకరిస్తాడు. తాను చూసిన, తన హృదయాన్ని కలిచివేసిన సందర్భాలను అక్షరీకరించి, వర్తమానాన్ని చరిత్రీకరిస్తాడు. సమాజం తిరోగమిస్తుంటే తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపి పురోగమింపచేస్తాడు. సమాజ భవిష్యత్తును తన కలంతో దిశానిర్దేశం చేస్తాడు. అందరు కవులు ఇలానే ఉంటారని చెప్పలేము కానీ, ఇటువంటి మహోన్నతమైన లక్ష్యంతో జీవితాన్ని వెళ్లదీసిన కవులలో, తెలుగు సాహితీ సీమలో ఎన్నదగిన కవిగా కవిసామ్రాట్ గుర్రం జాషువా కనబడతారు.
“రాజు మరణించెనొక తార రాలిపోయే/ సుకవి మరణించెనొక తార గగనమెక్కె/ రాజు జీవించు రాతి విగ్రహములయందు/ సుకవి జీవించు ప్రజల నాల్కల యందు” అని చాటి చెప్పిన గుర్రం జాషువా కాలాతీతమైన వ్యక్తిగా మనకు కనబడతారు. ఆయన చెప్పిన ఈ కవితా వాక్యాలు ఆయనకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుతం ఆయన జీవించి లేకపోయిన, ఆయన రచనలతో ప్రజల నాలుకల మీద కదలాడుతున్నారు.
చిన్నప్పటి నుంచి అవమానాలను, చీత్కారాలను చిరునవ్వుతో ఎదుర్కొని సామాజిక ప్రయోజనం కోసం జాషువా రచనలు చేశారు. ఒక విప్లవ కెరటమై ప్రజలలో చైతన్యాన్ని నింపారు.
1895 సెప్టెంబర్ 28న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో గుర్రం జాషువా జన్మించారు. గుర్రం జాషువా తల్లిదండ్రులైన గుర్రం వీరయ్య- లింగమ్మ కులాంతర వివాహం చేసుకోవడం వల్ల, ఆనాటి సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ కులాంతర వివాహ ప్రభావం గుర్రం జాషువా మీద కూడా చూపించింది. తండ్రి యాదవ కులానికి, తల్లి మాదిగ కులానికి చెందడంతో చిన్నప్పటి నుంచి అనేక అవమానాలు, ఛీత్కారాలను, కష్టాలను జాషువా ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటికి ప్రతిబంబం మనకు ఆయన రచనలలో కూడా కనబడుతుంది.
ఒక వ్యక్తి తాను ఏ సమాజం వల్ల అణిచివేతకు గురయ్యాడో, ఆ సమాజం వల్ల జరిగిన నష్టాన్ని ఆ వ్యక్తి వ్యక్తం చేస్తాడు. గుర్రం జాషువా రచనలను పరిశీలిస్తే మనకు ఇది స్పష్టంగా అర్థమవుతుంది.
“ఇది భయంకర దేశము/ వర్ణభేదముల్ గూడలు గట్టినవనరాదు పంచమ జాతివారికిన్/ కూడు హుళక్కి, మానవత గూడ హుళక్కి, హుళక్కి జన్మమున్” అని తీవ్ర ఆవేదనను జాషువా వ్యక్తం చేస్తారు. దొంతరులుగా చీలపడ్డ సమాజంలో మనిషిని మనిషిగా చూడరు. ఇటువంటి సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనబడదు. పంచముడని వెలివేసి దళితులను హింసించిన ఈ దేశం భయంకరమైనదని చెప్పిన జాషువా వేదనతో పాటు ఆగ్రహం ఈ రచనలో మనకు కనబడుతుంది.
గత పదిసంవత్సరాల ప్రభావం వల్ల, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మతం, కులం, భాష సమాజంలోని ప్రజల మధ్య ఏదో ఒకరకంగా చిచ్చుపెడుతోంది. చిచ్చుపెడుతోందనే కంటే తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అధికారంలో ఉన్న పాలకులు ప్రజలను మానసికంగా విభజించి, చిచ్చుపెడుతున్నారంటే సబబుగా ఉంటుంది. దాదాపు ఇలానే కాకపోయిన, ఇటువంటి ప్రస్తుత దశ స్వాతంత్య్రానికి ముందు కూడా ఉండేది. ఈ పరిస్థితులను జాషువా తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ తనను తాను విశ్వనరుడిగా చెప్పుకొచ్చారు.
“కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి/ పంజరాన గట్టు వడను నేను/ నిఖిలలోక మెట్లు నిర్ణయించిన/ నాకు తిరుగు లేదు విశ్వనరుడ నేను” ఈ కవితా పంక్తులతో గుర్రం జాషువా తనను తాను విశ్వనరుడనని చెప్తూనే, ఎవరు కూడా గీతలు గీసుకొని చట్రాలలో బంధించపడకూడదని హితబోధ చేస్తూ, ప్రతి వ్యక్తి విశ్వనరుడేనని అన్యోపదేశంగా తెలియజేస్తారు.
సామాజిక మార్పును ఆకాంక్షిస్తూ గుర్రం జాషువా అనేక రచనలు చేశారు. దళితులు ఎదుర్కొంటున్న అన్యాయాలు “గబ్బిలం”లో తెలియజేస్తారు, పర్షియన్ కవి వేదన “ఫిరదౌసి”లో కనబడుతుంది, “క్రీస్తు చరిత్ర” ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. ఎంతో ప్రభావాన్ని చూపిన జాషువా రచనలలో ఈ రచనలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.
తన రచనలతో సమాజం మీద ప్రభావాన్ని చూపిన గుర్రం జాషువా ఎన్నో పురస్కారాలను, బిరుదలను అందుకున్నారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ”తో సత్కరిస్తే, భారత ప్రభుత్వం “పద్మభూషణ్”పురస్కారంతో గౌరవించింది. కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి బిరుదలను కూడా జాషువా అందుకున్నారు. తెలుగు సాహిత్యాకాశంలో ధ్రువతారలా మెరిసే గుర్రం జాషువా 1971లో జూలై 24న గుంటూరులో తుదిశ్వాస విడిచారు.
జాషువా రచనలలో మానవత్వం కనబడుతుంది. వర్ణ, వర్గ, కుల, మత తారతమ్యాలు చూపకుండా మనిషినిమనిషిగా ప్రేమించమని హితబోధ ఉంటుంది. అన్ని విధాలుగా తిరోగమిస్తున్న ప్రస్తుత సమాజానికి గుర్రం జాషువా రచనలు చీకటిలో దీపంలా దారి చూపుతాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.