వాకౌట్లు, బిల్లులను జాప్యం చేయడం, ఘర్షణలు పడటం ద్వారా భారతీయ జనతా(బీజేపీ) పార్టీయేతర ప్రభుత్వాలతో తరచుగా గవర్నర్లు ఢీకొంటున్నారు.
వారి అధికారాల్లో కోత విధించాలని, వారి ప్రసంగాలను రద్దు చేయాలని లేకుంటే పదవినే రద్దు చేయాలనే డిమాండ్లు మళ్లీ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
బీజేపీ మినహా ఇతర పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలపై గవర్నర్లను ఆయుధాలుగా ప్రయోగిస్తున్నారు.
దీంతో ఎంతో వివాదాస్పదమైన వ్యవస్థ పాత్ర, నిర్వచనంపై మళ్లీ చర్చ మొదలైంది.
చట్టసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని పక్కకు పెట్టాలని కొందరు సూచిస్తుండగా; ఈ పదవినే రద్దు చేయాలని లేదా అభిశంసనకు అవకాశం కల్పించాలని ఇతరులు కోరుతున్నారు.
ప్రసంగాల చుట్టూ ముదిరిన వివాదం
బీజేపీయేతర రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర కేబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని చదవడానికి తిరస్కరించడం, కొన్ని భాగాలను చదవకపోవడంతో తాజా సంఘర్షణ తలెత్తింది.
తమిళనాడు, కర్ణాటక గవర్నర్లు సభ నుంచి మధ్యలో వెళ్లిపోవడమే కాకుండా; తమ చర్యలను సమర్థించుకుంటూ లోక్(రాజ్)భవన్ నుంచి ప్రకటనలు ఇవ్వడం కూడా జరుగుతోంది.
గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో ఒకరైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణలు కోరతానని పదేపదే చెబుతున్నారు.
బీజేపీ ప్రభుత్వ నియంతృత్వానికి ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) కూటమి ఎప్పటికీ తలొంచబోదని ఆయన స్పష్టం చేశారు.
కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రసంగంలో గవర్నర్ విస్మరించిన భాగాలను తాను చదివి, పూర్తి ప్రసంగాన్ని సభ చేత ఆమోదింపజేసుకున్నారు.
డీఎంకే ప్రభుత్వానికి తమిళనాడు గవర్నర్‌కు మధ్య- గవర్నర్‌గా ఆర్ఎన్ రవి నియమించబడిన 2021 మే నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి.
2022లో తన సాంప్రదాయ ప్రసంగం చేశారు కానీ 2023 నుంచి కొన్ని భాగాలను విస్మరించడం, తన సొంత వాక్యలను జోడించడం మొదలు పెట్టారు. 2024, 2025లో ప్రసంగాన్ని చదవకుండానే రవి వాకౌట్ చేశారు.
రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా గవర్నర్ చర్యలను రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ తోలుబొమ్మలాగా వ్యవహరించారని, ఢిల్లీలో తయారు చేసిన ప్రసంగాన్ని చదివారని ఆరోపించారు.
కర్ణాటక గవర్నర్ మొదట ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి తిరస్కరించారు. ఆ తరువాత తన ప్రణాళిక మార్చుకున్నారు.
కేవలం మూడు లైన్లను చదివి సభ నుంచి వెళ్లిపోయారు.
గవర్నర్ తన రాజ్యాంగ బాధ్యతలను ఉల్లంఘించినందుకు, ఆయనపై కర్ణాటక ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కూడా సిద్ధమైంది.
కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ సైతం చట్టసభలను ఉద్దేశించి గవర్నర్లు ప్రసంగం చేసే అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
దీనిని ప్రాముఖ్యత, ఉద్దేశం, పవిత్రత కోల్పోయిన వలసపాలన హ్యాంగోవర్గా ఆయన పేర్కొన్నారు.
పదవి రద్దుకు పెరుగుతున్న డిమాండ్లు
గవర్నర్ పదవిని రద్దు చేయాలని ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే యువజన విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక సదస్సులో తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
మళ్లీ మార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) నాయకుడు వైకో తమిళనాడు గవర్నర్‌గా ఆర్ఎన్ రవిని తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి ఒక మెమోరాండం సమర్పించారు.
గవర్నర్ పదవి సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు సరికాదని పేర్కొంటూ, ఆ పదవిని రద్దు చేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2016 తొలి రోజులలో పిలుపునిచ్చారు.
గవర్నర్ నియామకాలలో పారదర్శకత ఉండాలని కూడా కోరారు.
భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ఇదేవిధంగా గవర్నర్ పదవిని రద్దు చేయాలని కోరింది.
ఈ డిమాండ్‌ను సమర్థించే సీనియర్ నాయకుల్లో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ, తృణముల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు సౌగత రాయ్, మాజీ బ్యూరోక్రాట్ మాధవ్ గాడ్బోల్ ఉన్నారు.
ఇతర విచక్షణేతర వివాదాలు
గవర్నర్ క్రియాశీలత్వం ఇతర వివాదాలను కూడా రేకెత్తించింది. కేరళలో, గవర్నర్ తనకు పంపిన అత్యంత విశ్వసనీయమైన లేఖ తనకు చేరకుముందే మీడియాలోని కొన్ని సెక్షన్లకు లీకు చేయబడిందని అసెంబ్లీ స్పీకర్ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన ఇద్దరు శాసనసభ్యులు రాజ్‌భవన్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో, అసెంబ్లీ స్పీకర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. స్పీకర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ గవర్నర్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
గవర్నర్లు స్వల్ప విచక్షణాధికారాన్ని ఉపయోగించడానికి మాత్రమే ఉద్దేశించబడ్డారని రాజ్యాంగ పరిషత్ చర్చలు తెలియజేస్తున్నాయి. గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా పని చేయడం కానీ, ఎన్నికైన ప్రభుత్వాలలో జోక్యం చేసుకోవడం కానీ చేయరాదని రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు, మొదటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నొక్కిచెప్పారు.
గవర్నర్లకు విస్తృతాధికారాలు కట్టబెట్టిన 1935 నమూనాను పునరుద్ధరించడాన్ని రాజ్యాంగ పరిషత్ తిరస్కరించింది.
భారతదేశం పాశ్చాత్య ప్రభుత్వ నమూనాను అనుసరిస్తోంది కానీ, బ్రిటీష్ చక్రవర్తి ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం నుంచి భారతదేశ గవర్నర్ల తరహాలో ఎన్నడూ పక్కకు పోలేదు.
మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ గవర్నర్ ప్రసంగాన్ని అర్థరహితమైన లాంఛనంగా వర్ణించారు. ప్రసంగంలో “నా ప్రభుత్వం” బదులు “ప్రభుత్వం” అని చేర్చాలని సూచించారు.
గవర్నర్ ప్రసంగం తిరస్కరించబడటాన్ని ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానంగా పరిగణించే విషయంపై అనేక మంది న్యాయ నిపుణులు సైతం ప్రశ్నలు లేవనెత్తారు.
తత్తవేత్తలు, మిత్రులు, మార్గదర్శకులుగా గవర్నర్లను ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విమర్శకుల అభిప్రాయం ప్రకారం, చట్టసభల నుంచి వాకౌట్ చేయడం లేదా ఎన్నికైన ప్రభుత్వాలతో చెలగాటమాడని బ్రిటీష్ గవర్నర్ జనరల్స్‌కు మించి నేటి గవర్నర్లు పెత్తనం చెలాయిస్తున్నారు.
అటువంటి బ్రిటీష్ గవర్నర్ జనరల్స్‌లో ఒకరైన వారెన్ హేస్టింగ్స్ సైతం అభిశంసనకు గురయ్యారు.
పెత్తనం- వ్యక్తిగత ఆరోపణలు
తప్ప్పుచేసిన గవర్నర్లను అభిశంసించడానికి సర్కారియా కమీషన్ 1988లో ఒక యంత్రాంగాన్ని సిఫారసు చేసింది. అయినప్పటికీ, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను విస్మరించాయి. దానికి బదులు, కేంద్ర ఏజెన్సీల పనులను సమన్వయం చేయడంతో పాటు, గవర్నర్లకు కార్యనిర్వాహక అధికారాలు ఇవ్వాలనే సూచనలు కూడా చేశారు.
ఇటీవలి వివాదాలు విమర్శలకు దారితీస్తున్నాయి. తనకు విలాసవంతమైన కారును పంపకపోవడంపై తలెత్తిన వివాదంలో ఒడిశా గవర్నర్ కుమారుడు రాజ్ భవన్ ఉద్యోగిపై దాడి చేశారు. అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేసినప్పటికీ పోలీసులు చర్య తీసుకోవడానికి నిరాకరించారని అ అధికారి భార్య సయోజ్ తెలిపారు.
“నా భర్తను బలవంతంగా నేరస్తుల గదిలోకి ఈడ్చుకెళ్లి దాడి చేశారు” అని ఆమె మీడియాకు తెలిపారు. ఆ తరువాత ఆ అధికారిని బదిలీ చేశారు.
ఇదే గవర్నర్ అంతకు ముందు తన కోడలి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో, గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఆరోపించారు. అతను ఆరోపణను తిరస్కరించారు. అయినప్పటికీ, గవర్నర్ పదవిలో ఉండగా తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరగకుండా రక్షణ కవచంగా రాజ్యాంగం నిలుస్తోంది.
చట్టసభలు ఆమోదించిన బిల్లులను ‘పాకెట్ వీటో’గా పిలువబడుతున్న ఒక పద్ధతి ద్వారా గవర్నర్లు ఆమోదించకుండా తొక్కిపెట్టడం కూడా విమర్శలకు దారితీస్తోంది. బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో పెట్టరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల నియామకాలలో గవర్నర్లు జోక్యం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం కూడా అవసరమైంది. సుప్రీంకోర్టు రాష్ట్రాల వారీగా జోక్యం చేసుకోవడం ప్రారంభించిన తరువాత రాష్ట్రాల విశ్వవిద్యాలయాలలో కష్టసాధ్యమైన ప్రశాంతత సాధ్యమైంది, ఇప్పటికీ కొనసాగుతోంది.
(వ్యాస రచయిత పీ రామన్ వెటరన్ జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత. ఇంగ్లీష్ వ్యాసాన్ని తెలుగులోకి పీ నరసింహారావు అనువదించారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
