ఉమ్మడి- అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల స్థితిగతుల మీద ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ క్షేత్రస్థాయి సర్వే నివేదికను విడుదల చేశాయి. తమ సమస్యలను ఏ ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదని ఎక్కవ శాతం కౌలురైతులు భావిస్తున్నట్టుగా సర్వే నివేదిక వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వేను నిర్వహించాయి. 26 జిల్లాల్లో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ సర్వే కొనసాగింది. ఒక్కొక్క జిల్లా నుంచి 100- 125 శాంపిల్స్ చొప్పున దాదాపు 3000 శాంపిల్స్‌ను సర్వేయర్లు సేకరించించారు.
క్షేత్రస్థాయి సర్వే నివేదిక ప్రకారం, కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం సభ్యులు సేకరించిన డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, విశ్లేషించి నివేదికను రూపొందించింది. కౌలురైతు గుర్తింపుకార్డును ప్రభుత్వం ఇచ్చిందాని రైతులను సర్వేయర్లు ప్రశ్నించినప్పుడు; 87.7% మంది ఇవ్వలేదని, కేవలం 12.3% మంది మాత్రమే ఇచ్చిందని చెప్పారు.
నాలుక మడెతేసిన ఎన్డీఏ ప్రభుత్వం..
నివేదికలో తెలియజేశారు కదా, 2024 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం కౌలురైతులకు గుర్తింపు కార్డులను కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. అంతేకాకుండా, కౌలు రైతుల గుర్తింపుకు ప్రతిబంధకంగా తయారైన పంట సాగుదారు హక్కు చట్టం(సీసీఆర్సీ) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇది కూడా అమలుకాకపోవడంతో కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రజాగళం పేరిట ఎన్డీఏ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాలతో పాటు, పంట బీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తుంది. అయినా, హామీ అమలుకాకపోవడంతో కూటమి ప్రభుత్వంపై కౌలు రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని సర్వేయర్లు ప్రశ్నిస్తే, తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4%, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7%, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9%, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9%, రుణమాఫీ చేయాలని 10.5% మంది కోరారు.
వ్యవసాయం చేయడానికి సంవత్సరానికి ఎంత పెట్టుబడి అవసరమౌతోందని కౌలురైతులను ప్రశ్నించినప్పుడు; 60 వేలకు పైన 34.3%, 40వేల నుంచి 60 వేల వరకు 23.8%, 25 వేల నుంచి 45 వరకు 34.8%, 10 వేల నుంచి 25 వేల వరకు 7.2% మంది కౌలురైతులు తెలిపారు.
వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి సహాయానికి ఎవరిపైన ఆధారపడుతున్నారని కౌలురైతులను ప్రశ్నించగా- వడ్డీ వ్యాపారుస్తుల నుంచి 38.1, రైస్ మిల్లర్లు, దళారులు, వ్యాపారస్థుల నుంచి 28.8, కోఆపరేటివ్ బ్యాంకులు నుంచి 13.5, భూయజమానుల నుంచి 12.7, జాతీయ బ్యాంకుల నుంచి 2.5% ఆర్థిక సహాయం పొందుతున్నామని కౌలురైతులు తెలిపారు.
ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకునే అప్పుకు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారని ప్రశ్నించినప్పుడు, 2 రూపాయలు చెల్లిస్తున్నామని 79% మంది కౌలురైతులు చెప్పారు. రూపాయిన్నర చెల్లిస్తున్నామని 6.7%, ఒకరూపాయి చెల్లిస్తున్నామని 1.8%, 3 రూపాయలు చెల్లిస్తున్నామని 8.2% మంది తెలిపారు.
ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారని కౌలురైతులను ప్రశ్నించగా 60 వేల పైన 26.5, 40 వేల నుంచి 60 వేల వరకు 21.5%, 20 వేల నుంచి 40 వేల వరకు 33.8%, 10 వేల నుంచి 20 వేల వరకు 13.3%పెట్టుబడి పెడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఒక పంట సాగుచేస్తే సంవత్సరానికి ఎంత ఆదాయం కౌలురైతులకు వస్తుందని ప్రశ్నిస్తే, 25వేల పైన ఆదాయం వస్తోందని 28.1%, లాభం లేదు- నష్టం లేదని 19.4% మంది తెలుపగా నష్టం వస్తోందని 15.4% మంది తెలిపారు. కూలీలకే దాదాపు 69.8% ఖర్చు చేస్తున్నామని కౌలురైతులు చెప్పారు.
ప్రస్తుతం ఎంత అప్పు ఉందని కౌలురైతులను ప్రశ్నించగా; 5 లక్షల పైనని 20.4%, 3- 5 లక్షల వరకు 14.5% , లక్షన్నర నుంచి 3 లక్షల వరకు 34.6%, 50 వేల నుంచి లక్షా 50 వేల వరకు 21.5%, 50 వేల కన్నా తక్కువ 9% మందికి అప్పు ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.
తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు పెరిగిపోవడమని 67.2% మంది కౌలురైతులు తెలుపగా; ఎక్కువ కౌలు వల్ల అని 12.5%, గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్ల అని 10.8%, అధికవడ్డీలతో అప్పులు పెరిగిపోవడమని 5.5%, మార్కెటింగ్ సమస్యల వల్ల అని 4% మంది చెప్పారు.
కౌలురైతులు ముఖ్యంగా ఎరువుల విషయంలో, పంట నష్టం వచ్చినప్పుడు భూయజమాని కౌలు తగ్గించకపోవడం, అకాలవర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ప్రకటించే అరకొర సహాయం కూడా కౌలురైతులకు అందకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.
ఎకరానికి కౌలు ఎంత మొత్తంలో, ఏ విధంగా చెల్లిస్తున్నారని రైతులను సర్వేయర్లు ప్రశ్నించారు. దీనికి కొంతమంది నగదు, మరికొంతమంది ధాన్యం రూపంలో అని చెప్పారు. సంవత్సరానికి 35 వేలకుపైన భూయజమానులకు కౌలు చెల్లిస్తున్నామని 5.1%, 25 వేల నుంచి 35 వేలని 8.7%, 10 వేల నుంచి 25 వేలు 27.3%, 10 వేల కన్నా తక్కువని 22.4% మంది తెలియజేశారు.
సంవత్సరానికి ఎకరానికి 20 నుంచి 30 బస్తాలు(ధాన్యం) భూయజమానులకు కౌలుకింద పంటలో భాగం ఇస్తున్నామని 13.2, 15 నుంచి 20 బస్తాలు(ధాన్యం) 8.7, 10 నుంచి 15 బస్తాలు(ధాన్యం) 14.5% మంది ఇస్తున్నామని సర్వేయర్లు అడిగిన ప్రశ్నకు రైతులు బదులిచ్చారు. అంతేకాకుండా కౌలు ఒప్పందం మాట రూపంలో 92.3%, రాతపూర్వకంగా 3.9%, రెవెన్యూ రికార్డులో నమోదు ద్వారా అని 2.6% చెప్పారు.
10 ఎకరాలకు పైగా కౌలు తీసుకుంటున్న రైతులు 15.9%, 4- 10 ఎకరాలు 34.8%, 1- 3 ఎకరాలు 43.6%, ఒక ఎకరం కంటే తక్కువ 5.7% మంది భూయజమానుల నుంచి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. 20 సంవత్సరాలకు పైగా కౌలుకు వ్యవసాయం చేస్తున్న రైతులు 35.5% ఉండగా, 11 నుంచి 20 సంవత్సరాల వరకు 17.4%, 6 నుంచి 10 సంవత్సరాలు 20%, 1 నుంచి 5 సంవత్సరాల వరకు 27% మంది ఉన్నారు.
కౌలుచట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్..
సామాజికంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారాని కౌలు రైతులను సర్వేయర్లు ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగుబలహీనవర్గాల నుంచి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజికవర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు చెప్పారు. కౌలు ధరల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులు ఉన్నట్లు సర్వే నివేదిక తెలియజేసింది. కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది.
క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా కౌలురైతులతో సర్వేయర్లు మాట్లాడినప్పుడు; నూతనంగా తీసుకొస్తామని చెప్పిన కౌలు చట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే భావనలో అత్యధిక శాతం మంది కౌలురైతులు ఉన్నారు. రాష్ట్రప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చని పలుచోట్ల కౌలురైతులు అభిప్రాయపడ్డారు.
కౌలుదారుల కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 సదస్సులను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సేకరించిన సమాచారాన్ని చెత్త బుట్టలో వేశారా? లేక పరిగణలోనికి తీసుకుంటారా? అనే విషయంపై స్పష్టత లేదని పలు చోట్ల రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సహాయం చేయని ప్రభుత్వం..
నివేదికలో తెలియజేసిన దాని ప్రకారం, గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు. దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది. ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించాల్సివస్తోంది.
వర్షాభావం, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. అంతేకాకుండా చాలా మంది కౌలు రైతులు నోటి మాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని కౌలుకు తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు. ఫలితంగా సాగుచేయడానికి భూమిని, పంటను కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలు రైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు, దీంతో దిగుబడి తగ్గుతోంది.
కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద భూయాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు. కౌలు రైతులకు సహాయం చేయడానికి రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు.
భూయజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని ఎక్కువ శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.
సర్వే నివేదిక పేర్కొన్న దాంట్లో, కోనసీమ జిల్లా ఐ పోలవరం గ్రామంలో ఓ సామాన్య రైతు చెప్పిన యధార్థ కథ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల పరిస్థితికి అద్దం పడుతుంది. దాదాపు రాష్ట్రంలోని కౌలు రైతులంతా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
భూ యజమానికి లాభాలు..
భూ యజమానికి పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ 20,000 మూడు దఫాలుగా ఇస్తున్నాయి. బ్యాంకు నుంచి రెండు ఎకరాలకు “స్కేల్ ఆఫ్ ఫైనాన్స్“ ప్రకారం సుమారు రూ 80 వేలు రుణం తీసుకుంటారు. లక్ష రూపాయలు లోపు రుణం తీసుకున్న వారికి సకాలంలో చెల్లిస్తే సున్నా వడ్డీ కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఆ భూయజమాని బ్యాంకుకు వడ్డీ కట్టవలసిన అవసరం లేదు. పైగా ఆ రూ 80వేలు బయట వ్యక్తులకు వడ్డీకి నూటికి రెండు రూపాయల చొప్పున ఇస్తే సుమారు రూ 20 వేలు ఆదాయం వస్తుంది. కౌలు రూపంలో రెండు ఎకరాలకుగాను సుమారు రూ 78 వేలు పైగా ఆదాయం వస్తుంది. సంవత్సరానికి లక్ష పద్దెనిమిదివేల రూపాయల ఆదాయం భూయజమానికి సమకూరుతుంది.
భూ యజమానులు సంపాదించిన డబ్బులు బ్యాంకులో పెడితే ఆదాయ పన్ను చెల్లించాలి. భూములకు ఎటువంటి పన్నులు లేవు కాబట్టి భూములు కొనుగోలు చేసి ఆదాయాన్ని ఆదా చేసుకుకోవడానికి ఇది భూమి కొనుగోలు ఒక వనరుగా మారింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలు ధాన్యం, ఇతర పంటలు అమ్ముకున్నప్పుడు మద్దతు ధరతో పాటు కాటా, హమాలీ కూలీ, రవాణా ఖర్చులు కూడా ఇస్తున్నాయి. పంటల ధరలు మాత్రమే లెక్కగట్టి కౌలురైతులకు ఇస్తున్నారు. కాటా కూలీ, హమాలీ కూలీ, రవాణా చార్జీలు మాత్రం భూయజమానులే ఉంచుకుంటున్నారని కౌలురైతులు చెబుతున్నారు. ఇది ఒక కనిపించని మరొక ఆదాయం.
సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు ముఖ్యంగా ట్రాక్టర్ లాంటివి కూడా భూయజమానులకే ఇస్తున్నారు. వీటిని కౌలు రైతులకు భూయజమానులు రెంట్‌కు ఇస్తున్నారు. ఇది లెక్కలోకి రాని అదనపు ఆదాయం. కొనుగోలు కేంద్రాలలో పంటల అమ్ముకునే సందర్బంలో పంటల ధరలు తగ్గినప్పుడు బోనాస్, ఇన్సింటీవ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఇస్తుంది. అవి కూడా భూయజమానులకే వెళ్తున్నాయి.
భూములను కౌలుకు ఇచ్చిన యజమానులు ఆ గ్రామంలో ఎక్కువ మంది ఉండటం లేదు. వీరంతా వివిధ పట్టణాల్లో, రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. వాళ్ళ భూమికి రక్షణ అవసరం. అటువంటి నేపథ్యంలో భూమిని కౌలుకు ఇచ్చి కౌలురైతును సంరక్షుడిగా పెట్టుకుంటున్నారు. అంటే కాపలదారుడుగానూ, వాచ్మెన్గానూ ఉంటున్నాడు
భూమిని కౌలుకు తీసుకున్న కౌలు రైతు ఆ భూమిలో రాళ్లు, రప్పలు ప్రతి సంవత్సరం తీసివేసి భూమిని నిరంతరం శుభ్రం చేస్తూ తన శ్రమ ద్వారా ఆ భూమి విలువను పెంచుతాడు. భూయజమాని అవసరమై ఆ భూమిని అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారులు ఆ భూమిని చూసి ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు. ఇది ఒక ప్రయోజనం.
ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో భూయజమాని ఇంట్లో శుభ, అశుభ కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో భూమిని కౌలు తీసుకున్న కౌలు రైతులు ఆ ఇంటికెళ్లి కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. అది వివిధ రూపాల్లో ఉంటుంది. కొన్ని పనులకు విలువ కట్టలేం. ఇది ఒక రకమైన సామాజిక(వెట్టిచాకిరి) సర్వీసు. భూమిని కౌలుకు ఇచ్చాడనే దృక్పథంతో కౌలు రైతులు కొన్ని పనులు చేస్తారు. ఇది కూడా భూ యజమానికి ప్రయోజనమే.
ఇవి గాకుండా ప్రకృతి వైపరీత్యాలు వల్ల పంటల దెబ్బతింటే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం భూ యజమానికే వెళ్తాయి. పెట్టుబడి పెట్టిన కౌలురైతుకు కనీసం ఖర్చు కూడా రాకుండా వీధిలో పడతాడు. కౌలు దోపిడీ, వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీ, ఇన్పుట్ ధరల దోపిడీ(విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు నిరంతరం పేరుగుదల) వీటికి తోడు ప్రకృతి విపత్తులతో కౌలురైతులు అల్లాడిపోతున్నారు. చెమట చుక్క చిందించకుండానే భూయజమాని అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు.
పంట వేసినప్పుడు దిగుబడి వస్తుందో రాదో, మద్దతు ధర దక్కుతుందో లేదో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని తీవ్రమైన ఆందోళనతో కౌలురైతు మానసికంగా కృంగిపోతుంటారు. దీంతో అనేక రోగాలకు, రుగ్మతలకు కౌలురైతులు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వేరే మార్గం లేక ప్రభుత్వాలు కనుకరించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భాదిత కుటుంబాలకు కౌలుగుర్తింపు కార్డు(భూయజమాని కార్డు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో) లేకపోవడం చేత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్ గ్రేషియా అందనటువంటి దయనీయమైన స్థితిలో కౌలు రైతులు ఉన్నారు.
ఓట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ పథకం పెడితే బ్యాంకులో ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నారు. దీని వల్ల కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకాల ద్వారా భూ యజమానులే లబ్ధి పొందుతున్నారు.
ఒక మాటలో చెప్పాలంటే యజమానిని బతికించడం కోసమే కౌలురైతులు బతుకుతున్నారా? అన్నఆలోచన రాకతప్పడం లేదు. భూమిని కౌలుకు ఇచ్చిన భూ యజమానులకు(వ్యవసాయానికి సంబంధించిన) ఎటువంటి ఆందోళనలు, మానసిక వత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏ రోగాలు లేకుండా జీవితం గడుపుతున్నారు. పైగా కౌలురైతులపై వివిధ ఆరోపణలు చేస్తుంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 25శాతం మంది భూయజమానులే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి కొంతమంది సొంత భూమితో పాటు, మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా సొంత భూమి లేని పేదలు కౌలుకు భూమి తీసుకుని సాగు చేసే వారు గణనీయంగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల ప్రాథమిక స్థితి!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
