“ఇప్పటి వరకు జరిగిన సైన్సు పరిశోధనల్లో ఎక్కడా దేవుని అవసరం రాలేదు” అని ప్రముఖ గణిత, భౌతిక సిద్ధాంత కర్త స్టీఫెన్ విలియం హాకింగ్ అన్నారు.
సైన్సు అభివృద్ధి చెందని దశలో మనిషి ప్రకృతిని అర్ధం చేసుకుంటున్న దశలో దేవుడనే ఒక శక్తి ఈ విశ్వాన్ని సృష్టించిందని విశ్వసించడం జరిగింది. మనిషి అవగాహనకు ప్రకృతికీ మధ్య పెద్ద అగాధం ఉన్నప్పుడు; ఆ అగాధంలో దేవుడనే భావన గట్టిగా తిష్టవేసింది. ఆ భావనే అధిక సంఖ్యాకుల మీద ప్రభావం చూపింది. ఇప్పటికీ చూపుతూ ఉంది.
ఈ నేపథ్యంలో సైన్సు క్రమంగా అభివృద్ధి చెందుతూ- ప్రకృతి, గ్రహాలు, విశ్వాంతరాళం గురించి వివరాలన్నీ మనిషికి అందించింది.
మానవ శాస్త్ర సాంకేతిక విజయాలు సృష్టి రహస్యాలని తేటతెల్లం చేశాయి. దీంతో ప్రాథమిక దశలో మనిషి ఏర్పరుచుకున్న దైవభావన బీటలు బారింది. ఈ విశాల విశ్వంలో జరిగే ప్రతి సంఘటనా, సైన్సుకు అతీతమైందేమీ కాదు. జరుగుతోన్న ప్రతి అద్భుతాన్ని సైన్సు వివరించగలుతోంది.
విశ్వ నిర్మాణాన్ని వైజ్ఞానికంగా వివరించగలిగే సిద్ధాంతాలు, సూత్రీకరణలు మన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సుదీర్ఘ పరిశోధనా ప్రయాణంలో మనిషికి “దేవుడి” ఆచూకీ దొరకలేదు. దొరికే సూచనలూ లేవు. అందుకే “విశ్వనిర్మాణంలో దేవుడి అవసరం లేదు” అని వైజ్ఞానికులంతా ఘోషిస్తున్నారు. ఈ దశలో ఆదిమ సమాజంలో ఆదిమానవుడి భ్రమకు, ఊహకు ఏం విలువ ఉంటుంది? ఆ భ్రమ చుట్టూ అల్లుకున్న కథలు, కావ్యాలు, పనికిరాని బల్లి శాస్త్రాలు ఎలా ప్రామాణికమవుతాయీ?- అదే హేతువాదులూ, మానవవాదులిప్పుడు వేస్తున్న ప్రశ్న!
కల్పనా చాతుర్యాం..
ప్రపంచంలో ఎవరికీ తీసిపోని విధంగా మనవాళ్లు సృజనాత్మక సాహిత్యం పండించారు. ఆ విషయం తప్పకుండా ఒప్పుకోవాలి. ఆ కల్పనా చాతుర్యానికి ఒకింత తల కూడా పైకొత్తొచ్చు. అంత వరకే ఆ కలప్పనా సాహిత్యాన్ని ఆధారం చేసుకుని వాస్తవ జీవితంలో విలువల్ని ప్రతిష్ఠిస్తామంటే మాత్రం కుదరదు.
కల్పన కల్పనతో కలుస్తుంది. వాస్తవంతో కాదు- రెండు వేరువేరు లోహాలు అతకవు కదా? గత కాలాన్ని తెచ్చి సమకాలీనంలో నిలుపుతామంటే కుదురుతుందా? అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా నిర్ద్వందంగా ఖండించాల్సిందే!
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, ఇటీవల గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహం ప్రతిష్ఠించిన ఈ దేశ ప్రధాని ఒక “గొప్ప” సందేశమిచ్చారు. “శ్రీరాముడు కల్పన అనే మైండ్ సెట్ నుంచి దేశవాసులు బయటపడాలి” అని పిలుపునిచ్చారు. ముందు తను ఒక సెక్యులర్ దేశానికి ప్రధానినన్నది మరిచిపోయి, ఇచ్చే సందేశాన్ని ఎవరు మాత్రం పట్టించుకుంటారు? అసలు శ్రీరాముడు ఈ దేశాన్ని ఏ ఏ సంవత్సరాల మధ్య పాలించడాన్నది ప్రభుత్వం ప్రకటిస్తే మైండ్ సెట్ గురించి దేశప్రజలు తర్వాత ఆలోచిస్తారు!
కొన్ని సమకాలీన అంశాలు..
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించి రామదూత ఆశ్రమం కడితే, దానికి కేంద్రమంత్రివర్యులు వెళ్లడాన్ని స్వాగతిద్దామా? నిరసిద్దామా? ఆ రామదూత అనేవారు, ఆ ప్రాంతంలో భిక్షాటనతో పొట్టపోసుకునేవాడని ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. అయినా ఆ భూములకు సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉండగా, కేంద్రమంత్రులు వెళ్లడం, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు ఆహ్వానాలు పలకడం ఏమైనా హర్షించదగ్గ విషయమా? ఆలోచించాలి!
ఇదే రామదూత దగ్గరికి మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, గాలి జనార్ధన రెడ్డి, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ మొదలైనవారు దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రామదూతనే బాబాకు మహిమలే ఉంటే ఈ పైన చెప్పుకున్న వీఐపీలకు వేరువేరు కేసుల్లో శిక్షలు పడకుండా ఉండాల్సింది కదా? వీరందరికీ చక్కగా శిక్షలు పడ్డాయంటే, ఆ బాబాకు మహిమలేవీ లేవని అర్థం చేసుకోవాలి. ఉంటేగింటే అతనితో వీరికి ఏవో లావాదేవీలు ఉండి ఉంటాయని సామాన్యులు అనుకునే మాట.
ఇలాగే ఒక హర్యానా బాబా కేసు విచారణలో తేలిందేమంటే- అతను ఆడ భక్తురాళ్లు వెళ్లే బాత్రూంలలో సీసీ కెమెరాలు అమర్చి, వాటిని తన బెడ్రూంలోని టీవీకి కనెక్ట్ చేసుకున్నట్టు తేలింది. ఇలాంటి సిగ్గుమాలిన బాబాలని అరెస్టు చేయించడానికి బదులు దేశనేతులు, రాష్ట్ర నేతలు, వీవీఐపీలు, గవర్నర్లు వారి చుట్టూ తిరుగుతారా? అన్నదే మన ప్రశ్న.
జీవితాలను దుర్భరం చేసుకుంటున్న దశ..
ప్రస్తుతం విలువలు, మంచితనానికి అర్థం మారిపోయి, టెక్నాలజీకి అతిగా అలవాటుపడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్న దశ కొనసాగుతోంది. దీనిలోంచి బయటికి రావాలి.
ఇప్పుడు మనం ఎలాంటి ప్రపంచంలో నివసిస్తున్నామంటే; సిరియా మీద యాభైయేడు టొమహాక్ క్షిపణులు ప్రయోగించడం మానవతా చర్య? భయోత్పాతంలో ఉన్న శరణార్థులకు ఆశ్రయం కల్పించడం చాలా ప్రమాదకర చర్య? వ్యక్తిగత స్థాయిలోనైనా, అంతర్జాతీయ స్థాయిలోనైనా మానవ సంబంధాలు కొన్ని విలువలపై ఆధారపడి ఉండాలి.
ఉదాహరణకు చూడండి అహంభావం(Ego) అనేది ఇంగ్లీషులో చిన్న మూడక్షరాల పదం. కానీ అది సంబంధం(Relationship) అనే పెద్ద పన్నెండక్షరాల పదాన్ని ధ్వంసం చేస్తుంది. అది మనం గుర్తుంచుకోవాలి. వ్యక్తుల మధ్య అయినా, దేశాల మధ్య అయినా సూత్రం ఒక్కటే!
అత్యాధునికకాలంలో ముఖ్యంగా యువతరంలో బంధాలు నిలుపుకోవడం కష్టమైపోతూ ఉంది. అందుకే హత్యలు, ఆత్మహత్యలూ కొనసాగుతున్నాయి. మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చాక సంభాషణ టెక్స్ మెసేజ్ అయిపోయింది. చర్చ అంటే ఫోన్ కాల్లాగా మారిపోయింది. ఇంక ఫీలింగ్ అంటే అనుభూతులు స్టేటస్ అప్డేట్గా మారిపోయాయి. మానవవాదులు మరీ ఇంత యాంత్రికతకు అలవాటు పడకూడదు. కలిసి మాట్లాడుకుంటూ మానవీయ సంబంధాలు నిలుపుకోవడం ముఖ్యం; మనుషుల్ని కలవడం, మాట్లాడడం, ఒకరినొకరు హృదయపూర్వకంగా వ్యక్తీకరించుకోవడం చాలా అవసరం. అందుబాటులోకొస్తున్న టెక్నాలజీని వాడుకోవద్దని కాదు. ఆ వాడడంలో హద్దులు, కొంత నియంత్రణా అవసరం. స్వేచ్ఛ మంచిదే. విశృంఖలత్వం తగదు.
కుట్రలూ కుతంత్రాలను కనిపెట్టాలి..
ఏ బాబా అయినా ఆశ్రయం కట్టుకుంటే భవన నిర్మాణానికి సంబంధించిన టెక్నాలజీ అవసరం. సీసీ కెమెరాలు తమ బెడ్రూముల్లోని టీవీలకు అనుసంధానం చేసుకుంటే దానికీ టెక్నాలజీయే అవసరం. బాబాల చుట్టూ నేతలు తిరిగితే కార్లు గట్రా కావాలి. అవీ టెక్నాలజీ ఫలితాలే. ఎక్కడ నుంచి ఏ విషయం తీసుకున్నా అది, ఏదో విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే అయి ఉంటుంది.
అయితే, వీళ్లంతా ఆ రంగం గూర్చి ఒక్క మాట మాట్లాడరు. తేరగా అంది వచ్చిన సైన్సు ఫలితాలను చెడు పనులకు వాడుకుంటున్నారు. తప్పకుండా ఇది నిరసించదగ్గ విషయం! సామాన్య జనం వాస్తవాలు గ్రహిస్తూ ఉండాలి. వీఐపీల కుట్రలూ కుతంత్రాలు పసిగట్టాలి.
అయితే, ఒకటి మాత్రం నిజం స్టీవ్ బాబ్ అన్నట్టు “ఈ ప్రపంచాన్ని మార్చుతానని ఎవరైతే ఒక పట్టుదలతో పిచ్చిగా ఆలోచిస్తారో నిజమే వారే ఆ పని చేయగలరు.”
సిరియా, నైజీరియా, ఇరాక్‌ల తర్వాత మతపరంగా అసహన దేశాల జాబితాలో మన భారతదేశం నాలుగవది.
మేఘాలయా రాష్ట్రం మొత్తం క్రైస్తవంలోకి మారిపోయింది. ప్రతి ఆదివారం ఉదయం అందరూ తప్పని సరిగా చర్చ్‌కు వెళ్లాలి. సినిమాలు వగైరా ఉండవు. మత మార్పిడి దాహం ఇండియాలోనే ఎక్కువ. అమెరికాలో మత మార్పిడి లేదు.
“మతాన్ని నమ్మని వారిదో మతం”అని అంటున్నారు. అది నిజం కాదు. తమకు మతం లేదని నిర్భయంగా ప్రకటించుకున్న వారికి ఇంగిత జ్ఞానం లేదనుకోవాలి. కొంతమంది “సైన్సును నమ్మడం కూడా మతమే”అని తీర్మానించారు. అలాంటి తెలివి తక్కువ లేదా అతి తెలివి శిఖామణులకు విసుక్కోకుండా తగిన సమాధానం చెపుతూనే ఉండాలి.
“అసలు భగవంతుడనేవాడు లేకపోతే ఇవన్నీ కనుక్కోమని సైంటిస్టులకు ఎవరు చెప్పారూ? ఆ శక్తి ఇచ్చింది ఆయనే కదా? అయనే లేకపోతే ఈ భూమెలా పుట్టింది?” అని ఇంకా ఇప్పటికీ అడిగే అమాయకులు లేకపోలేదు. అలాంటి వారికోసమే ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ చెప్పిన విషయం గుర్తు చేస్తున్నాను.
“తప్పని సరైన పరిస్థితుల్లో కొన్ని భౌతిక సూత్రాలకు అనుగుణంగా ఈ విశ్వం రూపుదిద్దుకుంది. కాలక్రమంలో అనేక పరిణామాల ఫలితంగానే సృష్టి జరిగింది. అంతేగాని ఏ దేవుడో ఈ విశ్వాన్ని ఈ గ్రహాల్ని, ఈ జీవుల్ని తీరికగా కూర్చుని సృష్టించలేదు.” ఈ విశ్వానికి ఏ దేవుడి అవసరం రాలేదని, అది తనకు తానే తన అస్థిత్వాన్ని నిలుపుకుంటూ వస్తూ ఉందని ఆయన అన్నారు. ఆయన మరో శాస్త్రవేత్తతో కలిసి రాసిన “బిగ్‌బ్యాంగ్” పుస్తకంలోనూ అనేక ఇంటర్వ్యూలలోనూ ఈ విషయాన్నే విపులంగా చర్చించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
