తెలంగాణలో విద్యా వ్యవస్థ మీద అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్(టీఈసీ) 2025 మార్చిలో తన నివేదికను విడుదల చేసింది. అందులో కీలకమైన అంశాలను వెల్లడించింది. అంతేకాకుండా పలు ప్రతిపాదనలను కూడా చేసింది. ఆ నివేదిక మీద పరిశీలనాత్మక విశ్లేషణ.
మొదటి దశలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో వంద మండలాలలో, ప్రతి మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను, నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను అయిదు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ ప్రతిపాదించింది. అయితే కేవలం రంగారెడ్డి, నాగరకర్నూల్ జిల్లాలలో మాత్రమే నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఇంగ్లీషు మాధ్యమంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఇంగ్లీషు మాధ్యమంలో స్థాపించాలని సిఫారసు చేయడానికి ముఖ్యంగా తల్లిదండ్రుల మొగ్గుచూపే ప్రధాన కారణమని విద్యాకమిషన్ తన రిపోర్ట్‌లో తెలిపింది.
సాంకేతికతతో సులువు..
ఉన్నత జీవనశైలికి, అంతర్జాతీయ అవకాశాలకు ఇంగ్లీష్ అవసరమనే భావన చాలామందిలో ఉంది. అయితే, కేవలం ఇంగ్లీషు మాధ్యమం ద్వారా సమానమైన, నాణ్యత గల విద్య సాధ్యమవుతుందన్న నమ్మకం సరైనది కాదు. కొంతవరకు హానికరం కూడా. ఈ సందర్భంలో తెలంగాణకు, భాషా విధాన సమీక్షకు, విద్యాకమిషన్ రూపంలో ఒక అవకాశం వచ్చింది.
ప్రస్తుతం కృత్రిమ మేధస్సుతో ఏ భాషనైనా నేర్చుకోవడం కాస్తోకూస్తో తేలికగా మారింది. భాషానువాదం, వచన రూపాంతరం, లిప్యంతరీకరణలు గతంలో కంటే చాలా సులువుగా మారాయి. కాబట్టి ముందుగా ఇంటి భాషలో బలమైన పునాది వేసి ఆ తర్వాత క్రమంగా ఇంగ్లీషులోకి మారడం సరైనదని భాషా శాస్త్రవేత్తలు భావిస్తారు.
పాఠశాలల బోధన మాధ్యమాన్ని నిర్ణయించడంలో, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులనే గాక బోధనా శాస్త్ర విషయాలను, భాష శాస్త్ర విషయాలను, మేధస్సు అభివృద్ధికి సంబంధించిన విషయాలను, న్యూరో లింగ్విస్టిక్ పరిశోధనల ఫలితాలను, పిల్లల స్వాభావికంగా నేర్చుకునే హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
సరైన మాధ్యమం ఎంపిక- పిల్లల అకాడమిక్ ఫలితాలను మాత్రమే కాకుండా, వారి భాషా ప్రాసెసింగ్ నైపుణ్యాలను, మేధస్సు నిర్మాణాన్ని తీర్చిదిద్దుతుంది, అందుకని స్థానిక భాషల స్థానంలో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టడం కాకుండా, కృత్రిమ మేధ(ఏఐ) శక్తిని ఉపయోగించుకుని సరైన భాషా దృక్పథాన్ని రూపొందించుకోవడం అవసరం.
ఈ విధమైన మార్పు భాషా వైవిధ్యాన్ని, సాంస్కృతిక మూలాలను గౌరవించడమే కాదు. ఇంగ్లీష్‌ను సరైన రీతిలో నేర్చుకునే అవకాశాలను, భాషను నేర్చుకునే మూలాలను నాశనం చేయకుండా ఉండేలా చేస్తుంది.
భాషా విధానంలో లోపాలు..
విద్యా విధానాల రూపకల్పనలో అనుసరించవలసిన పని విధానాన్ని తెలంగాణ విద్యా కమిషన్ విస్మరించింది. సాధారణంగా విద్యా విధానాల రూపకల్పనలో ముందుగా నిపుణులతో వివిధ అంశాలపై ఫోకస్ గ్రూపులు ఏర్పాటు చేస్తారు. ఈ ఫోకస్ గ్రూపులు పరిశోధనలు, చర్చలు చేసిన పిదప వాటి సారాంశాన్ని క్రోడీకరించి విద్యా విధాన సిఫారసులను చేస్తారు.
తెలంగాణ విద్యా కమిషన్ ఈ ప్రక్రియను తలకిందులుగా అమలు చేసింది.
ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపి 2025 మార్చిలోనే తుది నివేదికను ప్రచురించింది. ఆ తర్వాత, కొన్ని అంశాలపై ఫోకస్ గ్రూపులు ఏర్పాటు చేసి 2025 మేలో సదస్సులు నిర్వహించారు. బోధనా మాధ్యమంపై కూడా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జరిగిన చర్చను “Learnings from the Seminar on English as the Medium of Instruction” అనే శీర్షికతో కమిషన్ వెబ్సైట్లో ప్రచురించారు.
ఈ చర్చలు ఆంగ్ల-మాధ్యమ విద్యకు అనుకూలంగా, ఏకగ్రీవంగా లేవు. నిపుణులతో విస్తృతంగా జరిగిన ఈ చర్చలు ఇంగ్లీష్ మాధ్యమానికి ఏకగ్రీవంగా మద్దతునివ్వలేదు. కానీ విద్యా కమిషన్, ఆంగ్ల మాధ్యమ స్కూళ్ల ప్రతిపాదనతో తుది నివేదిక(డ్రాఫ్ట్ కాదు)ను ముందే ప్రచురించింది.
ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించడంలో విస్తృత స్థాయి నిపుణుల అభిప్రాయాలను పక్కన పెట్టినట్టయింది.
ఏఐ తెచ్చిన కొత్త అవకాశాలు..
అయితే ఇప్పటికీ, ఈ ప్రతిపాదనల పునాదిలో ఉన్న ప్రజాభిప్రాయాన్ని విస్మరించలేం. తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రులు ఇంగ్లీషును అవకాశాలకు తలుపులు తీస్తున్న మాధ్యమంగా చూస్తున్నారు. వారి పిల్లలు బాగుపడాలని, వారికి ఉపాధి దొరకాలని, ఉన్నత విద్య అందాలని భావిస్తున్నారు.
ఈ ఆశలు సరైనవే. కానీ ఈ ఆశలు కొన్ని అపోహలపైన, ముఖ్యంగా ఇంగ్లీషు మాధ్యమం వలననే విజయమనే తప్పుడు నమ్మకంపై ఆధారపడి ఉన్నాయి. అంగ్ల భాషను చాలా తొందరగా, ఆ భాషను పరిచయం చేసే వాతావరణం లేని పిల్లలకు మాధ్యమంగా ప్రవేశపెడితే, అది వారి మేధస్సు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భాషా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు చాలాకాలంగా చెబుతున్నారు.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ‘సక్సెస్ స్కూల్స్’ ప్రయోగం, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష అనంతర(post-apartheid) కాలంలో జరిగిన ఇంగ్లీషు మాధ్యమపు ప్రయోగాలు ఈ అపోహను నిరూపించాయి.
బోధనా వనరులు, ఉపాధ్యాయుల శిక్షణ, కమ్యూనిటీ భాగస్వామ్యం లేకుండా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే, అది సాధికారతకు దారితీయకపోగా చేటుగా పరిణమిస్తుంది. ఇంట్లో మాట్లాడే భాషలోగాక పరాయి భాషలో బోధన వలన భాష అర్ధం కాక సరిగా నేర్చుకోలేకపోతారు. డైగ్లోసియా(ఒకే భాష, ఇంటిలో ఒక రూపంలో, బయటి వ్యవహారాల్లో మరో రూపంలో ఉండడం లేదా ఇంటిలో ఒక భాష, బయటి వ్యవహారాల్లో మరో భాష ప్రబలంగా ఉండే స్థితి) సమస్య ఉన్న దేశాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ) కీలకంగా మారుతుంది.
మానవ చరిత్రలో తొలిసారి, ఒకేసారి అనేక భాషల్లో బోధన అందించడం సాంకేతికంగా సాధ్యమవుతున్నది. బహుభాషా ఏఐ మోడళ్ల సహాయంతో, ఇంటి భాషలో బోధనకు తోడుగా సందర్భానుసార అనువాదం(contextual translation), భాషా ఫీడ్ బ్యాక్ (language feedback), ద్విభాషా (bilingual) పాఠ్యసామగ్రిని ఏఐ అందించగలదు.
ఉపాధ్యాయులకు ఏఐ ఆధారిత ఉపకరణాలు, ఉచ్ఛారణ మార్గదర్శకాలు, లోకలైజ్డ్ లెసన్ ప్లానింగ్ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ట్రాన్స్లేషన్ , ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లిటరేషన్ ప్రక్రియలు సులువవుతున్నాయి. దీంతో తరగతులు భాషా పరంగా సమగ్రతను సాధించగలవు, ఇంగ్లీష్‌ను ఒక అదనపు నైపుణ్యంగా చాలా సులువుగా పరిచయం చేయవచ్చు.
తెలంగాణ విద్యా కమిషన్ 2025 మేలో నిర్వహించిన సదస్సు ఈ అవకాశాలను గుర్తించింది. ఈ సదస్సు, కమిషన్ సమర్పించిన నివేదికలోని సిఫారసులకంటే విస్తృతమైన, సమగ్ర దృక్పథాన్ని అందించింది. ఇంగ్లీష్ పట్ల తల్లిదండ్రుల ఆకాంక్షను గౌరవిస్తూ, ఉపాధ్యాయుల శిక్షణ లోపాలు, ఇంట్లో ఇంగ్లీష్‌కు అనుకూలమైన వాతావరణం లేకపోవడం, పిల్లల ప్రాథమిక చదువుల పరిమిత స్థాయి, పాఠ్యాంశాల్లో స్థానిక సాంస్కృతిక నేపథ్యం గణనీయంగా లేకపోవడం వంటి సమస్యలను చర్చించింది.
ద్విభాషలో బోధన(bilingual instruction), దశల వారీ భాషా మార్పు, శిక్షణా ప్రణాళిక, ద్విభాషలో పాఠ్య పుస్తకాలు వంటి మార్గాలపైన దృష్టి పెట్టింది.
చైనా, జపాన్, కొరియా వంటి ఆధునిక దేశాలు బాహ్య ప్రపంచంతో సంబంధాల సందర్భంలో ఉపయోగపడే సాధనంగా ఇంగ్లీషును కేవలం”ఒక విషయం”గా మాత్రమే పరిగణిస్తాయి. వారి పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన జరుగుతుంది. కానీ ఇంగ్లీషు మాధ్యమంగా కాదు, వారి విజ్ఞానశాస్త్ర ప్రయాణానికి ప్రాథమిక వాహనం ఇంగ్లీషు కాదు.
ఏఐని ఉపయోగించుకొని రూపొందించుకునే భాషా విధానం, ముందుకు సాగేందుకు మంచి దారిని చూపించగలదు. ఇంటి భాషలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, చిన్నప్పటి నుంచే సరైన భావనాత్మక అవగాహన, లోతైన ఆలోచన, భావోద్వేగ భద్రతను పెంపొందించాలి, ఆపై ప్రాథమిక స్థాయిలో ఒక విషయంగా ఇంగ్లీష్‌ను ప్రవేశపెట్టి, విద్యార్థుల సంసిద్ధతను దృష్టిలో పెట్టుకుని కొన్ని సబ్జెక్టులలో ఇంగ్లీషును బోధన మాధ్యమంగా మార్చవచ్చు.
ఈ మార్పు ప్రక్రియలో ఏఐ అద్భుతమైన పునాదిగా పనిచేస్తుంది. భాషా మద్దతును వ్యక్తిగతంగా ఇస్తూ, ఉపాధ్యాయుల శిక్షణపై దృష్టి పెడితే రెండు భాషల మధ్య అనుసంధానం సులువు అవుతుంది. ఈ విధానంలో ఇంగ్లీషును తిరస్కరించడం జరుగదు. ఇంగ్లీషును నేర్చుకోవడాన్ని ఒకే మార్గంగా చూడకుండా, స్థానిక భాషల్ని అణచివేయకుండా, గౌరవించడం ద్వారా, బహుముఖ సాధనంగా పరిగణించడం జరుగుతుంది.
చివరగా(Finally) విద్య లక్ష్యం కేవలం ఇంగ్లీషు మాట్లాడగల విద్యార్థుల్ని తయారు చేయడం కాదు. స్థానిక పరిస్థితులు, ప్రపంచ వాస్తవాలు రెండింటినీ అర్థం చేసుకుని ఎదగగల చైతన్యవంతులైన పిల్లల్ని తయారుచేయడం. ఫలితంగా(As a result) పిల్లలు తమ భాషను వదులుకోవాల్సిన ఒత్తిడి లేకుండా, ఒక సమగ్ర భవిష్యత్తుకు వారిని సిద్ధం చేసేలా అనిర్వచనీయమైన అవకాశాన్ని సాంకేతికత అందిస్తుంది.
భాషా విధానాన్ని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాకమిషన్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. విధాన రూపకల్పనలో త్వరిత పరిష్కారాల ఆకర్షణకు లోబడకుండా- సమ్మిళిత, బహుభాషా విద్యా ఎకో సిస్టంను నిర్మించే దీర్ఘకాలిక పనిలో పెట్టుబడి పెట్టాలి. తెలంగాణ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ పోతే, తక్షణ నిర్ణయాల వలయాన్ని అధిగమించి, దీర్ఘకాలికంగా సమగ్రత, సమానత్వంపై ఆధారపడిన విద్యా వ్యవస్థను నిర్మించగలదు. న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి వేసే అడుగు కాగలదు.
(వ్యాస రచయిత హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సొసైటి ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ తెలంగాణ వ్యవస్థాపక సభ్యులు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
