
నేను ఖాన్‌యూనిస్ నగరంలో పశ్చిమాన ఉన్న నాజర్ ఆసుపత్రి సమీపంలో నివసిస్తాను. రోజు రక్తదానం కోసం ఆసుపత్రి సిబ్బంది అరిచే అరుపులు నా చెవుల్లో గింగిర్లు తిరుగుతుంటాయి. ఆసుపత్రి సమీపంలో దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి నెలకొంది.
ఇజ్రాయెల్ నిరంతర దాడుల్లో క్షతగాత్రులువుతున్న వేలాదిమంది గాజా వాసులు, పిల్లలు, మహిళలు, వృద్ధులు వైద్య సేవల కోసం ఆసుపత్రులకు ఎగబడుతున్నారు. నాజర్ ఆసుపత్రి లాగానే మిగిలిన ఆసుపత్రులు కూడా కనీస వైద్య సేవలు అందించేందుకు కావల్సిన వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నాయి. గత ఏడాది మే నుంచీ శరణార్ధులకు ఆహారం అందించే కేంద్రాల వద్ద నిలిచిన గాజా వాసులను ఇజ్రాయెల్ సైన్యం పిట్టలను కాల్చినట్లు కాల్చి వికలాంగులను చేస్తోంది.
గతంలో కూడా నేను రక్తదానంలో పాల్గొన్నాను. మళ్లీ రక్తదానం చేయటం నా బాధ్యతగా భావించాను. ఒకరోజు ఉదయాన్నే రక్తదానం చేయటానికి నాజర్ ఆసుపత్రికి బయల్దేరాను.
నా చేతికి సిరంజి పెట్టి రక్తం తీస్తున్నారు. ఉన్నట్లుండి మగతగా అనిపించింది. కళ్లు తెరవలేనంత భారం మోస్తున్నట్లనిపించింది రెప్పలపై. స్పృహ కోల్పోతున్నానేమో అన్న ఆందోళన కలిగింది. అక్కడే ఉన్న నా స్నేహితురాలు నర్సు హన్నన్ పరిగెత్తుకొచ్చింది. రక్తదానం కోసం అందరినీ అడిగే పని ఉద్యమంలా చేస్తోంది హన్నన్. మెదడుకు రక్తం సరఫరా సరిగ్గా జరిగేలా చూసి నన్ను అపస్మారకంలోకి జారిపోకుండా చేసేందుకు నా కాళ్లు ఎత్తిపట్టుకున్నది. నేను ఇచ్చిన రక్తాన్ని పరీక్షించటానికి ల్యాబ్‌కు వెళ్లింది. పది నిమిషాల్లో వెనక్కు వచ్చి నేను తీవ్రమైన రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. ఒంట్లో తగినంత రక్తం సరఫరా కావడానికి కావల్సిన కనీస ఆహారం కూడా తీసుకునే పరిస్థితులు లేనందువలన ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పింది. రక్తదానం చేయటానికి, నేను దానం చేసిన రక్తాన్ని ఇతరుల ప్రాణాలు బతికించేందుకు కావల్సినన్ని జీవకణాలు లేవని చెప్పింది.
అయితే, ఇదేదో నేను ఒక్కదాన్నే ఎదుర్కొంటున్న సమస్య కాదని గుర్తు చేసింది. గాజాపై ఇజ్రాయెల్ విధించిన సైంధవ చక్రం లాంటి నిర్భంధం వలన యుద్ధ పీడిత ప్రాంతంలోకి పాలు, గుడ్లు, మందులు, మాంసం, గోధుమపిండి వంటి కనీస నిత్యావసరాలు, శరీరాలు తూట్లు పొడ్చుకుని ఆసుపత్రికి వస్తున్న వారికి అందించే కనీస పోషక విలువలతో కూడిన తినుబండారాలు అందుబాటులో లేకపోవటం వలన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో ఎక్కువమంది రక్తహీనత, పోషకాహార కొరత ఎదుర్కొంటున్నారని వివరించింది. ఆసుప్రతికి వచ్చి పలువురు దానం చేస్తున్న రక్తంలో మూడింట రెండువంతుల మందికి హిమోగ్లోబిన్, రక్తంలో ఉండాల్సిన ఖనిజ లవణాల లోపంతో బాధపడుతున్నారని చెప్పింది. దాంతో అటువంటి వారి నుంచి తీసుకునే రక్తం ఇతరులను బతికించటానికి ఉపయోగపడటం లేదని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది.
లాబొరేటరీ అండ్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ సోఫియా జరాబ్ జూన్ మొదటి వారంలో మీడియాతో మాట్లాడుతూ, గాజా ప్రాంతంలో చికిత్సకు అవసరమైన రక్తం సీసాల కొరత ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని తెలిపారు. బుల్లెట్ గాయాలు, క్షిపణి దాడుల్లో శరీరాలు తునాతునకలు చేసుకుని ఆసుపత్రికి వస్తున్న వారికి చికిత్స అందించేందుకు సరిపోయినంత రక్తం నిల్వలు ఆసుపత్రిలో లేవని ఆయన తెలిపారు. రోజువారీ ప్రాణాంతక దాడుల్లో గాయపడుతున్న వారికి చికిత్స అందించేందుకు గాజాలో రోజుకు కనీసం 400 యూనిట్ల రక్తం కావాల్సి ఉంది.
‘‘వెస్ట్ బ్యాంక్‌లోని ప్రభుత్వ అధికారులు రక్తం సీసాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ సేనలు అందుకు అనుమతించటం లేదు’’ అన్నారు సోఫియా.
నా రక్తం మరొకరిని బతికించటానికి పనికి రాదు అన్న చేదు నిజాన్ని దిగమింగుకుని బతికున్న శవంలా ఇంటికొచ్చాను.
ఇజ్రాయెల్ సేనలు సృష్టిస్తున్న కృత్రిమ కరువు నన్ను కాటేస్తుందని నాకు తెలుసు. ఈ కాలంలో బరువు చాలా తగ్గిపోయాను. తలనొప్పి, కీళ్ల నొప్పులు, మగత, అపస్మారక స్థితి ఈ మధ్య పెరిగాయి. రోజువారీగా నేను రాసే వార్తలు రాయాలన్నా, చదవాలన్నా కూడా ఏకాగ్రత సరిపోవటం లేదు. శరీరం సహకరించటం లేదు. మధ్యమధ్యలో విరామం తీసుకోవాల్సి వస్తోంది.
అయితే ఈ రోజు ఆసుపత్రికి వెళ్లినపుడు నా ఆరోగ్యం ఎంతగా చితికిపోయిందో తెలిశాక నాకు దు:ఖం ముంచుకొచ్చింది.
గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని అంటటంతో గత కొన్ని నెలలుగ పాస్తా, బియ్యమే మాకు తిండిగా మారింది. రోజుకు ఒకసారి, మరికొన్ని రోజుల్లో అందులో కూడా సగం మాత్రమే తింటున్నాను. అలా మిగిలేదాంట్లోనే నా అన్నదమ్ములకు పంచుతున్నాను. మార్చి రెండో తేదీన ఈ ప్రాంతం ఇజ్రాయెల్ సేనల ఇనప తెర కిందకు వచ్చిన తర్వాత గుడ్లు, పాలు, గోధుమ పిండి కనీసం కళ్లతో కూడా చూసి ఎరుగం. తినటం తర్వాతి సంగతి.
ఇజ్రాయెల్ నరమేధం మొదలైన తర్వాత కనీస పోషకాహారం దొరక్క ఆకలికి చనిపోయిన పసికందులు 66 మంది ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. యూనిసేఫ్ అంచనా ప్రకారం, కేవలం ఒక్క మే నెల్లోనే పౌష్టికాహార కొరతతో రక్తహీనతతో ఐదువేల మంది పిల్లలు చికిత్స కోసం ఆసుప్రతుల్లో చేరారు.
అదృష్టం కొద్దీ కొద్దిమంది ప్రాణాలతో బయటపడినా వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదిగి బతకటానికి కావల్సిన పరిస్థితులు లేవు. ఆకలి నన్ను, నా కుటుంబాన్ని ఎలా దహించి వేస్తోందో తెలుసుకున్న తర్వాత నాలో మరింత ఆందోళన పెరిగింది. నా శరీరంలోని రక్తం బొట్టు గాయపడిన మరో శరీరానికి అక్కరకు రాదని చెప్పినప్పుడు గుండెకు గాయమైనట్లనిపించింది. నేను కూడా సాటి మనిషినే కాబట్టి ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన సాటి గాజావాసులను బతికించుకునేందుకు ఎంతో కొంత సాయమందించాలనుకున్నాను. మనిషన్న వారికి ఉండాల్సిన కనీస స్పందన కదా అది. సంఫీుభావమే మనిషిని మనిషిగా నిలుపుతుంది. మానవత్వంతో నింపుతుంది.
ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు చేయాలనుకున్న సహాయాన్ని చేయనీయకుండా నీ చుట్టూ ఉన్న పరిసరాలు అడ్డుకుంటున్నపుడు నిరాశ మొదలవుతుంది. మన మీదనే మనకు విరక్తి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో మనసుకు కలిగే గాయం జీవితాంతం వెన్నాడుతుంది.
అంతర్జాతీయ న్యాయ సూత్రాలు చెప్పే ఏ ఒక్క మానవ హక్కునూ గత రెండేళ్లల్లో మేము అనుభవించలేకపోతున్నాము. తినటానికి తిండి లేదు. తాగటానికి నీరు లేదు. ఉండటానికి ఇల్లు లేదు. గాయమైతే చికిత్స కోసం ఆసుపత్రి లేదు. చదువుకోవడానికి బడి లేదు. శరణు వేడే హక్కు లేదు. కావల్సిన చోటికి వెళ్లే హక్కు లేదు. అంతిమంగా మనిషిగా బతకడానికి కావల్సిన హక్కులన్నీ ఇజ్రాయెల్ సైన్యం ఇనుప బూట్ల కింద నలుగుతున్నాయి.
చివరికి ఎటువంటి దుస్థికి చేరామంటే, ఇతరులకు సాయం చేయటానికి సంఫీుభావంగా నిలబడటానికి కూడా మమ్ములను పరిస్థితులు నియంత్రిస్తున్నాయి. అడ్డుకుంటున్నాయి. సానుభూతి వ్యక్తం చేసే హక్కుకూడా లాగేసుకుంటున్నాయి.
ఇదేదో ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు. ఉద్దేశ్య పూర్వకంగా జరుగుతున్నదే. ఓ పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర ఫలితమే. పర్యవసానమే. ఈ నరమేధం కేవలం మనుషుల ప్రాణాలు మాత్రమే తీయటంం లేదు. తోటి మానవుడికి సాయం అందించాలన్న ఆలోచనను కూడా లాగేసుకొంటోంది. ప్రపంచంలో అన్నార్తులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చేతులు అందించిన కొద్దిపాటి వసతులతో ఏర్పాటు శరణార్ధుల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్లపై క్షిపణిదాడులు మొదలు, చివరకు జనం రొట్టె ముక్కల కోసం బందిపోట్లుగా మారి దారికాచి దోచుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఏ సంఫీుభావమైతే పాలస్తీనా ప్రజలను గత ఏడున్నర దశాబ్దాలుగా ఐక్యంగా ఉంచిందో, అదే సంఫీుభావ సామర్ధ్యంపై నేడు ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ప్రపంచం గుడ్లప్పగించి చూస్తోంది.
మా మధ్య సంబంధాలు నెర్రెలుబారి ఉండొచ్చు. ఆ నెర్రెలను పూడ్చుకుంటాము. గాజాలో నివసించే మేమంతా ఒకే కుటుంబం. మా ఇళ్లకు ఉన్న తలుపులు, గోడలు మమ్ములను ఏకం కాకుండా అడ్డుకోలేవు. ఒకరి బాధ మరొకరు తెలుసుకుని ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుస్తాము. పాలస్తీనాప్రజల మానవత్వం ఎల్లప్పుడూ విజయం సాధిస్తూనే ఉంది.
అనువాదం: కొండూరి వీరయ్య
(దోన్యా రచయిత- అనువాదకులు, కంటెంట్ రచయిత, ఇంగ్లీషు బోధిస్తున్నారు. ఈ మధ్యనే వైద్య విద్యలో చేరారు. హల్ట్ ప్రైజ్, యూత్ ఇన్నొవేషన్ హబ్, సైన్స్ టోన్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫ్రీలాన్సర్‌గా రాస్తుంటారు.)
(అల్ జజీరా సౌజన్యంతో)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.