ప్రపంచంలో సువిశాల ప్రజాస్వామ్య దేశం ఇండియా. అతిపెద్ద రాజ్యాంగం కలిగినదీ ఇండియానే. అమెరికా తర్వాత ప్రజాస్వామిక విజయాల పరంపరను కొనసాగిస్తున్నది మన దేశం. ప్రపంచపు అంచనాలను తలకిందులు చేస్తున్నది. విభిన్న కుల, మత జనజీవితాల ప్రవాహాలు ఇక్కడున్నాయి. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాబోదని పాశ్చాత్యులు జోస్యం చెప్పారు. అందులో విన్స్టన్ చర్చిల్ తొలి వరుసలో ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా- లోపాలు, లోటుపాట్లను అధిగమించి భారత్ పురోగమిస్తున్నది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారీ బరిలోకి దిగుతోన్న సీనియర్ ఎమ్మెల్యే హరినారాయణ సింగ్ గెలుస్తారా లేదానే చర్చ ఉత్తర భారతమంతా జరుగుతున్నది. ఎందుకంటే, ఈయన 50 ఏళ్లపాటు బీహార్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. ఇదే చర్చకు కారణం. పదకొండోసారి తన అదృష్టాన్ని సింగ్ పరీక్షించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయపరంపరను సాగిస్తున్నవారు, సాగించినవారు మరికొందరున్నారు. వారి గురించే ఈ వ్యాసం.
1952 సాధారణ ఎన్నికల నుంచి నేటి వరకు ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలను ఆవిష్కరించింది ఇండియన్ డెమోక్రసీ. ఈ రోజుల్లో ఓట్లు, నోట్లు ప్రచారంలాంటి నిజమూ, నిజంలాంటి ప్రచారం జనబాహుళ్యంలో ఉంది. 1980ల వరకు పార్టీలకతీతంగా జనం కోసం ఎన్నికల బరిలో నిలిచినవారే ఎక్కువ. 1990ల తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ ప్రసారమాధ్యమాల వ్యవహారంలోనూ చాలా మార్పులు వచ్చాయి.
ఇవాళ్టికి వచ్చిన మార్పుల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఒకసారి గెలిస్తే చాలనుకునే స్థితికి నాయకులు వచ్చారు. మరోసారి ఈయనకే ఎందుకు ఓటెయ్యాలి? అనే భావనకు ఓటర్లు వచ్చారు.
ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకులు..
వర్తమాన చరిత్రకు కొన్నాళ్లు వెనక్కి వెళ్లి చూస్తే, నేటికి ప్రజాభిమానాన్ని చూరగొట్టున్న నాయకులు ఉన్నారు. డజను సార్లకు పైగా గెలిచిన వారూ ఉన్నారు. డైబ్భైఐదేళ్లకు పైబడిన భారత ప్రజాస్వామిక గణతంత్ర వ్యవస్థలో వామపక్షాలతో పాటు పోటీపడి, తమ ఉనికిని చాటుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు.
భారత రాజకీయ వ్యవస్థలో అత్యధిక సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వారిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధి పదమూడు సార్లు విజయం సాధించారు. 1957లో ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు, 2018 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కేరళ కాంగ్రెస్ నాయకులు కేఎం మణి వరుసగా 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పదకొండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన జ్యోతిబసు పదకొండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహారాష్ట్రాకు చెందిన గజపతిరావు దేశ్‌ముఖ్ పదకొండుసార్లు ఎమ్మెల్యేగా గెలుచారు. రాజస్థాన్ మాజీముఖ్యమంత్రి హరిదేవ్ జోసి పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్‌కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే హరినారాయణ పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ వరుసలో రాష్ట్రాలకు అతీతంగా అతికొద్దిమంది మాత్రమే ఇలాంటి వరుస విజయాల పరంపర వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఎన్నికల ఖర్చు అమాంతం పెరిగిపోయిన ఈ రోజుల్లో కొందరు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఓట్లకోసం నోట్లు మభ్యపెట్టడాలెన్ని ఉన్నా, వీటిని పూర్వపక్షం చేస్తూ జనాభిమానాన్ని సొంతం చేసుకున్నవారు గెలుస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రథములు, ఆ తర్వాత అత్యధిక జనాభిమానాన్ని సొంతం చేసుకున్న నాయకుడు హరీష్‌రావు ఈ కోవకు చెందినవారే.
ప్రధానాంశాలుగా వ్యక్తిత్వమూ, ప్రజానుబంధాలు..
ఉత్తరదక్షిణ భారతదేశాల ఓటర్ల ఆలోచనలలో తేడాలున్నాయి. ఎన్నికల ఖర్చులలోనూ ఈ తేడా కనిపిస్తోంది. సంప్రదాయ, రాజకీయ నాయకులు కొందరు తమ ప్రతిభతో చాతుర్యంతో గెలుస్తున్నారు. ఈ గెలుపులో కులమూ, ఆర్థికపరమైన అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. దీనికి మించి నాయకుల వ్యక్తిత్వమూ, ప్రజలతో అనుబంధాలూ, పనితీరు ప్రధానాంశాలుగా ఉన్నాయి.
1985కు పూర్వం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన నాయకులు కొందరు. స్వాతంత్య్రానంతరం వచ్చిన నాయకులు మరికొందరు. అలాంటి వారిలో కరుణానిధి తొలి వరుసలో ఉన్నారు. రచయితగా, ఉపన్యాసకులుగా ఆయనకు ఎంత పేరున్నదో, రాజకీయ నాయకునిగా విజయవంతమైన ముఖ్యమంత్రిగా అంతకంటే ఎక్కువ పేరున్నది. తమిళనాడు ప్రత్యేక రాజకీయ, సామాజిక పరిస్థితులు ఆయనను రాటుదేలిన శూద్ర నాయకుడిగా, ద్రవిడ నేతగా ఎదిగేలా చేశాయి. వీరితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు అత్యధికసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారు వారి రాజకీయ పార్టీలు, సామాజిక స్థితిగతులు మెరుగైనవిగానే భావించవచ్చు.
రాజకీయ పరిస్థితులు మారినప్పటికీ, ఎన్నికలు అత్యంత ఖరీదైన ఈ తరుణంలో కూడా ఈ నాయకులు గెలుస్తూనే ఉన్నారు.
కుల, మత, కుటుంబ ప్రభావాలున్న ఆధునికకాలంలోనూ విజయపరంపర కొనసాగిస్తున్న నేటితరం నాయకులు మన దగ్గర కొందరున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొందరు జనాభిమానంతో వరుస విజయాలను కొనసాగిస్తున్నారు. రెండుసార్లు గెలిచిన తర్వాత మూడోసారికి గెలుపు గ్యారంటీ లేదు. ఎన్నికల వ్యూహకర్తలు, భరించలేని ఖర్చు. జనాన్ని గందరగోళపరిచే సోషల్ మీడియా వ్యతిరేక ప్రభావాన్ని ఎన్నికల వ్యవస్థపై చూపిస్తున్నాయి.
అయినా, ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు బలమైన సంకేతంగా ఓటు ఉంది. ఎన్ని రకాల ప్రభావాలు ఓటర్లను గందరగోళ పరుస్తున్నప్పటికీ, నిజమైన నాయకుడు ఎవరో వారికి తెలుసు. బహుశా, ఆధునిక పాలనలో పనిచేసేవారికే వరుస విజయాలు ఉంటాయి కావచ్చు. కాలం మారింది. అంతా మారుతున్నది. మార్పు అనివార్యం. తమ తప్పులు దిద్దుకొని నాయకులు మారడం అత్యవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
