తామున్న ప్రదేశం నుంచి మూలవాసులైన గిరిజనులను దూరం చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు- ప్రైవేట్ కంపెనీలు ఏ విషయంలోనూ వెనుకాడడం లేదు. అంతేకాకుండా, పర్యాటకుల వినోద వస్తువులలా వారిని మారుస్తున్నారు.
ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా ఫిలిప్పీన్స్‌లోని పలావన్ పరిగణించబడుతుంది. పర్యాటకులను ఆకర్షించే ప్రకృతి సౌందర్యం, నిర్మలమైన బీచ్‌లు, మరకతమణి రంగు నీటి వల్ల పలావన్ను సందర్శించడానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షల్లో ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు.
ఫిలిప్పీన్స్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ పలావన్ దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలతో ఆవరించి ఉంది. ఇదొక ద్వీపాల సమూహం. ఇందులో 1789 చిన్న- పెద్ద లంకలున్నాయి. ప్రతీ ఒక ద్వీపానికి ప్రత్యేక ఆకర్షణీయత, సౌందర్యత ఉంది. ఈ ప్రావిన్స్ రాజధాని ప్యూర్టో ప్రిన్సెసా.
అయితే, నేను ఫిలిప్పీన్స్ విహారయాత్రకు వెళ్లలేదు. ఫిలిప్పీన్స్‌కు రావాలని బస్తర్ ప్రాంత ఒక చిన్న గ్రామవాసికి ఊహించని ఆహ్వానం లభించింది. ఫిలిప్పీన్స్ ఆదివాసీల కోసం పనిచేసే సంస్థ Asia Indigenous Peoples Network on Extractive Industries and Energy(AIPNEE)వర్క్‌షాప్‌లో పాలుపంచుకోవడం కోసం నన్ను ఆహ్వానించారు.

ముందుగా బస్తర్ నుంచి ఢిల్లీకి; ఆ తర్వాత ఢిల్లీ నుంచి మనీలా మీదుగా ప్రయాణం చేసి, 2025 నవంబర్ 2న ప్యూర్టో ప్రిన్సెసా నగరాన్ని చేరుకున్నాను. నేను నగరానికి చేరుకున్న సమయంలో ఉదయం ఆరవుతుంది. లేలేత కిరణాలు భూమిని తాకుతున్నాయి. తేలికపాటి నీలాకాశంతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ల్యాండింగ్ కంటే ముందు విమాన కిటికీ నుంచి ఈ దృశ్యాన్ని చూసినప్పుడు- స్వర్గం కంటే తక్కువేం అనిపించలేదు. నీలం రంగు సముద్రం మధ్యలో పరిచిన పచ్చటి దుప్పటిలా నగరం ఉంది. విమానాశ్రయం వద్ద స్థానిక ప్రజల కంటే విదేశీయులు ఎక్కువగా కనపడ్డారు. అందులో ఎక్కువ మంది పర్యాటకులై ఉండొచ్చు.
బయట శుభ్రమైన, విశాలమైన రహదారులు ఉన్నాయి. ట్రాఫిక్ అసలు లేనేలేదు. చిన్న వాహనాలు, ట్రైసైకిల్ వాహనాలే ఎక్కువగా కనబడ్డాయి. నగరం మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉంది. ఇళ్లు, భవనాలు దూరం దూరం వరకు విస్తరించి ఉన్నాయి.
దీపావళి తర్వాత పొగచూరిన విషపూరిత ఢిల్లీ గాలి నుంచి ప్రయాణించి నేను ఈ పట్టణానికి చేరుకున్నాను. స్వచ్ఛమైన గాలిలో శ్వాస తీసుకోవడం చాలా సుఖవంతంగా అనిపించింది.
ప్యూర్టో ప్రిన్సెసా నగరంలో సబటెరెనియన్ రివర్ నేషనల్ పార్క్ ప్రసిద్ధమైనది. ఈ పార్కు 22,202 హెక్టార్ల ప్రాంతంలో వ్యాపించి ఉంది. ఇది వన్య ప్రాణులకు ఆశ్రయాన్ని కల్పిస్తోంది. 1999లో ఈ పార్క్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా, ప్రకృతి నూతన అద్భుతాలలో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. ఇతర ఆకర్షణాలలో నిర్మలమైన సముద్ర తీరం, సున్నపు రాళ్ల గుహలు, వివిధ రకాల వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ఈ నగరం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వంగా విలసిల్లుతోంది. ఇందులో ఇండిగేనోస్(మూలవాసి) సముదాయం, చారిత్రక స్థలాలు భాగంగా ఉన్నాయి.
స్వర్గంలాంటి ఈ భూమిలో బస్తర్ ఆదివాసీలలాంటి జీవనాన్ని కొనసాగించేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడి ఇండిగేనోస్(మూలవాసి) ప్రజల కథ కూడా దాదాపు మాలానే ఉంది. వారి జీవితం కూడా మా జీవితంలానే సంఘర్షణలతో నిండి ఉంది. వారు కూడా మాలానే తమ నీరు- అడవి- భూమిని కాపాడుకోవడానికి శాయశక్తులా పోరాడాల్సి వస్తోంది. ఇక్కడ కూడా మైనింగ్, పర్యాటక రంగం పేరుతో కార్పోరేట్ కంపెనీలు ప్రజల భూమిని ఆక్రమించారు.

ఆసియాకు చెందిన వివిధ దేశాల వ్యక్తులు వర్క్‌షాప్‌కు హాజరైయ్యారు. తాము తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతున్నట్టుగా కొందరు చెప్పారు. వారి ప్రభుత్వాలు వారిని మూలవాసులుగా గుర్తించడానికి ప్రాధాన్యతివ్వడం లేదు. వర్క్‌షాప్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరి కథ జల్- జంగల్- జమీన్తోనే ముడిపడి ఉంది.
ప్యూర్టో ప్రిన్సెసా నుంచి 162 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంగే వద్ద మాసిన్ గ్రామాన్ని మేము సందర్శించాము. అక్కడ పలావన్ ఆదివాసీ సమూహం నివసిస్తుంది. ఆ ప్రదేశంలో నికెల్ తవ్వకం జరుగుతుంది. అది లీథియం- అయన్ బ్యాటరీల తయారిలో ఒక అవసరమైన పదార్థం. ఆ మైనింగ్ వల్ల ప్రభావితమైన వారిని మేము కలిశాము.
నగరం నుంచి ఆ ఊరికి చేరుకోవడానికి దట్టమైన అడవులు, కొండలు, నదులను దాటి వెళ్లాల్సి వచ్చింది. చాలా చిన్నచిన్న గ్రామాలను దాటుతూ అక్కడికి చేరుకున్నాము. ఈ ప్రదేశాన్ని దాటుతున్నప్పుడు నాకు బస్తర్‌లోని అబుఝమాఢ్, ఆంధ్రాలోని అరకు కొండలు గుర్తుకొచ్చాయి. పలావాన్ మూలవాసుల ఇళ్లు కూడా చిన్నవిగానే ఉన్నాయి. ఎక్కువగా ఇళ్ల పైకప్పులు రేకులు, లేదా తుంగతో కప్పారు. కలప లేదా వెదురుతో చేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా మధ్య భారత ఆదివాసీలు నిర్మించిన ఇళ్లలానే ఉన్నాయి.

ఇక్కడ ఆహార విధానం కూడా దాదాపు ఒకేళా కనిపించింది. బస్తర్ ఆదివాసీ, ప్రత్యేకించి నేను ఏ సముదాయం నుంచి వస్తానో, ఆ సముదాయం వారి ఆహారంలో నూనె ఉపయోగం ఎక్కువగా ఉండదు. ఇక్కడ కూడా నూనె వాడరు. కూరగాయలను ఉడకబెట్టి తింటారు. వీరి ఆహారంలో బియ్యం ముఖ్యమైనది. ఇక్కడ మేముండే చోట దొరికే చిన్న మిర్చి(దీని ఆకారం ధాన్యపు గింజకు సరిసమానంగా ఉంటుంది. దీనిని గోండు భాషలో “చిచో మిరియా”, ఛత్తీస్‌గఢ్‌లో “ధాన్ మిరీ”అని పిలుస్తారు) నాకు కనబడింది.
మాసిన్ గ్రామ కమ్యూనిటీ హాల్లో మేము ఆగాము. ఆ హాల్ ఒక వైపు నుంచి భారత ఆదివాసి ప్రాంతాలలో కనబడే సాంప్రదాయ సమూహ నివాసం; అంటే బస్తర్ గోటుల్ లేదా జార్ఖండ్‌లోని ధూమకుడియాలా ఉంది. వెదురు, కలపతో ఏర్పాటు చేసిన పెద్ద హాల్ పైకప్పును గడ్డితో కాకుండా రేకులతో కప్పారు. కలప స్థంబాలతో భూమి నుంచి పది- పన్నెండు అడుగులు మీదికి లేపారు. వెదురు తడకలతో దీని నాలుగు వైపులను మూసివేశారు. మీదికి ఎక్కడానికి కలప మెట్లను ఏర్పాటు చేశారు.
ఎలా అయితే గోటుల్లో వెలాడదీసి ఉన్నాయో అలా లోపల వారి సాంప్రదాయ సంగీతవాద్యాలు- వాటిని మేము బస్తర్‌లో డోల్(నగారా), పర్రాయీ, డప్లీ అంటాము; అక్కడ వేలాడదీసి ఉన్నాయి. సామూహిక నృత్యంతో మహిళలు మాకు స్వాగతం పలికారు. ఈ నృత్యంలో మేము కూడా పాలుపంచుకున్నాము. ఇది చూసిన తర్వాత, బస్తర్‌లోని ఏదో ఒక గ్రామంలోని గోటుల్లోకి నేను వచ్చానని నాకు అనిపించింది.
ఈ గ్రామానికి కొద్ది దూరంలో నికెల్ మైనింగ్ జరుగుతుంది. రియో టుబా నికెల్ మైనింగ్ కార్పొరేషన్‌కు(ఆర్టీఎన్ఎంసీ) చెందిన ఈ గని పలావన్ ప్రాంత దక్షిణం వైపున్న బత్రాజా నగర మున్సిపాలిటి పరిధిలోని బరంగే రియో టుబాలో ఉన్నది. గని ప్రదేశానికి సమీపంలో 48 ఇండిగేనోస్ సమూహం నివసిస్తోంది. ఇందులో 11 సమూహాలు ప్రభావిత ప్రాంతంలో నివాసముంటున్నారు. ఈ వర్గాల ప్రధాన వృత్తి వ్యవసాయం, చేపల వేట.
ఇక్కడి మూలవాసి పలావన్ ఆదివాసీలు, ఇతర సమూహాల మీద ఈ మైనింగ్ దుష్ప్రభావాల పరిణామాలు చూపిస్తున్నాయి. వారి అడవి ధ్వంసమవుతోంది. వారి జీవనోపాధి లాక్కోబడుతోంది. వారి నదులూ కలుషితమవుతున్నాయి. మైనింగ్ నుంచి వెలువడుతోన్న విషపూరిత నీరుతో సముద్రం కూడా కలుషితమవుతోంది. గని వల్ల కోతకు గురవుతున్న అడవిలోని జీవవైవిధ్యానికి ప్రమాదం ఏర్పడింది. పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది.

మైనింగ్ వల్ల తమ ఆరోగ్య సమస్యలలో పెరుగుదల వచ్చిందని స్థానికులు వాపోయారు. నీటి నాణ్యత పడిపోయింది- అనేక మంచినీటి వనరుల ఇప్పుడు “ఎర్రటి గోధుమ” రంగులోకి మారిపోయాయి. మత్స్యకారుల జీవనపాధి మీద ప్రతికూల ప్రభావం పడింది. దీంతోపాటు పంట దిగుబడి కూడా తగ్గింది. తవ్వకాల వల్ల వెళ్తున్న నీరు సముద్రంలో ఎక్కడైతే కలుస్తుందో అక్కడ సముద్రం నీరు కూడా ఎరుపు- గోధుమ రంగులోకి మారింది. స్వర్గంలాంటి భూమి అసహ్యకరమైన రూపం ఇక్కడ చూడడానికి కనబడింది.
తవ్వకాలకు వ్యతిరేకంగా చాలాకాలం నుంచి ఇక్కడ ప్రజలు పోరాడుతున్నారు. కానీ ఎలాయితే భారతదేశంలో జరుగుతుందో అలా– వారి మాట ఎవరూ వినడం లేదు. బహుశా ప్రపంచంలో ప్రతీచోట ఇలానే జరుగుతుందేమో!

ప్రపంచ మరో అతిపెద్ద నికెల్ ఉత్పత్తి, అతిపెద్ద ఎగుమతి దేశాలలో ఒకటిగా ఫిలీప్పీన్స్ పరిగణించబడుతుంది. ఈ నికెల్‌ను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉపయోగిస్తారు. అదిప్పుడు ప్రపంచవ్యాప్తంలో కొత్త ట్రెండ్. పలావన్లో 11 క్రీయాశీల గనులున్నాయి. ఇందులో మూడు అతిపెద్ద భారీ నికెల్ గనులున్నాయి; అవి మూడు నగరాలలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చాలా కొత్త గనులు తెరవాలనే ప్రణాళిక కూడా ఉంది. కానీ కంపెనీలకు స్థానిక ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతి దొరకడం లేదు.
పలావన్ ద్వీపకల్పం మీద బ్రూక్స్ పాయింట్లో మేయర్‌గా ఎన్నికైన మేరీ జీన్ ఫెలిసియానో– స్థానిక ప్రజలకు మద్దతుగా నిలబడడం కోసం తన పదవిని కోల్పోవలసి వచ్చింది. ఫెలిసియానో కూడా వర్క్‌షాప్‌కు వచ్చారు. తానెప్పుడైతే మేయర్‌గా ఉందో, మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాన్ని 2017 మేలో తన నేతృత్వంలో బ్రూక్స్ పాయింట్ మున్సిపాలిటీ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా తను మాకు తెలియజేశారు. ఈ ఘటన తర్వాత, మేయర్ పదవి వల్ల లభించే సౌకర్యాలను తనకు నిలిపివేశారు. ఫెలిసియానో ప్రకారం, తన ఆదేశాన్ని స్థానికుల ఫిర్యాదుల తర్వాత జారీ చేశారు. ఎందుకంటే కంపెనీ దాదాపు 7,000 చెట్లను నరికివేసింది. తను ప్రజలతో మూడు సార్లు మైనింగ్ సైట్‌ను చేరుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, భద్రతా బలగాలు తనని ఆపేశాయి.

తన హోదాను ఫెలిసియానో దురుపయోగం చేశారని కంపెనీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో 2021లో తనను సస్పెండ్ చేశారు.
ఎటువంటి జీతం లేకుండా– సస్పెండ్ చేసిన ఒక సంవత్సరం తర్వాత కూడా తను తగ్గనేలేదని తను మాకు చెప్పారు. “నా సస్పెన్షన్ సందర్భంలో న్యాయవాదిలా నేను నా పనిని మళ్లీ మొదలు పెట్టాను. ప్రజలతో కలిసి మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాను” అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ రోజు వరకు కూడా ప్రజల జల్- జంగల్- జమీన్ పోరాటానికి ఫెలిసియానో మద్దతుగా నిలబడ్డారు.
వర్క్‌షాప్ ముగిసిన తర్వాత ఏరోజైతే నేను తిరుగు ప్రయాణం అవ్వాలో ఆరోజు నా వద్ద మరికొన్ని గంటల సమయం ఉంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ప్యూర్టో ప్రిన్సెసా నగరం తిరగాలనుకున్నాను. ఒక ట్రైసైకిలర్తో మాట్లాడాను. తను నన్ను అందరికంటే ముందు బటర్‌ఫ్లై ఎకో గార్డెన్ ట్రైబల్ గ్రామాన్ని చూపించాడు. 60 పెసో(ఫిలిప్పీన్ కరెన్సీ) రుసుము చెల్లించి లోపలికి ప్రవేశించాను. అక్కడ విదేశీ పర్యాటకులు పెద్దమొత్తంలో సందర్శిస్తున్నారు. ప్రవేశిస్తూనే అన్నింటికంటే ముందు– అనేక ఆదివాసీ సాంస్కృతిక ప్రదర్శనలు కనబడ్డాయి. అప్పటికే ఎక్కువమంది పర్యాటకులు అక్కడ కూర్చోని ఉన్నారు. దాని వెనుక ప్రదర్శన కోసం అక్కడి పలావన్ ఆదివాసీల ఇళ్లు నిర్మించి ఉన్నాయి. వాటి ముందు కొందరు పిల్లలు, మహిళలు, పురుషులు ఆదివాసీ వేషధారణలో పర్యాటకులకు వినోదాన్ని కల్పిస్తున్నారు.

ఒక వ్యక్తి ఇంగ్లీషులో విదేశీ పర్యాటకులకు తమ చరిత్ర, ఆహార్యం, ఆచార వ్యవహారాల గురించి తెలియజేస్తున్నాడు. వారితో పాటు ఆదివాసీ వేషధారణలో ఉన్న పురుషులు, మహిళలు సాంప్రదాయ కార్యకలాపాలను ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడైతే వారి వేట గురించి ఆ వ్యక్తి చెప్పాడో– వారు సాంప్రదాయ అస్త్రాలతో వేటాడేలా నటించారు. ఎప్పుడైతే వారి సంప్రదించే విధానం గురించి చెప్తాడో– వివిధ రకాలుగా జంతువుల, పక్షుల స్వరాన్ని వారు వినిపించారు. ఎప్పుడైతే నిప్పు ముట్టించే విధానం గురించి ఆ వ్యక్తి చెప్పాడో– వారు చెకుముకి రాళ్లను, వెదురు ముక్కలను ఒకదానికొకటి రాపిడి చేసి అగ్గిని రాజేశారు. ఎప్పుడైతే వారి నృత్య- సంగీతాలకు సంబంధించిన విషయాన్ని ఆ వ్యక్తి చెప్తాడో దానికి తగ్గట్టుగా అక్కడి ఆదివాసీలు నటిస్తారు. వివిధ రకాల వెదురు, కలప నుంచి తయారు చేసిన వాయిద్యాలను మోగించి చూపిస్తారు. చివరికి విదేశీ పర్యాటకులు ప్రదర్శన కోసం నిర్మించిన ఇళ్ల ముందు– వారు మనుషులు కాదు, ఆడవి అద్భుతాలుగా పరిగణిస్తూ ఆదివాసీలను పర్యాటకులతో ఫొటో తీయిస్తాడు.

ఇదంతా చూసి నేను ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే భారతదేశంలో కూడా ఆదివాసీలను, వారి సంస్కృతిని చాలా ఏళ్ల ముందే ప్రదర్శన వస్తువులుగా మార్చారు. రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో తయారైన ఆదివాసీ మ్యూజియం చూడడానికి వెళ్లాను. అక్కడ కూడా ఇలానే ఆదివాసీలను షో పీస్‌లా ప్రదర్శించారు. కొంత డబ్బిచ్చి అక్కడి ఆదివాసీ మహిళలతో పర్యాటకులు థెంసా నృత్యం చేస్తారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దాదాపు 250 ఎకరాలలో ఒక మ్యూజియంను ఏర్పాటు చేశారు. అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల సంస్కృతిని ప్రదర్శనకు పెట్టారు. రాయ్‌పూర్ విమానాశ్రయంలో బస్తర్ ఆదివాసీల ప్రదర్శన ఉంటుంది. ఎప్పుడైనా ఏ నాయకుడైనా ఆదివాసీ ప్రాంతాలను సందర్శిస్తే, ఆ నాయకుల స్వాగతాహ్వానంలో భాగంగా సాంస్కృతిక వేషధారణలో స్థానిక ఆదివాసీలతో నృత్యం చేయిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల కార్పోరేట్ కంపెనీలు ఆదివాసీల; లేదా ఇండిగేనోస్ సమూహాలకు చెందిన జల్- జంగల్- జమీన్ నుంచి విస్తాపితం చేయడం కోసం ఎటువంటి అవకాశాన్ని కూడా వదలడంలేదని నేను ఆలోచనలో పడ్డాను. ఒక వైపు వారి అస్తిత్వాన్ని తుడిచివేయడానికి సిద్ధమవుతున్నారు; వారి భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలన్నింటిని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. మరోవైపు, ప్రజా వినోదం పేరుతో అదే మూలవాసుల జీవిత శకలాలను ప్రదర్శనా వస్తువులుగా మార్చి; నగర మ్యూజియంలలో ప్రదర్శించే ఒక రకమైన వ్యాప్తి ప్రపంచంలో జరుగుతోంది.
ఈ బటర్‌ఫ్లై ఎకో గార్డెన్ ట్రైబల్ విలేజ్ నుంచి దాదాపు 162 కిలోమీటర్ దూరంలోని గ్రామం మాసిన్లో; దాని పరిసరాలలోని చాలా గ్రామాలలో ప్రజలు తమ భూమని, నీరును, పొలాలను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. ఇక్కడ, ఈ స్థలంలో, వారి అసలైన పోరాటాల గురించి తెలియని; లేదా దాంతో పరిచయం లేని విదేశీ పర్యాటకులు మూలవాసులను, నకిలీ ఇళ్లను, వారి ఆటపాటల ప్రదర్శనను చూసి ఓ అంచనాకు వస్తున్నారు. ఇంకా వారితో సెల్ఫీ తీసుకుంటున్నారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
(ఆసియా ఇండిగేనోస్ పీపుల్స్ నెటవర్క్ ఆన్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ అండ్ ఎనర్జీ ఆహ్వానంతో ఫిలిప్పీన్స్‌ను వ్యాస రచయిత పర్యటించారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
