మణిపూర్ కల్లోలం గురించి అధ్యయనం చేస్తున్న త్రిసభ్య సంఘానికి ఇప్పటివరకు అధ్యక్షుడిగా జస్టిస్ అజయ్ లాంబా ఉన్నారు.
ఆయన స్థానంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
లాంబా నాయకత్వంలోని త్రిసభ్య సంఘాన్ని 2023లో కేంద్ర హోంశాఖ నియమించింది. లాంబా మాజీ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
లాంబా స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న బల్బీర్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం లడఖ్‌లోని లేహ్‌లో చెలరేగిన ఆందోళన, అనంతర పరిణామాలపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ కమిషన్ తన నివేదికను ఇంకా సమర్పించలేదు.
మూడు సార్లు అదనపు గడువును కోరిన సంఘం
ది హిందూ పత్రికతో మాట్లాడిన లాంబా తన వ్యక్తిగత కారణాలతో విచారణ సంఘం బాధ్యతలకు రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు పదివేల అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాలు సేకరించిన ఈ సంఘం తన విచారణ పూర్తి చేయటానికి మూడుసార్లు అదనపు గడువు కోరింది.
సాక్ష్యం సేకరణలో భాగంగా వచ్చిన అఫిడవిట్లను వివిధ కేటగిరిల కింద విభజించి ఎవరెవరిని సాక్ష్యానికి పిలవాలో కమిషన్ ఒక అంచనాకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
లాంబా రాజీనామా చేసిన తర్వాత..
“సాక్షులకు కావాల్సిన పూర్తి భద్రత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. సాక్షులు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడానికి అవసరమైన ప్రయాణం ఏర్పాట్లు మొదలు రక్షణ వరకు విచారణ సంఘానిదే బాధ్యత. కూకీ ప్రాంతానికి చెందిన ప్రజలు సాక్ష్యం ఇవ్వడానికి కూడా రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు రావడానికి సిద్ధం కావడం లేదు. అందువలన వారిని ఢిల్లీ తీసుకెళ్ళి వాంగ్మూలం నమోదు చేయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మెయితీ ప్రజాలను కూడా ఢిల్లీకి తీసుకువెళ్ళి వాంగ్మూలం ఇప్పించాల్సి ఉంటుంది” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ వాంగ్మూలం రికార్డు చేయటం మొదలు కానున్నది.
గురువారం నాడు కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో “మణిపూర్ అల్లర్లపై విచారణ జరుపుతున్న దర్యాప్తు సంఘ అధ్యక్ష బాధ్యతల నుంచి మాజీ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంబా 2026 ఫిబ్రవరి 26న చేసిన రాజీనామా ఆమోదించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బల్బీర్ సింగ్‌ను నియమిస్తు”న్నట్టు ప్రకటించింది.
మణిపూర్ కల్లోలానికి కారణాలు, హింస తీవ్రత, ఏయే స్థానిక తరగతులపై దాడులు జరిగాయి. జరిగిన తీరు, ఈ దాడుల వెనక సంబంధిత ప్రభుత్వ శాఖల వైఫల్యాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాలపై దర్యాప్తు చేయాల్సి ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
