
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ 79 సంవత్సరాల వయసులో మరణించారు. ఆర్టికల్ 370 రద్దు చేయబడినప్పుడు ఆయన జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు.
ఆ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆరో సంవత్సరం అవుతోంది. పుల్వామా దాడి, రైతుల ఉద్యమంపై మాలిక్ చేసిన బహిరంగ ప్రకటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, వార్తలలో నిలిచాయి.
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మంగళవారం(ఆగస్టు 5) మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు కన్నుమూశారు. 79 ఏళ్ల సీనియర్ నాయకుడు చాలా కాలంగా అనారోగ్యంతో మాలిక్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు.
మాలిక్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చివరి గవర్నర్‌గా ఆగస్టు 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు పనిచేశారు.
ఆయన పదవీకాలంలో 2019 ఆగస్టు 5న రాష్ట్రాన్ని విభజించబడటమే కాకుండా, ఆర్టికల్ 370ని కూడా తొలగించి, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను ముగింపు పలికారు.
చారిత్రాత్మక నిర్ణయానికి ఆరో వార్షికోత్సవం..
మూడుసార్లు ఎంపీగా, కేంద్ర మాజీ సహాయమంత్రిగా పనిచేసిన సత్యపాల్ మాలిక్, జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన తొలి రాజకీయ నాయకుడు. జమ్మూ కశ్మీర్ తర్వాత, ఆయన గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. 2022 అక్టోబర్ వరకు మేఘాలయ గవర్నర్‌గా ఆయన పనిచేశారు. అంతకుముందు, 2017లో ఆయన కొద్దికాలం బీహార్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
రాజకీయవేత్త సత్యపాల్ మాలిక్..
1970లలో సోషలిస్ట్ వ్యక్తిగా తన రాజకీయ జీవితాన్ని మాలిక్ ప్రారంభించారు. తన రాజకీయ ప్రయాణంలో అనేక రాజకీయ పార్టీలలో చేరారు. అందులో చౌదరి చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్, కాంగ్రెస్, వీపీ సింగ్ నేతృత్వంలోని జనతా దళ్ కూడా ఉన్నాయి. చివరకు ఆయన 2004లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో కండువా కప్పుకున్నారు.
1974లో భారతీయ క్రాంతి దళ్ టికెట్‌పై బాగ్పత్ స్థానం నుంచి గెలిచి, ఉత్తరప్రదేశ్ శాసనసభలోకి ప్రవేశించారు. తరువాత లోక్‌దళ్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. తరువాత 1980, 1989లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు.
ఆయన రెండవసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు. కానీ 1987లో కాంగ్రెస్‌పై ఆరోపించబడిన “బోఫోర్స్ కుంభకోణం”పై కోపంతో, సత్యపాల్ మాలిక్ రాజ్యసభకు- కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. దీని తరువాత, ఆయన తన సొంత రాజకీయ పార్టీ “జన్ మోర్చా”ను ప్రారంభించారు. దీనిని 1988లో జనతాదళ్‌లో విలీనం చేశారు.
1989లో అలీఘర్ నుంచి జనతాదళ్ అభ్యర్థిగా లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యారు. 1990లో కొంతకాలం పార్లమెంటరీ వ్యవహారాలు- పర్యాటక శాఖ కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.
2004లో మాలిక్ బీజేపీలో చేరారు. బాగ్పత్ నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేశారు. కానీ, అప్పటి రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) చీఫ్ అజిత్ సింగ్ చేతిలో ఓడిపోయారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం- సత్యపాల్ మాలిక్..
నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి పదవీకాలంలో, భూసేకరణ బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి మాలిక్ అధిపతిగా నియమితులయ్యారు. ఆయన కమిటీ బిల్లుకు వ్యతిరేకంగా సిఫార్సు చేసింది. దీంతో ప్రతిపాదిత భూసంస్కరణను ప్రభుత్వం పక్కన పెట్టింది.
ఏప్రిల్ 2023లో ది వైర్ కోసం కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సత్యపాల్ మాలిక్ పుల్వామా దాడి గురించి బహిరంగ ప్రకటనలు చేశారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల బలిదానం వెనుక ఉన్న భద్రతా లోపం గురించి మౌనంగా ఉండమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనను కోరారని ఆయన అన్నారు.
మాలిక్ కూడా రైతుల ఉద్యమానికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను బహిరంగ వేదికల మీద విమర్శించారు.
అనువాదం: క్రిష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.