సోమనాథ్‌లో జరిగిన “సోమనాథ్ స్వాభిమాన్ పర్వ” చివరి రోజు కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను వ్యతిరేకించిన శక్తులు ఇంకా దేశంలో మిగిలే ఉన్నాయని అన్నారు.
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు జరిగిన ప్రయత్నాలను వ్యతిరేకించిన శక్తులు దేశంలో నేటికీ సజీవంగానూ, క్రియాశీలకంగానూ ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.
జనవరి 11న సోమనాథ్‌లో జరిగిన సభలో జవహర్లాల్ నెహ్రూను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోడీ ప్రసంగించారు.
కత్తి పట్టుకోకుండానే దేశాన్ని చీల్చేందుకు పలు శక్తులు పొంచి ఉన్నాయని కూడా ఆయన విమర్శించారు.
సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా చివరి రోజున జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసిన గజనీ దండయాత్ర జరిగి వెయ్యేళ్లు ముగుస్తున్న సందర్భంగా ఈ స్వాభిమాన ఉత్సవాలు జరుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
గజనీ తర్వాత కూడా అనేమంది ముస్లిం సైనికాధికారులు ఈ దేవాలయంపై జరిపిన దాడులు కరుడుకట్టిన మతోన్మాదానికి ప్రతీకలని ప్రధాని మోదీ అన్నారు. ఈ దాడులు మతోన్మాద దాడులు కాదనీ, దేవాలయ సంపద కొల్లగొట్టేందుకు జరిగిన దాడులుని కొందరు చరిత్రకారులు, పరిశోధకులు మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని కూడా ఆయన విరుచుకుపడ్డారు.
గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ల తర్వాత సభలో మోదీ మట్లాడుతూ, తాను సోమనాథ్ దేవాలయ ధర్మకర్తనని కూడా చెప్పుకున్నారు. ఈ ఉత్సవం అద్భుతంగా జరిగిందని కొనియాడారు.
‘‘ఓ వైపున దేవాధిదేవుడు మహదేవ్ ఉన్నారు. మరోవైపున సముద్రం. సూర్యకిరణాలు, మంత్రోచ్ఛరణ. ఇంతటి పవిత్ర వాతావరణంలో పవిత్ర భక్తుల సన్నిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమం మరింత మహత్తరమైనది’’అన్నారు.
శ్రోతలనుద్దేశించి ప్రశ్నిస్తూ, ‘‘వెయ్యేళ్ల క్రితం సోమనాథ్ దేవాలయం ఆలయంలో పరిస్థితి ఎలా ఉండేదో, హిందూస్తాన్ శక్తి- సామర్ధ్యం ఏమిటో వెయ్యేళ్ల నుంచి ఈ ఆలయంపై ఎగురుతున్న జెండా ప్రపంచానికి చెప్తోంది’’అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ దేవాలయంపై జరిగిన అనేక దాడుల్లో కొన్ని దాడులు దేవాలయాన్ని మసీదుగా మార్చేందుకు కూడా ప్రయత్నించాయన్నారు.
అయితే, చరిత్ర పరిశోధనాకారులకు ఇటువంటి వాదనలకు సంబంధించిన సమాచారమేదీ లభ్యం కాలేదు.
మోదీ మాత్రం, ‘‘పదేపదే ధార్మిక దాడికి గురైన ఈ దేవాలయాన్ని మళ్లీమళ్లీ పునర్నిర్మించారు’’అని అన్నారు.
ఈ రకమైన పునర్నిర్మాణమే మన సంస్కృతి గొప్పదనాన్ని వెల్లడిస్తున్నదని, ప్రపంచంలో ఏ సంస్కృతికీ ఇటువంటి సామర్ధ్యం లేదన్నారు.
ఈ దాడులను కప్పిపెట్టేందుకు కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ‘‘సంపద కొల్లగొట్టే ప్రయత్నాలేనని చెప్పడం ద్వారా ఈ దాడుల వెనక దాగి ఉన్న మతఛాందసత్వాన్ని కప్పిపెట్టేలా చరిత్ర పుస్తకాలు రాయబడ్డాయి’’అంటూ ప్రధాని ఆరోపించారు.
‘‘ఈ దేవాలయంపై సంపద కోసమే దాడి జరిగి ఉంటే, అది వెయ్యేళ్ల క్రితం జరిగిన మొదటి దాడితోనే ఆగిపోయి ఉండాలి.
పవిత్ర విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దేవాలయం రూపు రేఖలు మార్చటానికి పదేపదే జరిగిన దాడుల్లో ప్రయత్నాలు జరిగాయి’’ అంటూ ప్రధాని చెప్పుకున్నారు.
సోమనాథ్ దేవాలయంపై జరిగిన అనేక పరిశోధనల్లో రొమిల్లా థాఫర్ పరిశోధన ప్రధానమైనది.
తన రచనలో రొమిల్లా థాఫర్ అనేక జైన, పర్షియన్, సంస్కృతం రచనల నుంచి కీలకమైన ఆధారాలు, ప్రస్తావనలు సేకరించారు. తన పరిశోధనలో పొందుపరిచారు.
ఈ దేవాలయంపై జరిగిన దాడికి ప్రధాన కారణం సంపద కొల్లగొట్టే ప్రయత్నమేనని, రాజకీయ ప్రయోజనాలో లేక ధార్మిక ఆధిపత్య స్థాపనో ప్రధాన లక్ష్యాలుగా దాడులు జరగలేదని తను స్పష్టం చేశారు.
కానీ నేడు ప్రధాని, సంఘపరివారంలోని ఆయన మిత్రులు దీనికి భిన్నమైన భాష్యాన్ని చెప్తున్నారు.
సోమనాథ్ దేవాలయం క్షీణతకు దాడులే ఏకైక కారణం కాదనీ ఆయన పరిశోధనలో నిర్ధారిస్తారు. ఈ దాడుల వలన ఈ ప్రాంతంలో సమాజ మత పొందికల్లో ఎటువంటి మార్పు రాలేదని; హిందూ, ముస్లింలు వేల ఏళ్ల తరబడి శాంతియుతంగానే జీవించారని ఆమె వివరించారు.
దీర్ఘకాలం నిర్లక్ష్యానికి తోడు ప్రకృతివైపరీత్యాలు కూడా దేవాలయ క్షీణతకు కారణమయ్యాయని రొమిల్లా విశ్లేషించారు.
ప్రస్తుతం సంఘపరివార్ శక్తులు చెప్తున్నట్టు సోమనాథ్ దేవాలయం ఎన్నడూ మత విద్వేషాలకు కేంద్రంగా లేదని ఆమె స్పష్టం చేశారు.
కానీ మోదీ మాత్రం, సోమనాథ్ దేవాలయం మతోన్మాద శక్తుల దాడులకు కేంద్రంగా ఉన్నదనే రాజకీయ నమ్మకంతో ఉన్నారు.
స్వాతంత్య్ర సాధన తర్వాత దేవాలయ పునరుద్ధరణ కోసం వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయత్నాలనూ, పునరుద్ధరణ తర్వాత జరిగే పునఃప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ హాజరుకావాలన్న ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు.
ఆలయ పునరుద్ధరణను, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం చేయాలన్న ప్రతిపాదనలను అప్పటి ప్రధాని నెహ్రూ వ్యతిరేకించారు.
ఈ విషయాన్నే మోదీ తన ఉపన్యాసంలో పరోక్షంగా ప్రస్తావించారు.
చరిత్రకారుడు రామచంద్రగుహ రాసిన “ఇందిరా అనంతర భారత్” రచనలో, 1951లో తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌కు నెహ్రూ రాసిన లేఖలో- ‘‘సోమనాథ్ వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టే సమయం ఇది కాదు. కొన్నేళ్ల తర్వాత మరింత భారీ ఎత్తున ఈ పని పూర్తి చేయవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
‘‘ప్రభుత్వ బాధ్యతల్లోని వారు గుళ్లు, గోపురాలతో, మత విశ్వాసాలతో ముడివేసుకోకూడదు’’ అన్న అభిప్రాయానికి తగ్గట్టుగా రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా దేవాలయ పునఃప్రారంభోత్సవం జరపాలనే ప్రతిపాదనతో నెహ్రూ విబేధించారు.
అయితే, అన్ని మతాలకూ సమాన హోదా ఇవ్వాలనే రాష్ట్రపతి అభిప్రాయానికి అనుగుణంగా ఆయన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు’’ అని రాశారు.
‘‘1951లో దేవాలయ పునరుద్ధరణను వ్యతిరేకించి శక్తులు నేటికీ దేశంలో సజీవంగానూ, క్రియాశీలకంగానూ ఉన్నాయి’’అని ప్రధాని మోదీ సభలో వక్కాణించారు.
‘‘నేడు దేశాన్ని చీల్చడానికి కత్తులకు బదులు అనేక ఇతర మార్గాలను పాటిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మలన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఐక్యంగా ఉండాలి. మనల్ని చీల్చటానికి ప్రయత్నం చేసే ప్రతీ శక్తిని ఓడించాలి’’అంటూ ప్రధాని ఆ శక్తులెవరు? ఏమిటి? కుట్రలేమిటి అన్నది స్పష్టం చేయకుండా చెప్పారు.
‘‘మన మతానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు, మన మూలాలకు మనం కట్టుబడి ఉన్నపుడు, మన వారసత్వాన్ని మనం పూర్తి స్వీయాభిమానంతో కాపాడుకోగలిగినప్పుడు, మన వారసత్వం గురించిన ఎరుకను కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన నాగరికత మూలాలు మరింత బలోపేతంగా ఉంటాయి. అందువలన గత వెయ్యేళ్లల్లో జరిగిన ప్రయాణం మరో వెయ్యేళ్లకు జరిగే ప్రయాణానికి మనల్ని సిద్ధం చేయాలి’’ అన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే నూతన విశ్వాసాన్ని కోట్లాది మంది భారతీయుల్లో నింపటమేనని మోదీ చెప్పారు.
గతంలో సంఘపరివారం పదేపదే చెప్తున్నట్టుగా ప్రధాని ‘‘భారతదేశం వెయ్యేళ్ల బానిసత్వం అనుభవించింది’’ అన్నారు. బ్రిటిష్ పాలన కంటే ముందున్న మొఘల్ పాలనను కూడా విదేశీపాలనగానే సంఘపరివారం పరిగణిస్తుంది. అదే అభిప్రాయాన్ని మోదీ బలంగా విశ్వసిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
