
1
నేను జీవిస్తున్నది ముమ్మాటికీ అంధయుగమే!
వంచన లేని మాటలు అసంబధ్ధం
నున్నని నుదురు కఠిన హృదయానికి చిహ్నం
నవ్వేవాడు భయపెట్టే వార్తలను ఇంకా వినలేదు
ఆహా, ఇది ఎంత గొప్ప యుగమో కదా..!
ఇలాంటప్పుడు చెట్లను గురించి మాట్లాడడం దాదాపు నేరం
ఎందుకంటే ఇది అన్యాయం పట్ల మౌనం వహించడం వంటిదే!
ప్రశాంతంగా రోడ్డు దాటి నడిచి వెళ్ళేవాడు
ఆపదలో ఉన్న మిత్రులకు అందుబాటులో లేనట్లే కదా?
నిజమే, నేను బ్రతకడం కోసం సంపాదిస్తున్నాను
కానీ, నన్ను నమ్మండి, ఇది కేవలం కాకతాళీయం
నేను చేసేదేదీ, నేను కోరుకున్నంత అనుభవించే అర్హత నాకివ్వదు
నేను యాధృచ్ఛికంగానే తప్పించుకున్నాను(నా అదృష్టం నన్ను వదలి
పోయిందంటే, నేను పతనం కాక తప్పదు.)
వాళ్ళు నాకు చెప్తారు: “తిను, తాగు. ఉన్నవాడివైనందుకు సంతోషించు”
కానీ, నేను ఎలా తినగలను, తాగగలను?
నా ఆహారం అన్నార్తుల నుండి లాక్కున్నదైనప్పుడు,
నా గ్లాసు నీళ్ళు దాహంతో గొంతెండుతున్న వారిదైనప్పుడు.
అయినప్పటికీ నేను తింటాను, తాగుతాను
నేను ఆనందంగా జ్ఞానిగా ఉండగలను
పాత పుస్తకాలు మనకు జ్ఞానం అంటే ఏమిటో చెబుతాయి:
ప్రపంచంలోని సంఘర్షణను తప్పించికోవడం
నీకున్న కొద్ది సమయాన్ని
ఎవరికీ భయపడకుండా,
ఎటువంటి హింస చేయకుండా,
పూర్తిగా జీవించడం.
చెడుకు కూడా మంచిని ప్రతిఫలంగా ఇవ్వడం–
కోరికల్ని తీర్చుకోవడం కాకుండా, మరిచిపోవడం
ఇదే జ్ఞానం అంటే.
నేను ఇందులో ఏదీ చేయలేను.
నేను జీవిస్తున్నది ముమ్మాటికీ అంధయుగమే.
2
నేను సంక్షోభ కాలంలో నగరానికి వలస వచ్చాను
అప్పుడు అక్కడ ఆకలి రాజ్యమేలుతోంది.
నేను తిరుగుబాట్ల కాలంలో శ్రామికుల మధ్యలో చేరాను
నేను వారితో కలిసి తిరుగుబాటు చేశాను.
కానీ ఈ భూమిపై నాకు ఇచ్చిన
కాలం ఇంతలోనే ఖర్చయిపోయింది.
నేను ఊచకోతల నడుమ తిన్నాను
హత్యల నీడలో నిదురించాను
నేను ప్రేమించినపుడు, నిర్లిప్తంగానే ప్రేమించాను
ప్రకృతిని అసహనంతో చూశాను
కానీ ఈ భూమిపై నాకు ఇచ్చిన
కాలం ఇంతలోనే ఖర్చయిపోయింది
నా కాలంలో వీధులు అగాధంలోకి దారి తీశాయి
మాటలు నన్ను వంచనతో కసాయివాడికి పట్టించాయి
నేను చేసింది చాలా తక్కువే. కానీ నేను లేకుంటే
పాలకులు ఇంకా సురక్షితంగా ఉండేవారు. ఇదే నా ఆశ.
కానీ ఈ భూమిపై నాకు ఇచ్చిన కాలం ఇంతలోనే ఖర్చయిపోయింది.
3
మేము మునుగుతున్న
ఈ ఉప్పెన నుండి ఉద్భవించే మీరు,
మా బలహీనతల గురించి మాట్లాడేటప్పుడు,
వాటికి కారణం అయిన
చీకటి కాలం గురించి కూడా
కొంచెం ఆలోచించండి
ఎందుకంటే, మేము వర్గ పోరాటంలో,
అన్యాయమే తప్ప ప్రతిఘటన లేనప్పుడు, నిరాశతో
చెప్పుల్ని మార్చినట్లు దేశాలను మారుస్తూ తిరిగాము.
ఎందుకంటే మాకు బాగా తెలుసు:
నీచత్వం పట్ల ద్వేషం సైతం
ముఖాన్ని కఠినంగా మారుస్తుందని
అన్యాయం పట్ల కోపం సైతం
స్వరాన్ని కటువుగా మారుస్తుందని
అయ్యో, దయాపూరిత ప్రపంచానికి పునాదులు వేయాలనుకున్న
మేము దయగా ఉండలేకపోయామే
కానీ ఎప్పుడైతే మనిషి తోటి మనిషికి సహాయపడగలిగే
సమయం, సమాజం వస్తాయో, ఆ రోజుల్లో జీవించే మీరు,
మా గురించి మరీ కఠినంగా వ్యాఖ్యానించకండి.
రచన: బెర్టోల్ట్ బ్రెక్ట్
ఆంగ్లానువాదం: హెచ్ఆర్ హేస్
తెలుగు అనువాదం: ఒక అధో జగత్ జీవి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.