జమిలికి ముందు జరగబోతున్నది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. అనంతరం లోక్‌సభ ఎన్నికలు ఏకమొత్తంగా జరుగుతాయో? లేదా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు విడివిడిగా జరుగుతాయో తెలియదు. కానీ, జమిలికి ముందే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు.
అంతేకాదు, రాబోయే సాధారణ ఎన్నికలకు ఇవి ప్రీ-ఫైనల్ అని కూడా మరికొంతమంది భావిస్తున్నారు. దీనికి కారణమూ లేకపోలేదు.
నాలుగు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను కూల్చిన మమత ఒకవైపు ఉన్నారు. బీజేపీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే కేరళ కమ్యూనిస్టులు ఒకవైపు ఉన్నారు. ద్రవిడవాద రాజకీయ కోణం మరోవైపు ఉన్నది. వెరసి ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని చూపించబోతున్నాయి.
ఇదే సందర్భంలో ఈ మూడు రాష్ట్రాలలోనూ తన ప్రభావాన్ని, పట్టును నిరూపించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది.
మునుపెన్నడూ లేని విధంగా ప్రధాని మోదీ డజన్ల కొద్దీ ర్యాలీలను ఈ మూడు రాష్ట్రాలలో నిర్వహిస్తున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బెంగాల్‌పై కమలనాథులకు మంచి శక్తినిచ్చాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సినారియో ఉంటుందా లేదా అనే సంశయం నెలకొన్నది.
కేరళ: ఉనికిని నిలుపుకునే పోరాటంలో కమ్యూనిస్టులు
పై సందర్భాలను ఇంకాస్త లోతుగా విశ్లేషణ చేస్తే, మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఒకటి, డెబ్భై ఆరేళ్ల పైబడిన భారత స్వాతంత్ర్య చరిత్రలో కడు పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళాను నిలిపి కమ్యూనిస్టులు సరికొత్త చరిత్రను సృష్టించారు. కరోనా కాలంలోనూ యావత్ ప్రపంచం చేత భేష్ అనిపించుకున్నారు.
గడిచిన దశాబ్దాలలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య అధికార మార్పిడి జరిగింది. ఇప్పుడు కేరళ ఓటర్ల మనోభావం ఏమిటనేది అందరినీ ఆకర్షిస్తున్న, ఆలోచింపజేస్తున్న అంశం.
అంతేకాదు వెస్ట్ బెంగాల్, త్రిపుర తమ చేతుల నుంచి పోయిన తర్వాత కమ్యూనిస్టులకు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ. ఇక్కడైనా తమ పట్టును నిలుపుకుంటారా లేదా అని చాలా మంది అనుకుంటున్నారు.
ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఇటీవల భారతీయ జనతా పార్టీ తన ఉనికిని బలంగా అక్కడ వ్యక్తీకరించడం గమనించాల్సిన విషయం. అందుకే, ఆ ఎన్నికల పట్ల ఆసక్తిగా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్: మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ
వెస్ట్ బెంగాల్ రాజకీయాలలో మమతా బెనర్జీ తిరుగులేని నాయకులు. సింగూర్ వివాదం తర్వాత బెంగాల్ రాజకీయాలలో తనకు తిరుగులేదని చాటి చెప్పుకున్నారు. ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీల ప్రాబల్యాన్ని తగ్గించి జయకేతనం ఎగురవేశారు. మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు.
బెంగాల్ రాజకీయాలలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అంతేకాదు, కాకలు తీరిన యోధులకు సైతం సవాలు విసిరారు. తాజాగా బీజేపీ అక్కడ చేస్తున్న రాజకీయ సమీకరణలను తిప్పికొట్టి నిలబడుతున్నారు.
తన పార్టీలో కీలకమైన నాయకులను తనకు అనుకూలంగా మలుచుకున్న బీజేపీ గతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపించలేదు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ ఫలితాలను సాధించింది. ఈ అంశాలే, ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై జనాసక్తికి కారణం అవుతున్నాయి.
అంతేకాదు, ఎస్ఐఆర్పైన తీవ్ర అభ్యంతరాలను మమత వ్యక్తీకరిస్తున్నారు. అంతటితో ఆగట్లేదు. ఈసారి తానే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నారు.
బీజేపీ ఎత్తుగడ అక్కడ పారబోతున్నదని, లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను లెక్కించుకున్నా తాము అధికారానికి అతి చేరువలో ఉంటామని బీజేపీ భావిస్తోంది. ఈ అంచనాల ఆధారంగా బెంగాల్ ఎవరి వశం అవుతున్నదనేదే ఈ చర్చలకు కారణం.
తమిళనాడు: ద్రవిడ రాజకీయాలపై జాతీయ పార్టీల ప్రభావం
ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరు డీఎంకే. ఆ పార్టీ మరోసారి తానే అధికారంలోకి వస్తానని అంటున్నది. గడిచిన అయిదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను ద్రవిడ కోణంలోనే చూసి, విశ్లేషించి విమర్శించింది ఆ పార్టీ.
నీట్ వివాదమైనా, త్రిభాషా సూత్రమైనా ద్రవిడ అంశాన్నే జోడించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చింది.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తను బలపడేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అన్నామలై రాష్ట్ర శాఖ అధ్యక్షులు అయిన తర్వాత కొంత ఊపు వచ్చింది.
కానీ, అది ఓట్లుగా రూపాంతరం చెందలేదు. పేరు పొందిన నాయకులెవరూ బీజేపీలో చేరలేదు.
సెంగోల్‌ను పార్లమెంటులో ప్రతిష్ఠించినా- అనుకున్న స్థాయిలో కమలనాథులకు అక్కడ అవకాశం రాలేదు.
ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే పొత్తుతో తాము గెలుస్తామని, తమిళ రాజకీయాలలో చక్రం తిప్పుతామని నమ్ముతున్నారు.
2016 తర్వాత తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందని అప్పట్లో చాలామంది అనుకున్నారు.
ఏ పరిణామాలు ఎలా ఉన్నా తమిళులు ద్రవిడ కోణంలో నుంచి బయటకు రాలేదు. సినిమా హీరో విజయ్ పార్టీ ప్రభావం ఎట్లా ఉంటుందన్నది ఒక కీలక అంశం.
స్టాలిన్ రెండోసారి సీఎం అవుతారా లేదా అనేది ఆసక్తి కలిగించే అంశం.
ప్రస్తుత ఎన్నికలతోనే బీజేపీ అక్కడ బలపడుతుందని ఎవరూ భావించడం లేదు. ద్రవిడ రాజకీయాల ముద్ర, ఆలోచన, ఆచరణ ఎట్లా ఉంటుందో చూడాలి.
రాబోయే రాజకీయాలకు దిక్సూచి
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తప్పకుండా రాబోయే రాజకీయ సమీకరణలకు ఓ దారి చూపుతాయనే దానిలో సందేహం లేదు.
ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారతీయులపై ఉన్నది. అంతేకాదు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రభావిత అంశాలుగా ఉన్నాయి.
మూడు విభిన్న నేపథ్యాలు, రాజకీయ భావజాలాలు ఉన్న ఈ మూడు రాష్ట్రాల్లో ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తారో తెలియదు.
ఇదే సందర్భంలో పాతవారే ఎన్నికైతే కనుక వారి పాలనకు ముమ్మాటికీ ఓటర్లు జేజేలు పలికినట్లే.
సీట్ల సంఖ్య మ్యాజిక్ నెంబర్‌కు అటూఇటైనా గత ప్రభుత్వాల పనితీరుకు ప్రజలు పట్టం కట్టినట్టేనని చాలా మంది భావిస్తున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాలే అత్యంత కీలకం, భవిష్యత్తు రాజకీయ దారిని చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
